Pages - Menu

Pages

11, నవంబర్ 2017, శనివారం

కలబురిగి కబుర్లు - 1

మా అమ్మాయిని M.D (Homoeo) లో చేర్చడానికి ఈ మధ్యన కలబురిగి (గుల్బర్గా) లో రెండు దఫాలుగా పదిరోజులున్నాను. వీళ్ళ బ్యాచ్ ఏభై మందిలో ఆరుగురు మాత్రమే సబ్జెక్టులు ఏవీ మిగుల్చుకోకుండా సింగిల్ అటెంప్ట్ లో B.H.M.S పాసయ్యారు. మళ్ళీ ఈ ఆరుగురిలో తను మాత్రమే వీళ్ళ బ్యాచ్ నుంచి M.D లో జాయినైంది.

ఈ ఊరికి ఇప్పుడు కలబురిగి అని పేరు మార్చారు. గుల్బర్గా విశ్వవిద్యాలయంలోనే నేను న్యాయశాస్త్రం చదివాను. మళ్ళీ ఇప్పుడక్కడే మా అమ్మాయి మెడిసిన్ చదువుతోంది. కనుక ఈ ఊరికీ మాకూ ఏవో కర్మసంబంధాలున్నాయన్న మాట !!

ఈ ఊరు చాలా ప్రాచీనమైనదని దీని చరిత్ర చెబుతోంది. దాదాపు 3000 ఏళ్ళ క్రితమే ఈ ఊరు ఉన్నది. ఈ జన్మలో నాకీ ఊరు గత పాతికేళ్ళ నుంచీ తెలుసు. (గత జన్మల గురించి అడక్కండి. అడిగినా నేను చెప్పను). అప్పటికీ ఇప్పటికీ ఊరు చాలా మారింది. సేడం రోడ్ (హైదరాబాద్ హైవే) పక్కగా ఊరు బాగా పెరిగిపోయింది. కార్లో అయితే హైదరాబాద్ కు మూడు గంటల్లో చేరుకోవచ్చు.

ఈ ఊరిలో ముస్లిం జనాభా ఎక్కువ. దాదాపు 49% వాళ్ళే ఉన్నారు. 48% దాకా హిందువులున్నారు. మిగిలినదాంట్లో మిగతా జనాభా ఉన్నారు. ముస్లిమ్స్ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ గొడవలు లేవు. అందరూ కలిసే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలలో శివభక్తి చాలా ఎక్కువ. ఎందుకంటే వీరిలో చాలామంది లింగాయతులున్నారు.

తన నానో తాళాలు నాచేతిలో పెట్టి - 'ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఈ కారు నీదే' అన్నారు శ్రీకంఠయ్యగారు. ఈయన దగ్గరే 1995 లో నేను జ్యోతిష్యశాస్త్రంలో ఓనమాలు నేర్చుకున్నాను. ఒక అరగంటలో ఆ ఊరంతా నాకు దారులతో సహా తెలిసిపోయింది. సునాయాసంగా ఆ రోడ్లన్నీ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూచున్న వాళ్ళు ఆశ్చర్యపోయి - 'ఈ ఊరు మీకు ముందే తెలుసా?' అని అడిగారు. 'తెలీదు. ఎప్పుడో ఇరవైఏళ్ళ క్రితం ఒకసారి వచ్చాను. అంతే' అని చెప్పాను. కానీ వాళ్ళు నమ్మలేదు.

శ్రీకంఠయ్యగారు ఆ ఊరిలో ప్రఖ్యాత జ్యోతిష్కుడు. టెలికాం డిపార్ట్ మెంట్ లో ఇంజనీరుగా పన్నెండేళ్ళ క్రితం ఆయన రిటైరయ్యాడు. సర్వీసులో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఆయన బిజీగా ఉంటున్నాడు. తెంపులేకుండా జ్యోతిష్యం కోసం ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకూ జనాలు వస్తూనే ఉంటారు.ఈయనకు జ్యోతిష్యవిద్య వారి పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చింది. వీరి పూర్వీకులు మైసూరు దగ్గర చామరాజనగర్ లోని శ్రీకంఠేశ్వర ఆలయంలో గత 300 ఏళ్ళ నుంచీ అర్చకులుగా ఉన్నారు. మంత్రోపాసనా, జ్యోతిష్యవిద్యా వీరి వంశంలో తరతరాలుగా వస్తున్నాయి. వీరి తాతగారూ నాన్నగారూ ఎంత గొప్ప జ్యోతిష్కులంటే మనిషి ముఖం చూచి అతని చరిత్ర చెప్పేవారు. వారి నోటినుంచి మాట వస్తే అది జరిగి తీరేది. నిష్ఠాపరులైన మంచి వేదపండితులు వాళ్ళు.

ఈయన స్నేహితులలో సయ్యద్ మసూద్ అనే ముస్లిం ఒకాయన ఉన్నాడు. ఈయన గుల్బర్గా స్టేషన్ దగ్గర ఉన్న సహారా లాడ్జి ఓనరు. ఈయన ఉండేది హైదరాబాదులో. నెలకు రెండు మూడుసార్లు ఇక్కడకు వచ్చి ఉంటూ ఉంటాడు. ఇరానియన్ ఫీచర్స్ తో ఉన్నాడు. ఒకప్పుడు సుల్తానుల కాలంలో గుల్బర్గాలో సగం ప్రాపర్టీ వీళ్ళదేట. ప్రస్తుతం అంతా పోయి కొంత ప్రాపర్టీ మాత్రం మిగిలింది. ఈయన ఇస్లామిక్ పరిహారాలు చెయ్యడంలో దిట్ట అని మామగారు అన్నారు. ఈయనకు వచ్చే కేసుల్లో కొన్ని కేసులను తనకూ ఇవ్వమని మామగారి దగ్గరకు వస్తూ ఉంటాడు. రాత్రంతా తమదైన ఉపాసనలో కాలం గడిపి పొద్దున్న ఆరునుంచి పదకొండు వరకూ నిద్రపోవడం ఈయన అలవాటుట. అందుకే ఈయన చేసే పరిహార క్రియలు బాగా పనిచేస్తాయని విన్నాను. కానీ, తను చేసే క్రియలకు భారీగా చార్జి చేస్తాడని చెప్పారు.

బిజినెస్ మాన్ అయి ఉండి ఈ తాంత్రిక క్రియలు ఏమిటి? అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయనకు డబ్బు ఇబ్బంది లేదు. ప్రవృత్తేమో ఇది. కనుక తీరికగా రాత్రంతా కూచుని ఈ సాధనలు చేస్తూ ఉంటాడన్నమాట. 

వైదిక విధానంలో తనూ, ఇస్లామిక్ విధానంలో సయ్యదూ తమ దగ్గరకు వచ్చిన వారి సమస్యలకు పరిహార క్రియలు చేస్తూ ఉంటారు. ఇద్దరూ స్నేహితులే. ఇది విచిత్రంగా అనిపించింది.

'ఇస్లాంలో మంత్రాలున్నాయా? బీజాక్షరాలు లేకుండా అవి ఎలా పని చేస్తాయి?' అని ఇదంతా గమనిస్తున్న మా అమ్మాయి అడిగింది.

'ఉన్నాయి. శుద్ధ అరబిక్ వినడానికి చాలా సొంపుగా ఉంటుంది. ఏ భాష అయినా ఏభై అక్షరాల సమాహారమే కదా. కనుక బీజాక్షరాలు అన్నింటిలోనూ ఉంటాయి. అవి కూడా పనిచేస్తాయి. పైగా అక్షరాలతో బాటు వాటి వెనుక ఉన్న 'భావన' అనేది అసలైన శక్తిగా పనిచేస్తుంది.' అని చెప్పాను.

అన్ని మతాలలో ఉన్నట్లే ఇస్లాంలో కూడా తాంత్రిక క్రియలు ఉన్నాయి. ఈ బ్రాంచ్ ని 'సిహ్ర్' అని అంటారు. ఈ మ్యాజిక్ చేసేవారిని 'సాహిర్' అంటారు. బ్లాక్ మేజిక్ తో బ్లాక్ మేజిక్ ను డీల్ చెయ్యడాన్ని 'నష్రా' అంటారని, అలాకాకుండా షరియా ప్రకారం ఖురాన్ లోని సూక్తులను వాడి కూడా వాటిని నయం చెయ్యవచ్చని, బహుశా ఈ మసూద్ అనే ఆయన అదే చేస్తూ ఉండవచ్చనీ మా అమ్మాయికి చెప్పాను.

ఈ ఊరిలో రెండు విశ్వవిద్యాలయాలున్నాయి. ఒకటి శరణ బసవేశ్వర యూనివర్సిటీ. ఇది ఈమధ్యనే అయింది. రెండోది గుల్బర్గా యూనివర్సిటీ. లింగాయత సాంప్రదాయానికి చెందినదే శరణ బసవేశ్వర ఆలయం ఒకటి ఊరి మధ్యలో చాలా విశాలమైన ప్రాంగణంలో ఉన్నది.

(ఇంకా ఉంది)