Pages - Menu

Pages

16, మార్చి 2018, శుక్రవారం

2018- విళంబి నామ సంవత్సర ఉగాది ఫలితాలు

18-3-2018 ఆదివారం ఉగాది.

'ఉగాది ఫలితాలు వ్రాయడం లేదేంటి?' అడిగాడొక మిత్రుడు.

'బోరు కొట్టింది. అదీగాక అవి వ్రాయడానికి బోలెడుమంది సాంప్రదాయ జ్యోతిష్కులున్నారు. నేనెందుకు?' చెప్పాను.

'కాదు నీ శైలి విభిన్నంగా ఉంటుంది. వ్రాయి.' అన్నాడు వాడు.

'సరే వ్రాస్తాలే. ఏడుపాపు' చెప్పాను.

అందుకే ఈ పోస్ట్.

ఇక చదువుకోండి రాశులవారీగా ఫలితాలు.

-------------------------------------------
మేషరాశి

మేకలాగా అమాయకంగా ఉండకండి. ఎంతసేపూ మీరు మోసపోవడం కాదు. ఎదుటివారిని మోసం చెయ్యడం ప్రాక్టీస్ చెయ్యండి. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది.

రెమెడీ :- ఆలస్యం చెయ్యడం, మారలేకపోవడం, పోనీలే పాపం అనుకోవడం మీ బలహీనతలు. వాటిని మార్చుకోండి.

వృషభరాశి

అచ్చోసిన ఆంబోతులాగా ఊరిమీద పడి తిరగడం ఆపి తల్లిదండ్రుల్ని పెళ్ళాం పిల్లల్ని కాస్త పట్టించుకోండి. మీకు మంచి జరుగుతుంది.

రెమెడీ :- పనులు మొదలుపెట్టడం పూర్థి చెయ్యలేకపోవడం, లోలోపల భయాలు, కంఫర్ట్ ను ఎక్కువగా కోరుకోవడం మీ లోపాలు. వీటిని వదుల్చుకోండి.

మిథునరాశి

ఎంతసేపూ ఎదుటివారి వ్యవహారాల్లో వేలు పెట్టడం తగ్గించండి. మీ పని మీరు చేసుకోండి. ఊరకే వసపిట్టలా వాగుడు ఆపి మౌనం పాటిస్తే మీకు మంచిది.

రెమెడీ :- గాలివాటుగా బ్రతికెయ్యడం, అతిగా సోషలైజ్ అవడం, పదిపనులు ఒక్కసారే పెట్టుకోవడం మీ బలహీనతలు. వీటినే మీ బలాలుగా మార్చుకోండి.

కర్కాటక రాశి

బీచిలో పీతలాగా పక్కదాటు వైఖరి ఆపి, సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోండి. స్వార్ధం తగ్గించుకుని ఇతరులకు కాస్త సాయం చెయ్యండి. పైకొస్తారు.

రెమెడీ :- నిలకడ లేకపోవడం, స్వార్ధం, ఆకర్షణలకు తేలికగా లోబడటం మీ బలహీనతలు. వీటిని జయించండి.

సింహరాశి 

దురహంకారం తగ్గించుకుని మానవత్వం పెంచుకోండి. భజన బృందాలకు దూరంగా ఉండండి. బాగుపడతారు.

రెమెడీ :- పొగడ్తలకు ఉబ్బిపోవడం, మీ గురించి గొప్పగా ఊహించుకోవడం, నలుగురికోసం బ్రతకడం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి.

కన్యారాశి

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూచి మోసపోకండి. మీ కాళ్ళమీద మీరు నిలబడే ప్రయత్నం చెయ్యండి. ఇదే మీకు రాజబాట.

రెమెడీ :- ఇతరులమీద ఎక్కువగా ఆధారపడటం, అందరినీ త్వరగా నమ్మడం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి.

తులారాశి

ఎంతసేపూ ఎదుటివారిని అంచనా వేసి, తీర్పులు తీర్చే పని ఆపి, ఆత్మవిమర్శ చేసుకుంటూ మీ సంగతేంటో మీరు చూసుకోండి.  బాగుంటుంది.

రెమెడీ :- విలాసాల మోజులో పడటం, ఎల్లకాలం ఈ రోజులాగే ఉంటుందని భ్రమించడం, లోకాభిప్రాయానికి మితిమీరిన విలువ ఇవ్వడం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి.

వృశ్చికరాశి

మీ దగ్గర తేలుకొండి ఉంటె ఎదుటివారి దగ్గర చెప్పు ఉందని మర్చిపోకండి. కుళ్ళు, కుట్రలు తగ్గించుకుని స్వచ్చంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. మంచి మార్పు వస్తుంది.

రెమెడీ :- రహస్య అజెండాలు లోలోపల ఉంచుకోవడం, బయటకు వేరేగా కన్పించడం, అతిస్వార్ధం, మాటకు కట్టుబడకపోవడం, నమ్మినవారిని మోసం చెయ్యడం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి.

ధనూరాశి

ఎంతసేపూ ఎదుటివారిలో తప్పులు వెదకడం, ఎదుటివారిని నిందించడం మానేసి, మీ తప్పులు మీరు వెదుక్కొని వాటిని సరిదిద్దుకోండి. బాగుపడతారు.

రెమెడీ :- మీగురించి ఎక్కువగా ఊహించుకోవడం, ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం, అందరూ మీ ట్యూన్ కే డాన్స్ చెయ్యాలని కోరుకోవడం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి.

మకరరాశి

మూర్ఖపు పట్టుదలలు, ఉడుంపట్లు మానేసి, కాస్త రెండుపక్కలా ఆలోచించే మంచి అలవాటు చేసుకోండి. ఎదుటివారు కూడా మనుషులే అని గుర్తుంచుకోండి. శాంతి కలుగుతుంది.

రెమెడీ :- ఊగిసలాట మనస్తత్వం, డిప్రెషన్ కు తేలికగా గురికావడం, అసవసరమైన చోట్ల పనికిరాని పట్టుదలలు మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి.

కుంభరాశి

ఓవర్ సెంటిమెంట్ తగ్గించుకోండి. లోకం కోసం బ్రతకడం మానేసి మీకోసం బ్రతకడం మొదలు పెట్టండి. మీ శక్తికి మించి ఇతరులకు సాయం చెయ్యకండి. మీకు మంచి జరుగుతుంది.

రెమెడీ :- మిమ్మల్ని మీరు మర్చిపోవడం, అనవసరంగా గిల్టీగా ఫీలవడం, ఎదుటివారికి సాయం చెయ్యడానికి ఎంత దూరమైనా పోవడం మీ బలహీనతలు. వీటిని వదుల్చుకోండి.

మీనరాశి

అనవసరమైన ఆదర్శాలకు పోయి ఉన్నది పోగొట్టుకోకండి. తేలికగా మోసపోయే లక్షణాన్ని మార్చుకోండి. అతిమంచితనం పనికిరాదని గుర్తుంచుకోండి. బాగుపడతారు.

రెమెడీ :- నేలను వదిలి ఊహల్లో బ్రతకడం, లోకాన్ని మార్చాలని చూడటం, సిద్ధాంతాల ఊహల్లో ఎప్పుడూ విహరిస్తూ ఉండటం మీ బలహీనతలు. వీటిని మార్చుకోండి.

ఈ ఉగాదికే కాదు ఏ ఉగాదికైనా ఇవే ఫలితాలుంటాయి. చెప్పినవిధంగా మారే ప్రయత్నం చేయండి. దీనికి మీకొక జీవిత కాలం పట్టచ్చు. ఎందుకంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం అంత సులభం కాదు మరి !

ఇకమీద ఉగాది ఫలితాలని నన్నడక్కండి. సరేనా !

బెస్టాఫ్ లక్ !!