Pages - Menu

Pages

26, డిసెంబర్ 2017, మంగళవారం

సత్యం ఎవరికి కావాలి?

నిన్న క్రీస్తు పుట్టలేదు
కానీ లోకమంతా క్రిస్మస్ జరుపుకుంది

మనిషిని చంపమని ఇస్లాం చెప్పలేదు
కానీ కాఫిర్లను వాళ్ళు చంపుతూనే ఉంటారు

కొత్తకొత్త దేవుళ్ళను సృష్టించమని
హిందూమతం అనలేదు కానీ
వాళ్ళాపనిని రోజూ చేస్తూనే ఉంటారు

'నన్ను పూజించండి' అని బుద్దుడు చెప్పలేదు
పైగా ఆ పని వద్దన్నాడు
కానీ బౌద్ధులు దానినే ఆచరిస్తున్నారు

మహావీరుడు బట్టలు వదిలేశాడు
జీవితమంతా అలాగే బ్రతికాడు
జైనులు మాత్రం బట్టల వ్యాపారమే చేస్తున్నారు

మతాలు చెప్పినదాన్ని
మతస్థులే ఆచరించడం లేదు
దేవుడు ఆశించినట్లు
భక్తులూ ఉండటం లేదు

అదే సమయంలో

మతాన్నీ వదలడం లేదు
దేవుడినీ వదలడం లేదు
ఇది కాదూ మాయంటే?
ఇది కాదూ భ్రమంటే?

మాయలో ఉన్నంతవరకూ
వాస్తవం ఎలా తెలుస్తుంది?
భ్రమలో ఉన్నంతవరకూ
నిజం ఎలా అర్ధమౌతుంది?

మాయ మత్తుగా జోకొడుతుంటే
మెలకువ ఎవరికి కావాలి?
భ్రమే ఆనందంగా ఉంటే
సత్యం ఎవరికి కావాలి?