Pages - Menu

Pages

28, నవంబర్ 2017, మంగళవారం

కలబురిగి కబుర్లు - 3 (బసవన్న వచనాలు)

బసవేశ్వరుని బోధలన్నీ చిన్న చిన్న పద్యాల రూపంలో ఉంటాయి. వాటిని వచనాలు అంటారు. ఇవి జెన్ మాస్టర్ల హైకూల వంటివి. కానీ వాటికంటే కొంచం పెద్దవిగా ఉంటాయి. ఆధ్యాత్మిక సత్యాలను ఇవి క్లుప్తంగా చక్కగా విడమర్చి చెప్తాయి. వీటిని చదివిన ఎవరైనా సరే, 'కాదు' అనలేరు. అంత చక్కగా ఉంటాయి.

అయితే, చాలా ఉన్నతమైన ఆధ్యాత్మికతను చెబుతూ ఉంటాయి గనుక, ఇవి ఆచరణలో సాధ్యమౌతాయా అని అనుమానం తప్పకుండా వస్తుంది. ఇది నిజమే. ఆచరణలో ఇవి అందరికీ సాధ్యం కావు. ఎందుకంటే, నిజమైన ఆధ్యాత్మికతను అందరూ ఆచరించలేరు. దానికి కారణం ఏమంటే - ఆ సత్యాలేమో ఎక్కడో మేఘాలలో తేలుతూ ఉంటాయి. మన జీవితాలేమో మురికి గుంటలలో దొర్లాడుతూ ఉంటాయి. కనుక - ఈ సత్యాలు చదివి ' ఓహో ' అనుకోడానికే తప్ప జనసామాన్యానికి ఆచరణలో అందవు. ఒకవేళ ఎవరికైనా ఇవి ఆచరణలో కూడా అందితే మాత్రం, వారు నిజంగా ధన్యులే.

ఈయన తన వచనాలలో ' కూడల సంగమ దేవా !' అనే మకుటాన్ని వాడాడు. కర్నాటక రాష్ట్రంలో బాగల్ కోట జిల్లాలో అలమట్టి డ్యాం కు దగ్గరలో ఉన్న కూడలసంగమ క్షేత్రంలో కృష్ణానది, మలప్రభా నదులు కలుస్తాయి. ఆ సంగమస్థానంలో ఒక శివాలయం ఉన్నది. ఈ క్షేత్రంలోనే బసవన్న గురువైన జటావేదముని ఆశ్రమం ఉండేది. బసవన్న చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండి శైవమతాన్ని అధ్యయనం చేశాడు. అందులోని ఈశ్వరుని పేరు కూడల సంగమేశ్వరుడు. ఈయన్ని సంబోధిస్తూనే బసవన్న తన వచనాలన్నీ చెప్పాడు.

కొన్ని వచనాలను చూద్దాం. ప్రతిపదార్ధంగా కాకుండా, భావాత్మక స్వేచ్చానువాదాన్ని చేశాను.

1. వచనదల్లి నామామృత తుంబి
నయనదల్లి నిమ్మ మూరుతి తుంబి
మనదల్లి నిమ్మ నెనహు తుంబి
కివియల్లి నిమ్మ కీరుతి తుంబి
కూడల సంగమదేవా
నిమ్మ చరనకమల దోళగాను తుంబి

నా మాటల్లో పలికేది నీవే - నా కన్నుల్లో మెరిసేది నీవే
నా మనసులో ఆలోచనవు నీవే - నా చెవులలో వినిపించేది నీవే
ఓ కూడల సంగమేశ్వరా...
నీ పాదపద్మాలలో నేనొక తుమ్మెదనంతే !

మనిషికి పంచేంద్రియాలున్నప్పటికీ ఎక్కువగా మనం వాడేది కన్నులు, నోరు, చెవులు మాత్రమే. వీటికి తోడుగా మనసు ఉండనే ఉంటుంది. ఈ నాలుగింటిలో నీవే నిండి ఉన్నావని ఈశ్వరునితో చెబుతున్నాడు బసవన్న. అంటే నిత్యమూ నిరంతరమూ ఆయనకు శివధ్యానమే. ఒక తుమ్మెద ఎలా అయితే పద్మంలోని మకరందాన్ని గ్రోలుతూ మైమరచి ఉంటుందో ఆ విధంగా నేనూ నీ ధ్యానంలో తన్మయుడనై ఉన్నానని అంటాడు.

2. ఎన్న వామ క్షేమ నిమ్మదయ్యా
ఎన్న హాని వృద్ధి నిమ్మదయ్యా
ఎన్న మాన అపమానవూ నిమ్మదయ్యా
బళ్ళిగే కాయి దిమ్మిత్తే? కూడల సంగమ దేవా !

ఓ పరమేశ్వరా !
నా క్షామమూ క్షేమమూ రెండూ నీ కృపయే
నాకు జరిగే హానీ, నాకు ఒరిగే లాభమూ రెండూ నీ భిక్షే
నాకయ్యే సన్మానమూ అవమానమూ రెండూ నువ్విచ్చేవే
తీగకు కాయ భారమా? కూడల సంగమ దేవా !

సంపూర్ణ శరణాగతికి పరాకాష్ట ఈ భావన. జరిగేది అంతా నీ సంకల్పమే అన్న ఒప్పుదల మనసుకు బాగా పట్టిన భక్తునికి ఇక బాధ ఏముంటుంది? ఆందోళన ఏముంటుంది? అయితే ఈ మాటలు ఊరకే చెబితే చాలదు. ఇది మనసుకు బాగా పట్టాలి. ఊరకే నోటితో చెప్పడం కాకుండా మనసులో కూడా ఇదే భావన నిరంతరం నిండి ఉండాలి. అదే నిజమైన శరణాగతి. చాలామంది ఊరకే 'శరణం శరణం' అని నోటితో చెబుతుంటారు గొప్పకోసం. అది నిజమైన శరణాగతి కాదు. శరణాగతి నిజమైనదైతే నలుగురిలో గొప్పగా చెప్పవలసిన పని లేదు. మనసులో నిజంగా ఆ భావన ఉంటే చాలు.

జిల్లెళ్ళమూడి అమ్మగారు తరచూ ఇలా అనేవారు ' మంచి ఇచ్చేది దేవుడైతే మరి చెడును ఇస్తున్నది ఎవరూ?' అదీ వాడి కృపే.

3. ఇవనారవ ఇవనారవ ఇవనారవనెందు ఎనిసదిరయ్యా
ఇవ నమ్మవ ఇవ నమ్మవ ఇవ నమ్మవనెందు ఎనిసయ్యా
కూడల సంగమ దేవా !
నిమ్మ మనెయ మగనెందు ఎనిసయ్యా

ఇతనిదే కులం ఇతనిదే కులం ఇతనిదే కులం
అని అడిగేటట్లు నన్ను చెయ్యకు
ఇతనూ నావాడే ఇతనూ నావాడే ఇతనూ నావాడే
అనుకునే విధంగా నన్ను చెయ్యి
'నేనూ నీ బిడ్డనే' అనుకునే విధంగా నన్ను చెయ్యి
ఓ కూడల సంగమ దేవా !

నిజమైన భక్తి హృదయంలో నిండినప్పుడు కులమతాలు అసలు గుర్తే రావు. అవి కంటికే కనపడవు. అవన్నీ మానవ లోకపు కట్టుబాట్లు. భక్తుడు వాటికి అతీతుడు. వాటన్నిటికీ అతీతుడైన పరమేశ్వరుడే అతని హృదయంలో ఎల్లప్పుడూ నిండి ఉంటాడు. ఇక వాటితో అతనికి పనేముంది? తన ప్రియతముని సృష్టిలో అన్నీ ప్రియమైనవే. అసహ్యానికి తావెక్కడుంది?

"భక్తేర్ జాతి నోయ్" - భక్తులు కులానికి అతీతులు అనేది శ్రీ రామకృష్ణుల అమృతవాక్కులలో ఒకటి.

4. ఉంబ బట్టలు బేరే కంచల్ల
నోడువ దర్పణ బేరే కంచల్ల
భాండ ఒందే భాజన ఒందే
బెళగే కన్నడియనిసినిత్తయ్యా
అరిదడే శరణ మరిదడే మానవ
మరెయదే పూజిసు కూడల సంగన

కంచపు కంచూ అద్దపు కంచూ వేరుకావు
లోహం ఒకటే తత్వమూ ఒకటే
మొద్దు లోహం మెరుగు పెడితే అద్దం అవుతుందంతే
తెలిస్తే భక్తుడు మరిస్తే మానవుడు
ఈశ్వరుని ఎప్పుడూ మరువకుండా ధ్యానించు

జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఎవరో అడిగారు - 'అమ్మా నీదేం కులం? అని' అమ్మ బ్రాహ్మణకులంలో పుట్టిందని అడుగుతున్నవారికి తెలుసు. తెలిసినా కొంటెప్రశ్న అడిగారు. దానికి అమ్మ ఇలా చెప్పింది - 'శుక్లశోణితాలదే కులమో అదే నా కులం నాన్నా'. ఈ జవాబు అడిగినవారిని నిశ్చేష్టులను గావించింది.

అన్ని దేహాలలో ఉన్నది పంచభూతాలే. ఏమీ తేడా లేదు. ఒక ఒంట్లో అమృతమూ ఇంకో ఒంట్లో బురదా లేవు. అన్ని దేహాలలో ఉన్నది అదే మురికే.దీన్ని గ్రహించి సాధన గావిస్తే సిద్దత్వాన్ని అందుకోవచ్చు. దీనిని మరిస్తే మామూలు మనిషివే నువ్వు. కనుక అసలు విషయాన్ని గ్రహించి ఏమరకుండా శివధ్యానం చెయ్యి. 

5. కళబేడ కొలబేడ హుసియ నుడియలు బేడ
మునియ బేడ అన్యరిగే అసహ్య పడబేడ
తన్న బంనిస బేడ ఇదిర హళియలు బేడ
ఇదే అంతరంగ శుద్ధి ఇదే బహిరంగ శుద్ధి
ఇదే నమ్మ కూడలసంగమ దేవర నోలిసువ పరి

దొంగతనం చెయ్యకు, దేనినీ చంపకు, అబద్దం చెప్పకు
కోపపడకు, ఇతరులను అసహ్యించుకోకు
హెచ్చులు చెప్పుకోకు, ఎదుటివారిని అవమానించకు
లోపల శుద్ధి ఇదే  బయట శుద్ధి ఇదే
ఇదే నా కూడలసంగమ దేవుని మెప్పించే అసలైన దారి

పనికిమాలిన తంతులూ పూజలూ రోజంతా చేసి, సాయంత్రానికి ఇతరులతో చండాలంగా ప్రవర్తిస్తూ ఉంటే, అది అసలైన ఆధ్యాత్మికత కాదు. బాహ్యశుద్ది కంటే భావశుద్ధి ముఖ్యం.

పద్దతిగా ఉండు. కల్మషం లేకుండా ఉండు. త్రికరణ శుద్ధిగా ఉండు. సత్యం పలుకు. దొంగవు కాకు. చంపకు. హింసించకు. తిట్టకు. గొప్పలు చెప్పుకోకు. ద్వేషించకు. నిరంతరం శివుని ధ్యానించు. పరమేశుని మెప్పించే సత్యమార్గం ఇదే.