Pages - Menu

Pages

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

Makkal Needi Mayyam Party - Astro analysis

21-2-2018 బుధవారం రాత్రి 7.35 ప్రాంతంలో మదురైలో నటుడు కమల్ హాసన్ తన రాజకీయ పార్టీని ప్రారంభించాడు. దానిపేరు 'మక్కల్ నీది మయ్యం' (ప్రజాన్యాయ కేంద్రం) అంటున్నాడు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పేరులాగే ఇదీ ధ్వనిస్తోంది. దీని జాతకం ఎలా ఉందో చూద్దాం.

నాస్తికుడిని అని చెప్పుకునే కమల్ కూడా తన పార్టీని ప్రకటించే సమయాన్ని జాగ్రత్తగా జ్యోతిష్యపరంగా ఎంచుకోవడం ఈ కుండలిలో కనిపిస్తోంది. కనుక తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది క్లియర్ గా తెలుస్తోంది. ఎలాగో చూద్దామా?

స్థిరలగ్నము, అధికార రాశీ అయిన అయిన సింహలగ్నంలో, సూర్య హోరలో, దశమాధిపతి శుక్రుడు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండేటట్లు, అలాగే సింహలగ్నానికి యోగకారకుడైన కుజుడు కూడా నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండేటట్లు చూచుకుని మరీ, పార్టీని సరిగ్గా ఆ సమయంలో ప్రకటించాడు. కనుక ఇతనికి జ్యోతిష్కుల సలహా ఉంది అని ఖచ్చితంగా అర్ధమౌతున్నది. మరి తను నాస్తికుడినని ఎలా చెప్పుకుంటాడో అర్ధం కాదు. బహుశా చెప్పేదొకటి చేసేదొకటి కావడమే రాజకీయాలలో ముఖ్యమైన అర్హతేమో?

అయితే 'తానొకటి తలచిన దైవమొకటి తలచును' అన్న సామెతకు అనుగుణంగా, ఈ ముహూర్త చక్రంలో లోపాలేంటో చెప్తా వినండి. ఎందుకంటే స్థూల ముహూర్తం వేరు, సూక్ష్మ ముహూర్తం వేరు. రెండోది ఎలా పెట్టాలో చాలామంది జ్యోతిష్కులకు తెలియదు. చివరకు, పంచాంగాలు వ్రాసే ఉద్దండులకు కూడా ఈ రహస్యాలు తెలియవు. మనిషి అలా ప్రతిదాన్నీ ముహూర్తంతో బాగుచేసుకునే పనైతే ఇక విధి ఎందుకు, కర్మ ఎందుకు?

మనిషి చేసేవన్నీ చేసేసి, మంచి ముహూర్తం పెట్టుకుని పాత కర్మను అధిగమిస్తాను అంటే కుదరదు. పూర్వకర్మ అనేది సూక్ష్మస్థాయిలలో ముహూర్తబలాన్ని అధిగమిస్తుంది. మహర్షి అయిన వశిష్టుడు శ్రీరామునికి పెట్టిన పట్టాభిషేక ముహూర్తం ఎందుకు విఫలం అయింది? ధౌమ్యుడు రాజగురువుగా ఉన్నప్పటికీ పాండవులు అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? అన్నింటికీ ముహూర్తాలు చూచుకుని మంచి జరిగేటట్లు చేసుకోవచ్చు కదా? మహారాజైన హరిశ్చంద్రుడి చేతిలో జ్యోతిష్కులు లేరా? ఆయన ఎందుకు అన్ని కష్టాలు పడ్డాడు? మొదలైన సందేహాలకు ఇదే సమాధానం.

ముహూర్తం కొంతవరకే పని చేస్తుంది. పూర్వకర్మను అది పూర్తిగా తీసెయ్యలేదు. అలా తీసేయ్యగలిగితే ప్రపంచంలో ఎక్కడా ఏ కష్టమూ ఉండదు. ప్రతిపనికీ అందరూ పంచాంగాలు చూచుకుని ముహూర్తాలు పెట్టుకుని హాయిగా మంచి ఫలితాలు పొందుతూ ఉండవచ్చు. కానీ, నూటికి నూరు శాతం మంచి ముహూర్తం అనేది ఎక్కడా ఉండదు. "అల్పదోషం గుణాధిక్యం సర్వేషాం సమ్మతం మతమ్" అనేదే ముహూర్త సమయంలో ఆచరించవలసిన సూత్రం. నూటికి నూరుపాళ్ళు మంచి మనిషి ఎలాగైతే ఉండడో, నూటికి నూరు పాళ్ళు మంచి ముహూర్తమూ ఎక్కడా ఉండదు. కాలంలోని ప్రతిక్షణంలో మంచీ చెడూ కలిసే ఉంటాయి. కొంతలో కొంత మంచి సమయాన్ని ఎంచుకోవడమే ముహూర్తం చేసే పని.

ఇప్పుడు విషయంలోకి వద్దాం.

లగ్నాధిపతి అయిన సూర్యుడు సప్తమంలో అస్తమిస్తూ ఉండటం మంచి సూచన కాదు. కనుక ఈ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం.

అంతేకాదు సప్తమంలో సూర్యుడు కాక రెండు గ్రహాలున్నాయి. అవి ఇప్పటికే రాజకీయంలో పండిపోయి ఉన్న రెండు పార్టీలైన DMK, ADMK పార్టీలకు సూచికలు. లగ్నాధిపతి సూర్యుడు వాటితో చేరడం, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ MNM పార్టీ తన ప్రత్యర్ధులకు తలొగ్గలసిందే అనీ, స్వతంత్రంగా తనంత తానుగా మనుగడ సాగించలేదనీ సూచిస్తున్నది. 

ఈ లగ్నానికి కుజుడు యోగకారకుడే కాదు బాధకుడు కూడా. కనుక మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ప్రజలను సూచించే నాలుగింట అతని స్థితి మంచిది కాదు. ప్రజలలో ఇతనికి ఏకపక్ష మెజారిటీ రాదు. అంతేకాదు వృశ్చిక కుజుని వల్ల, ఈ పార్టీ వ్యూహరచనలో స్పష్టమైన కుట్రలు కుతంత్రాలు దర్శనమిస్తున్నాయి. రాజకీయాల్లో ఇవి మామూలే అనుకోవచ్చు. కానీ నోరు తెరిస్తే ఆదర్శాలు చెప్పే పార్టీలు అలా ఉండకూడదు మరి !

పంచమంలో శనీశ్వరుని స్థితివల్ల త్వరలోనే ఈ పార్టీ డిప్రెషన్ కు గురౌతుంది అని చెప్పవచ్చు. అంతేగాక, తన పార్టీలో ప్రముఖులతోనూ, తన అనుచరులతోనే ముందు ముందు తనకు వచ్చే విరోధాలను ఈ యోగం సూచిస్తోంది.

అన్నింటి కంటే ముఖ్యమైనది - ఈ పార్టీ క్రైస్తవ మాఫియాల ఫండింగ్ తో నడుస్తున్నది అని ఇప్పటికే వస్తున్న ఆరోపణలలో నిజం ఉందా లేదా గమనిద్దాం.

ద్వాదశాధిపతి ( రహస్య ఆలోచనలకు సూచకుడు) అయిన చంద్రుడు నవమంలో (మత సంస్థలను సూచిస్తూ) బలంగా ఉండటమూ, అదే ద్వాదశంలో కుట్రలకు సూచకుడైన రాహువు ఉండటమూ, చంద్రుని పైన మతసంస్థలకు సూచకుడైన గురువు దృష్టి ఉండటమూ, సప్తమాధిపతి (దూరదేశాలకు సూచకుడు) అయిన శనీశ్వరుని దృష్టి సహజ నవమమూ మతస్థానమూ అయిన ధనుస్సు నుంచి చంద్రునిపైన కోణదృష్టిగా ఉండటమూ గమనిస్తే ఈ ఆరోపణ నిజమే అని తెలుస్తున్నది. 

ఆర్ధిక ఫండింగ్ కు సూచకుడైన లాభస్థానాధిపతి బుధుడు సప్తమంలో (దూరదేశాలకు సూచిక) ఉండటమూ, దశమాదిపతి అయిన శుక్రునితో కలసి ఉండటమూ, వారితో బాటే లగ్నాధిపతి అయిన సూర్యుడు ఉండటమూ చూస్తుంటే - ఈ పార్టీ మొత్తం విదేశీ సంస్థల పెట్టుబడితో, వారి పర్యవేక్షణలోనే నడుస్తుంది అని అర్ధమై పోతున్నది.

కారకాంశ అయిన మిథునం నుంచి కూడా సూర్య బుధ శుక్రులు నవమ స్థానంలో ఉండటం గమనిస్తే ఈ పార్టీ మీద విదేశీ మతసంస్థల పెత్తనం బలంగా ఉందన్న విషయం అర్ధమౌతుంది.

ఈ పార్టీ పెట్టిన సమయంలో ఈ జాతకానికి శుక్ర-చంద్ర-రాహు-కేతు-బుధ దశ నడుస్తున్నది. శుక్రుడు దశమాదిపతిగా సప్తమంలో ఉంటూ, చంద్రుడు ద్వాదశాదిపతిగా నవమంలో ఉంటూ,రాహువు రహస్య ద్వాదశంలో ఉంటూ - ఈ పార్టీ కార్యరంగంలో విదేశీ మతసంస్థల పెత్తనాన్ని స్పష్టంగా సూచిస్తున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న ఉచ్ఛశుక్ర మహర్దశ 2033 వరకూ నడుస్తుంది. ఈ దశ ఆరూఢ లగ్నమైన వృషభానికీ, కారకాంశ లగ్నమైన మిధునానికీ, సూర్యలగ్నమైన కుంభానికీ బాగానే యోగిస్తుంది. తిరుగులేని మెజారిటీ రాకపోయినా, రాజకీయ రంగంలో ఈ పార్టీ ఉంటూనే ఉంటుంది. తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది.

స్వతహాగా కమలహాసన్ జాతకం గట్టిది. అందులో ఒకటి మించి రాజయోగాలున్నాయి. ఇతను 7-11-1954 న తమిళనాడులోని పరమకుడిలో పుట్టాడు. ఆరోజున కుజుడు, గురువు, శని ఉచ్ఛస్థితిలో ఉన్నారు. నవాంశలో సూర్యుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. ఇన్ని మంచి యోగాలున్నాయి గనుకనే ఇతని జీవితం సినిమారంగంలో ఎదురులేకుండా నడిచింది. కానీ దారాకారకుడైన శుక్రుడు వక్రించి, అందులోనూ వృశ్చికంలో శనినక్షత్రంలో ఉంటూ, నీచరాహువుకు అతి దగ్గరగా ఉండటం వల్లా పాపార్గళంలో చిక్కుకోవడంవల్లా ఇతని వివాహజీవితం అనేక ఒడుదుడుకులకు లోనౌతూ వచ్చింది. చివరకు విఫలం అయిందనే చెప్పవచ్చు. మొదటి భార్య వాణీగణపతి గతి ఏమైందో తెలియదు. రెండో భార్య సారిక ప్రస్తుతం ముంబైలో వేషాలు లేక ఆర్ధికంగా దయనీయ పరిస్థితిలో ఉంది.  అందుకేనేమో - 'ముందు నీ భార్యలిద్దరికీ న్యాయం చెయ్యి ఆ తర్వాత ప్రజలకు న్యాయం చేద్దువుగాని' - అంటూ ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

వివాహ జీవితాన్ని అలా ఉంచితే, ముఖ్యమైన గ్రహాలు - గురువు, శని, కుజుడు, సూర్యుడు ఉచ్చస్థితిలో బలంగా ఉన్నారు గనుక రాజకీయాలలో ఇతను బాగానే నిలదొక్కుకోవచ్చు.

అయినా ఈరోజుల్లో 'తిను - తినిపించు' అన్న సూత్రమే ఇండియాలో పనిచేస్తున్నది గాని, ఆ పార్టీ ఫండింగ్ ఎక్కడనుంచి వస్తున్నది? ఎవరు దీనిని పెట్టారు? దీని వెనకాల ఏ మతం ఉన్నది? ఏ సంస్థలున్నాయి? అనే విషయాలు ఎవడికీ అవసరం లేదు. కనుక ఈ సూత్రాన్ని బాగా అమలు పరిస్తే కమల్ కు ఏమీ ధోకా ఉండబోదు.

కానీ కమల హాసన్ కు తినే అలవాటే గాని తినిపించే అలవాటు లేదనీ, తన జేబులోనుంచి ఒక్క రూపాయి కూడా ఎవడికీ ఏనాడూ పెట్టింది లేదనీ లోకాపవాదు ఉన్నది. కాకపోతే ఇప్పటి పరిస్థితి వేరు. తన జేబులో డబ్బులు పెట్టనక్కరలేదు. తనకు ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళ అజెండాను మన సమాజంలో అమలు చేసి వాళ్ళిచ్చే డబ్బుల్లో కొంత ప్రజలకు పెడితే చాలు. అనుకున్న పనైపోతుంది.

ఎంతో ఆశలతో ప్రజలు ఓట్లేసిన పార్టీలు ఏం ఉద్ధరిస్తున్నాయో చూస్తున్నాం కదా! ఎన్ని కొత్త కొత్త పార్టీలోచ్చినా ఎన్నెన్ని నీతులు చెప్పినా అంతర్జాతీయ అవినీతి ఇండెక్స్ లో మన దేశం 81 స్థానంలో ఉందని మనం మర్చిపోరాదు.

మోసపూరిత సమాజంలో మోసపూరిత పార్టీలే సక్సెస్ అవుతాయి. అందులోనూ తమిళనాడులొ వ్యక్తిపూజ మరీ ఎక్కువ కదా! కమల్ హాసన్ పార్టీ కూడా అలాగే ఏదో ఒక రకంగా సక్సెస్ కావాలని కోరుకుందాం !! చెబుతున్న నీతులను త్రికరణశుద్ధిగా పాటించే లక్షణం అయితే ఈ ముహూర్త చక్రంలో ఏమీ కనిపించడం లేదు. కాబట్టి, ఈ పార్టీ కూడా మిగతా పార్టీల లాగే ఇంకొక అవకాశవాద పార్టీ మాత్రమే అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.