నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

2, మే 2018, బుధవారం

ఆర్నెల్లపాటు మకరరాశిలో కుజసంచారం - ఫలితాలు

మీరు కొన్నాళ్ళుగా వాయిదా వేస్తున్న పనిని నిన్నా ఈరోజులలో మొదలు పెడతారు. చేసిఉంటారు. మీ జీవితాలలో పరిశీలించి చూచుకోండి. నిన్నా ఈ రోజులలో మీరు చేసిన చేస్తున్న పనులను గమనించి చూడండి. అవి చిన్నచిన్న పనులే కావచ్చు. ఎవరికైనా ఫోన్ చెయ్యడమో, లేకపోతే మెయిల్ ఇవ్వడమో, లేదా ఇలాంటిది ఏదో ఒక చిన్న పనే కావచ్చు. అవి మీరు చాలా రోజులనుంచీ వాయిదా వేస్తున్నవై ఉంటాయి. కానీ తప్పకుండా నిన్నా ఈరోజులలో ఆపనులను మీరు చేసి ఉంటారు. మీ జీవితాలను గమనించండి. నేను చెబుతున్న దానిలో నిజం మీకే అర్ధమౌతుంది.

దీనికి కారణం మీ పైన కుజుని ప్రభావం! దీనివల్ల మీలో ఉన్నట్టుండి ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

ఈ రోజు సాయంత్రం 4.30 ప్రాంతంలో కుజుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ నవంబర్ 6 వ తేదీ వరకూ, అంటే ఆర్నెల్లపాటు ఉండబోతున్నాడు. సామాన్యంగా నలభై రోజులలో ఒక రాశిని దాటవలసిన ఆయన ఆర్నెల్లు అక్కడే ఉంటున్నాడు. దీనినే 'స్తంభన' అంటారు. దానికి కారణం మధ్యలో ఆయనకు వస్తున్న రెండు నెలల వక్రత్వం, మందగతి వగైరాలు. ఈ ఆర్నెల్ల కాలంలో ఆయన ఇప్పటికే మకరరాశిలో ఉన్న కేతువుతో కలసి సంచరిస్తాడు. 

మకరంలో ఉన్న కేతువు, స్వక్షేత్రంలో ఉన్న శనీశ్వరుడిని సూచిస్తున్నాడు. సహజంగా కేతువు కుజుడిని సూచిస్తాడు. కానీ ఇక్కడ ఆయనకు డబల్ రోల్ వచ్చింది. అందులోనూ కుజునికి పరమశత్రువు అయిన శనీశ్వరుడయ్యాడు. అంటే, కేతువు రెండు పరస్పర శత్రువుల పాత్రలను పోషించాలి. అంటే తానొక స్ప్లిట్ పర్సనాలిటీగా మారాలి. ఇది మంచి సూచన కాదు.

ఈ ఆర్నెల్ల కాలం ప్రపంచంలో అనేక మార్పులను తేబోతున్నది. వాటిలో కొన్నింటిని ఇక్కడ సూచిస్తున్నాను.

  • నిన్న వచ్చిన అకాలవర్షాన్ని అది మిగిల్చిన నష్టాన్ని గమనించండి. ఉన్నట్టుండి అదెందుకొచ్చింది? అందులోనూ ఈ మండువేసవిలో?
  • ఉన్నట్టుండి నిన్న సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ఉరుములు పిడుగులతో హోరువాన వచ్చి గుంటూరు విజయవాడలలో పిడుగులు పడి దాదాపు 20 మంది చనిపోయారు. ఏంటిది?
  • నిన్న కుజుని ఆధిపత్యంలో ఉన్న మంగళవారం అయింది. గమనించండి.
  • ఈ అకాలవర్షమూ, ఉరుములూ, పిడుగులూ, అవి మిగిల్చిన వ్యవసాయ నష్టాలూ, ప్రకృతి కన్నెర్ర చెయ్యడమూ ఇదంతా కాకతాళీయం కాదు. రాబోయే ఆర్నెల్లకాలంలో జరుగబోతున్న వాటికి ఇవి సూచన మాత్రమే. 
  • ఒక్కరోజులో (నేడు) జరుగబోతున్న కుజుని మకరరాశి ప్రవేశమే ఈ తాత్కాలిక విలయానికి కారణం.
  • కుజుడు ఎలక్ట్రికల్ ఎనర్జీకి కారకుడన్న విషయం గుర్తుంటే, నిన్న అకస్మాత్తుగా వచ్చిన ఉరుములు పిడుగులు గాలివానా ఎందుకు వచ్చాయో అర్ధమౌతుంది.
  • ఇకపోతే, ఈ ఆర్నెల్లకాలంలో ఏం జరుగబోతున్నాయో చూద్దాం.
  • ప్రతిమనిషిలోనూ అహంకారం పెరిగిపోతుంది. ప్రతిదానికీ పక్కవాళ్ళతో వాదనలు, గొడవలు, తగాదాలు జరుగుతాయి. నేనే కరెక్ట్ అన్న ధోరణి బాగా పెరుగుతుంది. దానివల్ల పక్కవారితో గొడవలు వస్తాయి. 
  • వాతావరణమూ ప్రకృతీ మనిషిని బాగా దెబ్బతీస్తాయి. పంటలు దెబ్బ తింటాయి. భూవివాదాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ ఒక స్థిరత్వం లేకుండా అనేక ఒడుదుడుకులకు లోనౌతుంది. దీనిలో పడి ఎంతోమంది డబ్బు నష్టపోతారు.
  • వృత్తి వ్యాపారాలలో అనేకమంది జీవితాలలో ఊహించని అనేక మార్పులు వస్తాయి.
  • ఒకసారి ఎక్కువ ఉత్సాహం, దాని వెంటనే అంతకు రెట్టింపు డిప్రెషన్ చాలామందిలో చూడవచ్చు.
  • దూకుడుగా ముందుకు వెళ్లేవారికి అనుకోని ఎదురుదెబ్బలు తగలడం ఈ సమయంలో దాదాపు ప్రతిరోజూ మీరు చూడవచ్చు.
  • ప్రపంచవ్యాప్తంగా హింస పెరుగుతుంది. దేశాల మధ్యా, దేశానికీ దాని పౌరులకూ మధ్యా జరిగే యుద్ధాలలో అనేక మంది చనిపోతారు.
  • భూకంపాలు వచ్చి అనేకమందిని కబళిస్తాయి. అనేక మంది నిరాశ్రయులౌతారు. బయటపడిన వాళ్ళు మానసిక స్థైర్యాన్ని కోల్పోతారు.
  • నాయకులే దొంగలౌతారు. మాయమాటలతో ప్రజలను నమ్మిస్తారు. ప్రజలు వంచించబడతారు.
  • మొబైల్, ఎలక్ట్రానిక్ రంగాలు సామాన్య ప్రజలకు మరింత దగ్గరౌతాయి. అనేక ఇతర సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
  • యధావిధిగా ఈ ఆర్నెల్లు కూడా, యాక్సిడెంట్లు, అసహజ మరణాలు కొనసాగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే, గత రెండు నెలలకంటే కూడా ఈ సమయంలో ఇంకా ఎక్కువౌతాయి.
  • అవినీతిపరులు ఎక్కువౌతారు. అనైతికత కూడా ప్రజలలో ఎక్కువౌతుంది.
  • అయితే - ఈ యోగం అందరికీ అంతా చెడే చెయ్యదు. వారివారి జాతకాలను బట్టి చాలామందికి అద్భుతమైన మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి. ఎంతో మంది జీవితాలు వారు ఊహించిన విధంగా సెటిల్ అవుతాయి కూడా.
  • కానీ జనరల్ గా ప్రపంచవ్యాప్తంగా మాత్రం చెడు జరుగుతుంది. చెడుకర్మ పోగేసుకుని ఉన్నవారికి ఈ కాలంలో భయంకరమైన శిక్షలు పడతాయి, ఈ శిక్షలు పడేది మానవ న్యాయస్థానాలలో కాదు, దైవన్యాయస్థానంలో, ప్రకృతి న్యాయస్థానంలో అవి పడతాయి. మనిషి వాటినుంచి తప్పుకోలేడు. 

జూన్ 28 నుంచీ ఆగస్ట్ 25 దాకా కుజుడు వక్రస్తితిలో సంచరిస్తాడు. ఈ ఆర్నెల్ల కాలంలో, ప్రపంచానికి ఇది చాలా చెడుకాలం అని చెప్పాలి. ఈ రెండునెలల కాలం చాలామందిని కబళిస్తుంది.

చదువరులను భయపెట్టడానికి ఈ సూచనలు ఇవ్వడం లేదు. మనిషిని అంతిమంగా రక్షించేది నీతి మాత్రమేననీ, అందుకనే నిత్యజీవితంలో నీతిగా జాగ్రత్తగా పద్దతిగా ఉండమని చెప్పడమే నా ఉద్దేశ్యం.