Pages - Menu

Pages

30, నవంబర్ 2017, గురువారం

Mai Hosh Me Tha - Mehdi Hassan


Mai Hosh Me Tha Tho Phir Uspe Mar Gaya Kaise 

అంటూ తన గంధర్వస్వరంలో మెహదీ హసన్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ ఘజల్ ఒక అద్భుతమైన గీతం. భావానికి భావం, రాగానికి రాగం రెండూ అద్భుతమైనవే. మెహదీ హసన్ స్వరంలో ఏ పాటైనా అలవోకగా ఒదిగి ఒక పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. 'ఆయన స్వరంలో ఆ దైవమే పలుకుతుంది' అని లతా మంగేష్కర్ అన్నదీ అంటే ఇక మనం ఊహించుకోవచ్చు. అందుకే ఆయనకు "ఘజల్ రారాజు" అని పేరున్నది.ఈ మరువరాని ఘజల్ ను నా స్వరంలో కూడా వినండి మరి.

Genre:-- Non Filmi Ghazal
Lyrics:-- Kaamil Chandpuri
Singer:-- Shahensha E Ghazal Mehdi Hassan
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
Main hosh mein tha to - phir us pe mer gaya kaisay - 2
Ye zeher mere lahoo mein utar gaya kaise
Main hosh mein tha

Kuch us ke dil mein - lagawat - zaroor thi warna - 3
Woh mera hath-3
Woh mera hath - daba kar guzar gaya kaisay -2
Ye zehar mere lahoo main utar gaya kaise
Main hosh mein thaa

Zaroor uski tawajaaa
Zaroor uski tawajon ki rehbheri ho gi
Nashay mein tha - 3
Nashay mein tha to mein - apne hi ghar gaya kaisay - 2
Ye zeher mere lahoo main - utar gaya kaise
Main hosh mein thaa

Jisay bhulaye - kayi saal - ho gaye kaamil - 3
Main aaj us ki …O…o…
Main aaj us ki - gali se - guzar gaya kaise - 2
Ye zehar mere lahoo main utar gaya kaise
Main hosh main tha to - phir us pe mar gaya kaise - 2
Ye zehar mere lahoo main - utar gaya kaise - 2

Meaning

If I were in my senses, how come I fell in love with her?
how come this poison sank into my blood?

There is some love in her heart too, for sure
Otherwise, why did she pat my hand and go away?

Certainly I was still thinking of her
Otherwise, though being drunk
how could I reach my home safe?

I spent many years trying to forget her
Yet, how come I pass through her lane now?

If I were in my senses, how come I fell in love with her?
how come this poison sank into my blood?

తెలుగు స్వేచ్చానువాదం

నాకే మాత్రమైనా తెలివంటూ ఉంటే
ఆమెను ప్రేమించడం ఎలా జరిగింది?
ఈ విషం నా రక్తంలోకి జారడం
ఎలా జరిగింది?

ఆమె గుండెలో కూడా నామీద ప్రేమ
ఎంతో కొంత ఉండే ఉంటుంది
లేకుంటే నా చేతిని ప్రేమగా తట్టి
ఎందుకలా వెళ్ళిపోతుంది?

నేను తనగురించే
ఎప్పుడూ ఆలోచిస్తున్నానేమో?
లేకుంటే, ఇంత మత్తులో కూడా
నా ఇంటికే నేనెలా చేరగలిగాను?

ఎవరినైతే మరచిపోదామని
ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నించానో
ఆమె వీధిలోకే
ఇప్పుడు నేనెలా వచ్చాను?

నాకే మాత్రమైనా తెలివంటూ ఉంటే
ఆమెను ప్రేమించడం ఎలా జరిగింది?
ఈ విషం నా రక్తంలోకి జారడం
ఎలా జరిగింది?

28, నవంబర్ 2017, మంగళవారం

కలబురిగి కబుర్లు - 3 (బసవన్న వచనాలు)

బసవేశ్వరుని బోధలన్నీ చిన్న చిన్న పద్యాల రూపంలో ఉంటాయి. వాటిని వచనాలు అంటారు. ఇవి జెన్ మాస్టర్ల హైకూల వంటివి. కానీ వాటికంటే కొంచం పెద్దవిగా ఉంటాయి. ఆధ్యాత్మిక సత్యాలను ఇవి క్లుప్తంగా చక్కగా విడమర్చి చెప్తాయి. వీటిని చదివిన ఎవరైనా సరే, 'కాదు' అనలేరు. అంత చక్కగా ఉంటాయి.

అయితే, చాలా ఉన్నతమైన ఆధ్యాత్మికతను చెబుతూ ఉంటాయి గనుక, ఇవి ఆచరణలో సాధ్యమౌతాయా అని అనుమానం తప్పకుండా వస్తుంది. ఇది నిజమే. ఆచరణలో ఇవి అందరికీ సాధ్యం కావు. ఎందుకంటే, నిజమైన ఆధ్యాత్మికతను అందరూ ఆచరించలేరు. దానికి కారణం ఏమంటే - ఆ సత్యాలేమో ఎక్కడో మేఘాలలో తేలుతూ ఉంటాయి. మన జీవితాలేమో మురికి గుంటలలో దొర్లాడుతూ ఉంటాయి. కనుక - ఈ సత్యాలు చదివి ' ఓహో ' అనుకోడానికే తప్ప జనసామాన్యానికి ఆచరణలో అందవు. ఒకవేళ ఎవరికైనా ఇవి ఆచరణలో కూడా అందితే మాత్రం, వారు నిజంగా ధన్యులే.

ఈయన తన వచనాలలో ' కూడల సంగమ దేవా !' అనే మకుటాన్ని వాడాడు. కర్నాటక రాష్ట్రంలో బాగల్ కోట జిల్లాలో అలమట్టి డ్యాం కు దగ్గరలో ఉన్న కూడలసంగమ క్షేత్రంలో కృష్ణానది, మలప్రభా నదులు కలుస్తాయి. ఆ సంగమస్థానంలో ఒక శివాలయం ఉన్నది. ఈ క్షేత్రంలోనే బసవన్న గురువైన జటావేదముని ఆశ్రమం ఉండేది. బసవన్న చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండి శైవమతాన్ని అధ్యయనం చేశాడు. అందులోని ఈశ్వరుని పేరు కూడల సంగమేశ్వరుడు. ఈయన్ని సంబోధిస్తూనే బసవన్న తన వచనాలన్నీ చెప్పాడు.

కొన్ని వచనాలను చూద్దాం. ప్రతిపదార్ధంగా కాకుండా, భావాత్మక స్వేచ్చానువాదాన్ని చేశాను.

1. వచనదల్లి నామామృత తుంబి
నయనదల్లి నిమ్మ మూరుతి తుంబి
మనదల్లి నిమ్మ నెనహు తుంబి
కివియల్లి నిమ్మ కీరుతి తుంబి
కూడల సంగమదేవా
నిమ్మ చరనకమల దోళగాను తుంబి

నా మాటల్లో పలికేది నీవే - నా కన్నుల్లో మెరిసేది నీవే
నా మనసులో ఆలోచనవు నీవే - నా చెవులలో వినిపించేది నీవే
ఓ కూడల సంగమేశ్వరా...
నీ పాదపద్మాలలో నేనొక తుమ్మెదనంతే !

మనిషికి పంచేంద్రియాలున్నప్పటికీ ఎక్కువగా మనం వాడేది కన్నులు, నోరు, చెవులు మాత్రమే. వీటికి తోడుగా మనసు ఉండనే ఉంటుంది. ఈ నాలుగింటిలో నీవే నిండి ఉన్నావని ఈశ్వరునితో చెబుతున్నాడు బసవన్న. అంటే నిత్యమూ నిరంతరమూ ఆయనకు శివధ్యానమే. ఒక తుమ్మెద ఎలా అయితే పద్మంలోని మకరందాన్ని గ్రోలుతూ మైమరచి ఉంటుందో ఆ విధంగా నేనూ నీ ధ్యానంలో తన్మయుడనై ఉన్నానని అంటాడు.

2. ఎన్న వామ క్షేమ నిమ్మదయ్యా
ఎన్న హాని వృద్ధి నిమ్మదయ్యా
ఎన్న మాన అపమానవూ నిమ్మదయ్యా
బళ్ళిగే కాయి దిమ్మిత్తే? కూడల సంగమ దేవా !

ఓ పరమేశ్వరా !
నా క్షామమూ క్షేమమూ రెండూ నీ కృపయే
నాకు జరిగే హానీ, నాకు ఒరిగే లాభమూ రెండూ నీ భిక్షే
నాకయ్యే సన్మానమూ అవమానమూ రెండూ నువ్విచ్చేవే
తీగకు కాయ భారమా? కూడల సంగమ దేవా !

సంపూర్ణ శరణాగతికి పరాకాష్ట ఈ భావన. జరిగేది అంతా నీ సంకల్పమే అన్న ఒప్పుదల మనసుకు బాగా పట్టిన భక్తునికి ఇక బాధ ఏముంటుంది? ఆందోళన ఏముంటుంది? అయితే ఈ మాటలు ఊరకే చెబితే చాలదు. ఇది మనసుకు బాగా పట్టాలి. ఊరకే నోటితో చెప్పడం కాకుండా మనసులో కూడా ఇదే భావన నిరంతరం నిండి ఉండాలి. అదే నిజమైన శరణాగతి. చాలామంది ఊరకే 'శరణం శరణం' అని నోటితో చెబుతుంటారు గొప్పకోసం. అది నిజమైన శరణాగతి కాదు. శరణాగతి నిజమైనదైతే నలుగురిలో గొప్పగా చెప్పవలసిన పని లేదు. మనసులో నిజంగా ఆ భావన ఉంటే చాలు.

జిల్లెళ్ళమూడి అమ్మగారు తరచూ ఇలా అనేవారు ' మంచి ఇచ్చేది దేవుడైతే మరి చెడును ఇస్తున్నది ఎవరూ?' అదీ వాడి కృపే.

3. ఇవనారవ ఇవనారవ ఇవనారవనెందు ఎనిసదిరయ్యా
ఇవ నమ్మవ ఇవ నమ్మవ ఇవ నమ్మవనెందు ఎనిసయ్యా
కూడల సంగమ దేవా !
నిమ్మ మనెయ మగనెందు ఎనిసయ్యా

ఇతనిదే కులం ఇతనిదే కులం ఇతనిదే కులం
అని అడిగేటట్లు నన్ను చెయ్యకు
ఇతనూ నావాడే ఇతనూ నావాడే ఇతనూ నావాడే
అనుకునే విధంగా నన్ను చెయ్యి
'నేనూ నీ బిడ్డనే' అనుకునే విధంగా నన్ను చెయ్యి
ఓ కూడల సంగమ దేవా !

నిజమైన భక్తి హృదయంలో నిండినప్పుడు కులమతాలు అసలు గుర్తే రావు. అవి కంటికే కనపడవు. అవన్నీ మానవ లోకపు కట్టుబాట్లు. భక్తుడు వాటికి అతీతుడు. వాటన్నిటికీ అతీతుడైన పరమేశ్వరుడే అతని హృదయంలో ఎల్లప్పుడూ నిండి ఉంటాడు. ఇక వాటితో అతనికి పనేముంది? తన ప్రియతముని సృష్టిలో అన్నీ ప్రియమైనవే. అసహ్యానికి తావెక్కడుంది?

"భక్తేర్ జాతి నోయ్" - భక్తులు కులానికి అతీతులు అనేది శ్రీ రామకృష్ణుల అమృతవాక్కులలో ఒకటి.

4. ఉంబ బట్టలు బేరే కంచల్ల
నోడువ దర్పణ బేరే కంచల్ల
భాండ ఒందే భాజన ఒందే
బెళగే కన్నడియనిసినిత్తయ్యా
అరిదడే శరణ మరిదడే మానవ
మరెయదే పూజిసు కూడల సంగన

కంచపు కంచూ అద్దపు కంచూ వేరుకావు
లోహం ఒకటే తత్వమూ ఒకటే
మొద్దు లోహం మెరుగు పెడితే అద్దం అవుతుందంతే
తెలిస్తే భక్తుడు మరిస్తే మానవుడు
ఈశ్వరుని ఎప్పుడూ మరువకుండా ధ్యానించు

జిల్లెళ్ళమూడి అమ్మగారిని ఎవరో అడిగారు - 'అమ్మా నీదేం కులం? అని' అమ్మ బ్రాహ్మణకులంలో పుట్టిందని అడుగుతున్నవారికి తెలుసు. తెలిసినా కొంటెప్రశ్న అడిగారు. దానికి అమ్మ ఇలా చెప్పింది - 'శుక్లశోణితాలదే కులమో అదే నా కులం నాన్నా'. ఈ జవాబు అడిగినవారిని నిశ్చేష్టులను గావించింది.

అన్ని దేహాలలో ఉన్నది పంచభూతాలే. ఏమీ తేడా లేదు. ఒక ఒంట్లో అమృతమూ ఇంకో ఒంట్లో బురదా లేవు. అన్ని దేహాలలో ఉన్నది అదే మురికే.దీన్ని గ్రహించి సాధన గావిస్తే సిద్దత్వాన్ని అందుకోవచ్చు. దీనిని మరిస్తే మామూలు మనిషివే నువ్వు. కనుక అసలు విషయాన్ని గ్రహించి ఏమరకుండా శివధ్యానం చెయ్యి. 

5. కళబేడ కొలబేడ హుసియ నుడియలు బేడ
మునియ బేడ అన్యరిగే అసహ్య పడబేడ
తన్న బంనిస బేడ ఇదిర హళియలు బేడ
ఇదే అంతరంగ శుద్ధి ఇదే బహిరంగ శుద్ధి
ఇదే నమ్మ కూడలసంగమ దేవర నోలిసువ పరి

దొంగతనం చెయ్యకు, దేనినీ చంపకు, అబద్దం చెప్పకు
కోపపడకు, ఇతరులను అసహ్యించుకోకు
హెచ్చులు చెప్పుకోకు, ఎదుటివారిని అవమానించకు
లోపల శుద్ధి ఇదే  బయట శుద్ధి ఇదే
ఇదే నా కూడలసంగమ దేవుని మెప్పించే అసలైన దారి

పనికిమాలిన తంతులూ పూజలూ రోజంతా చేసి, సాయంత్రానికి ఇతరులతో చండాలంగా ప్రవర్తిస్తూ ఉంటే, అది అసలైన ఆధ్యాత్మికత కాదు. బాహ్యశుద్ది కంటే భావశుద్ధి ముఖ్యం.

పద్దతిగా ఉండు. కల్మషం లేకుండా ఉండు. త్రికరణ శుద్ధిగా ఉండు. సత్యం పలుకు. దొంగవు కాకు. చంపకు. హింసించకు. తిట్టకు. గొప్పలు చెప్పుకోకు. ద్వేషించకు. నిరంతరం శివుని ధ్యానించు. పరమేశుని మెప్పించే సత్యమార్గం ఇదే.

24, నవంబర్ 2017, శుక్రవారం

"శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక" పుస్తకావిష్కరణ కార్యక్రమం


నా శిష్యులూ, పంచవటి సభ్యులూ, నా బ్లాగు పాఠకులూ, ఇంకా చాలామంది ఎదురుచూస్తున్న కార్యక్రమం అతి దగ్గరలోకి వచ్చేసింది. అదే నేను రచించిన - శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక - బుక్ రిలీజ్ ఫంక్షన్. ఈ పుస్తకం మా పంచవటి పబ్లికేషన్స్ నుంచి వెలువడుతున్న మూడవ ప్రింట్ పుస్తకం. E - Book గా కూడా అదే రోజున వెలువడుతుంది.

ఈ పుస్తకానికి సంకల్పం 2016 లో అమెరికాలో పడింది. అక్కడ 'శ్రీవిద్య' మీద నేనిచ్చిన ఉపన్యాసాలను విన్న నా శిష్యురాలు, టెక్సాస్ నివాసిని శ్రీమతి లక్ష్మి తంత్రవాహిగారు - 'లలితా సహస్రనామాలకు మీ వివరణ వినాలని ఉంది' అని నన్ను కోరారు. ఆ విధంగా ఇదంతా మొదలైంది. ఆ తర్వాత నేను ఇండియా వచ్చేశాను. ఇక్కడనుంచి నేను ఫోన్ లో ప్రతిరోజూ చెబుతూ ఉండగా, డెట్రాయిట్ నివాసిని నా శిష్యురాలు శ్రీమతి అఖిల జంపాల ఈ పుస్తకాన్ని వ్రాసింది. ప్రతిరోజూ రెండుగంటలు పట్టిన ఈ కార్యక్రమం ఆరునెలల్లో ముగిసింది. ఆ విధంగా ఇప్పటికి ఈ పుస్తకం అచ్చులోకి రాగలిగింది.

శక్తితత్వాన్ని వివరించే ఈ గ్రంధం శక్తిస్వరూపిణుల సంకల్ప సహకారాలతోనే పూర్తి అవ్వడం ముదావహం.  

ఈ కార్యక్రమాన్ని 10-12-2017 ఆదివారం రోజున హైదరాబాద్ లో జరపాలని నిర్ణయించాము. ఉదయంపూట బుక్ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. మధ్యాన్నం నుంచీ Astro Workshop - 5 నిర్వహించబడుతుంది. ఈ వర్క్ షాపులో - జాతకచక్రాన్ని నేను విశ్లేషణ చేసే పద్ధతిలో కొన్ని సూత్రాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో, ఉదాహరణలతో సహా నేర్పించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి రావాలనుకునేవారు, మిగతా వివరాలకోసం, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ (ఇండియా) సెక్రటరీ అయిన 'శ్రీ రాజు సైకం' ను 9966007557 అనే మొబైల్ నంబర్ లో సంప్రదించవచ్చును.

23, నవంబర్ 2017, గురువారం

కలబురిగి కబుర్లు - 2

కలబుర్గి అంటే రాతిబురుజు అని అర్ధం. ఆ ఊళ్ళో బహమనీ సుల్తానుల కోట ఉంది. అందుకని ఆ పేరు వచ్చిందో ఏమో తెలీదు. ఇదంతా ఒకప్పుడు సుల్తానుల ఆధీనంలో ఉన్న ప్రాంతం. చాలాకాలం పాటు ఇది హైదరాబాద్ నిజాం అధీనంలో కూడా ఉంది. అందుకే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ. చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళున్నారు. ఇది హైద్రాబాద్ కు బాగా దగ్గర కావడంతో చదువుకోడానికి చాలామంది తెలుగువాళ్ళు ఇక్కడికి వస్తుంటారు.

ఇక్కడకు వచ్చిన రెండో రోజే లోకల్ న్యూస్ చూద్దామని పేపర్ తీస్తే ఒక విచిత్రమైన వార్త కనిపించింది. అదేమంటే - మేం హిందువులం కాము. మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని లింగాయత్ కమ్యూనిటీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. విషయం కోర్టు దాకా వెళ్ళింది. ఇది నాకు భలే విచిత్రం అనిపించింది. శివుడిని పూజించే లింగాయతులు హిందువులు కాకుండా ఎలా పోతారు?

అసలు లింగాయత మతం, అనేది ( అసలంటూ అదొక ప్రత్యెక మతం అయితే?) మొదలైనదే బసవేశ్వరుడినుంచి. బసవన్నది చాలా విషాద గాధ.

మనం సమాజంలో కులవ్యవస్థను లేకుండా చెయ్యాలని ప్రయత్నించిన వాళ్ళు ప్రాచీనకాలం నుంచీ కొందరున్నారు. వారిలో మొదటి వాడు బుద్ధుడు. ఆ తర్వాతివాడు బసవన్న. బుద్ధుడు క్షత్రియుడు. బసవన్న బ్రాహ్మణుడు. వీరిద్దరూ అగ్రవర్ణాలకు చెందినవారే. వీరి తర్వాత అంబేద్కర్ ప్రయత్నించాడు. బుద్ధునికీ బసవన్నకూ 1700 సంవత్సరాల కాలవ్యవధి ఉంది. బసవన్నకూ అంబేద్కర్ కూ 800 సంవత్సరాల తేడా ఉంది.

అయితే వీళ్ళలో తేడాలున్నాయి. బుద్ధుడు జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ మార్గంలో నడిస్తే మనిషి కులానికి అతీతుడౌతాడని అన్నాడు. అది నిజమే. ఆ మార్గంలో నడిచి జ్ఞానులైనవాళ్ళు ఎందఱో ఉన్నారు. బసవన్నేమో శివభక్తికి ప్రాధాన్యతనిచ్చాడు. లింగాన్ని మెడలో ధరించి కొన్ని నియమాలు పాటిస్తూ, శివజ్ఞానాన్ని పొంది జీవితాన్ని గడిపితే కులానికి అతీతంగా పోవచ్చని ఆయనన్నాడు. ఇదీ నిజమే. ఇది భక్తిమార్గం. క్రమేణా వీరందరూ లింగాయతులు (లింగధారులు) అని ఒక ప్రత్యెకమైన జాతిగా తయారయ్యారు. కానీ వీరు మతప్రాతిపదికన కులాన్ని దాటాలని ప్రయత్నించారు. అంబేద్కరేమో, మతంతో సంబంధం లేకుండా, సమాజంలోనుంచి కులమనేది అదృశ్యం కావాలని భావించాడు.

విచిత్రమేమంటే వీరిలో ఎవరి స్వప్నమూ నిజం కాలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం - ఎప్పటికీ కాబోదు కూడా. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగి కులానికి అతీతుడు కావచ్చు. మనిషి దైవత్వాన్ని అందుకుంటే కులమతాలకు అతను అతీతుడౌతాడు. కానీ సామాజికంగా కులం అదృశ్యం కావడం అనేది జరగదు. అది ఆచరణాత్మకం కూడా కాదు.

వ్యక్తిగతంగా మనిషి కులానికి అతీతుడు కావచ్చు. కానీ సమాజం మొత్తం ఒకేసారి అలా కావడం జరగదు. ముఖ్యంగా మన భారతీయ సమాజంలోనుంచి కులం అదృశ్యం కావడం ఎన్నటికీ జరగని పని.అసలు బర్త్ సర్టిఫికేట్ లోనే కులం అన్న కాలమ్ ఉన్నప్పుడు కులం ఎలా పోతుంది? ఎక్కడికి పోతుంది? ఒకవేళ ఆ సర్టిఫికేట్ లోనుంచి దాన్ని తీసేసినా మనుషుల మనసులలోనుంచి ఎలా పోతుంది?  పైగా, కులం వల్ల ఇప్పుడు అనేక లాభాలు ఒనగూడుతున్నప్పుడు అదెలా పోతుంది? అది జరిగే పని కాదు.

కులం లేని విదేశాలలో కూడా రంగు ఉంది. రేసిజం అనేది రంగును బట్టే ఉంటుంది. పోనీ ఒకే రంగు ఉన్న జాతులలో కూడా మళ్ళీ వారిలో వారికే అనేక విభేదాలున్నాయి. ఫిజికల్ ఫీచర్స్ లో తేడాలనేవి మనుషులలో ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. కనుక విభేదాలనేవి ఎప్పటికీ మానవజాతినుంచి అదృశ్యం కావు. కులం కాకపోతే రంగు, రంగు కాకపోతే జాతి, జాతి కాకపోతే దేశం, దేశం కాకపోతే మతం, అది కాకపోతే ఇంకోటి - ఈ రకంగా అవి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. మానవసమాజంలో గ్రూపులనేవి ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటాయి. ఇది ప్రకృతి నియమం.

ఆ విషయాన్ని అలా ఉంచి, బసవన్న గురించి కొంత ఆలోచిద్దాం.

ఈ బసవన్న 12 శతాబ్దంలో వాడు. కన్నడ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఈయన నందీశ్వరుని వరప్రసాది అని భావిస్తారు. అలాంటి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా, చిన్నప్పటి నుంచీ కులవ్యవస్థ అంటే ఈయనకు రుచించేది కాదు. ఉపనయన సమయంలో జంధ్యాన్ని తెంచేసి, ఇంట్లోనుంచి పారిపోయి, ఒక పాశుపతశాఖకు చెందిన శైవగురువు దగ్గర శిష్యునిగా చేరిపోయాడు.

పాశుపత మతానికి మూలాలు వేదాలలోనే ఉన్నాయి. మనుషులందరూ కామం, క్రోధం, భయం, గర్వం మొదలైన పాశాలతో బంధింపబడి ఉన్నారు గనుక వీరందరూ పశువులనీ, దేవుడు వీటికి అతీతుడు గనుక ఆయన పశుపతి అనీ ఆయనే శివుడనీ వీళ్ళు భావిస్తారు. పన్నెండేళ్ళు అదే ఆశ్రమంలో ఉండి ఆ ఫిలాసఫీ బాగా చదివి జీర్ణించుకున్నాడు. ఆ తర్వాత బిజ్జలుడనే ఆ దేశపు రాజు దగ్గర గణకుడిగా (ఎకౌంటెంట్) ఒక ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత తన మేనమామ అయిన మంత్రి చనిపోతే, ఆ స్థానంలో మంత్రి అయ్యాడు. మంత్రిపదవి ఆయనకు రావడానికి వెనుక ఉన్న కధను ఇప్పటికీ కన్నడదేశంలో చెప్పుకుంటారు.

బిజ్జలుడు పశ్చిమ చాళుక్యరాజులకు ఒక సామంతరాజు. వీరిని కల్యాణి చాళుక్యులని కూడా అనేవారు. తన ప్రభువైన విక్రమాదిత్యుడు చనిపోయాక స్వతంత్రం ప్రకటించుకుని కొన్ని కోటలను జయించాడు. ఆ కోటల్లో ఒకచోట ఒక రాగిరేకు దొరికింది. ఆ రాగి రేకుమీద ఏదో అర్ధంకాని కోడ్ భాషలో ఏదో వ్రాసి ఉంది. దాన్ని ఎవరూ డీకోడ్ చెయ్యలేకపోగా, బసవన్న దాన్ని చదివి వివరించి చెప్పాడు. అది ఒక నిధికి మ్యాప్. దానిలో ఉన్న గుర్తుల ప్రకారం కోటలో త్రవ్వించగా కోట్లాది బంగారు నాణాలతో కూడిన పెద్దనిధి ఒకటి దొరికింది. దాన్ని డీకోడ్ చేసినందుకు కృతజ్ఞతగా బసవన్నను తన మంత్రిగా పెట్టుకున్నాడు బిజ్జలుడు. అంతేగాక తన చెల్లెల్నిచ్చి పెళ్లి కూడా చేశాడు.

అంతకు ముందే తన మేనమామ అయిన మంత్రి కూతుర్ని (తన మరదల్ని) చేసుకుని ఉన్నాడు బసవన్న. రాజు చెల్లెలూ మంత్రి కూతురూ చిన్నప్పటి నుంచీ స్నేహితులుగా పెరిగారు. ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేరు. ఇద్దరూ ఒకరినే పెళ్లి చేసుకుందామని ఒప్పందం కూడా చేసుకుని ఉన్నారు. కనుక ఇద్దరినీ బసవన్నే పెళ్లి చేసుకున్నాడు.

మంత్రి అయిన తర్వాత బసవన్న తన కులరహిత సమాజ ఎజెండాను ప్రచారం చెయ్యడం మొదలుపెట్టాడు. 'అనుభవ మంటపం' అని ఒక పార్లమెంట్ లాంటిదాన్ని కట్టించి, అందులో సాధువులనూ సిద్దులనూ పోగేసి చర్చలు చెయ్యడం సాగించాడు. కులవ్యవస్థను ధిక్కరించడం మొదలుపెట్టాడు. మంత్రిగారే అలా ఉంటె ఇక సమాజం ఎలా ఉంటుంది? నిమ్నకులాల వారికి ఆయన ఒక దేవునిలా కనిపించాడు. వారందరూ ఆయన చుట్టూ చేరి ఒక ప్రవక్తగా ఆయన్ను కొలవడం ప్రారంభించారు. అతి త్వరలో ఆయన పాపులారిటీ రాజును మించిపోయింది.

ఈయన అనుచరుల్లో నిమ్న కులాలకు చెందినవారు ఎందఱో ఉన్నారు. వారందరూ లింగధారులుగా మారారు. వారికి కులం లేదు. లింగాయతమే వారి కులం, అదే వారి మతం. వారు దేవాలయాలకు వెళ్ళరు. పూజలు చెయ్యరు. ఆచారాలు పాటించరు. శివభక్తి ఒక్కటే వారి మతం. ఇష్టలింగం అనే ఒక లింగాన్ని రుద్రాక్ష దండలో వేసి మెడలో ధరిస్తారు. పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. వారికి పూజారులు, పురోహితులు అవసరం లేదు. తంతులు పాటించరు. శివుడిని డైరెక్ట్ గా ధ్యానిస్తారు. ఉపాసన, ధ్యానం, జ్ఞానం, శివైక్యం - ఇదే వారి దారి.

అనుభవ మంటపంలో గురువు అల్లమప్రభు. ఈయన మహా శివభక్తుడు. ఈయన దేవాలయంలో డోలు వాయించే వృత్తికి (బహుశా మంగలి కావచ్చు) చెందినవాడు. ఒక నర్తకిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె చనిపోగా ఈయన వైరాగ్యపూరితుడై కొండల్లో కోనల్లో తిరుగుతూ ఒక గుహలో ఒక సిద్ధయోగిని కలిసి ఆయన శిష్యుడై సాధన గావించి జ్ఞానాన్ని పొందాడు. అనుభవ మంటపంలోనే అక్కమహాదేవి కూడా ఉండేది. మాలకక్కయ్య, మాదిగ హరలయ్య, మడివాల మచ్చయ్య (జాలరి), హడపాద అప్పన్న (మంగలి), మాదర చెన్నయ్య (మాదిగ), నూళియ చందయ్య (పద్మసాలి), అంబిగర చౌడయ్య (పడవ నడిపే కులం)  మొదలైన శివభక్తులు కూడా అందులోనే మహామంత్రి అయిన బసవన్నతో సమానంగా ఆసీనులయ్యేవారు. బసవన్న స్వయంగా అల్లమప్రభు పాదాలవద్ద కూచునేవాడు. ఆ మంటపంలో అసలైన, నిజమైన, ఆధ్యాత్మిక చర్చలు జోరుగా సాగేవి. ఉత్త చర్చలతో కాలం గడపడం కాకుండా వారందరూ ఉన్నతమైన ఆశయాలతో కూడిన ఆధ్యాత్మిక జీవితాలను గడిపేవారు. కలసి మెలసి కులాలకు అతీతంగా ఉండేవారు.

ఈ విధంగా అనుభవ మంటపంలో కులాన్ని రూపుమాపాడు బసవన్న. ఈయన అనేక చిన్న చిన్న పద్యాలలో తన భావాలను చెప్పాడు. వాటిని 'వచనాలు' అంటారు. ఆయనే గాక అల్లమప్రభు, అక్కమహాదేవి వంటి మిగతా శివభక్తులు కూడా 'వచనాలు' చెప్పారు. అవి అర్ధగాంభీర్యంలో గాని, సత్యప్రకటనలో గాని చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ ఆధ్యాత్మికంగా సత్యాలే. అయితే, వాటన్నిటినీ ఒకేసారిగా సమాజం మొత్తానికీ అప్లై చేసి సమాజం మొత్తాన్నీ ఏకమూలంగా మార్చి పారేయ్యలన్న వీరి ప్రయత్నమే బెడిసికొట్టింది. 

ఇదిలా ఉండగా, శీలవంతుడనే పేరుగల మాదిగ హరలయ్య కొడుకుతో, తన శిష్యుడైన మధువరసు అనే బ్రాహ్మణుని కూతురైన కళావతికి దగ్గరుండి వివాహం చేయించాడు బసవన్న. వెయ్యి సంవత్సరాల క్రితం సమాజంలో ఇదెంత సాహసోపేతమైన చర్యో అర్ధం చేసుకోవచ్చు. ఈ సంఘటన అగ్రవర్ణాలకు చాలా కోపాన్ని తెప్పించింది. వారంతా కలసి మూకుమ్మడిగా బిజ్జలుడికి ఫిర్యాదు చేశారు. సమాజం పూర్తిగా భ్రష్టు పట్టిందనీ, కులవ్యవస్థ బీటలు వారిందనీ, దీనికంతా మంత్రిగారే కారకుడనీ, అందువల్ల రాజు వెంటనే జోక్యం చేసుకోకపోతే రాజ్యం అల్లకల్లోలం అవ్వబోతున్నదనీ, విప్లవం రాబోతున్నదనీ రాజుకు బాగా ఎక్కించారు. రాజును దించేసి బసవన్నే రాజయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా ఆయనకు బాగా నూరిపోశారు. 

అప్పటికే బసవన్న చేస్తున్న పనులను రాజు వేగులద్వారా చాలాసార్లు విని ఉన్నాడు. కానీ బసవన్న తన బావమరిది గనుక, చెల్లెలి ముఖం చూచి వెంటనే చర్య తీసుకోలేక, ఊరుకునేవాడు. కానీ బసవన్న ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. సమాజమే కుప్పకూలే పరిస్థితి వచ్చేస్తున్నది. ఇలాంటి కుట్ర జరుగుతుంటే ఏ రాజు చూస్తూ ఊరుకుంటాడు? కోపోద్రిక్తుడైన రాజు, మంత్రి బసవన్నను పిలిచి మంత్రిపదవికి వెంటనే రాజీనామా ఇవ్వమని ఆదేశించాడు. బసవన్న అలాగే చేశాడు. తన కిరీటాన్ని తీసి రాజు పాదాల వద్ద ఉంచి ఒక సామాన్యునిగా సమాజంలోకి వెళ్ళిపోయాడు. అంతేగాని తన సిద్ధాంతాలు వదులుకోలేదు.

బిజ్జలుడు అంతటితో ఊరుకోలేదు. ఆ తర్వాత, తమ పిల్లలకు అలాంటి కులాంతర వివాహం చేసినందుకు హరలయ్యకూ, మధువరసుకూ కళ్ళు పీకించి వారిని మదపుటేనుగు కాళ్ళకు గొలుసులతో కట్టించి ఆ ఏనుగును కల్యాణి నగరపు వీధుల్లో పరిగెత్తించాడు. ఒళ్లంతా రక్తగాయాలై తలలు పగిలి వారిద్దరూ చనిపోయారు. కల్యాణి నగరపు వీధులు వారి రక్తంతో తడిశాయి. ఎదురు తిరిగిన లింగాయతులను ఎక్కడికక్కడ క్రూరంగా అణచి వెయ్యమని సైన్యాన్ని ఆదేశించాడు రాజు.

రాజ్యంలో విప్లవం రేగింది. ప్రజలు సైన్యానికీ రాజుకూ ఎదురు తిరిగారు. ఆ గొడవల్లో చాలామంది ప్రజల ప్రాణాలు పోయాయి. ఆడవాళ్ళు కూడా ఈ సివిల్ వార్ లో పాల్గొన్నారు. లింగాయతులలో కొంతమంది యుద్ధవిద్యా నిపుణులున్నారు. వారంతా కలసి సమయం కోసం వేచి చూచి, ఒకరోజున రాజు ఒంటరిగా ఉన్నప్పుడు గెరిల్లా పద్ధతిలో ఎటాక్ చేసి బిజ్జలుడిని చంపేశారు. ఆ విధంగా హరలయ్య మధువరసుల హత్యలకు వారు ప్రతీకారం తీర్చుకున్నారు. బిజ్జలుని కథ అలా విషాదంగా ముగిసింది.

ఇదంతా చూచి బసవన్నకు మహా విరక్తి కలిగింది. "తను ఆశించినదేమిటి? జరిగినదేమిటి? కులానికి అతీతంగా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆశయాలతో కూడిన సమాజాన్ని నిర్మిద్దామని తను ఊహిస్తే, అది ఒక విప్లవంగా మారి రాజ్యాన్నే అల్లకల్లోలం చేసింది. రాజు హత్యకు కారణమైంది. రాజు తన బావగారు కూడా. రాజు భార్యకూ, తన భార్యకూ తనేం సమాధానం చెప్పాలి? తన అనుచరులైన హరలయ్యకూ, మధువరసుకూ కూడా భయంకరమైన మరణం ప్రాప్తించింది. వారి కుటుంబమూ తన కుటుంబమూ మొత్తం చిన్నాభిన్నం అయిపోయాయి. ఇంకా ఎందఱో తన శిష్యులు సైన్యంతో జరిగిన గొడవల్లో చనిపోయారు. బహుశా తన ఊహ తప్పేమో? తను చాలా తొందరపడ్డాడేమో? అలాంటి ఉన్నతమైన సమాజవ్యవస్థను అప్పుడే ఊహించడం తన తప్పేమో? ఇలాంటి సమాజం రావడానికి ఇంకా కొన్నివేల ఏళ్ళు పట్టవచ్చేమో? ఏదేమైనా ఇందరి చావులకు తనే కారణం అయ్యాడు కదా?" అన్న పశ్చాత్తాపం ఆయనలో తీవ్రంగా తలెత్తింది. 

ఆ మనోవ్యధను తట్టుకోలేక, కూడలసంగమ క్షేత్రంలో ఉన్న తన గురువు ఆశ్రమానికి వెళ్లి, తిండి మాసేసి, కఠోర ఉపవాసదీక్షలో ఉంటూ ఒక ఏడాది తర్వాత అక్కడే చనిపోయాడు. అప్పటికి అతనికి 35 ఏళ్ళు మాత్రమే. అక్కడ కృష్ణానదిలోకి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటారు. కాదు, హత్య చెయ్యబడ్డాడని కొందరు అంటారు. నిజానిజాలు ఎవరికీ తెలీదు. ఆ తర్వాత అతని ఇద్దరు భార్యలూ కూడా విషాదకర పరిస్థితులలోనే చనిపోయారు. ఏదేమైనా బసవన్న కధ ఆ విధంగా విషాదాంతం అయింది. ఇదంతా క్రీ.శ.1100 ప్రాంతంలో జరిగింది.

కానీ, ఆయన ఆశించిన కులరహిత సమాజం మాత్రం ఇంతవరకూ మన దేశంలో రాలేదు. ఇకముందు వస్తుందని కూడా భరోసా లేదు.

ఇదిలా ఉంటే, కాలక్రమేణా, ఆయన అనుచరులైన లింగాయతులు కన్నడదేశంలో తామరతంపరలుగా వృద్ధి చెందారు. ఇప్పుడు కర్ణాటకలో వారొక బలమైన రాజకీయశక్తిగా ఉన్నారు. అక్కడి ముఖ్యమంత్రులలో చాలామంది లింగాయతులే. ఇప్పుడు వాళ్ళందరూ కలసి ఒక కొత్తపాట మొదలు పెట్టారు. అదేమంటే - మేం హిందువులం కాము. మాది హిందూమతం కాదు. కనుక మాకు ప్రత్యేక మైనారిటీ స్టేటస్ ఇవ్వాలి - అని.

పేపర్లో వీళ్ళ గోల చదువుతుంటే నాకు నవ్వాలో ఏడవాలో ఇంకేదైనా చెయ్యాలో ఏమీ అర్ధం కాలేదు. హిందూ సమాజంలో వీరిది ఒక సంస్కరణోద్యమం. అంతే. అంత మాత్రం చేత వీరు హిందువులు కాకుండా ఎలా పోతారు? గతంలో సిక్కులు కూడా ఇలాగే మాది హిందూమతం కాదన్నారు. శిక్కు అనే పదానికే శిష్యుడు అని అర్ధం. వారి ఫిలాసఫీ అంతా హిందూత్వమే. కొన్నికొన్ని ఇస్లాం నుంచి కూడా వారు స్వీకరించి ఉండవచ్చుగాక. కానీ ఆ ఇస్లాం కూడా హిందూమతంలోని ఒక శాఖ మాత్రమే. ఏకేశ్వర వాదం హిందూమతంలో కూడా ఉంది. హిందూమతంలో లేనిది ఏ మతంలోనూ ఎక్కడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అన్ని మతాలూ హిందూమతపు విభిన్న శాఖలే.

లింగాయతులు, మాది ప్రత్యేక కులం అంటున్నారు. కానీ కులవ్యవస్థకు వారి మూలపురుషుడైన బసవన్న వ్యతిరేకం అన్నమాటను వారు మర్చిపోతున్నారు. ఈ ఉద్యమంలోనే ఆయన కుటుంబం మొత్తం వెయ్యేళ్ళ క్రితమే సర్వనాశనం అయింది. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఇదెలా ఉందంటే - భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టిన కమ్యూనిజం అధికారంలోకి వచ్చాక అదొక నయా భూస్వామి వ్యవస్థగా రూపుదిద్దుకున్నట్లుగా ఉంది. 

కులానికి వ్యతిరేకంగా పుట్టిన ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తలు తామే ఒక ప్రత్యేక కులంగా మారడం చూస్తుంటే ఏమనిపిస్తోంది? మన దేశంలో కులం అనేది మాయం కావడం అసంభవం అన్న నా మాట నిజం అనిపించడం లేదూ?

బసవన్న మీద కన్నడంలో వచ్చిన రెండు సినిమాలను ఇక్కడ యూట్యూబులో చూడండి.

Jagajyothi Basaveshwara 1959 Movie

https://www.youtube.com/watch?v=B6wHMFAKe8k

Kranti Yogi Basavanna Movie

https://www.youtube.com/watch?v=nIr0RRgxvi4


19, నవంబర్ 2017, ఆదివారం

నీకు చుక్క కనిపిస్తుందా??

లలితా సహస్రనామాల మీద ఈ మధ్యనే నేను వ్రాసిన పుస్తకం అచ్చు పనుల కోసం రామారావును కలుద్దామని మొన్నీ మధ్య విజయవాడలోని డీటీపీ సెంటర్ కు వెళ్ళాను. ఉదయం ఎనిమిది గంటలకే అక్కడ ఒక పెద్దాయన కూచుని రామారావుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయం పూట అయితే ఎవరూ వచ్చి డిస్టర్బ్ చెయ్యరని మా ఉద్దేశ్యం. అందుకని పొద్దున్నే మా పని పెట్టుకుంటూ ఉంటాం. కానీ షాపు తెరిచి కనిపిస్తే చాలు ఎవరో ఒకరు వచ్చి కాలక్షేపం కబుర్లు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళల్లో రిటైరైన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీరికి శ్రోతలు కావాలి. పాపం ఎవరూ వాళ్ళను పట్టించుకోరు. అందుకని ఎవరు బకరాలు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు.

కాసేపు షాపు బయట వెయిట్ చేశాను ఆయన లేచి పోతాడేమో అని. కానీ ఆయన కదిలే రకంలాగా కనిపించలేదు. ఇక ఇలా కాదని నేనూ లోపలకు వెళ్లాను.

నన్ను చూస్తూనే - 'ఈయన కూడా సాధకుడే మీలాగా' అంటూ రామారావు నన్ను పరిచయం చేశాడు ఆయనకు.

ఆయన వయస్సు డబ్బై ఎనభై మధ్యలో ఉంటుంది. వయసుతో పాటు వచ్చిన చెవుడు కూడా ఆయనకు ఉన్నట్టుంది నా వైపు ఎగాదిగా చూశాడు.

చెప్పిందే ఇంకొంచం గట్టిగా చెప్పాడు రామారావు.

చెవుడు ఉన్నవాళ్ళకు రెండోసారి చెబితే చాలా కోపం వస్తుంది. అలాగే ఆయనకూ వచ్చింది. అర్ధమైందిలే అన్నట్టు విసుక్కుంటూ - 'ఏం సాధన చేస్తావు నువ్వు?' అన్నాడు నన్ను తేలికగా.

నేనేం మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాను.

ఆయన చేతిలో ఉన్న కాయితాలు గట్రా చూస్తే ఎవరికో ఏవేవో ఉత్తరాలు వ్రాసినట్లుగా ఉన్నాయి. నా చూపును గమనించి - 'ఇవన్నీ ఆయన తన అనుభవాలను ఎవరెవరో స్వామీజీలకు వ్రాసిన ఉత్తరాలు.అవి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు.' అని అన్నాడు రామారావు.

అలా అంటూ - 'ఈయనక్కూడా మంచి మంచి అనుభవాలున్నాయి' అన్నాడు నన్ను చూపిస్తూ.

'ఏం అనుభవాలయ్యాయి నీకు?' అన్నాడు ముసలాయన నన్ను చూస్తూ.

'ఏం అనుభవాలు చెప్పాలో ఈయనకు?' అన్న చిలిపి ఆలోచన నా ముఖంలో నవ్వును రప్పించింది. ఆయన ప్రశ్నకు అసలు జవాబే ఇవ్వలేదు నేను. నిరామయంగా ఆయన ముఖంలోకి చూస్తున్నాను.

'చుక్క కనిపిస్తుందా?' అడిగాడు పెద్దాయన.

'రోజూ కనిపిస్తూనే ఉంటాయి. చీకటి పడ్డాక' అన్నాను నేను భక్తిగా.

'ఆ చుక్కలు కాదు. ధ్యానంలో కళ్ళు మూసుకుంటే చుక్క కనిపిస్తుందా లేదా?' అన్నాడాయన స్వరం రెట్టించి.

'లేదు' అన్నట్లుగా తల అడ్డంగా ఆడించాను.

'నువ్వు వేస్ట్' అన్నట్లుగా నావైపు చూశాడాయన.

'చుక్క కన్పించాలి. పైకీ కిందికీ ఆడుతూ ముందుగా రెండు చుక్కలు కన్పిస్తాయి. ఆ తర్వాత రెండూ ఒకటే చుక్కగా మారిపోతాయి. అసలు చుక్క కనిపిస్తేనే నువ్వు యోగంలో మొదటి మెట్టు ఎక్కినట్లు లెక్క' అన్నాడాయన.

నేను అయోమయంగా ముఖం పెట్టాను.

'ప్రాణాయామం చేస్తావా నువ్వు?' అడిగాడాయన మళ్ళీ నావైపు నిర్లక్ష్య ధోరణిలో చూస్తూ.

'లేదు' అన్నాను.

'మరింక నీకేం పురోగతి ఉంటుంది? ప్రాణాయామం చెయ్యాలి. నేను నాలుగు సంవత్సరాల పది నెలల పాటు రెగ్యులర్ గా ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రాణాయామం చేశాను - నాలుగు సంవత్సరాల పది నెలలు.' అన్నాడాయన రెండోసారి రెట్టిస్తూ.

'అలాగా' అన్నట్లు జాలిగా ఆయనవైపు చూశాను.

నా చూపు ఆయనకు నచ్చలేదు.

'చూడండి నా అనుభవాలు !! ఇవన్నీ పెద్ద పెద్ద స్వామీజీలకు ఉత్తరాలు వ్రాస్తూ ఉంటాను.' అన్నాడు తన చేతిలోని ఉత్తరాల కట్ట చూపిస్తూ.

'మన అనుభవాలు మనలోనే ఉంచుకోవాలి గాని ఇతరులకు చెప్పకూడదు.' అని గొణిగా నేను 'అనుభవాలు' అన్న పదాన్ని నొక్కుతూ.

ఆయనకు వినిపించలేదుగాని నేనేదో కామెంట్ చేసానని అర్ధమైంది.

మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో - 'పొద్దున్నే లేచి ప్రాణాయామం చెయ్యి. సూర్యుడు వచ్చాక చేసే సాధనకు ఫలితం ఉండదు. సూర్యోదయం ముందే మన సాధన అయిపోవాలి. అప్పుడు రోజంతా ఫ్రెష్ గా ఉంటుంది.' అన్నాడు.

'అవును. అప్పుడు బోలెడు సమయం ఉంటుంది గనుక పొద్దున్నే లేచి రోడ్లంబడి తిరుగుతూ ఉండచ్చు.' అన్నా నేను చిన్నగా.

ఆయనకు నా మాట అర్ధం కాలేదు.

'సాధన బాగా చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. చూడండి. నిన్ననే వీళ్ళ క్లాస్ కు వెళ్లి వచ్చాను.' అన్నాడు నాకొక పాంప్లెట్ చూపిస్తూ.

'అదేంటా?' అని ఆ కాయితం వైపు చూచాను. 'బాబాజీ భోగర్ మాతాజీ క్రియాయోగా' అంటూ ఏదేదో వ్రాసి ఉంది దానిమీద. అదాటున చూచి ' బాబాజీ బోగస్ మాతాజీ' అన్నట్లు కనిపించి చచ్చే నవ్వొచ్చింది.

నా నవ్వును చూచి ఆయనకు కోపం ఇంకా పెరిగిపోయింది. నా వైపు కోపంగా చూచాడు.

నేనేదో తప్పు చేసినవాడిలా ఫోజిచ్చి ఆయనవైపు దీనంగా చూచాను.

ఇదంతా ఆయనకే బోరు కొట్టినట్లు ఉంది. లేచి - 'సరే నే వస్తా' అని మాతో చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు.

'పద రామారావు టీ త్రాగి వద్దాం.' అన్నా నేనూ లేస్తూ.

'పదండి' అని తనూ లేచాడు.

దారిలో నడుస్తూ ఉండగా - 'అదేంటి సార్. ఆయన గొప్ప సాధకుడినని చెప్పుకుంటూ ఉంటాడు. మిమ్మల్ని చూస్తూనే గుర్తు పడతాడని నేను అనుకున్నాను. అందుకే కొద్దిగా పరిచయం చేశాను. అలా మాట్లాడాడెంటి మీతో?' అన్నాడు.

'ఏమో నాకేం తెలుసు. ఆయన్నే అడగక పోయావా?' అన్నా నవ్వుతూ.

'ఇంకేం అడుగుతాం. ఆయన ధోరణి అలా ఉంటే' అన్నాడు.

'చెప్తా విను. ఆయన క్రియాయోగ సాధన చేస్తున్నాడు. ఆ సాధనా ప్రారంభంలో భ్రూమధ్యంలో వెలుగు చుక్క కన్పించడం సహజమే. అదేమీ పెద్ద అనుభవం కాదు. చాలా ప్రాధమికమైన అనుభవం అది. ఈయనకేమో డబ్భై దాటాయి. ముసలోడికి దసరా పండగ అన్నట్లు ఇదేదో పెద్ద గొప్ప అనుభవం అని అందరికీ ఉత్తరాలు వ్రాస్తున్నాడు. ఎవడి పిచ్చి వాడికానందం. అయిదేళ్ళ క్రితం సాధన మొదలు పెట్టానని చెబుతున్నాడు. అంటే - ఆయనకు ఏ అరవై ఐదో ఉన్నప్పుడు మొదలు పెట్టాడు. అప్పటికి శరీరంలో ఏం శక్తి ఉంటుంది? అంతా ఉడిగిపోయి ఉంటుంది. పైగా బ్రహ్మచారి కూడా కాదు, సంసారిలాగే ఉన్నాడు. కనుక ఇప్పుడెంత కొట్టుకున్నా ఆయనకు చుక్క తప్ప ఇంకేమీ కన్పించదు.' అన్నా.

'అంతేనంటారా?' అన్నాడు రామారావు.

'ఈ వయసులో ఆయన త్వరగా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఒకటే మార్గం ఉంది. అదేంటంటే - రోజూ చీకటి పడగానే చుక్కేసుకోని తొంగోవడమే..' అన్నా నవ్వుతూ.

'అవునా? మీరు దేన్నైనా జోకులెయ్యకుండా ఉండరు' అన్నాడు రామారావు నవ్వుతూ.

'హాస్యమే జీవితంలో ఖర్చులేని ఔషధం రామారావ్! అది సరేగాని, క్రియాయోగం అనేది వయసులో ఉన్నపుడు చెయ్యాలి. అప్పుడు శరీరంలో రీ ప్రొడక్టివ్ జ్యూసెస్ ఉంటాయి. అవి ఉన్నప్పుడే యోగసాధన ఫలిస్తుంది. అవి పోయాక ఏ సాధనా ఏ ఫలితాన్నీ ఇవ్వదు. మహా అయితే గంటలు గంటలు ప్రాణాయామం చేస్తే ఒక చుక్క కన్పించవచ్చేమో? ముందే చెప్పాకదా..అదేమీ పెద్ద గొప్ప ఫలితం కాదు.' అన్నా నేను.

'కానీ ఆయన మిమ్మల్ని గుర్తించలేకపోవడమే విచిత్రంగా ఉంది.' అన్నాడు.

'ఆయనకు చెవుడుతో బాటు చూపు కూడా మందగించినట్లుంది పాపం ! పోనీలే. రోడ్డుమీద పోతున్న ఏ చక్కని చుక్కనో చూచి తన పెళ్ళాం అనుకోకుంటే అంతే చాలు. ఈ ఫీల్డే అంత రామారావ్ ! ఇక్కడ ఒక నలభై రోజులు నల్లడ్రస్సు వేసుకుని గడ్డం పెంచుకున్న ప్రతివాడు కూడా పెద్ద లెవల్లో ఫీలై పోతూ ఉంటాడు.అదంతే. దీన్నే స్పిరిచ్యువల్ ఈగోయిజం అంటారు. ఈయన్నే చూడు. ఈపాటికి సాధన అయిపోయి ఒక ముప్పైఏళ్ళు గతించి ఉండాలి. కానీ ఈయనిప్పుడు క్లాసులని తిరుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళని చూచి మనం జాలిపడాలి అంతే!!

ఇంకో విషయం చెప్పనా? ఇలాంటి వాళ్ళు మనల్ని గుర్తించకపోవడమే మనకు పెద్ద వరం. గుర్తించారంటే ఇక మన వెంటపడి అది చెప్పు ఇది చెప్పు అని పీడిస్తారు. ఆ గోల మనం భరించలేం.' అన్నా నవ్వుతూ.

మాటల్లోనే 'స్టార్' టీ స్టాల్ వచ్చేసింది.

ఇద్దరం టీ సేవించడం మొదలు పెట్టాం !!

11, నవంబర్ 2017, శనివారం

కలబురిగి కబుర్లు - 1

మా అమ్మాయిని M.D (Homoeo) లో చేర్చడానికి ఈ మధ్యన కలబురిగి (గుల్బర్గా) లో రెండు దఫాలుగా పదిరోజులున్నాను. వీళ్ళ బ్యాచ్ ఏభై మందిలో ఆరుగురు మాత్రమే సబ్జెక్టులు ఏవీ మిగుల్చుకోకుండా సింగిల్ అటెంప్ట్ లో B.H.M.S పాసయ్యారు. మళ్ళీ ఈ ఆరుగురిలో తను మాత్రమే వీళ్ళ బ్యాచ్ నుంచి M.D లో జాయినైంది.

ఈ ఊరికి ఇప్పుడు కలబురిగి అని పేరు మార్చారు. గుల్బర్గా విశ్వవిద్యాలయంలోనే నేను న్యాయశాస్త్రం చదివాను. మళ్ళీ ఇప్పుడక్కడే మా అమ్మాయి మెడిసిన్ చదువుతోంది. కనుక ఈ ఊరికీ మాకూ ఏవో కర్మసంబంధాలున్నాయన్న మాట !!

ఈ ఊరు చాలా ప్రాచీనమైనదని దీని చరిత్ర చెబుతోంది. దాదాపు 3000 ఏళ్ళ క్రితమే ఈ ఊరు ఉన్నది. ఈ జన్మలో నాకీ ఊరు గత పాతికేళ్ళ నుంచీ తెలుసు. (గత జన్మల గురించి అడక్కండి. అడిగినా నేను చెప్పను). అప్పటికీ ఇప్పటికీ ఊరు చాలా మారింది. సేడం రోడ్ (హైదరాబాద్ హైవే) పక్కగా ఊరు బాగా పెరిగిపోయింది. కార్లో అయితే హైదరాబాద్ కు మూడు గంటల్లో చేరుకోవచ్చు.

ఈ ఊరిలో ముస్లిం జనాభా ఎక్కువ. దాదాపు 49% వాళ్ళే ఉన్నారు. 48% దాకా హిందువులున్నారు. మిగిలినదాంట్లో మిగతా జనాభా ఉన్నారు. ముస్లిమ్స్ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ గొడవలు లేవు. అందరూ కలిసే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలలో శివభక్తి చాలా ఎక్కువ. ఎందుకంటే వీరిలో చాలామంది లింగాయతులున్నారు.

తన నానో తాళాలు నాచేతిలో పెట్టి - 'ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఈ కారు నీదే' అన్నారు శ్రీకంఠయ్యగారు. ఈయన దగ్గరే 1995 లో నేను జ్యోతిష్యశాస్త్రంలో ఓనమాలు నేర్చుకున్నాను. ఒక అరగంటలో ఆ ఊరంతా నాకు దారులతో సహా తెలిసిపోయింది. సునాయాసంగా ఆ రోడ్లన్నీ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూచున్న వాళ్ళు ఆశ్చర్యపోయి - 'ఈ ఊరు మీకు ముందే తెలుసా?' అని అడిగారు. 'తెలీదు. ఎప్పుడో ఇరవైఏళ్ళ క్రితం ఒకసారి వచ్చాను. అంతే' అని చెప్పాను. కానీ వాళ్ళు నమ్మలేదు.

శ్రీకంఠయ్యగారు ఆ ఊరిలో ప్రఖ్యాత జ్యోతిష్కుడు. టెలికాం డిపార్ట్ మెంట్ లో ఇంజనీరుగా పన్నెండేళ్ళ క్రితం ఆయన రిటైరయ్యాడు. సర్వీసులో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఆయన బిజీగా ఉంటున్నాడు. తెంపులేకుండా జ్యోతిష్యం కోసం ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకూ జనాలు వస్తూనే ఉంటారు.ఈయనకు జ్యోతిష్యవిద్య వారి పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చింది. వీరి పూర్వీకులు మైసూరు దగ్గర చామరాజనగర్ లోని శ్రీకంఠేశ్వర ఆలయంలో గత 300 ఏళ్ళ నుంచీ అర్చకులుగా ఉన్నారు. మంత్రోపాసనా, జ్యోతిష్యవిద్యా వీరి వంశంలో తరతరాలుగా వస్తున్నాయి. వీరి తాతగారూ నాన్నగారూ ఎంత గొప్ప జ్యోతిష్కులంటే మనిషి ముఖం చూచి అతని చరిత్ర చెప్పేవారు. వారి నోటినుంచి మాట వస్తే అది జరిగి తీరేది. నిష్ఠాపరులైన మంచి వేదపండితులు వాళ్ళు.

ఈయన స్నేహితులలో సయ్యద్ మసూద్ అనే ముస్లిం ఒకాయన ఉన్నాడు. ఈయన గుల్బర్గా స్టేషన్ దగ్గర ఉన్న సహారా లాడ్జి ఓనరు. ఈయన ఉండేది హైదరాబాదులో. నెలకు రెండు మూడుసార్లు ఇక్కడకు వచ్చి ఉంటూ ఉంటాడు. ఇరానియన్ ఫీచర్స్ తో ఉన్నాడు. ఒకప్పుడు సుల్తానుల కాలంలో గుల్బర్గాలో సగం ప్రాపర్టీ వీళ్ళదేట. ప్రస్తుతం అంతా పోయి కొంత ప్రాపర్టీ మాత్రం మిగిలింది. ఈయన ఇస్లామిక్ పరిహారాలు చెయ్యడంలో దిట్ట అని మామగారు అన్నారు. ఈయనకు వచ్చే కేసుల్లో కొన్ని కేసులను తనకూ ఇవ్వమని మామగారి దగ్గరకు వస్తూ ఉంటాడు. రాత్రంతా తమదైన ఉపాసనలో కాలం గడిపి పొద్దున్న ఆరునుంచి పదకొండు వరకూ నిద్రపోవడం ఈయన అలవాటుట. అందుకే ఈయన చేసే పరిహార క్రియలు బాగా పనిచేస్తాయని విన్నాను. కానీ, తను చేసే క్రియలకు భారీగా చార్జి చేస్తాడని చెప్పారు.

బిజినెస్ మాన్ అయి ఉండి ఈ తాంత్రిక క్రియలు ఏమిటి? అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయనకు డబ్బు ఇబ్బంది లేదు. ప్రవృత్తేమో ఇది. కనుక తీరికగా రాత్రంతా కూచుని ఈ సాధనలు చేస్తూ ఉంటాడన్నమాట. 

వైదిక విధానంలో తనూ, ఇస్లామిక్ విధానంలో సయ్యదూ తమ దగ్గరకు వచ్చిన వారి సమస్యలకు పరిహార క్రియలు చేస్తూ ఉంటారు. ఇద్దరూ స్నేహితులే. ఇది విచిత్రంగా అనిపించింది.

'ఇస్లాంలో మంత్రాలున్నాయా? బీజాక్షరాలు లేకుండా అవి ఎలా పని చేస్తాయి?' అని ఇదంతా గమనిస్తున్న మా అమ్మాయి అడిగింది.

'ఉన్నాయి. శుద్ధ అరబిక్ వినడానికి చాలా సొంపుగా ఉంటుంది. ఏ భాష అయినా ఏభై అక్షరాల సమాహారమే కదా. కనుక బీజాక్షరాలు అన్నింటిలోనూ ఉంటాయి. అవి కూడా పనిచేస్తాయి. పైగా అక్షరాలతో బాటు వాటి వెనుక ఉన్న 'భావన' అనేది అసలైన శక్తిగా పనిచేస్తుంది.' అని చెప్పాను.

అన్ని మతాలలో ఉన్నట్లే ఇస్లాంలో కూడా తాంత్రిక క్రియలు ఉన్నాయి. ఈ బ్రాంచ్ ని 'సిహ్ర్' అని అంటారు. ఈ మ్యాజిక్ చేసేవారిని 'సాహిర్' అంటారు. బ్లాక్ మేజిక్ తో బ్లాక్ మేజిక్ ను డీల్ చెయ్యడాన్ని 'నష్రా' అంటారని, అలాకాకుండా షరియా ప్రకారం ఖురాన్ లోని సూక్తులను వాడి కూడా వాటిని నయం చెయ్యవచ్చని, బహుశా ఈ మసూద్ అనే ఆయన అదే చేస్తూ ఉండవచ్చనీ మా అమ్మాయికి చెప్పాను.

ఈ ఊరిలో రెండు విశ్వవిద్యాలయాలున్నాయి. ఒకటి శరణ బసవేశ్వర యూనివర్సిటీ. ఇది ఈమధ్యనే అయింది. రెండోది గుల్బర్గా యూనివర్సిటీ. లింగాయత సాంప్రదాయానికి చెందినదే శరణ బసవేశ్వర ఆలయం ఒకటి ఊరి మధ్యలో చాలా విశాలమైన ప్రాంగణంలో ఉన్నది.

(ఇంకా ఉంది)

2, నవంబర్ 2017, గురువారం

శనీశ్వరుని ధనూరాశి పున:ప్రవేశం

వారంనాడు, అంటే అక్టోబర్ 26 న శనీశ్వరుడు మళ్ళీ ధనూరాశిలో ప్రవేశించాడు. వక్రస్థితిలో వృశ్చికరాశిలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఋజుగతితో ధనూరాశి ప్రవేశం గావించాడు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.

ఈ గ్రహచారం వల్ల అనేక మంది జీవితాలలో హటాత్తు మార్పులు కలుగుతాయి. కలుగుతున్నాయి. గమనించండి.

ఎందుకంటే - వక్రగ్రహాలు ఋజుగతిలోకి వచ్చేటప్పుడు చాలా వేగంగా ఫలితాలనిస్తాయి. ప్రస్తుతం అలాంటి పరిస్తితిలోనే ఉన్న ఈ శనీశ్వరుని దశమదృష్టి కన్యలో ఉన్న కుజ శుక్రుల మీద ప్రసరిస్తున్నది. దీని ఫలితంగా అనేక మంది సెక్సు కుంభకోణాలలో ఇరుక్కుంటారు. వీటిల్లో నిజాలూ ఉంటాయి. మోపబడిన కేసులూ ఉంటాయి. సరిగా ఈ వారంలోనే అమెరికాలో అనేక సెక్సు కేసులు బుక్కయ్యాయి. సెలబ్రిటీలు అనేకమంది వీటిల్లో ఇరుక్కుంటున్నారు. గమనించండి.

ఇలాంటి కేసులో  ఇరుక్కుని ఏకంగా బ్రిటిష్ డిఫెన్స్ సెక్రటరీయే తన పదవిని పోగొట్టుకున్నాడు.



నిత్య జీవితంలో కూడా మీ చుట్టుపక్కల అనేకమంది (వీరిలో కొందరు అమాయకులు కూడా ఉంటారు) గత రెండు రోజులుగా అనేక రకాలుగా కేసులలో ఫ్రేం చెయ్యబడుతూ ఉంటారు గమనించండి. ఇది రాబోయే రెండు మూడు రోజులలో కూడా కొనసాగుతుంది.

ఇంకో విచిత్రం ఏమంటే - డిల్లీలో ఒక కోర్టు ఇదే సమయంలో ఇదే సబ్జెక్ట్ మీద ఒక తీర్పును వెలువరించింది, అదికూడా తీరిగ్గా రెండేళ్ళ తర్వాత. కానీ ఇదే గ్రహచారం జరుగుతున్న సమయంలో ఈ తీర్పు రావడం, ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరగడం కాకతాళీయం అనలేం కదా !

http://www.thehindu.com/news/national/sexual-offences-worse-than-murder-other-heinous-crimes-court/article19968341.ece

మానవ జీవితం మీద గ్రహప్రభావానికి ఇవి కూడా రుజువులే మరి !!