Pages - Menu

Pages

10, ఏప్రిల్ 2018, మంగళవారం

మీ పాటలు వేరే బ్లాగ్ లొ పెట్టండి

నా బ్లాగ్ పాఠకులలో కొందరు ఆధ్యాత్మికత కోసమే చదివే వారుంటారు. కలగూరగంప లాంటి నా బ్లాగ్ వారిలో అనేక విరుద్ధ భావాలను కలిగిస్తూ ఉంటుంది. పాపం వారిలో కొంతమంది నాకు మంచిగానే కొన్ని సలహాలను ఇవ్వబోతూ ఉంటారు. అలాంటి వారినుంచి నాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. అలాంటివాటిలో తరచుగా నాకోచ్చే మెయిల్ ఇది.

'మీరు ఆధ్యాత్మికత మీద చాలా బాగా వ్రాస్తూ ఉంటారు. కానీ మీ బ్లాగులో పాటలు కూడా పాడి పెడుతూ ఉంటారు. అవి మాకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఈ ఆధ్యాత్మికత పక్కనే అలాంటి పాటలు వినాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనుక మా సలహా ఏమంటే, మీ పాటల వరకు ఇంకో బ్లాగ్ తయారు చేసుకోండి. అందులొ ఆ పాటల్ని పెట్టుకోండి.'

పాపం వీరి పాయింట్ నాకు చక్కగానే అర్ధం అయింది. అందరికీ వ్యక్తిగతంగా జవాబు ఇవ్వలేను గనుక బ్లాగు ముఖంగా ఈ పోస్ట్ అన్నమాట !

ఆధ్యాత్మికత అంటే ముందుగా మీ అభిప్రాయం మార్చుకోండి. అది ఏదైనా కావచ్చు గాని సరియైన దృక్కోణం మాత్రం కాదని నేనంటాను. మడి కట్టుకుని పూజామందిరంలో కాసేపు చేసే పూజ మాత్రమే ఆధ్యాత్మికత అనే భావానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. నేను నమ్మేది, ఆచరించేది, నా శిష్యులకు నేర్పించేది  అయిన ఆధ్యాత్మికత - జీవితంలో ఒక ముక్క కాదు. కాసేపు చేసే పార్ట్ టైం ఉద్యోగం కాదు. నా ఆధ్యాత్మికత నా జీవితం మొత్తాన్నీ ఆవరించి ఉంటుంది. పూజామందిరంలో ఉన్నప్పుడు నేనెలాంటి స్థితిలో ఉంటానో టాయిలెట్లో ఉన్నపుడు కూడా అలాటి స్థితిలోనే ఉండటానికి ఇష్టపడతాను. నా ఆధ్యాత్మికతను చిన్న మాటల్లో చెప్పాలంటే ఇంతే !

పాటలు పాడినంత మాత్రానా, ఆటలు ఆడినంత మాత్రానా జారిపోయే ఆధ్యాత్మికత అసలు ఆధ్యాత్మికత కాదని నేనంటాను. పాటలు పాడటం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అదొక కళ. అన్ని కళలూ జగన్మాత వరాలే. దానిని సక్రమంగా చూడటమూ సక్రమంగా వాడుకోవడమూ నిజమైన ఆధ్యాత్మికత అని నేనంటాను.

నిజానికి నా పాటలను, అవి సినిమా పాటలైనా సరే, మనసు పెట్టి వింటే మిమ్మల్ని ధ్యానపు లోతుల్లోకి తప్పకుండా తీసుకుపోతాయి. అవి మిమ్మల్ని వెంటాడతాయి. కొన్ని రోజులపాటు వాటిని హమ్మింగ్ చెయ్యకుండా మీరుండలేరు. ఎంతో మంది నాకు మెయిల్స్ ఇస్తూ చెప్పిన, చెబుతున్న మాట ఇది ! 

ఎందుకంటే అవి ఉత్త గొంతుతో పాడిన పాటలు కావు. మనసుతో పాడిన పాటలు కాబట్టి !

అసలైన ఆధ్యాత్మికత దేనినీ కాదనదు. నిమ్నత్వాన్ని తప్ప ! అత్యున్నత స్థాయిలలో నిమ్నత్వాన్ని కూడా అది కౌగలించుకుంటుంది. అలాంటప్పుడు తక్షణ తన్మయత్వాన్నీ, ఔన్నత్యాన్నీ ఇచ్చే సంగీతం ఆధ్యాత్మికత కాకుండా ఎలా ఉంటుంది మరి?

ఇప్పుడైనా అర్ధమైందా అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో?