Pages - Menu

Pages

26, ఫిబ్రవరి 2018, సోమవారం

మేమూ యోగా చేస్తున్నాం !

నిన్న శ్రీదేవి చావు మీద పోస్ట్ వ్రాశాక యధావిధిగా కొన్ని మెయిల్స్ వచ్చాయి. అందులో ఒకరు ఇలా అన్నారు - యోగా చెయ్యక శ్రీదేవి చనిపోయింది అని మీరన్నారు. అది తప్పు. ఆమె రోజూ యోగా చేస్తుంది. అయినా సరే ఎందుకు చనిపోయింది?'

' యోగా చేస్తోంది కనుకే అలా చనిపోయింది. యోగినిలా బ్రతికితే ఇంకోలా చనిపోయి ఉండేది.' అని అతనికి క్లుప్తంగా మెయిల్ ఇచ్చా. 

ఇతని మెయిల్ చూచాక యధావిధిగా నాకు మళ్ళీ నవ్వొచ్చింది. ఈ మధ్యన నాకు ఎవరిని చూచినా తెగ నవ్వొస్తోంది. ఒకరు నన్ను పొగిడినా నవ్వొస్తోంది. తిట్టినా నవ్వొస్తోంది. మనుషులనూ వాళ్ళ అజ్ఞానపు తీరుతెన్నులనూ చూస్తుంటే విపరీతమైన నవ్వొస్తోంది. నేను నవ్వుతుంటేనేమో వాళ్ళకు కోపం ఇంకా పెరిగిపోతోంది. ఏం చేస్తాం ?

ఈ మెయిల్ చూచాక ఎప్పుడో జరిగిన ఒక  సంఘటన నాకు గుర్తొచ్చింది. కొన్నేళ్ళ క్రితం ఒకాయన నాతో ఇలా అన్నాడు.

'మీరేదో  యోగా గురించి తెగ చెబుతుంటారు. ఒక్క మీరే యోగా చెయ్యడం   లేదు. మేమూ యోగా చేస్తున్నాం. మీరే పెద్ద గొప్ప అనుకోకండి.'

యధావిధిగా నేను నవ్వేసి ఊరుకున్నాను.

కాసేపు అదీఇదీ మాట్లాడాక ఆయన తన కష్టాల సోది మొదలు పెట్టాడు. కొడుకు సరిగా చదవడం లేదనీ, పదహారేళ్ళకే కూతురు ఎవడితోనో లవ్వులో పడిందనీ, భార్య తన మాట వినడం లేదనీ చెప్పుకొచ్చాడు.

అంతా మౌనంగా విని చివరకు ఇలా  అన్నాను.

'నువ్వు   అబద్దం చెబుతున్నావు.'

అతను బిత్తరపోయాడు. 'లేదు నేను చెప్పేవి నిజాలే.  నా భార్యా పిల్లలవల్ల నాకు మనశ్శాంతి కరువైంది.' అన్నాడు.

'నేననేది అది కాదు. అవన్నీ నిజాలే. కాదనడం లేదు. నువ్వు రోజూ యోగా చేస్తున్నది అబద్దం.' అన్నాను.

'లేదు. అది కూడా నిజమే. ప్రతిరోజూ గంటసేపు చేస్తాను.' అన్నాడు.

'నువ్వు  చేస్తున్నది యోగా కాదు' అన్నాను.

అతను అయోమయంగా చూచాడు.

'ఇంకో విషయం చెప్పనా? 'యోగా' చేసేది కాదు. చేయించబడేది' అన్నాను.

అతను అయోమయంగా చూచాడు.

'కాస్త అర్ధమయ్యేలా చెప్పు' అన్నాడు.

అప్పుడిలా వివరించాను.

'లోకంలో చాలామంది యోగా చేస్తున్నామని భ్రమిస్తూ ఉంటారు. ఆసనాలనేవి యోగా కాదు. అవి యోగంలో మొదటి  మెట్టు మాత్రమే. యోగంలో 'మనో నిగ్రహం' లేదా మైండ్ కంట్రోల్ అనేది అతి ముఖ్యమైన మెట్టు. నువ్వు చేసే ఆసనాలనేవి ఆ పైమెట్టు ఎక్కడానికి పనికొచ్చే మొదటి మెట్టు మాత్రమే. దానిపైన ఎనిమిది మెట్లున్నాయి. అవి ఒదిలేసి రోజుకి ఒక అరగంటో గంటో ఆసనాలు చేస్తూ 'యోగా' చేస్తున్నామన్న భ్రమలో ఉంటారు అందరూ. అదే నాకు నవ్వు తెప్పించే అంశం.

యోగం అనేది ఒక జీవన విధానం. It is a way of life. నీ జీవితం మొత్తం యోగపరంగా ఉండాలి గాని ఆసనాలొక్కటే చేస్తే నువ్వు యోగివి కాలేవు. నువ్వు చెప్పిన నటులే కాదు, హాలీవుడ్ నటీ నటులు కూడా రోజూ యోగా చేస్తారు. కానీ వాళ్ళెం యోగిక జీవితాలు గడపరు. మిగతా వ్యాయామాల లాగే అది  వాళ్లకు ఒక వ్యాయామం అంతే.

నువ్వు నిజంగా యోగపరమైన జీవితాన్ని గడిపితే నీకు శరీరం మీద అంత మోజు ఉండదు. మేకప్ మీద శ్రద్ధ అసలే ఉండదు. వయసు ముదిరిపోతున్నదనీ, అందంగా కనపడాలనీ, దానికోసం నానా సర్జరీలు చేయించుకోవాలనీ నీకస్సలు అనిపించదు. నువ్వు చెబుతున్న కుటుంబ సమస్యలూ, డబ్బు సమస్యలూ నీ మనస్సును తాకను కూడా తాకలేవు. నీ మానసిక ప్రశాంతతను ఏదీ చెదరకొట్ట లేదు.

అసలు - నువ్వు చెప్పిన సినిమా నటులు చేసేది యోగా కాదు. అది ఒక వ్యాయామం అంతే. యోగా చెయ్యడం వేరు. యోగజీవితం గడపడం వేరు. ఈ రెంటికీ నక్కకూ దేవలోకానికీ   ఉన్నంత భేదం  ఉంది. కాకపోతే యోగా చెయ్యడం వల్ల ఒళ్ళు కాస్త కండిషన్ లో ఉంటుంది. అంతే. పిచ్చిపిచ్చి అల్లోపతీ మందులు వాడితే అదీ పోతుంది.

ఒక  విషయం చెబుతా విను. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా హైదరాబాద్ సత్యనారాయణ గోయెంకా గారి దగ్గర విపస్సాన  ధ్యానంలో కోర్స్ చేశారు. కానీ వాళ్ళకేం ఒరిగింది? వాళ్ళేం బుద్ధత్వాన్ని పొందలేదే? మరి ఈ ధ్యానం వల్లనే సిద్ధార్ధుడు బుద్ధుడయ్యాడు. కానీ ఆ ధ్యానాన్ని కోర్సుగా చేసిన అందరూ బుద్ధులు కావడం లేదుగా? అందుకే నేను చెప్పేది ఏమంటే -- ఫ్యాన్సీగా కోర్సులు చెయ్యడం కాదు. దానిని ఒక జీవనవిధానంగా మార్చుకుని ప్రతిరోజూ ప్రతి క్షణమూ అలా బ్రతకాలి. అప్పుడే నువ్వు యోగంకానీ ధ్యానం కానీ చేస్తున్నట్లు. లేకపోతే నీ జీవితంలోని మిగతా నటనల్లాగే ఇదీ ఒక నటన. అంతే !

ఆ విధంగా బ్రతుకుతూ అప్పుడు చెప్పు 'మేమూ యోగా చేస్తున్నాం అని' - అప్పుడు నమ్ముతాను. కానీ ఒక విచిత్రం చెప్పనా? నువ్వు నిజంగా అలా బ్రతికితే, అసలు ఇంకొకరికి చెప్పవలసిన పనే నీకు రాదు. అప్పుడు నా దగ్గరకొచ్చి ఇలా నీ సమస్యలను ఏకరువు పెట్టవు.

అసలు నువ్వన్న మాటలోనే అహంకారమూ, అసూయా నిండి ఉన్నాయి. ' నువ్వు మాకేమీ చెప్పనక్కర లేదు. మేమూ యోగా చేస్తున్నాం' అన్న మాటలోనే నువ్వేంటో నాకు తెలిసిపోయింది. నువ్వేమీ అనుకోకపోతే ఒకమాట చెబుతాను. నీలాంటి వాళ్ళు జీవితమంతా యోగా చేసినా 'యోగాన్ని' మాత్రం అర్ధం చేసుకోలేరు. అందుకోలేరు'. - అని   ముగించాను.

'ఇందాక అన్నావ్ కదా ! యోగా అంటే చేసేది కాదు. చేయించబడేది. అని.' అదేంటో కూడా అర్ధమయ్యేలా చెప్పు.' అన్నాడు.

'ఇప్పుడొద్దులే. ముందు ఇప్పటిదాకా  చెప్పినదాన్ని జీర్ణించుకో. అది ఇంకోసారి ఎప్పుడైనా చెబుతాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి చెబితే అజీర్తి చేస్తుంది నీకు'   అన్నా మళ్ళీ నవ్వుతూ.

మీరుకూడా ఆలోచించుకోండి మరి ! మీరు కేవలం ఉత్త యోగా చేస్తున్నారో లేదా  నిజమైన యోగజీవితాన్ని గడుపుతున్నారో?

25, ఫిబ్రవరి 2018, ఆదివారం

పాపం శ్రీదేవి !


13-8-1963
సినీనటి శ్రీదేవి చనిపోయింది. అందులోనూ అర్ధాంతరంగా 54 ఏళ్ళకే పోయింది. ఈ అంకె నిజమో కాదో నాకు తెలీదు. వికీ సోర్స్ నుంచి అనుకోడమే.

మరిప్పుడు ఈమె జాతకం చూడకపోతే మన పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది గనుక చూడక తప్పదు. ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని పనులు నా అభిమానులకోసం చెయ్యాల్సి వస్తోంది. ఏం చేస్తాం ?

ఈమె అందచందాలకు ముగ్డులైపోయి ఈనాటికీ ఈమెను ఆరాధిస్తున్న పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఈ వార్త బాధాకరమే గాని, వాస్తవాలను గమనిద్దాం. షావుకారు జానకి, కాంచన లాంటి పాత తరం హీరోయిన్లు ఈరోజుకూ చక్కగా హాయిగా ఉన్నారు. ఈ మధ్యతరం హీరోయిన్లు మాత్రం హటాత్తుగా హరీమంటున్నారు. కారణాలేమై ఉంటాయో?

25-2-2018
పాతకాలం వాళ్ళకు కొన్ని విలువలున్నాయి. జీవితంలో ఎంతసేపూ గ్లామర్ ఒక్కటే వాళ్లకు ప్రధానం కాదు. వయసుతో బాటు వచ్చిన మార్పులను హుందాగా స్వాగతిస్తూ, అనవసరమైన కాస్మెటిక్ ఆపరేషన్లూ గట్రాల జోలికి పోకుండా, ఆహార నియమాలు పాటిస్తూ, హైఫై జీవితం జోలికి పోకుండా, యోగాభ్యాసం చేస్తూ ఎనభైలు దాటినా వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు. ఈకాలపు హీరోయిన్లేమో అనవసరమైన మందులు వాడుతూ, సర్జరీలు చేయించుకుంటూ, వయసు పైబడుతున్నా ఇంకా కుర్రపిల్లల్లా కనిపించాలన్న భ్రమలో మధ్యలోనే హరీమంటున్నారు.

కొన్ని నెలల క్రితం పెదిమలు కొంత బండగా కనిపించడం కోసం శ్రీదేవి ఏదో సర్జరీ చేయించుకుందని వార్తలొచ్చాయి. అది విన్నప్పుడు లైపో సక్షన్ చేయించుకుని చనిపోయిన ఆర్తీ అగర్వాల్ నాకు గుర్తొచ్చింది. ఇలాంటి సర్జరీల వల్ల ఇలాంటి ప్రమాదాలు చాలా ఉంటాయి. కానీ ఆ సర్జన్లు ఇవేవీ చెప్పరు. దానికీ దీనికీ సంబంధం లేదని అంటారు. అంతా సేఫ్ అని నమ్మిస్తారు. జనం కూడా వాళ్ళ మాటల్ని నమ్ముతారు.

ఆ తర్వాత ఇరవై ఏళ్ళకు ఒక సైన్స్ జర్నల్లో ఇలా వ్రాస్తారు.

' ఫలానా సర్జరీ తర్వాత వాడే ఫలానా మందు వల్ల గుండె దెబ్బతింటుంది అని ఈ మధ్యనే మా ఇరవైయేళ్ళ పరిశోధనల్లో తెలిసింది. అందుకని ఆ మందును యూరప్ అమెరికా మార్కెట్లో మాత్రం ప్రస్తుతానికి నిషేధిస్తున్నాం. మిగతావాళ్ళు ఏమైపోయినా మాకనవసరం.'

ఈ లోపల ఆ మందును విచ్చలవిడిగా వాడేసి మిగతా ఖండాలలో దేశాలలో జనం ఒళ్ళు గుల్ల చేసుకుని చనిపోతూనే ఉంటారు. హేతువాదులకూ సైన్సువాదులకూ ఇలాంటి విషయాలు కనిపించవు గాక కనిపించవు !

ఈ వీడియోని చూడండి మరి !
https://www.youtube.com/watch?v=0g201YThZJc

54 ఏళ్ళు వచ్చాక మూతి ఎలా ఉంటే ఏమైంది? ముక్కు ఎలా ఉంటే ఏమైంది? అని సామాన్యులమైన మనం అనుకోవచ్చు గాక. గ్లామర్ డాల్స్ అలా అనుకోవు కదా ! హిందీ నటుడు దేవానంద్ తన హెయిర్ స్టైల్ కుర్రవయసులో ఉన్నట్టే కనిపించడం కోసం చనిపోయే ముందు కూడా జుట్టుమీద ఏడాదికి లక్షల్లో ఖర్చు చేసేవాడుట. సినీ పక్షులందరూ అలాంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్లకు శరీరమే కదా పెట్టుబడి ! అది గ్లామరస్ గా ఉన్నంతవరకే వాళ్ళ జీవితాలు ! అందుకని అలాంటి జాగ్రత్తలు తప్పవేమో మరి !

ఎన్ని మందులు వాడినా, ఎన్ని సర్జరీలు చేయించుకున్నా, చివరకు వాటి సైడ్ ఎఫెక్ట్స్ తో ఒళ్ళు గుల్ల అవడమే గాని ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. బొటోక్స్ ఇంజెక్షన్లూ, సిలికాన్ ఇంప్లాంట్ లూ హైఫై సొసైటీలో మామూలే కావచ్చు. కానీ అవన్నీ సహజసిద్ధమైన ఆరోగ్యాన్ని గుల్లచేసి పారేస్తాయని చాలామందికి తెలీదు. ఆహార నియమం, యోగాభ్యాసం, నియమాలతో కూడిన జీవితంతో వచ్చే ఆరోగ్యం ఇలాంటి పిచ్చి పనులతో ఎప్పటికీ రాదు.

నానమ్మాళ్ చూడండి ! తొంభై ఏళ్ళ వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా ఉందో? ఆమె ఏ మేకప్ చేసుకోకపోయినా ఆమెలో జీవకళ ఉంది. అదేమరి యోగాభ్యాస మహిమ అంటే ! నేటి హీరోయిన్లు ఎన్నెన్ని మేకప్ లు వేసుకున్నా వాళ్ళ మొహాల్లో జీవకళ ఉండదు. మామూలుగా వాళ్ళు అంత అందంగా ఏమీ ఉండరు. మేకప్ లేకపోతే వాళ్ళ ముఖాలు చాలా కళావిహీనంగా ఉంటాయి.

సరే ఎవరెలా పోతే మనకెందుకు గాని, శ్రీదేవి జాతకాన్ని ఒకసారి చూద్దాం, వికీ సోర్స్ నిజమే అయితే !

రెండు ముఖ్యమైన యోగాలు ఈమె మరణాన్ని సూచిస్తున్నాయి.

1. జననకాల సూర్య శుక్రులు ఈమెకు కర్కాటకంలో ఉన్నారు. వీరిమీదకు గోచార రాహువు ప్రస్తుతం సంచరిస్తున్నాడు. సూర్యునిపైన రాహువు సంచారం ప్రాణగండాన్ని సూచిస్తుంది. అంతేగాక, గ్లామర్ కూ, మేకప్ కూ, అందానికీ కారకుడైన శుక్రుని మీదకు రాహుసంచారం వల్ల సర్జరీ వల్ల ప్రమాదం అని సూచన ఉంది. అదీగాక ఆ శుక్రుడు ఆమె జాతకంలో అస్తంగతుడై ఉన్నాడు మరి !! 

2. గోచార యముడు (ప్లూటో) ధనుస్సు 26 డిగ్రీలలో ఉంటూ ఈమె జననకాల గ్రహాలలో చాలావాటితో ప్రస్తుతం చాలా దగ్గర దృష్టులలో ఉన్నాడు.

>కర్కాటకంలో ఉన్న జననకాలసూర్యునితో, ఖచ్చితమైన షష్టాష్టకదృష్టిలో ఉంటూ మరణాన్ని సూచిస్తున్నాడు.

> మీనంలో ఉన్న జననకాల గురువుతో ప్రతికూల కేంద్ర దృష్టిలో ఉన్నాడు.

> జననకాల శని మకరంలో 26 డిగ్రీలలో వక్రించి ఉన్నాడు. ఈయన్ను ధనుస్సులోకి స్వీకరిస్తే సరిగ్గా గోచార యముని (ప్లూటో) తో కలుస్తాడు. ఇది ఖచ్చితమైన మరణగండం. ఎందుకంటే శనీశ్వరుడూ ప్లూటో ఇద్దరూ మరణానికి కారకులే. ఒకే డిగ్రీమీద ప్రస్తుతం ఉన్నారు. ఇది మరణ గండమే.

> అంతేగాక, గోచార ప్లూటో, జననకాల కేతువుమీద సంచరిస్తూ రాహువు దృష్టికి లోనౌతున్నాడు. ఇవన్నీ మరణ సూచనలే.

అయితే, కర్కాటకం అనేది సహజ చతుర్ధంగా గుండెకు సూచిక. అక్కడ ఉన్న జననకాల సూర్యుడు కూడా గుండెకే సూచకుడు. అక్కడకు ప్రస్తుతం వచ్చిన రాహువు గుండెపోటును సూచిస్తున్నాడు. అందువల్లే మరణం జరిగి ఉండవచ్చు. కానీ ఆ గుండెపోటుకు దారితీసిన పరిస్థితులు మాత్రం, కాస్మెటిక్ సర్జరీలూ, వాటితో వాడిన మందులూ,వాటి సైడ్ ఎఫెక్ట్ లూ అని నా అభిప్రాయం.

గ్లామర్ వరల్డ్ లో మైకేల్ జాక్సన్ నుంచి నేటి శ్రీదేవి వరకూ అందరూ 'నేను ఇంకా అందంగా లోకానికి కనిపించాలి' అన్న ఒక్క ఆలోచనకు బలి అయినవారే అని నా ఊహ ! కుహనా సౌందర్యదేవత పాదాలదగ్గర ఎంతమంది ఇలా ప్రాణాలు అర్పించాలో?

అసలూ - నిజమైన సౌందర్యం అంటే ఏమిటి? అదెక్కడుంటుంది? అది మేకప్ లో ఉంటుందా? డ్రస్సులో ఉంటుందా? లేక స్వచ్చంగా వెలిగే అంతరంగంలోనూ అది బయటకు ప్రతిఫలించే కళ్ళలోనూ ఉంటుందా? జీవం లేని ప్లాస్టిక్ నవ్వులలో అది ఉంటుందా? లేకపోతే నిష్కల్మషంగా హృదయంలో నుంచి పొంగి వచ్చే సంతోషపు నవ్వులో ఉంటుందా? కృత్రిమంగా తెచ్చుకునే వంపుసొంపులలో అది ఉంటుందా? లేక సహజసిద్ధమైన వ్యాయామాల వల్ల వచ్చే ఫిట్నెస్ లో ఉంటుందా?

జీసస్ అన్న మాట ఒకటి గుర్తుకొస్తోంది.

'ప్రపంచంలో ఒకడు అన్నీ సంపాదించినా చివరకు తన ఆత్మను పోగొట్టుకుంటే అందువల్ల ఉపయోగం ఏముంది?'

కోరికలు తీరకుండా అర్ధాంతరంగా పోయినవాళ్ళు ప్రేతాత్మలౌతారని అంటారు. సిల్క్ స్మిత అలాగే దయ్యమైందని ఒక పుకారు చాలా బలంగా సినీ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు శ్రీదేవి కూడా అలాగే అర్ధాంతరంగా పోయింది. ఈమె ఏమౌతుందో చూడాలి మరి !!

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

Makkal Needi Mayyam Party - Astro analysis

21-2-2018 బుధవారం రాత్రి 7.35 ప్రాంతంలో మదురైలో నటుడు కమల్ హాసన్ తన రాజకీయ పార్టీని ప్రారంభించాడు. దానిపేరు 'మక్కల్ నీది మయ్యం' (ప్రజాన్యాయ కేంద్రం) అంటున్నాడు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పేరులాగే ఇదీ ధ్వనిస్తోంది. దీని జాతకం ఎలా ఉందో చూద్దాం.

నాస్తికుడిని అని చెప్పుకునే కమల్ కూడా తన పార్టీని ప్రకటించే సమయాన్ని జాగ్రత్తగా జ్యోతిష్యపరంగా ఎంచుకోవడం ఈ కుండలిలో కనిపిస్తోంది. కనుక తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది క్లియర్ గా తెలుస్తోంది. ఎలాగో చూద్దామా?

స్థిరలగ్నము, అధికార రాశీ అయిన అయిన సింహలగ్నంలో, సూర్య హోరలో, దశమాధిపతి శుక్రుడు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండేటట్లు, అలాగే సింహలగ్నానికి యోగకారకుడైన కుజుడు కూడా నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండేటట్లు చూచుకుని మరీ, పార్టీని సరిగ్గా ఆ సమయంలో ప్రకటించాడు. కనుక ఇతనికి జ్యోతిష్కుల సలహా ఉంది అని ఖచ్చితంగా అర్ధమౌతున్నది. మరి తను నాస్తికుడినని ఎలా చెప్పుకుంటాడో అర్ధం కాదు. బహుశా చెప్పేదొకటి చేసేదొకటి కావడమే రాజకీయాలలో ముఖ్యమైన అర్హతేమో?

అయితే 'తానొకటి తలచిన దైవమొకటి తలచును' అన్న సామెతకు అనుగుణంగా, ఈ ముహూర్త చక్రంలో లోపాలేంటో చెప్తా వినండి. ఎందుకంటే స్థూల ముహూర్తం వేరు, సూక్ష్మ ముహూర్తం వేరు. రెండోది ఎలా పెట్టాలో చాలామంది జ్యోతిష్కులకు తెలియదు. చివరకు, పంచాంగాలు వ్రాసే ఉద్దండులకు కూడా ఈ రహస్యాలు తెలియవు. మనిషి అలా ప్రతిదాన్నీ ముహూర్తంతో బాగుచేసుకునే పనైతే ఇక విధి ఎందుకు, కర్మ ఎందుకు?

మనిషి చేసేవన్నీ చేసేసి, మంచి ముహూర్తం పెట్టుకుని పాత కర్మను అధిగమిస్తాను అంటే కుదరదు. పూర్వకర్మ అనేది సూక్ష్మస్థాయిలలో ముహూర్తబలాన్ని అధిగమిస్తుంది. మహర్షి అయిన వశిష్టుడు శ్రీరామునికి పెట్టిన పట్టాభిషేక ముహూర్తం ఎందుకు విఫలం అయింది? ధౌమ్యుడు రాజగురువుగా ఉన్నప్పటికీ పాండవులు అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? అన్నింటికీ ముహూర్తాలు చూచుకుని మంచి జరిగేటట్లు చేసుకోవచ్చు కదా? మహారాజైన హరిశ్చంద్రుడి చేతిలో జ్యోతిష్కులు లేరా? ఆయన ఎందుకు అన్ని కష్టాలు పడ్డాడు? మొదలైన సందేహాలకు ఇదే సమాధానం.

ముహూర్తం కొంతవరకే పని చేస్తుంది. పూర్వకర్మను అది పూర్తిగా తీసెయ్యలేదు. అలా తీసేయ్యగలిగితే ప్రపంచంలో ఎక్కడా ఏ కష్టమూ ఉండదు. ప్రతిపనికీ అందరూ పంచాంగాలు చూచుకుని ముహూర్తాలు పెట్టుకుని హాయిగా మంచి ఫలితాలు పొందుతూ ఉండవచ్చు. కానీ, నూటికి నూరు శాతం మంచి ముహూర్తం అనేది ఎక్కడా ఉండదు. "అల్పదోషం గుణాధిక్యం సర్వేషాం సమ్మతం మతమ్" అనేదే ముహూర్త సమయంలో ఆచరించవలసిన సూత్రం. నూటికి నూరుపాళ్ళు మంచి మనిషి ఎలాగైతే ఉండడో, నూటికి నూరు పాళ్ళు మంచి ముహూర్తమూ ఎక్కడా ఉండదు. కాలంలోని ప్రతిక్షణంలో మంచీ చెడూ కలిసే ఉంటాయి. కొంతలో కొంత మంచి సమయాన్ని ఎంచుకోవడమే ముహూర్తం చేసే పని.

ఇప్పుడు విషయంలోకి వద్దాం.

లగ్నాధిపతి అయిన సూర్యుడు సప్తమంలో అస్తమిస్తూ ఉండటం మంచి సూచన కాదు. కనుక ఈ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం.

అంతేకాదు సప్తమంలో సూర్యుడు కాక రెండు గ్రహాలున్నాయి. అవి ఇప్పటికే రాజకీయంలో పండిపోయి ఉన్న రెండు పార్టీలైన DMK, ADMK పార్టీలకు సూచికలు. లగ్నాధిపతి సూర్యుడు వాటితో చేరడం, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ MNM పార్టీ తన ప్రత్యర్ధులకు తలొగ్గలసిందే అనీ, స్వతంత్రంగా తనంత తానుగా మనుగడ సాగించలేదనీ సూచిస్తున్నది. 

ఈ లగ్నానికి కుజుడు యోగకారకుడే కాదు బాధకుడు కూడా. కనుక మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ప్రజలను సూచించే నాలుగింట అతని స్థితి మంచిది కాదు. ప్రజలలో ఇతనికి ఏకపక్ష మెజారిటీ రాదు. అంతేకాదు వృశ్చిక కుజుని వల్ల, ఈ పార్టీ వ్యూహరచనలో స్పష్టమైన కుట్రలు కుతంత్రాలు దర్శనమిస్తున్నాయి. రాజకీయాల్లో ఇవి మామూలే అనుకోవచ్చు. కానీ నోరు తెరిస్తే ఆదర్శాలు చెప్పే పార్టీలు అలా ఉండకూడదు మరి !

పంచమంలో శనీశ్వరుని స్థితివల్ల త్వరలోనే ఈ పార్టీ డిప్రెషన్ కు గురౌతుంది అని చెప్పవచ్చు. అంతేగాక, తన పార్టీలో ప్రముఖులతోనూ, తన అనుచరులతోనే ముందు ముందు తనకు వచ్చే విరోధాలను ఈ యోగం సూచిస్తోంది.

అన్నింటి కంటే ముఖ్యమైనది - ఈ పార్టీ క్రైస్తవ మాఫియాల ఫండింగ్ తో నడుస్తున్నది అని ఇప్పటికే వస్తున్న ఆరోపణలలో నిజం ఉందా లేదా గమనిద్దాం.

ద్వాదశాధిపతి ( రహస్య ఆలోచనలకు సూచకుడు) అయిన చంద్రుడు నవమంలో (మత సంస్థలను సూచిస్తూ) బలంగా ఉండటమూ, అదే ద్వాదశంలో కుట్రలకు సూచకుడైన రాహువు ఉండటమూ, చంద్రుని పైన మతసంస్థలకు సూచకుడైన గురువు దృష్టి ఉండటమూ, సప్తమాధిపతి (దూరదేశాలకు సూచకుడు) అయిన శనీశ్వరుని దృష్టి సహజ నవమమూ మతస్థానమూ అయిన ధనుస్సు నుంచి చంద్రునిపైన కోణదృష్టిగా ఉండటమూ గమనిస్తే ఈ ఆరోపణ నిజమే అని తెలుస్తున్నది. 

ఆర్ధిక ఫండింగ్ కు సూచకుడైన లాభస్థానాధిపతి బుధుడు సప్తమంలో (దూరదేశాలకు సూచిక) ఉండటమూ, దశమాదిపతి అయిన శుక్రునితో కలసి ఉండటమూ, వారితో బాటే లగ్నాధిపతి అయిన సూర్యుడు ఉండటమూ చూస్తుంటే - ఈ పార్టీ మొత్తం విదేశీ సంస్థల పెట్టుబడితో, వారి పర్యవేక్షణలోనే నడుస్తుంది అని అర్ధమై పోతున్నది.

కారకాంశ అయిన మిథునం నుంచి కూడా సూర్య బుధ శుక్రులు నవమ స్థానంలో ఉండటం గమనిస్తే ఈ పార్టీ మీద విదేశీ మతసంస్థల పెత్తనం బలంగా ఉందన్న విషయం అర్ధమౌతుంది.

ఈ పార్టీ పెట్టిన సమయంలో ఈ జాతకానికి శుక్ర-చంద్ర-రాహు-కేతు-బుధ దశ నడుస్తున్నది. శుక్రుడు దశమాదిపతిగా సప్తమంలో ఉంటూ, చంద్రుడు ద్వాదశాదిపతిగా నవమంలో ఉంటూ,రాహువు రహస్య ద్వాదశంలో ఉంటూ - ఈ పార్టీ కార్యరంగంలో విదేశీ మతసంస్థల పెత్తనాన్ని స్పష్టంగా సూచిస్తున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న ఉచ్ఛశుక్ర మహర్దశ 2033 వరకూ నడుస్తుంది. ఈ దశ ఆరూఢ లగ్నమైన వృషభానికీ, కారకాంశ లగ్నమైన మిధునానికీ, సూర్యలగ్నమైన కుంభానికీ బాగానే యోగిస్తుంది. తిరుగులేని మెజారిటీ రాకపోయినా, రాజకీయ రంగంలో ఈ పార్టీ ఉంటూనే ఉంటుంది. తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది.

స్వతహాగా కమలహాసన్ జాతకం గట్టిది. అందులో ఒకటి మించి రాజయోగాలున్నాయి. ఇతను 7-11-1954 న తమిళనాడులోని పరమకుడిలో పుట్టాడు. ఆరోజున కుజుడు, గురువు, శని ఉచ్ఛస్థితిలో ఉన్నారు. నవాంశలో సూర్యుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. ఇన్ని మంచి యోగాలున్నాయి గనుకనే ఇతని జీవితం సినిమారంగంలో ఎదురులేకుండా నడిచింది. కానీ దారాకారకుడైన శుక్రుడు వక్రించి, అందులోనూ వృశ్చికంలో శనినక్షత్రంలో ఉంటూ, నీచరాహువుకు అతి దగ్గరగా ఉండటం వల్లా పాపార్గళంలో చిక్కుకోవడంవల్లా ఇతని వివాహజీవితం అనేక ఒడుదుడుకులకు లోనౌతూ వచ్చింది. చివరకు విఫలం అయిందనే చెప్పవచ్చు. మొదటి భార్య వాణీగణపతి గతి ఏమైందో తెలియదు. రెండో భార్య సారిక ప్రస్తుతం ముంబైలో వేషాలు లేక ఆర్ధికంగా దయనీయ పరిస్థితిలో ఉంది.  అందుకేనేమో - 'ముందు నీ భార్యలిద్దరికీ న్యాయం చెయ్యి ఆ తర్వాత ప్రజలకు న్యాయం చేద్దువుగాని' - అంటూ ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

వివాహ జీవితాన్ని అలా ఉంచితే, ముఖ్యమైన గ్రహాలు - గురువు, శని, కుజుడు, సూర్యుడు ఉచ్చస్థితిలో బలంగా ఉన్నారు గనుక రాజకీయాలలో ఇతను బాగానే నిలదొక్కుకోవచ్చు.

అయినా ఈరోజుల్లో 'తిను - తినిపించు' అన్న సూత్రమే ఇండియాలో పనిచేస్తున్నది గాని, ఆ పార్టీ ఫండింగ్ ఎక్కడనుంచి వస్తున్నది? ఎవరు దీనిని పెట్టారు? దీని వెనకాల ఏ మతం ఉన్నది? ఏ సంస్థలున్నాయి? అనే విషయాలు ఎవడికీ అవసరం లేదు. కనుక ఈ సూత్రాన్ని బాగా అమలు పరిస్తే కమల్ కు ఏమీ ధోకా ఉండబోదు.

కానీ కమల హాసన్ కు తినే అలవాటే గాని తినిపించే అలవాటు లేదనీ, తన జేబులోనుంచి ఒక్క రూపాయి కూడా ఎవడికీ ఏనాడూ పెట్టింది లేదనీ లోకాపవాదు ఉన్నది. కాకపోతే ఇప్పటి పరిస్థితి వేరు. తన జేబులో డబ్బులు పెట్టనక్కరలేదు. తనకు ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళ అజెండాను మన సమాజంలో అమలు చేసి వాళ్ళిచ్చే డబ్బుల్లో కొంత ప్రజలకు పెడితే చాలు. అనుకున్న పనైపోతుంది.

ఎంతో ఆశలతో ప్రజలు ఓట్లేసిన పార్టీలు ఏం ఉద్ధరిస్తున్నాయో చూస్తున్నాం కదా! ఎన్ని కొత్త కొత్త పార్టీలోచ్చినా ఎన్నెన్ని నీతులు చెప్పినా అంతర్జాతీయ అవినీతి ఇండెక్స్ లో మన దేశం 81 స్థానంలో ఉందని మనం మర్చిపోరాదు.

మోసపూరిత సమాజంలో మోసపూరిత పార్టీలే సక్సెస్ అవుతాయి. అందులోనూ తమిళనాడులొ వ్యక్తిపూజ మరీ ఎక్కువ కదా! కమల్ హాసన్ పార్టీ కూడా అలాగే ఏదో ఒక రకంగా సక్సెస్ కావాలని కోరుకుందాం !! చెబుతున్న నీతులను త్రికరణశుద్ధిగా పాటించే లక్షణం అయితే ఈ ముహూర్త చక్రంలో ఏమీ కనిపించడం లేదు. కాబట్టి, ఈ పార్టీ కూడా మిగతా పార్టీల లాగే ఇంకొక అవకాశవాద పార్టీ మాత్రమే అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

14, ఫిబ్రవరి 2018, బుధవారం

జగ్జీత్ సింగ్ జాతకం - విశ్లేషణ

ప్రఖ్యాత ఘజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జాతకాన్ని గమనిద్దాం. 'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు' అన్నట్లుగా, మనం మంచివాళ్ల జాతకాలే చూస్తాం గనుకా, అలాగే చూడాలి గనుకా, ఇప్పుడు ఈయన జాతకం చూస్తున్నామన్న మాట !

ఈయన 8-2-1941 న ప్రస్తుతం రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో జన్మించాడు. జనన సమయం తెలియదు గనుక ఇతర లగ్నాలనుంచి గమనిద్దాం.

చంద్రుడు ఆరోజున ఆర్ద్రా నక్షత్రం 1,2,3 పాదాలలో సంచరించాడు. ఇవి నవాంశలో అయితే ధనుస్సు, మకరం, కుంభం అవుతాయి. వీటిలో ఈయనది మకర నవాంశ అని నా అభిప్రాయం. అంటే ఈయన మధ్యాన్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిదిలోపుగా పుట్టి ఉండాలి. అలా ఎందుకు? అనేది ముందుముందు విశ్లేషణలో చెబుతాను.

చంద్రలగ్నం నుంచి చూస్తే - నాలుగింట రాహువు ఉచ్ఛబుధుడిని సూచిస్తూ వీరి కుటుంబంలో ఉన్న సంగీత, సాహిత్య పరంపరను తెలుపుతున్నాడు. ఈయన తల్లిదండ్రులు సంగీతంలో నిష్ణాతులు కానప్పటికీ, వీరి పూర్వీకులలో ఈ జీన్స్ ఖచ్చితంగా ఉండి ఉండాలి.

కారకాంశ సింహం అయింది. అక్కణ్ణించి ఉచ్చబుధుడు రెండింటిలో ఉంటూ ప్రసిద్ధ గాయకుడిని సూచిస్తున్నాడు. నవమంలో బలీయమైన పూర్వకర్మను సూచించే నీచశని గురువుల డిగ్రీ సంయోగం ఉన్నది. ఇది మంచి యోగం కాదు. అందుకే, సంగీతంలో తన మొదటి గురువుగా చగన్ లాల్ శర్మ అనే గ్రుడ్డి గురువు దగ్గర చేరి విద్యను నేర్చుకున్నాడు. చంద్ర లగ్నం నుంచి కూడా నవమంలో బుధుడు అర్గల గ్రస్తుడై ఉండటం చూడవచ్చు.

సప్తమంలో కుజుని స్థితివల్ల వచ్చిన కుజదోషంతో డైవోర్సీ అయిన చిత్రా సింగ్ ను వివాహం చేసుకున్నాడు. కుజునికి దారా కారకత్వం రావడమూ ఆయన సున్నా డిగ్రీలలో బలహీనుడుగా ఉండటమూ గమనించాలి. పుత్రకారకుడైన గురువు నీచ శనితో కలసి ఉండటంతో జగ్జీత్ - చిత్ర లకు పుట్టిన వివేక్ అనే అబ్బాయి తన 18 ఏట ఒక కారు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటినుంచీ జగ్జీత్ బాగా కృంగిపోయాడు. ఆ తర్వాత, తన మొదటి భర్త ద్వారా పుట్టిన కూతురు కూడా 2009 లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో చిత్రా సింగ్ కూడా మానసికంగా చాలా క్రుంగిపోయింది.

అక్కడనుంచీ వారిద్దరూ పాటలు పాడటం తగ్గించారు. చిత్రా సింగ్ పూర్తిగా పాడటం మానేసింది. జగ్జీత్ మాత్రం కొన్నేళ్ళ డిప్రెషన్ తర్వాత నిదానంగా మళ్ళీ పాడటం మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత కూడా అతను ఆ డిప్రెషన్ నుంచి బయటపడలేదని, చాలా విరక్తికి లోనయ్యాడని ఆయన పాడిన పాటలు, వాటి రాగాలు గమనిస్తే మనకు తెలుస్తుంది. ఎన్ని పాటలు పాడినా ఎన్ని ఎవార్డులు, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా,  చివరకు నిరాశతోనే 10-10-2011 తేదీన ముంబాయిలో ఈయన చనిపోయాడు.

ఆ రోజున --

జననకాల సూర్యునితో, గోచార శని కేంద్ర దృష్టిలోనూ, జననకాల చంద్రుడు, గోచార గురువుతో అర్ధకోణ దృష్టిలోనూ, ముఖ్యంగా గోచార గురువు మళ్ళీ అదే జననకాల స్థానంలోనూ, గోచార ప్లూటో (యముడు) జననకాల రాహువుతో కేంద్రదృష్టి లోనూ ఉండటం గమనించవచ్చు.

కుజదోషం వివాహభావాన్ని ఖచ్చితంగా చెడగొడుతుంది. ఈ చెడిపోవడం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా చెడిపోవడం వల్ల వారిలో ఇద్దరికీ గానీ ఒక్కరికి గానీ మంచి జరుగుతుంది కూడా. మనిషి జీవితం చాలా విచిత్రమైనది. ఇందులో ఎన్నెన్నో కోణాలుంటాయి. ఏ ఇద్దరి జీవితాలూ ఒకే విధంగా ఉండవు. మంచిలో చెడుంటుంది. చెడులో మంచీ ఉంటుంది. జీవితంలోని ఈ విభిన్న కోణాలను సూచిస్తూ జాతకంలోని గ్రహయోగాలు కూడా రకరకాలుగా ఉంటాయి.

బలీయమైన పూర్వకర్మను సూచించే శనిగురువుల సంయోగమూ అందులోనూ శని నీచలో ఉన్నప్పుడు ఆ జాతకంలో ఎన్ని ఉన్నా ఏమీ లేని స్థితి మానసికంగా ఉంటుందని ఈ జాతకం నిరూపిస్తుంది.

అయితే, రాశి చక్రంలో ఉచ్చబుధుడిని సూచిస్తున్న రాహువూ, నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడూ ఈయనకు సినిమా రంగంలోనూ, ఘజల్స్ పాడటంలోనూ, ట్యూన్స్ కట్టడంలోనూ మంచి అంతర్జాతీయ సక్సెస్ ను ఇచ్చారు. ఆ శుక్రుడు కూడా మకర చంద్రుని నుంచి తృతీయస్థానంలో ఉండటంతో మంచి స్వరాన్ని ఇచ్చాడు.

ఈ విధంగా జాతకంలో యోగాలనేవి జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాటి ప్రకారమే మనిషి జీవితం నడుస్తుందనడానికీ, సామాన్యులైనా అసామాన్యులైనా ఎవ్వరూ గ్రహప్రభావానికి అతీతులు కారని  చెప్పడానికీ ఈయన జాతకం ఒక ఉదాహరణ.

8, ఫిబ్రవరి 2018, గురువారం

Shayad Aa Jayega Saaqi Ko Taras - Jagjit Singh


Shayad aa jayega Saaqi ko taras - Ab ke baras

అంటూ జగ్జీత్ సింగ్ మధురాతి మధురంగా గానం చేసిన ఈ ఘజల్ 1994 లో వచ్చిన Magic Moments అనే ఆల్బం లోనిది. ఈ గీతాన్ని రాయ్ రాంపురి రచించగా, సంగీతాన్ని జగ్జీత్ సింగ్ సమకూర్చాడు.

ఉర్దూ ఘజల్స్ లో 'సాకీ' కి ప్రత్యేక స్థానం ఉన్నది. సామాన్యంగా ఘజల్స్ లో మనం 'మధుశాల' కు చెందిన కొన్ని పదాలను ఎక్కువగా వింటుంటాం.

'మై' అంటే మధువు. 'మైఖానా' అంటే పానశాల. 'సాఘర్' అంటే మధువుతో నిండిన కప్పు, 'మినా' అంటే మధుపాత్ర, 'సాకీ' అంటే మధువును అందించే అమ్మాయి. ఇవన్నీ సూఫీల ప్రేమమయ సాధనా మార్గాన్ని మార్మికంగా సూచించే పదాలు.

సూఫీలు త్రాగుబోతులు కారు. వారు అనంతమైన ప్రేమను ఆరాధించేవారు. ప్రేమ అంటే దైవమే అని వారి భావం. కానీ వారి సాధనా మార్గాన్నీ అందులో వాళ్ళు పడే వేదననూ, పొందే ఆనందపు మత్తునూ 'మధువు', 'సాకీ', 'మత్తు', 'మధుపాత్ర', 'మధుశాల' మొదలైన త్రాగుబోతులకు చెందిన పదాలలో వాళ్ళు వ్యక్తీకరిస్తుంటారు.

'సాకీ' అనే పదం 'సఖి' గా మారిందని నా ఊహ. సఖి అంటే మనల్ని సరిగ్గా అర్ధం చేసుకుని, అక్కున చేర్చుకుని, మన బాధల్ని విని, మధువును అందించి, మనల్ని ఓదార్చే స్నేహితురాలు, ప్రియురాలు. అలాంటి సఖి కావాలని ఈ లోకంలో ఎవరనుకోరు? కానీ అలాంటి స్వచ్చమైన సఖి ఎక్కడైనా ఉంటుందా? ఎవరికైనా దొరుకుతుందా? ఏమో? అలాంటి సఖి దొరికితే మాత్రం అతడిని మించిన అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు మరి !

లోకపు బాధల్ని మరిపించి, నిరంతరం వెంటాడే ఆలోచనలను త్రుంచి, తర్కానికి అతీతమైన ఆనందపు మత్తులో మనల్ని ముంచేదే పానశాల. అక్కడ మనకు మధువును అందించే ప్రేయసే సాకీ. ఉమర్ ఖయాం నుంచి గాలిబ్ దాకా అందరూ సాకీని ఆరాధించిన వాళ్ళే. పానశాలను ప్రేమించిన వాళ్ళే.

సాకీకి భగవంతుడు, ప్రియురాలు అనే అర్ధాలున్నాయి. లౌకిక కోణంలో - స్నేహితురాలు. ఆధ్యాత్మిక కోణంలో - దైవం. ధ్యాన పరవశతలో కలిగే మత్తే నిజమైన మధువు. దానిని అందించే అంతరిక స్థితే నిజమైన సాకీ. మానవ సాకీలు ఏదో ఒకనాడు మనల్ని ఒదిలి పోతారు. కానీ మనలో ఉండే ఈ సాకీ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అది మన నిరంతర నేస్తం. దానికి స్వార్ధం లేదు. అది మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది. మత్తులో ముంచే మధువును పాత్రలో నింపి మనకు అందిస్తూనే ఉంటుంది.

ఆ సాకీ లాంటి సాకీ ఈ లోకంలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది !

నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి !

Album :- Magic Moments (1994)
Lyrics :- Rai Rampuri
Music and Singer:- Jagjit Singh
Karaoke Singer:- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------
Shayad aa jayega Saaqi ko taras - Ab ke baras
Milna paya hai un aakhon ka bhi ras - Ab ke baras
Shayad aa jayega Saaqi ko taras - Ab ke baras

Aisi chayi thi kaha gham ki ghataye pehle - 2
Ha mere deedar - e- tar Khub baras - Ab ke baras
Shayad aa jayega Saaqi ko taras - Ab ke baras

Uf wo un mad-bhari aakhon ki - Chalakte huye jaam - 2
Badh gayi aur bhi peene ki havas - Ab ke baras
Shayad aa jayega Saaqi ko taras - Ab ke baras

Pehle ye kab tha ki - Wo mere hai - Mai unka hu - 2
Unki yaadone sataya hai tho bas - Ab ke baras

Shayad aa jayega Saaqi ko taras - Ab ke baras
Milna paya hai un aakhon ka bhi ras - Ab ke baras
Shayad aa jayega Saaqi ko taras - Ab ke baras

Meaning

Perhaps, this rainy season, this year
Saaqi will have pity on me
Unfortunate I am
Could not get a glance of love from her eyes

This much of agony I never felt before
Never saw these dark clouds of anguish before
Yes ! my tearful eyes are still raining for her
in this rainy season also

Oh ! those nectar (love) filled eyes !
are like wine glasses over flowing
Now, my desire to drink the wine
has increased a hundred fold

When was it that
She was mine and me hers
Now her memories are torturing me
even this rainy season

Perhaps, this rainy season, this year
Saaqi will have pity on me
Unfortunate I am
Could not get a glance of love from her eyes

తెలుగు స్వేచ్చానువాదం

కనీసం ఈ వర్షాకాలమైనా
సాకీ కి నేనంటే జాలి కలుగుతుందేమో?
తన కన్నులలోని ప్రేమను 
నేనిప్పటిదాకా పొందలేకపోయాను
కనీసం ఈ వర్షాకాలమైనా...

ఇంత బాధను ఇంతకు ముందెన్నడూ పడలేదు
ఇంత దట్టమైన బాధామయ మేఘాలను ఎప్పుడూ చూడలేదు
తడిబారిన నా కన్నులు వర్షిస్తున్నాయి తనకోసం
ఈ వర్షాకాలంలో కూడా...

ప్రేమతో నిండిన తన కన్నులు
తొణికిసలాడుతున్న మధుపాత్రలలా ఉన్నాయి
వాటిని చూచాక
త్రాగాలన్న నా కోరిక మరీ ఉద్ద్రుతమైపోయింది

గతంలో...
నాకోసం తను, తనకోసం నేనుగా ఉన్నాం
ఇప్పుడో...
తన జ్ఞాపకాలు నన్నిలా సతాయిస్తున్నాయి

కనీసం ఈ వర్షాకాలమైనా
సాకీ కి నేనంటే జాలి కలుగుతుందేమో?
తన కన్నులలోని ప్రేమను 
నేనిప్పటిదాకా పొందలేకపోయాను
కనీసం ఈ వర్షాకాలమైనా...

పీడ కల

మంచి నిద్రలో ఉండగా
పీడ కలొచ్చి నిద్ర లేపేసింది
చిన్న పీడకల అంతమై
పెద్ద పీడకలలోకి మెలకువొచ్చింది...

ఈ ఆత్మ...

ఈ ఆత్మ
ఎన్నోసార్లు గమ్యాన్ని చేజార్చుకుంది
కానీ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది

ఈ మనసు
ఎన్నో సార్లు మోసపోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తూనే ఉంది

ఈ ప్రాణం
ఎన్నో సార్లు క్రుంగిపోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ పుంజుకుంటూనే ఉంది

ఈ దేహం
ఎన్నో సార్లు రాలిపోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంది

ఈ స్వరం
ఎన్నో సార్లు మూగబోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ పాడుతూనే ఉంది

ఈ నమ్మకం
ఎన్నో సార్లు వెన్నుపోట్లకు గురయింది
కానీ మళ్ళీ మళ్ళీ నమ్ముతూనే ఉంది

ఈ జీవితం
ఎన్నో సార్లు ముగిసింది
కానీ మళ్ళీ మళ్ళీ కొనసాగుతూనే ఉంది...

4, ఫిబ్రవరి 2018, ఆదివారం

Raat Khamosh Hai - Jagjit Singh


Raat Khamosh Hai Chand Madhosh Hai అంటూ జగ్జీత్ సింగ్ పాడిన ఈ ఘజల్ చాలా మధురమైన గీతం. ఇది 2004 లో రిలీజైన Muntazir అనే ఆల్బం లోనిది. ఈ పదానికి  'ఆత్రుతతో వేచి చూడటం' అని అర్ధం.

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Album:-- Muntazir (2004)
Lyrics:--  Hari Ram Acharya
Music and Singer:-- Jagjit Singh
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------

Raat Khamosh Hai - Chand Madhosh Hai
Thaam lena mujhe - Jaa raha hosh hai
Raat Khamosh Hai

[Milan ki daastaan - Dhadkano ki jubaan
Gaa rahi hai Zamee - Sun raha aasmaan] - 2
Gungunati hawa - De rahi hai sada
Sard is raat ki - Garm aagosh hai

[Mehakti ye fiza - Jaise teri Adaa
Chaa raha rooh par - Jane kaisa nasha] - 2
Jhoomta hai jahaa - Ajab hai ye samaa
Dil ke gulzaar me - Ishq parjosh hai

Raat Khamosh Hai - Chand Madhosh Hai
Thaam lena mujhe - Jaa raha hosh hai
Raat Khamosh Hai

Meaning

The night is silent - the Moon is drunk
Hold me - I am losing my senses
The night is silent

The tale of our meeting - the voice of our heart beats
The Earth is singing - the sky is listening
The wind is humming - it is giving us eternity
The cold of this night - is creating hot memories

Just like your beauty - this cool breeze is glowing
An unknown intoxication - is possessing my soul
The whole world is reeling - this weather is strange
In the garden of my heart - love's perfume is spreading

The night is silent - the Moon is drunk
Hold me - I am losing my senses
The night is silent

తెలుగు స్వేచ్చానువాదం

రాత్రి మౌనంగా ఉంది - జాబిల్లి మత్తులో ఉంది
నన్ను పట్టుకో - నాకు స్పృహ తప్పేలా ఉంది
రాత్రి మౌనంగా ఉంది

మన సమాగమ కధ - మన హృదయాల సంభాషణ
నేల పాడుతోంది - ఆకాశం వింటోంది
గాలి స్వరం కలిపి - మనకు అమరత్వాన్ని ఇస్తోంది
ఈ చలి రాత్రి - మనలో వేడి జ్ఞాపకాలను రగులుస్తోంది

నీ అందం లాగే - ఈ గాలి కూడా వెలుగుతోంది
ఏదో తెలియని మత్తు - నా ఆత్మను కమ్మేస్తోంది
ఈ వాతావరణం వింతగా ఉంది - లోకం మొత్తం తూగుతోంది
నా హృదయపు పూదోటలో - ప్రేమ సుగంధం అలముకుంటోంది

రాత్రి మౌనంగా ఉంది - జాబిల్లి మత్తులో ఉంది
నన్ను పట్టుకో - నాకు స్పృహ తప్పేలా ఉంది
రాత్రి మౌనంగా ఉంది...