నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

7, డిసెంబర్ 2017, గురువారం

శ్రీ లలితాదేవిపై కొన్ని పద్యములు


'శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' పుస్తకావిష్కరణ రెండు రోజులలోకి వచ్చింది. అందుకేనేమో, నిన్న రాత్రి అమ్మను ధ్యానిస్తూ ఉండగా ధారగా స్ఫురించిన ఈ పన్నెండు పద్యసుమాలను అందుకోండి మరి !

లలితా సహస్ర నామాల ప్రాశస్త్యాన్ని, అసలైన శ్రీవిద్యా సాధనా మార్గాన్ని మార్మికంగా వివరిస్తూ సాగిన పద్యధార ఇది. అన్నీ ఉత్పలమాల, చంపకమాల, మొదలైన వృత్తాలలో ఒదిగి ఉన్నాయి. చదవండి !

1. లలితా సహస్ర నామముల ప్రాశస్త్యం

ఉ|| కొందరు మంత్రశాస్త్రమని గొప్పగ మిక్కిలి సన్నుతించి; రిం
కొందరు యోగశాస్త్రమని; కొందరి కిద్దియె తంత్రశాస్త్ర; మిం
కొందరు భక్తిపూర్ణమని; గొందరు వేదపు దవ్వటంచు; సా
నంద ఘనాత్మ రూపివగు నిన్నిట గాంచిరి పెక్కుభంగులన్

లలితా సహస్ర నామములను అనేకులైన మహనీయులు అనేక రీతులలో అర్ధము జేసికొన్నారు. అవి మంత్ర, తంత్ర, భక్తి, జ్ఞాన, యోగ, వేదాంత, రాజ, లయమార్గముల సమాహారములన్న విషయమును గ్రహించిన విజ్ఞులనేకులు గలరు. వీరిలో ఎవరి దర్శనము వారిది. అందరును కృతార్దులే. అయితే, ఉత్త పారాయణము సరిపోదు. సాధన గావలెను.

2. పరమేశ్వరీ కటాక్షం

చం|| చలిత విశాల నేత్రముల చల్లని జూడ్కులు జాలువార;నీ
కలిత పదాబ్జ దీధితుల కామము లెల్లెడ దృప్తినొంద; స 
ల్లలిత మనోజ్ఞ రూపమున లీలల జూపుచు స్వాత్మ శంభు; స
మ్మిలిత పరాత్మ లీన ఘనమోదము లీయవె మాకు నెప్పుడున్

అమ్మా జగజ్జనని ! అందమైన నీ విశాల నేత్రముల నుండి మనోహరములైన చల్లని చూపులు మా మీద ప్రసరించగా, నీ చల్లని పాదస్పర్శచే మా కోరికలన్నియు తీరిపోయినట్టి స్థితిలో, ప్రాణమగు నీవు, పరాత్ముడగు నీ నాధుడు శంకరుని యందు లయించినట్టి ఆనంద సమాధిస్థితిని మాకెప్పుడును ప్రసాదించవా?


3. కుండలినీ జాగృతి

చం|| కనుగవ మూసి నిద్దురల గూరిమి నీవటు దేలువేళ; మా
మనముల బట్టి జీకటుల ముంచుచు గూల్చదె మాయ; యంతటన్
ఘనముగ లేచి వేగమున గాంతుని దిగ్గున జేరబోవ; నా
క్షణమున మాకు గల్గు; చిరకామిత సత్య సమాధి సంస్థితుల్

అమ్మా ! నీవు కుండలినీ మహాశక్తిగా మూలాధారమున నిద్రించుచున్నంత వరకు, మా మనస్సులలో అలముకుని యున్నట్టి దట్టమగు అజ్ఞానమను మాయచీకటి తొలగిపోదు. కానీ, నీవెప్పుడైతే నీ యుగయుగముల నిద్రనుండి లేచి కళ్ళువిప్పి సహస్రదళ పద్మమున వెలుగుచున్న నీ నాధుడైన పరమేశ్వరుని చేరబోయెదవో, ఆ క్షణములోనే మేము చిరకాలము నుండి ఎదురుచూచుచున్న సత్యమగు సమాధిస్థితి మాకు సిద్ధించగలదు.   

4. మాయా బంధచ్చేదనం

చం|| అగణిత మోహ బంధముల నట్టులె గూలుచు నేడ్చు జీవులన్
వగగని వారి గావజని వాంఛల దీర్చుచు వారికెల్ల నీ
జగమున దక్కు గాసిళుల జిక్కుల బాపుచు గూర్మిమీర; ని
త్తగవుల దీర్చి గాతువిక దీరము జేర్చుచు లీలగానిటన్

లెక్కలేనన్ని మోహబంధాలలో చిక్కుకుని రాగద్వేషాలలో కుములుతూ వాటినుంచి బయటపడలేక, ఏడ్చుచున్న జీవులను గాంచి, జాలిపడి వారి కష్టములను తొలగిస్తూ, ఈ భ్రాంతిమయ తీరమును దాటించి సత్యమైన జ్ఞానతీరమునకు వారిని చేరుస్తున్న జగద్దాత్రివి నీవే.  


5. కాముని పునరుజ్జీవనం

ఉ || కామము గాల్చివైచి జను కాంతుని గాంచుచు నవ్వుదోచ; బల్
నీమము బట్టితీవు; మరి నీల్గుచు నెల్లరు నిన్ను జేర; యే
కాముని దాపులేక మని గాలము హెచ్చుచు బొంగుటెట్లనిన్
గామము నిచ్చి గాచితివి కాముని వామభరాత్మ శక్తివై

తన సమాధి భంగమైనదన్న కోపముతో మన్మధుని తన మూడవ కంటిమంట చేత క్షణమాత్రములో బూడిదగా మార్చిన శివుని జూచి నవ్వుతూ - 'ఏమి తపస్సయ్యా నీది? అందరు జీవులూ నీలాగా సమాధియోగ మగ్నులై పోతే ఈ సృష్టి సాగేదెలా?' అని నీ క్రీగంటి చూపుతో ఆ బూడిదకు జీవాన్ని పోసి మన్మధుని మళ్ళీ బ్రతికించావు కదా !


6. శాపాలు వరాలుగా మారడం

ఉ|| నీ పదధూళి నింత శిర నీరజమందున దాల్చు వారికిన్
ఆపద లెట్లు గల్గు? సరి ! యాతుర మందున సంభవింప; నీ
ప్రాపున నున్నయంత యవి పాపము దీర్చెడు యక్కసంబులై
చేపుల నిచ్చుగాదె ! గన ! సూర్యుని ముంగిట యంధముండునే ?

అటువంటి మహాశక్తివైన నీ పాదధూళిని తమ శిరస్సులలో ధరించేవారికి ఆపదలెలా కలుగుతాయి? ఒకవేళ తొందరపాటులో కల్గినా, అవి చివరకు మేలును చేకూర్చే వరాలే అవుతాయి గాని శాపాలు కాలేవు. ఎందుకంటే - జాజ్జ్వల్యమైన సూర్యకాంతి వంటి నీ కృప ముందు పాపాలు శాపాలనే చీకటులు ఎలా నిలబడగలుగుతాయి?

7. శ్రీమాతృ కటాక్ష ప్రభావం

చం|| అసువుల బాసి కామవిభుడగ్నుల గాలుచు బూది గాగ; న
వ్విసువున రోసి కామసతి వేడుచు నీదరిజేరి యేడ్వసొక్కుచున్ 
పసువుల వైరి చిందుగని ఫక్కున నవ్వుచు ప్రాణదాయివై
యుసురుల బోసి గాచితివి యుత్కట మొప్పగ నిక్షుధన్వునిన్

శరీరాన్ని కోల్పోయిన మన్మధుడు బూడిదగా మారిపోగా, దిక్కుతోచని రతీదేవి నీ దరిజేరి ఏడుస్తూ నిన్ను ప్రార్ధించగా, యోగేశ్వరుడగు పరమేశ్వరుని కోపమును జూచి ఫక్కున నవ్వుతూ నీ కడగంటి చూపుతో ఆ చెరకువింటి ధానుష్కునకు ప్రాణం పోసి ఒక్క క్షణంలో బ్రతికించావు కదా !  

8. ప్రపంచమంటే భయపడకు - అది నా ఆట

ఉ|| లోకము నొల్లనన్న మరి లోలత గాంచుచు భీతి నొందుటౌ
నాకము చాలునన్న నర నాటకమెప్పుడు స్వర్గ తుల్యమౌ?
లోకము వీడిపోక సురలోకము నిచ్చట పెంపుజేయుటే
శోకము బాపజేయు ఘన సౌహృద కర్మము సజ్జనాళికిన్

'ఈ లోకం నాకొద్దు' అంటే లోకాన్ని చూచి భయపడినట్లే. 'పరలోకమే నాకు కావాలి' అని సాధకులూ సిద్ధులూ అంటున్నంత వరకూ ఈ లోకం స్వర్గంగా ఎప్పుడు మారుతుంది? ఈ లోకం నా ఆట. దీనిలో భయపడటానికి ఏముంది? కనుక నిజమైన సజ్జనులు ఈ లోకంలోనే ఉంటూ దీనినే స్వర్గంగా మార్చడానికి ప్రయత్నం చెయ్యాలి. మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి వారిని సరియైన దారిలో నడిపించడం వల్ల మాత్రమే ఇది సాధ్యమౌతుంది. 


9. రక్తిమార్గం - విరక్తి మార్గం

చం|| సరసము కల్లయౌనె? యది సారస సౌఖ్యము నిచ్చు నెల్లెడన్
విరసుల కెట్లు గల్గు పరివార విహార సుసార భూమికల్?
సరసము నొల్లబోక విరసంబుల నెప్పుడు వీడిరాక; యా
నిరత వినోద భూమికల నిత్యము దేలెడివాడు సిద్ధుడౌ !

శృంగారము. సరసము - ఇవి మంచివి కావు అనడం మంచిది కాదు. విరక్తులకు పరమసౌఖ్యప్రదమైన ఆనంద సమాధి ఎలా కలుగుతుంది? నిజమైన మార్గం ఏమిటో తెలుసా? సరసాన్ని వదలకు. విరక్తిని వీడి ఇవతలకు రాకు. ఈ విధంగా ఈ రెంటినీ చక్కగా సమన్వయం చెయ్యగల వాడే అసలైన సిద్ధపురుషుడు. అర్ధం కాలేదా? కాదులే. ఇది అర్ధం కావాలంటే పుస్తక పాండిత్యం సరిపోదు. సాధన కావాలి. ఈ స్థితినే 'శ్రీవిద్యారహస్యం' గ్రంధంలో "గుణాతీత జీవన్ముక్త స్థితి" అనే అధ్యాయంలో వివరించాను.

10. శ్రీవిద్య - శృంగార యోగం

ఉ|| సారవిహీన లోకమున సారము గల్గునె? నీవుగాక; సం
సారపు బీళ్ళలోన ఘనసారము నీవని నేర్చుకొంటి; శృం
గార సుయోగ భూమికల గామము నంతయు బూదిజేసి: యం
గారము లార్పి; గల్పి వెలిగారము; నద్దరి నుండెద; నిత్యకామినై

అమ్మా ! జగజ్జనని ! సారం లేని ఎడారి లాంటి ఈ లోకంలో నీవు దప్ప సారం ఏముంది? ఈ సంసారమనే సారంలేని బీడుభూమిలో నీవే అసలైన సారమవని తెలుసుకున్నాను. శృంగారయోగంలో కామాన్ని కాల్చి బూడిదగా మార్చి, నిప్పులను ఆర్పి, ఆ బూడిదలో వెలిగారాన్ని కలిపి, నిత్యకామమనే ఆవలితీరంలో నిలిచి ఉంటాను.

11. విజ్ఞాని స్థితి

ఉ|| ఒక్కటి యౌట యెగ్గుగదె? యొంటిగ నుండగ నేమి సాధ్యమౌ?
ఒక్కడు గాదె ఈశ్వరుడు? ఒంటిగ నుండక నింత ఏలనో?
ఒక్కటి రెండు గావలయు; నొక్కటి గావలె రెండునింక; రెం
డొక్కటి రెండు గాగ విభు డొక్కడ వీవిట శక్తివీవెగా !

దైవం ఎప్పుడూ ఒక్కడే ఉండే పనైతే, ఇంత వైవిధ్యంతో కూడిన సృష్టిని చెయ్యడం ఎందుకు? అసలీ సృష్టిలో ఒంటరిగా ఉండటం ఎవరికైనా సాధ్యమేనా? పరమశివుడే నీ సాహచర్యంలో పరిపూర్ణుడయ్యాడు కదా ! అసలు సత్యం ఏమిటో చెప్పనా? ఒకటి రెండుగా మారాలి. మళ్ళీ ఆ రెండూ ఒక్కటి కావాలి. ఒకటిలో రెంటినీ రెంటిలో ఒకటినీ అనుభవించేవాడే అసలైన సిద్ధుడు. వాడిలోనే శివశక్తులైన మీరిద్దరూ ఒక్కటిగా నిత్యమూ నివసిస్తారు.

12. సమరస సౌఖ్యం

చం|| సమరస సౌఖ్యమన్న యది శాశ్వతసౌఖ్యము సాధనాంతమౌ
భ్రమలిడు భేదభావముల బంధము లన్నియు వీడిపోవునా
క్రమగత సామరస్యమున కామము జచ్చుచు కన్నువిచ్చు; నా
శ్రమలిక దీరిపోవు; శివశక్తులు నిల్వగ నాదు డెందమున్ !

శివశక్తుల సమరస సౌఖ్యమే శాశ్వతసౌఖ్యం. ఆ సౌఖ్యాన్ని అనుభవంలో తెలుసుకుంటే అన్ని భ్రమలూ అన్ని బంధాలూ వీగిపోతాయి. ఇది శ్రీవిద్యాసాధనలో చరమావస్థ. ఈ సామరస్య సాధనలో కామం ప్రతిక్షణమూ చస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే పుడుతూ ఉంటుంది. అప్పుడే మా ప్రయాణం పరిసమాప్తి అవుతుంది. ఎందుకంటే మీరిద్దరూ అప్పుడు మా గుండెల్లోనే ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు కదా !