నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, ఏప్రిల్ 2018, శుక్రవారం

బ్రహ్మజ్ఞానులకు రేప్ తప్పు కాదా? ఇదేం వక్రభాష్యం?

బ్రహ్మజ్ఞాని అయినవాడు రేప్ చేసినా తప్పు లేదని వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ అన్నట్లు అతని కారు డ్రైవరూ, బాడీ గార్డూ మొదలైన డ్యూటీలు చేసిన ఒకతను కోర్టులో వాజ్మూలం ఇచ్చాడు. ఈ మొత్తం గోలలో నిజానిజాలేమిటో మనకు తెలియదు గాని, కోర్టు ఆశారాం బాపూను దోషిగా నిర్దారించినందువల్ల అది నిజమేనని భావిస్తూ కొన్ని మాటలు చెప్పదలచుకున్నాను.

ఈ మాటతో నేనూ ఏకీభవిస్తున్నాను. నిజమే ! బ్రహ్మజ్ఞాని అయినవాడు రేప్ చేసినా వాడికి ఏమీ పాపం అంటదు. అది తప్పు కాదు. భగవద్గీత కూడా ఇదే భావాన్ని 'చంపినా అతడు చంపనివాడే' అంటూ ఇంకో రకంగా చెప్పింది.

కానీ విషయం ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఆగిపోదు. ఇది సగం మాత్రమె. ఇందులో ఇంకో సగం స్టేట్మెంట్ బాకీ ఉంది.

అదేంటంటే, నిజంగా బ్రహ్మజ్ఞాని అయినవాడు, తనకు ఉరిశిక్ష పడినప్పుడు కూడా, తనను ఉరికంబం ఎక్కిస్తున్నపుడు కూడా, మెడకు ఉరి బిగిస్తున్నపుడు కూడా, చివరకు ఉరి తీస్తున్నపుడు కూడా మనస్సులో ఏ విధమైన చలనమూ లేకుండా అదే ప్రశాంతతతో అదే నిర్లిప్తతతో అదే నిబ్బరంతో ఉండగలిగితే - అప్పుడు మాత్రమె ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. తను ఇంకొకరిని చంపుతున్నపుడు మాత్రమె కాదు, తనను ఇంకొకరు చంపుతున్నపుడు కూడా అదే చిరునవ్వుతో అదే సమదృష్టితో అదే స్థిరచిత్తంతో ఉంటె, అదీ బ్రహ్మజ్ఞానం. అంతేకాని ఊరకే నాలుగు శ్లోకాలు బట్టీ పట్టి, టీవీల్లో ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం రాదు - రాబోదు.

రమణ మహర్షికి కేన్సర్ వచ్చింది. రామకృష్ణునికి కేన్సర్ వచ్చింది. వాళ్ళేమీ చలించలేదు. సుఖంలో ఎలా ఉన్నారో బాధలో కూడా అలాగే చెదరకుండా ఉన్నారు.

రమణ మహర్షి చేతికి వచ్చిన కేన్సర్ పుండు ఒకరోజున పగిలి దానినుంచి భయంకరంగా రక్తం కారుతున్నది. దానిని చూచిన భక్తులు భరించలేక ' భగవాన్ ! ఏంటిది? ఇలా రక్తం కారుతోంది? మీరీ బాధను ఎలా భరిస్తున్నారు?' అని ఏడుస్తూ అడిగితే దానికి మహర్షి  నవ్వుతూ - 'దానికేమి? నా దగ్గరికి మీరెలా వచ్చారో అదీ అలాగే వచ్చింది. ఉండనివ్వండి. చూడండి! చేతికి మాణిక్యాలూ కెంపులతో హారం పెట్టుకున్నట్లు ఎంత సుందరంగా ఎర్రగా ఉందో?' అన్నారట ! ఆ అడిగినవారికి బంగారం మీదా కెంపుల మీదా మోజు ఉండి ఉంటుంది. అందుకే మహర్షి అలా చమత్కరించారు.

శ్రీరామకృష్ణులకు గొంతు కేన్సర్ వచ్చింది. ఆహారం తినలేకపొతున్నారు. ద్రవపదార్ధాలు కూడా మ్రింగలేకున్నారు. ఆహారం స్వీకరించి నెలరోజులైంది. చిక్కి ఎముకలగూడుగా మారిపోయారు. ఆ బాధ చూచి భరించలేక ఏడుస్తున్న భక్తులతో - "ఎందుకు ఏడుస్తున్నారు? ఈ ఒక్క నోటితో తినకపోతే ఏమైంది? మీ అందరి నోళ్ళతో తింటున్నాను కదా?' అని నవ్వుతూ అన్నారాయన!

అసలేమిటా స్థితి!! మనబోటి మానవమాత్రుల ఊహకైనా అందుతుందా ఆ స్థితి?

తన గుడారంలోకి చెప్పకుండా వచ్చాడని సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీ స్వామి చేతిని నరికేశాడు ముస్లిం సేనాపతి. స్వామికి దేహస్ప్రుహ లేదు. నరికింది తనను కాదు అన్నట్లు నిర్లిప్తంగా చూచి రక్తం కారుతున్న సగం చేతితో అలా నడుచుకుంటూ శిబిరంలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆయన !

వారు నిజమైన బ్రహ్మజ్ఞానులు !!

అంతేగాని ఏసీ ఆశ్రమాలలో ఉంటూ, రాజభోగాలు అనుభవిస్తూ, మాయ మాటలు చెబుతూ జనాన్ని మోసం చేస్తున్న నేటి దొంగగురువులు ఆ మాటకు ఏమాత్రం తగరు.

ఆశారాం బాపూ ఈ మాట అన్నది నిజమే అయితే, మరి కోర్టులో జడ్జి తీర్పు వెలువరిస్తున్నపుడు కన్నీటి పర్యంతమైపోయి, 'ఏదో ఒకటి చెయ్యండి. నన్ను బయటపడేయ్యండి ' అంటూ లాయర్లను ప్రాధేయపడవలసిన అవసరం లేదు. అక్కడే అతని డొల్లతనం బయట పడుతున్నది.

బ్రహ్మజ్ఞాని అయినంత మాత్రాన అనైతిక ప్రవర్తన ఉండదు. నిజమైన బ్రహ్మజ్ఞాని నీతిగా ఉంటాడు. చెప్పినదే చేస్తాడు. చేసేదే చెబుతాడు. మాయమాటలూ, నాటకాలూ అతని వద్ద ఉండవు.

శ్రీ రామకృష్ణులన్న మాట ఒకటి నాకు ఈ సందర్భంలో గుర్తుకు వస్తున్నది.

'సంగీతంలో ప్రజ్ఞ ఉన్నవాడు అపస్వరం పలకడు. నాట్యంలో ప్రజ్ఞ ఉన్నవాడు తప్పటడుగు వెయ్యడు' అన్నారాయన.

ఎంత గొప్ప మాట !

ఆదిశంకరుల జీవితంలోనూ, త్రిలింగస్వామి జీవితంలోనూ జరిగిన ఒక సంఘటన ఉన్నది. వారు ఒకరోజున సారాయి త్రాగారని శిష్యులు కూడా సారాయి త్రాగడం మొదలు పెట్టారట. ఒకరోజున మరుగుతున్న సీసం తీసుకుని సారాయిని త్రాగినట్లే వారు త్రాగారట. అది చూచి శిష్యులు బిత్తరపోయి, ఆ పని చెయ్యలేక, బుద్ధి తెచ్చుకున్నారని ఒక కధ చెబుతారు.

బ్రహ్మజ్ఞానం అనేది సారాయి త్రాగినప్పుడు మాత్రమె కాదు, కరిగిన సీసాన్ని త్రాగినప్పుడు కూడా కనిపించాలి. అలాగే రేప్ చేసినప్పుడు మాత్రమె కాదు, తనకు ఉరి పడినప్పుడు కూడా అది కనిపించాలి. అప్పుడు ఒప్పుకోవచ్చు అది నిజమైన బ్రహ్మజ్ఞానమే అని.

సత్యమేమంటే - బ్రహ్మజ్ఞాని అయినవాడికి రేప్ చెయ్యాలన్న ఆలోచన అసలు రాదు. రేప్ సంగతి అలా ఉంచితే, ఒక అమ్మాయి ఇష్టపడి తనవద్దకు వచ్చినా అతనా పని చెయ్యడు గాక చెయ్యడు. ఎందుకని?

బ్రహ్మజ్ఞానికి ద్వంద్వం ఉండదు. తను తప్ప వేరొకటి అతనికి ఈ సృష్టిలో ఎక్కడా కనపడదు. ఎటు చూచినా తాను తప్ప వేరేది కనపడని వాడు ఇక అంత చండాలంగా ఎలా ప్రవర్తించగలడు? అది జరిగే పని కాదు.

శ్లో|| నా విరతో దుశ్చరితా నాశాంతో నా సమాహిత:
నాశాంత మానసో వాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్ ||

అంటుంది యజుర్వేదాన్తర్గతమైన కఠోపనిషత్తు. ఏమిటి దీనర్ధం?

"ప్రపంచ భోగాలంటే విరక్తి లేనివాడు, చెడు ప్రవర్తన కలిగినవాడు, శాంతి లేనివాడు, నిశ్చలమైన మనస్సు లేనివాడు - ఇలాంటి వాడు ఎన్నటికీ జ్ఞానాన్ని పొందలేడు". అని వేదమే చెబుతున్నది.

నేను వ్రాసిన 'శ్రీవిద్యారహస్యం' అనే పుస్తకంలో 'మాయ గురువులు- మాయను దాటించే గురువులు' అనే అధ్యాయంలో ఇదే పాయింట్ ఎన్నోచోట్ల వ్రాశాను. నేటి గురువులలో చాలామంది మాయగురువులే అని నొక్కి మరీ చెప్పాను. ఈ విషయం ప్రతిరోజూ రుజువౌతూనే ఉన్నది.

ఆశారాం బాపూకు ఇండియాలోనే 200 ఆశ్రమాలున్నాయట. వాటిని నమ్మి ఆయా ఊర్లలో ఎన్ని వేలమంది ఇతనికి మూర్ఖభక్తులుగా ఉన్నారో ఇప్పుడు వారి గతి ఏమిటో ఆ దేవునికే ఎరుక !!

కలియుగంలో మాయశిష్యులు ఎక్కువ అందుకే మాయ గురువులూ ఎక్కువే. 'మహిమలు చేసే దొంగ బాబాలనూ, మాయమాటలు చక్కగా చెప్పే దొంగ గురువులనూ నమ్మితే అధోగతే, నమ్మకండి!' అని నేను దాదాపు పదేళ్ళనుంచీ చెబుతున్నాను. ఇది సత్యం అని ప్రతిరోజూ రుజువౌతున్నది.

రేప్ అనేది ఎవడు చేసినా తప్పే ! అందులోనూ ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల్సిన గురువులు చేస్తే అది మామూలు తప్పు కాదు ! క్షమించరానంత ఘోరమైన తప్పు !!

ప్రపంచం మాయ అని వేదాంతం అంటుంది. నేటి ఆధ్యాత్మిక ప్రపంచం కూడా అంతకంటే పెద్దమాయ అని అనుభవం చెబుతున్నది. సత్యాన్వేషి అయినవాడు ఇలాంటి దొంగ స్వాముల, దొంగ గురువుల మాయలో పడరాదు. పడితే వాడి పని అధోగతే అన్నది అసలైన సత్యం !!

ఊరకే మాటలు చెప్పినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం వస్తుందా పిచ్చి కాకపోతే?