నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, డిసెంబర్ 2017, సోమవారం

Dynamo (magician impossible) Astro chart Analysis

ప్రముఖుల జాతకాలు అనే శీర్షిక క్రింద ఏదైనా వ్రాసి చాలాకాలం అయింది. బ్లాగులో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ నుంచి కొంచం పక్కకొచ్చి అటువైపు దృష్టి సారిద్దాం. ఒక ప్రపంచ ప్రఖ్యాత మెజీషియన్ జాతకాన్ని ఈ పోస్టులో గమనిద్దాం.

మేజిక్ సర్కిల్స్ లో 'డైనమో' పేరు విననివారు ఉండరు. లబ్దప్రతిష్టులైన గారడీవాళ్ళ (మెజీషియన్స్)లో  చూస్తే వయసులో ఇతను చాలా చిన్నవాడు. కానీ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంచిపేరును నాలుగే నాలుగేళ్ళలో సంపాదించాడు. దానికి కారణమేమంటే అతని అత్యంత విజయవంతమైన ప్రదర్శనలే.

Dynamo: Magician Impossible అనే ఇతని ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా చాలా విజయవంతం అయింది. దీనిలో భాగంగా ఇతను అనేక దేశాలు తిరిగి సామాన్య జనంతో కలసి మెలసి తన మేజిక్ ట్రిక్స్ చేసి అందరినీ మెప్పించాడు. ఇతను చేసే ట్రిక్స్ చూస్తే ఎవరైనా సరే నోరెళ్ళబెట్టక తప్పదు.

ఇతనేమైనా క్షుద్రవిద్యలు నేర్చుకున్నాడా అని అనుమానం వచ్చే స్థాయిలో ఇతని మేజిక్ ఉంటుంది. ఈ అనుమానం చాలామందిలో ఉంది కూడా. ఇతను కొన్ని 'జిన్' లనే భూతాలను అదుపులో ఉంచుకున్నాడని ముస్లిమ్స్ అంటారు. కాదు, ఇతను సైతాన్ ఆరాధకుడు, సైతాన్ ఇచ్చిన శక్తులవల్లే ఈ ట్రిక్స్ చెయ్యగలుగుతున్నాడు, ఇవి మామూలు మెజీషియన్స్ చెయ్యలేని ట్రిక్స్-  అని క్రైస్తవులంటారు.

ఏదేమైనా ఇతను చేసే మేజిక్ చాలా ఊహాతీతంగా ఉంటుంది. వాటిల్లో ఎక్కువభాగం సింపుల్ మేజిక్ ట్రిక్స్ కావచ్చు. సన్నని దారాలూ, కంటికి కనిపించని వైర్లూ వాడి ఆ మేజిక్ ట్రిక్స్ చేస్తూ ఉండవచ్చు. ఆడియన్స్ లో ఇతని మనుషులు ఉండొచ్చు కూడా. కానీ కొన్ని ట్రిక్స్ మాత్రం అలా అనిపించవు. నిజంగా ఏదో అతీతశక్తి ఇతనికి ఉంది అనిపించే స్థాయిలో అవుంటాయి. మామూలు మెజీషియన్స్ అయితే ఇతను చేసే ట్రిక్స్ చెయ్యలేరు. అదీగాక ఇతను ఒక మంచి మెస్మరిస్టూ హిప్నాటిస్టూ మాత్రమే గాక ఒక మైండ్ రీడర్ కూడా.

ఇతని జాతకాన్ని గమనిద్దాం.

ఇతని అసలు పేరు స్టీవెన్ ఫ్రేన్. తండ్రి పాకిస్తానీ. తల్లి ఇంగ్లీషు వనిత. ఇతను 17-12-1982 న ఇంగ్లాండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ లో రాత్రి 11-10 కి పుట్టాడు. ఈ విషయాన్ని తన జీవితచరిత్రలో తనే వ్రాశాడు.

అది దుందుభి నామ సంవత్సరం. సామాన్యంగా మనం సంవత్సర నామాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ దానికి కూడా ఒక అర్ధం పరమార్ధం ఉంటుంది. దుందుభి అంటే డమరుకం, భేరీ వాయిద్యం అని అర్ధం ఉన్నది. అంటే దాని శబ్దం చాలా దూరం వినిపిస్తుంది అని. అలాగే ఈ సంవత్సరంలో పుట్టినవాళ్ళు ఏదో ఒక రకంగా వారివారి రంగాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఇవి ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇతనికేమో ప్రపంచ ప్రఖ్యాతి చిన్న వయసులోనే మేజిక్ ద్వారా వచ్చింది.

ఇతని జననం శుక్లపక్షంలో జరిగినప్పటికీ అమావాస్యకు దగ్గరలో ఉండటం వల్ల చీకటి శక్తుల ప్రభావం ఇతని మీద తప్పకుండా ఉంటుంది. అందుకే చీకటి విద్య అయిన మేజిక్ లో నిష్ణాతుడయ్యాడు.

ఇతను పుట్టినది శుక్రవారం అర్ధరాత్రి సమయంలో. శుక్రుడు రాక్షస గురువు. ఇతనికి మృతసంజీవనీ విద్య తెలుసు. ఈ విద్య దేవగురువైన బృహస్పతికి కూడా తెలియదు. కనుక మేజిక్ అనేది శుక్ర అధీనంలో ఉండే విద్య. ఆ శుక్రవారం నాడే ఆదికూడా అర్ధరాత్రి సమయంలో ఇతను పుట్టడం ఒక మార్మిక సూచన. ఇతనికి డెమన్స్ సహాయం ఉంది అని ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది నమ్ముతున్నారు. ఇతను కూడా ఒక 'షో' లో యాంకర్ అడిగిన ప్రశ్నకు అదే జవాబును ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు.

'మీరు చేస్తున్న మేజిక్ వెనుక మామూలుగా ఉపయోగించే ట్రిక్స్ మాత్రమే గాక, ఏదో ఒక అతీతశక్తి సహాయం కూడా ఉందని ఒక ఊహ ప్రేక్షకులలో ఉంది. దీనికి మీరేమంటారు?' అని యాంకర్ అడిగింది.

వక్రమైన చిరునవ్వుతో డైనమో ఇలా అన్నాడు.

'ఏమో? ఉండే ఉంటుంది'

మంత్రస్థానం అయిన ధనుస్సులో రవి,బుధ,శుక్ర, చంద్ర,కేతువులు ఉండటం ఈ జాతకంలో ప్రముఖమైన యోగం.వీరిలో కేతువు, సహజ నవమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడని గమనించాలి. అష్టమం రహస్య విద్యలకు నిలయం. అష్టమాదిపతి అయిన గురువు ఈ జాతకంలో విద్యాస్థానంలో ఉండటమూ ఇది సహజ అష్టమస్థానం అవడమూ గమనిస్తే, ఇతనికి మేజిక్ విద్య ఎలా పట్టుబడిందో తెలుస్తుంది. దీనివల్లే ఇతను చిన్న వయస్సులోనే "అసాధారణ గారడీ ప్రదర్శకుడు" అనే పేరును సంపాదించగలిగాడు. దీనికి తోడుగా రహస్య చీకటివిద్యలకు నేతలైన యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోలు ఈ జాతకంలో వరుసగా వృశ్చిక ధనూ తులా రాశులలో ఉన్నారు.

నవమాధిపతి అయిన కుజుడు ఆరింట ఉచ్చస్థితిలో ఉండటమూ, రహస్య వృశ్చికం నుంచి యురేనస్ తో ఖచ్చితమైన సెక్స్ టైల్ దృష్టిని కలిగి ఉండటమూ ఇతనికి బ్లాక్ ఆర్ట్ అయిన మేజిక్ లో ప్రావీణ్యాన్ని ఇచ్చాయి.

నవాంశ చక్రంలో అష్టమాదిపతి అయిన బుధుడు (తెలివి) లాభస్తానంలో ఉచ్చ స్థితిలో ఉండటం గమనిస్తే, తెలివితేటలూ ట్రిక్సూ ఉపయోగించి చేసే మేజిక్ వల్ల ఇతనికి ఎంత లాభం కలిగిందో అర్ధమౌతుంది.

అదే విధంగా సహజ విద్యాస్థానం అయిన కర్కాటకంలో ఇతను పుట్టిన వారాధిపతి అయిన శుక్రుడు చీకటి విద్యలకు కారకుడైన కేతువుతో కలసి ఉండటం గమనిస్తే ఇతనికి మేజిక్ ఎందుకు పట్టుబడిందో అర్ధమౌతుంది.

పేరు ప్రఖ్యాతులు కలగటానికి ఘటీలగ్నాన్ని గమనించాలి. ఇది ధనుస్సులోనే శుక్రునిదైన పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటూ మేజిక్ ద్వారా కలిగే గొప్ప పేరును సూచిస్తోంది. ఇదే నక్షత్రంలో బుధుడు కూడా ఉంటూ తెలివితో కూడిన మోసపూరిత విద్యను సూచిస్తున్నాడు. బుధుడు ఈ లగ్నానికి లాభాధిపతి అన్న విషయమూ అక్కడే రాహువు ఉచ్చస్థితిలో ఉన్న విషయమూ మనకు గుర్తుండాలి.

ఇతనికి ప్రస్తుతం 2022 వరకూ రాహుదశే నడుస్తున్నది. అందులోనూ మళ్ళీ 2019 వరకూ రాహు/ శుక్రదశ నడుస్తూ మంచి టైం ను చూపిస్తున్నది. కనుకనే ఇతనికిప్పుడు ఇంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఎవరి జీవితమైనా సరే దశల ప్రకారమే నడుస్తుందనడానికి ఇదొక ఉదాహరణ.

ఇతనికి కలిగిన ప్రపంచవ్యాప్త గుర్తింపు రాహు/శని దశలో 2010-12 మధ్యలోనే కలిగింది.  ఈ ఇద్దరూ ఇతని జాతకంలో ఉచ్ఛస్తితులలో ఒకరికొకరు కోణస్థితిలో ఉండటం గమనించవచ్చు. రాహువు బుధునికి సూచకుడనీ, బుధ శనులిద్దరూ స్నేహితులనీ ఒకే గ్రూపు వారనీ గుర్తుంటే విషయం తేలికగా అర్ధమౌతుంది.

మేజిక్ లో ఇతని ప్రావీణ్యాన్ని గమనించి లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రఖ్యాత మేజిక్ సొసైటీ Magic Circle ఇతనికి A.I.M.C 'అసోసియేట్ ఆఫ్ ఇన్నర్ మేజిక్ సర్కిల్' గా ప్రొమోషన్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇందులో 300 మందికి మాత్రమే ప్రఖ్యాత మెజీషియన్స్ కు ప్రవేశం ఉంటుంది.

అదే పంచమ స్థానంలోని అయిదు గ్రహాల వల్ల ఇతనికి క్రోన్స్ డిసీస్ వచ్చింది. ఈ లోకంలో ఎంతటి వారైనా కర్మబద్దులే కదా? జీవితంలో ఒకటి కావాలంటే ఇంకొకదాన్ని వదులుకోక తప్పదు కదా ! ఇది క్రానిక్ డిసీజ్. ఈ రోగం ఉన్నవాళ్ళు బాగా సన్నగా అయిపోతారు. వీరికి పేగులలో వాపు ఉంటుంది. ఇంత ప్రజ్ఞాశాలికి ఇంత చిన్న వయసులో ఈ రోగం ఏంటో? ఖర్మ అనిపిస్తోంది కదూ? బహుశా తన విద్యకోసం, పేరు ప్రఖ్యాతుల కోసం సైతాన్ కు, భూతాలకు అతను చెల్లిస్తున్న మూల్యం ఇదేనేమో ?

ఈ వీడియో చూస్తే, ఇతను చేస్తున్నది మామూలు మేజిక్ కాదని దీని వెనుక అతీతశక్తి ఉందని తేలికగా అర్ధమౌతుంది. ఖాళీ బకెట్ లోనుంచి ఆ బకెట్ కి పదిరెట్ల చేపలను బయటకు పొయ్యడమూ, జిమ్ లో అనుభవజ్ఞుడైన ట్రెయినర్ కూడా ఎత్తలేనంత బరువుతో, అతి బలహీనుడైన ఇతను బెంచ్ ప్రెస్ చెయ్యడమూ చూస్తే మీరేమంటారు?

https://www.youtube.com/watch?v=Z0iOEVQIjFY

ఇతని ప్రోగ్రామ్స్ ను మరిన్ని, యూట్యూబ్ లో చూడండి మరి ! అప్పుడు మీరూ ఒప్పుకుంటారు ఇతను magician impossible అని, రియల్ మేజిక్ అనేది నిజమేనని.