Pages - Menu

Pages

26, డిసెంబర్ 2017, మంగళవారం

సత్యం ఎవరికి కావాలి?

నిన్న క్రీస్తు పుట్టలేదు
కానీ లోకమంతా క్రిస్మస్ జరుపుకుంది

మనిషిని చంపమని ఇస్లాం చెప్పలేదు
కానీ కాఫిర్లను వాళ్ళు చంపుతూనే ఉంటారు

కొత్తకొత్త దేవుళ్ళను సృష్టించమని
హిందూమతం అనలేదు కానీ
వాళ్ళాపనిని రోజూ చేస్తూనే ఉంటారు

'నన్ను పూజించండి' అని బుద్దుడు చెప్పలేదు
పైగా ఆ పని వద్దన్నాడు
కానీ బౌద్ధులు దానినే ఆచరిస్తున్నారు

మహావీరుడు బట్టలు వదిలేశాడు
జీవితమంతా అలాగే బ్రతికాడు
జైనులు మాత్రం బట్టల వ్యాపారమే చేస్తున్నారు

మతాలు చెప్పినదాన్ని
మతస్థులే ఆచరించడం లేదు
దేవుడు ఆశించినట్లు
భక్తులూ ఉండటం లేదు

అదే సమయంలో

మతాన్నీ వదలడం లేదు
దేవుడినీ వదలడం లేదు
ఇది కాదూ మాయంటే?
ఇది కాదూ భ్రమంటే?

మాయలో ఉన్నంతవరకూ
వాస్తవం ఎలా తెలుస్తుంది?
భ్రమలో ఉన్నంతవరకూ
నిజం ఎలా అర్ధమౌతుంది?

మాయ మత్తుగా జోకొడుతుంటే
మెలకువ ఎవరికి కావాలి?
భ్రమే ఆనందంగా ఉంటే
సత్యం ఎవరికి కావాలి?

23, డిసెంబర్ 2017, శనివారం

మా పుస్తకాలు - శ్రీలలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక



పంచవటి పబ్లికేషన్స్ నుంచి మూడవ ప్రింట్ పుస్తకంగా, మరియు నాలుగో ఈ బుక్ గా ఈ మధ్యనే రిలీజైంది - శ్రీలలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక.

లలితా సహస్ర నామాలకు అనేకములైన వ్యాఖ్యానాలు ఇప్పటికే ఉన్నాయి. వీటిలో 'సౌభాగ్య భాస్కరము' అనబడే "భాస్కరరాయ మఖి" గారి భాష్యం నుంచీ ఈ మధ్యకాలపు రచయితలు వ్రాసిన భాష్యాల వరకూ అనేకం మనకు లభిస్తున్నాయి.

మరి ఈ గ్రంధపు ప్రత్యేకత ఏమిటి?

ప్రతిపదార్ధాల జోలికి పోకుండా, లలితా సహస్రనామాలకు గల అసలైన, సాధనాపరమైన, తంత్రశాస్త్ర సమ్మతమైన నిగూడార్ధాలను వివరించింది ఈ పుస్తకం. దీనిలో పాండిత్య ప్రకర్ష కంటే, ఈ నామాల యొక్క రహస్యములైన సాధనార్ధాలను వివరించే ప్రయత్నమే మీకు దర్శనమిస్తుంది.

నా గురువుల నుంచి నేను తెలుసుకున్నవి, నా సాధనా మార్గంలో నేను పొందినవి అనేక అనుభవాలను ఒక చోటికి తెచ్చి వ్రాయబడినదే ఈ పుస్తకం. ఇందులోని ప్రతి పేజీ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ప్రతి లైనూ మిమ్మల్ని ముందుకు పోనివ్వకుండా అడ్డుకుంటుంది. ఈ పుస్తకాన్ని ఒక నవల లాగా చదివి పూర్తిచెయ్యడం అంత తేలిక కాదు. త్వరలోనే ఈ పుస్తకం యొక్క ఇంగ్లీష్ వెర్షన్ - ఈ బుక్ గా వెలువడుతుంది.

ఇది మీకు Google play books నుంచి లభిస్తుంది.

18, డిసెంబర్ 2017, సోమవారం

కలబురిగి కబుర్లు - 4 (బుద్ధవిహార్)







కలబురిగిలో చూడదగిన ప్రదేశాలు ఏమున్నాయని మావాళ్ళను అడిగాను. ఏవేవో గుళ్ళూ గోపురాలూ చెప్పారు. వాటికి పోవాలని నాకేమీ అనిపించలేదు. కానీ ఒక ప్రదేశం మాత్రం చూడాలనిపించింది. అదే, గుల్బర్గా యూనివర్సిటీ వెనుకగా ఊరికి దూరంగా ఉన్న ' బుద్ధ విహార్ '. ఎనిమిదేళ్ళ క్రితం కర్నాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో దీనిని రూపకల్పన జరిగింది.

దీనిని 2009 లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, దలైలామాలు ప్రారంభించారని చెబుతున్నారు. గుల్బర్గాలో 'పాటిల్' అనేవాళ్ళ హవా ఎక్కువ. ఎక్కడ చూచినా ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళే ఉంటారు. బిజినెస్ లో, ఉద్యోగాలలో వీళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు.

దాదాపు 70 ఎకరాల విశాలమైన కొండప్రాంతంలో ఇది కట్టబడింది. ఊరికి దూరంగా నిశ్శబ్ద వాతావరణంలో ఈ ప్రాంగణం ఉన్నది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పెద్ద ధ్యానమందిరం ఉంది. ఇందులో బుద్ధుని విగ్రహం ఉన్నది. ఫస్ట్ ఫ్లోర్ లో బుద్ధుని ఆలయం ఉన్నది. ఇందులో కూడా బుద్ధుని విగ్రహంతో బాటు పక్కన ఇద్దరు ప్రధానశిష్యుల విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు సారిపుత్ర, మౌద్గల్యాయన అని వాళ్ళ విగ్రహాల తీరును బట్టి అనుకున్నాను. ఈ విగ్రహాలు థాయిలాండ్ విగ్రహాల పోలికలతో ఉన్నాయి.

ఈ బుద్ధవిహార్ బయట, అంబేద్కర్ తన అనుచరులతో బౌద్ధమతంలోకి మారుతున్న లైఫ్ సైజ్ విగ్రహాలు ఉన్నాయి. 

ఈ బుద్ధ విహార్ కు దగ్గరలోనే కనగనల్లి అనే ఒక గ్రామం ఉన్నది. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలోనే ఈ గ్రామంలో కమలముని అని ఒక ప్రసిద్ధ బౌద్ధభిక్షువు ఉండేవాడని చరిత్ర చెబుతున్నది. అప్పట్లోనే ఇది ఒక ప్రసిద్ధ బౌద్ధ కేంద్రంగా ఉన్నదన్నమాట.

క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం ప్రాంతంలోనే కర్నాటకలో జైన మతం విలసిల్లిందన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుడు తన గురువైన భద్రబాహువుతో కలసి కర్నాటకలోని శ్రావణబెలగొలకు వచ్చి అక్కడే తపస్సులో తనువు చాలించాడన్నది చరిత్రలో రికార్డ్ కాబడిన విషయం. అక్కడున్న చంద్రగిరి అనే కొండకు ఆ పేరు  ఈయన నుంచి వచ్చినదే. కానీ బౌద్ధం కూడా అప్పుడే కర్నాటకలో ఉన్నదన్న విషయం ఇప్పుడే విన్నాను. బహుశా కమలముని అనేవాడు జైనముని అయ్యిఉండవచ్చు. వీళ్ళు బహుశా పొరపాటు పడుతూ ఉండవచ్చు. ఎందుకంటే అలాంటి పేర్లు బౌద్దులలో ఉండటం అరుదు.

అప్పుడప్పుడు వస్తున్న టూరిస్టుల వెకిలి గోల తప్ప మిగతా సమయాలలో చాలా ప్రశాంతంగా ఉందిక్కడ. ఊరికి చాలా దూరంగా ఉన్నది గాబట్టి సాయంత్రం అయిదుకల్లా దీనిని మూసేస్తారు. స్టాఫ్ తప్ప ఇక్కడ రాత్రంతా ఎవరూ ఉండరు. కానీ గెస్టులకోసం కొన్ని రూములు కనిపించాయి. వాటిల్లో ఉండే అవకాశం దొరికితే రాత్రంతా అక్కడ ఉండి ధ్యానంలో కాలం గడపొచ్చు అన్న ఆలోచన చాలా సంతోషాన్నిచ్చింది. ఈసారి ఆ ప్రయత్నం చెయ్యాలి.

పక్కనే ఉన్న ఒక పెద్ద భవనంలో ఒక బుద్ధిస్ట్ లైబ్రరీ కూడా ఉన్నదన్న విషయం విన్నప్పుడు మాత్రం కలబురిగికి వచ్చిన తర్వాత కలిగిన ఆనందాలలో కెల్లా గొప్ప ఆనందం కలిగింది. కానీ నేను వెళ్ళినప్పుడు అక్కడేవో రిపేర్లు జరుగుతూ ఉన్నందున లోనికి అనుమతించలేదు.

రాబోయే మూడేళ్ళలో ఇక్కడకు చాలాసార్లు రావలసి ఉంటుంది గనుక, ఈసారి వచ్చినప్పుడల్లా, నా లగేజిని మా అమ్మాయి రూములో పడేసి, రోజంతా ఈ లైబ్రరీలో మకాం వేసి ఇందులోని బౌద్ధగ్రంధాలను (ఇప్పటిదాకా నేను చదవనివంటూ కనిపిస్తే) మొత్తం జీర్ణం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి అక్కడనుంచి బయలుదేరి వెనక్కు వచ్చాను.

13, డిసెంబర్ 2017, బుధవారం

5th Astro Work Shop


పంచవటి సభ్యులలో జ్యోతిశ్శాస్త్రం అంటే శ్రద్ధ ఉన్నవారు జ్యోతిశ్శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం గావిస్తూ మంచి జ్యోతిష్కులుగా రాణిస్తున్నారు. వీరందరూ బాగా చదువుకున్నవారూ, మంచి ఉద్యోగాలలో ఉన్నవారూ కావడంతో 'సైంటిఫిక్ ఆస్ట్రాలజీ' ని త్వరగా నేర్చుకుంటూ శాస్త్రీయ దృక్పధంతో ఎదుగుతున్నారు.

పుస్తకావిష్కరణ రోజున జరిగిన 'అయిదవ జ్యోతిశ్శాస్త్ర సమ్మేళనం' (5th Astro work shop) లో పంచవటి సభ్యులైన జ్యోతిశ్శాస్త్రవేత్తలు తమ తమ టాపిక్స్ మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చారు.



జననకాల సంస్కరణ

>> ఒక వ్యక్తి పుట్టిన సమయం ఖచ్చితంగా మనకు లభించనప్పుడు ఆ సమయాన్ని ఎలా రాబట్టాలి? ఆయా సూత్రాలేమిటి? అన్న విషయాన్ని ఒక ఉదాహరణ జాతకంతో చక్కగా వివరిస్తూ సూర్యనారాయణ Birth time rectification అనే టాపిక్ కు న్యాయం చేశాడు.




దశమభావ విచారణ

>> మనిషి జీవితంలో వృత్తి అనేది చాలా ముఖ్యమైనది. అతని జీవనానికి అదే ఆధారం. ఈ విషయాన్ని ఒక ఉదాహరణ చార్ట్ సహాయంతో '10th house analysis - Professional ups and downs అనే తన ప్రెజెంటేషన్ లో సత్యేంద్ర చక్కగా వివరించాడు.




జాతకాన్ని ఎలా చదవాలి?

>> జ్యోతిశ్శాస్త్రంలో స్ఫురణ శక్తి ప్రాధాన్యత, ఒక జాతకాన్ని ఎలా చదవాలి? ఏయే విషయాలు మొదటగా చూడాలి? అన్న విషయాలపై పంచవటి మహిళా జ్యోతిష్కురాళ్ళలో ఒకరైన రత్నపాప తన ఉపన్యాసంలో చక్కగా వివరించింది.




నాడీ జ్యోతిష్యం

>>  నాడీ జ్యోతిష్యంలోని అంశాల గురించి, తన సుదీర్ఘ అనుభవాన్ని వివరిస్తూ మరొక ప్రఖ్యాత జ్యోతిష్కుడు వంశీ క్లుప్తంగా చక్కగా తను ఎంచుకున్న విషయాన్ని వివరించాడు.
  


వక్ర గ్రహములు - వాటి ఫలితాలు

>> వక్రగ్రహాలనేవి జ్యోతిశ్శాస్త్రంలో కొరుకుడు పడని అంశాలు. ఎంతటి పెద్ద జ్యోతిష్కులకైనా అవి అంత త్వరగా అర్ధం కావు. అలాంటి లోతైన విషయాన్ని తన ఉపన్యాసంలో పంచవటి (ఇండియా) జాయింట్ సెక్రటరీ అయిన జనార్దన్ చక్కగా వివరించాడు.




శుభ పాప గ్రహాలు - వాటిని ఎలా అర్ధం చేసుకోవాలి?

>> శుభ, పాప గ్రహాలనే కాన్సెప్ట్ జ్యోతిశ్శాస్త్రంలో ఒక ప్రధానమైన అంశం. ఈ గహనమైన విషయాన్ని మా విధానంలో మేమెలా అర్ధం చేసుకుంటామో చక్కగా తన ప్రెజెంటేషన్ లో వివరించాడు పంచవటి (ఇండియా) సెక్రటరీ రాజు సైకం, MA (Astrology).




జాతకంలో సూర్యచంద్రుల పాత్ర

>> చివరగా ప్రసంగిస్తూ నేను, జాతక విశ్లేషణలో సూర్య చంద్రులను ఎలా అర్ధం చేసుకోవాలి? అనే అంశం మీద నా ప్రెజెంటేషన్ ఇచ్చాను. దాని తర్వాత Spiritual Astrology లోని కొన్ని అంశాలను సభికులకు పరిచయం చేశాను.

మంచి లోతైన సబ్జెక్ట్స్ తీసుకుని విషయాన్ని చక్కగా వివరించి చెప్పిన వీరికి బ్లాగు ముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంగ్లీషు చదువులు బాగా చదువుకున్నప్పటికీ, మన ప్రాచీన ధార్మికసంపద అయిన ఈ శాస్త్రాన్ని కూడా చక్కగా అధ్యయనం చేస్తూ, ఋషి ఋణం తీర్చుకుంటున్న వీరందరినీ అభినందిస్తూ, ముందు ముందు జరిగే సమావేశాలలో, మిగతా సభ్యులు కూడా ముందుకొచ్చి వారికిష్టమైన టాపిక్స్ మీద మాట్లాడవలసినదిగా, దానికి ఇప్పటినుంచే తయారు కావలసిందిగా కోరుతున్నాను.

'శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' పుస్తకావిష్కరణ - మరికొన్ని ఫోటోలు

"పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" ఒక ప్రేమపూరితమైన ఆధ్యాత్మిక కుటుంబంగా వేగంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి ముఖాలలో ఆనందం. అకారణ సంతోషం. జీవితంలో ఇన్నాళ్ళకు ఒక అర్ధం పరమార్ధం కలుగుతున్నాయన్న సంభ్రమం. అద్భుతమైన గమ్యాన్ని చేరుకునే క్రమంలో అడుగులు వేస్తున్నామన్న ఆత్మసంతృప్తి. ఇన్నాళ్ళూ వేచి చూచిన ఒక Spiritual fulfillment కలుగుతున్నదన్న ఉత్సాహం.

దేశంలోని నలుమూలల నుంచీ ఇక్కడకు వచ్చారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క పని భుజాన వేసుకుని తమ ఇంటి పని కంటే చక్కగా నిర్వహించారు. ఒకే కుటుంబంలా కలసి మెలసి ఉన్నారు. ఎవరి కులం ఏమిటో, ఎవరి మతం ఏమిటో, ఎవరి ఆర్ధిక స్తోమత ఏమిటో, ఎవరి సామాజిక స్థాయి ఏమిటో, ఎవరి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో - ఎవరికీ అవసరం లేదు. మేమంతా ఒక కుటుంబం. అంతే !!

ఎవరిలోనూ కల్లా కపటం లేవు. స్వార్ధం లేదు. అనవసరమైన మాటలు లేవు. లోపల ఒకటీ బయటకు ఒకటీ లేవు. స్వచ్చమైన మనసులతో, నిష్కల్మషమైన నవ్వులతో, ఆత్మీయతతో కలసి మెలసి ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. సాయంత్రం విడిపోయేటప్పుడు బరువైన గుండెలతో, మళ్ళీ త్వరలోనే కలుస్తామన్న భరోసాతో - ఒకరికొకరు సెలవు తీసుకున్నాం. విడిపోయేటప్పుడు చాలామంది ఏడ్చేశారు కూడా !

ఈ పుస్తకాన్ని నేనొక్కడినే వ్రాయలేదు. మనమంతా కలసి వ్రాశాం. ఇది మన పుస్తకం. మనందరి పుస్తకం !!

ఇదే అసలైన సత్సంగం అంటే. ఇలాంటి సత్సంగం ప్రపంచంలో ఇంకెక్కడ దొరుకుతుంది? భూతద్దం వేసి వెదికినా ఇలాంటి మనుషులు ఎక్కడ దొరుకుతారు?