Pages - Menu

Pages

19, నవంబర్ 2017, ఆదివారం

నీకు చుక్క కనిపిస్తుందా??

లలితా సహస్రనామాల మీద ఈ మధ్యనే నేను వ్రాసిన పుస్తకం అచ్చు పనుల కోసం రామారావును కలుద్దామని మొన్నీ మధ్య విజయవాడలోని డీటీపీ సెంటర్ కు వెళ్ళాను. ఉదయం ఎనిమిది గంటలకే అక్కడ ఒక పెద్దాయన కూచుని రామారావుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయం పూట అయితే ఎవరూ వచ్చి డిస్టర్బ్ చెయ్యరని మా ఉద్దేశ్యం. అందుకని పొద్దున్నే మా పని పెట్టుకుంటూ ఉంటాం. కానీ షాపు తెరిచి కనిపిస్తే చాలు ఎవరో ఒకరు వచ్చి కాలక్షేపం కబుర్లు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళల్లో రిటైరైన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీరికి శ్రోతలు కావాలి. పాపం ఎవరూ వాళ్ళను పట్టించుకోరు. అందుకని ఎవరు బకరాలు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు.

కాసేపు షాపు బయట వెయిట్ చేశాను ఆయన లేచి పోతాడేమో అని. కానీ ఆయన కదిలే రకంలాగా కనిపించలేదు. ఇక ఇలా కాదని నేనూ లోపలకు వెళ్లాను.

నన్ను చూస్తూనే - 'ఈయన కూడా సాధకుడే మీలాగా' అంటూ రామారావు నన్ను పరిచయం చేశాడు ఆయనకు.

ఆయన వయస్సు డబ్బై ఎనభై మధ్యలో ఉంటుంది. వయసుతో పాటు వచ్చిన చెవుడు కూడా ఆయనకు ఉన్నట్టుంది నా వైపు ఎగాదిగా చూశాడు.

చెప్పిందే ఇంకొంచం గట్టిగా చెప్పాడు రామారావు.

చెవుడు ఉన్నవాళ్ళకు రెండోసారి చెబితే చాలా కోపం వస్తుంది. అలాగే ఆయనకూ వచ్చింది. అర్ధమైందిలే అన్నట్టు విసుక్కుంటూ - 'ఏం సాధన చేస్తావు నువ్వు?' అన్నాడు నన్ను తేలికగా.

నేనేం మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాను.

ఆయన చేతిలో ఉన్న కాయితాలు గట్రా చూస్తే ఎవరికో ఏవేవో ఉత్తరాలు వ్రాసినట్లుగా ఉన్నాయి. నా చూపును గమనించి - 'ఇవన్నీ ఆయన తన అనుభవాలను ఎవరెవరో స్వామీజీలకు వ్రాసిన ఉత్తరాలు.అవి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు.' అని అన్నాడు రామారావు.

అలా అంటూ - 'ఈయనక్కూడా మంచి మంచి అనుభవాలున్నాయి' అన్నాడు నన్ను చూపిస్తూ.

'ఏం అనుభవాలయ్యాయి నీకు?' అన్నాడు ముసలాయన నన్ను చూస్తూ.

'ఏం అనుభవాలు చెప్పాలో ఈయనకు?' అన్న చిలిపి ఆలోచన నా ముఖంలో నవ్వును రప్పించింది. ఆయన ప్రశ్నకు అసలు జవాబే ఇవ్వలేదు నేను. నిరామయంగా ఆయన ముఖంలోకి చూస్తున్నాను.

'చుక్క కనిపిస్తుందా?' అడిగాడు పెద్దాయన.

'రోజూ కనిపిస్తూనే ఉంటాయి. చీకటి పడ్డాక' అన్నాను నేను భక్తిగా.

'ఆ చుక్కలు కాదు. ధ్యానంలో కళ్ళు మూసుకుంటే చుక్క కనిపిస్తుందా లేదా?' అన్నాడాయన స్వరం రెట్టించి.

'లేదు' అన్నట్లుగా తల అడ్డంగా ఆడించాను.

'నువ్వు వేస్ట్' అన్నట్లుగా నావైపు చూశాడాయన.

'చుక్క కన్పించాలి. పైకీ కిందికీ ఆడుతూ ముందుగా రెండు చుక్కలు కన్పిస్తాయి. ఆ తర్వాత రెండూ ఒకటే చుక్కగా మారిపోతాయి. అసలు చుక్క కనిపిస్తేనే నువ్వు యోగంలో మొదటి మెట్టు ఎక్కినట్లు లెక్క' అన్నాడాయన.

నేను అయోమయంగా ముఖం పెట్టాను.

'ప్రాణాయామం చేస్తావా నువ్వు?' అడిగాడాయన మళ్ళీ నావైపు నిర్లక్ష్య ధోరణిలో చూస్తూ.

'లేదు' అన్నాను.

'మరింక నీకేం పురోగతి ఉంటుంది? ప్రాణాయామం చెయ్యాలి. నేను నాలుగు సంవత్సరాల పది నెలల పాటు రెగ్యులర్ గా ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రాణాయామం చేశాను - నాలుగు సంవత్సరాల పది నెలలు.' అన్నాడాయన రెండోసారి రెట్టిస్తూ.

'అలాగా' అన్నట్లు జాలిగా ఆయనవైపు చూశాను.

నా చూపు ఆయనకు నచ్చలేదు.

'చూడండి నా అనుభవాలు !! ఇవన్నీ పెద్ద పెద్ద స్వామీజీలకు ఉత్తరాలు వ్రాస్తూ ఉంటాను.' అన్నాడు తన చేతిలోని ఉత్తరాల కట్ట చూపిస్తూ.

'మన అనుభవాలు మనలోనే ఉంచుకోవాలి గాని ఇతరులకు చెప్పకూడదు.' అని గొణిగా నేను 'అనుభవాలు' అన్న పదాన్ని నొక్కుతూ.

ఆయనకు వినిపించలేదుగాని నేనేదో కామెంట్ చేసానని అర్ధమైంది.

మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో - 'పొద్దున్నే లేచి ప్రాణాయామం చెయ్యి. సూర్యుడు వచ్చాక చేసే సాధనకు ఫలితం ఉండదు. సూర్యోదయం ముందే మన సాధన అయిపోవాలి. అప్పుడు రోజంతా ఫ్రెష్ గా ఉంటుంది.' అన్నాడు.

'అవును. అప్పుడు బోలెడు సమయం ఉంటుంది గనుక పొద్దున్నే లేచి రోడ్లంబడి తిరుగుతూ ఉండచ్చు.' అన్నా నేను చిన్నగా.

ఆయనకు నా మాట అర్ధం కాలేదు.

'సాధన బాగా చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. చూడండి. నిన్ననే వీళ్ళ క్లాస్ కు వెళ్లి వచ్చాను.' అన్నాడు నాకొక పాంప్లెట్ చూపిస్తూ.

'అదేంటా?' అని ఆ కాయితం వైపు చూచాను. 'బాబాజీ భోగర్ మాతాజీ క్రియాయోగా' అంటూ ఏదేదో వ్రాసి ఉంది దానిమీద. అదాటున చూచి ' బాబాజీ బోగస్ మాతాజీ' అన్నట్లు కనిపించి చచ్చే నవ్వొచ్చింది.

నా నవ్వును చూచి ఆయనకు కోపం ఇంకా పెరిగిపోయింది. నా వైపు కోపంగా చూచాడు.

నేనేదో తప్పు చేసినవాడిలా ఫోజిచ్చి ఆయనవైపు దీనంగా చూచాను.

ఇదంతా ఆయనకే బోరు కొట్టినట్లు ఉంది. లేచి - 'సరే నే వస్తా' అని మాతో చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు.

'పద రామారావు టీ త్రాగి వద్దాం.' అన్నా నేనూ లేస్తూ.

'పదండి' అని తనూ లేచాడు.

దారిలో నడుస్తూ ఉండగా - 'అదేంటి సార్. ఆయన గొప్ప సాధకుడినని చెప్పుకుంటూ ఉంటాడు. మిమ్మల్ని చూస్తూనే గుర్తు పడతాడని నేను అనుకున్నాను. అందుకే కొద్దిగా పరిచయం చేశాను. అలా మాట్లాడాడెంటి మీతో?' అన్నాడు.

'ఏమో నాకేం తెలుసు. ఆయన్నే అడగక పోయావా?' అన్నా నవ్వుతూ.

'ఇంకేం అడుగుతాం. ఆయన ధోరణి అలా ఉంటే' అన్నాడు.

'చెప్తా విను. ఆయన క్రియాయోగ సాధన చేస్తున్నాడు. ఆ సాధనా ప్రారంభంలో భ్రూమధ్యంలో వెలుగు చుక్క కన్పించడం సహజమే. అదేమీ పెద్ద అనుభవం కాదు. చాలా ప్రాధమికమైన అనుభవం అది. ఈయనకేమో డబ్భై దాటాయి. ముసలోడికి దసరా పండగ అన్నట్లు ఇదేదో పెద్ద గొప్ప అనుభవం అని అందరికీ ఉత్తరాలు వ్రాస్తున్నాడు. ఎవడి పిచ్చి వాడికానందం. అయిదేళ్ళ క్రితం సాధన మొదలు పెట్టానని చెబుతున్నాడు. అంటే - ఆయనకు ఏ అరవై ఐదో ఉన్నప్పుడు మొదలు పెట్టాడు. అప్పటికి శరీరంలో ఏం శక్తి ఉంటుంది? అంతా ఉడిగిపోయి ఉంటుంది. పైగా బ్రహ్మచారి కూడా కాదు, సంసారిలాగే ఉన్నాడు. కనుక ఇప్పుడెంత కొట్టుకున్నా ఆయనకు చుక్క తప్ప ఇంకేమీ కన్పించదు.' అన్నా.

'అంతేనంటారా?' అన్నాడు రామారావు.

'ఈ వయసులో ఆయన త్వరగా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఒకటే మార్గం ఉంది. అదేంటంటే - రోజూ చీకటి పడగానే చుక్కేసుకోని తొంగోవడమే..' అన్నా నవ్వుతూ.

'అవునా? మీరు దేన్నైనా జోకులెయ్యకుండా ఉండరు' అన్నాడు రామారావు నవ్వుతూ.

'హాస్యమే జీవితంలో ఖర్చులేని ఔషధం రామారావ్! అది సరేగాని, క్రియాయోగం అనేది వయసులో ఉన్నపుడు చెయ్యాలి. అప్పుడు శరీరంలో రీ ప్రొడక్టివ్ జ్యూసెస్ ఉంటాయి. అవి ఉన్నప్పుడే యోగసాధన ఫలిస్తుంది. అవి పోయాక ఏ సాధనా ఏ ఫలితాన్నీ ఇవ్వదు. మహా అయితే గంటలు గంటలు ప్రాణాయామం చేస్తే ఒక చుక్క కన్పించవచ్చేమో? ముందే చెప్పాకదా..అదేమీ పెద్ద గొప్ప ఫలితం కాదు.' అన్నా నేను.

'కానీ ఆయన మిమ్మల్ని గుర్తించలేకపోవడమే విచిత్రంగా ఉంది.' అన్నాడు.

'ఆయనకు చెవుడుతో బాటు చూపు కూడా మందగించినట్లుంది పాపం ! పోనీలే. రోడ్డుమీద పోతున్న ఏ చక్కని చుక్కనో చూచి తన పెళ్ళాం అనుకోకుంటే అంతే చాలు. ఈ ఫీల్డే అంత రామారావ్ ! ఇక్కడ ఒక నలభై రోజులు నల్లడ్రస్సు వేసుకుని గడ్డం పెంచుకున్న ప్రతివాడు కూడా పెద్ద లెవల్లో ఫీలై పోతూ ఉంటాడు.అదంతే. దీన్నే స్పిరిచ్యువల్ ఈగోయిజం అంటారు. ఈయన్నే చూడు. ఈపాటికి సాధన అయిపోయి ఒక ముప్పైఏళ్ళు గతించి ఉండాలి. కానీ ఈయనిప్పుడు క్లాసులని తిరుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళని చూచి మనం జాలిపడాలి అంతే!!

ఇంకో విషయం చెప్పనా? ఇలాంటి వాళ్ళు మనల్ని గుర్తించకపోవడమే మనకు పెద్ద వరం. గుర్తించారంటే ఇక మన వెంటపడి అది చెప్పు ఇది చెప్పు అని పీడిస్తారు. ఆ గోల మనం భరించలేం.' అన్నా నవ్వుతూ.

మాటల్లోనే 'స్టార్' టీ స్టాల్ వచ్చేసింది.

ఇద్దరం టీ సేవించడం మొదలు పెట్టాం !!