నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, మే 2018, మంగళవారం

అన్ని మంత్రాలలోకీ గొప్ప మంత్రం ఏది?

మంత్రశాస్త్రంలో అనేక వేల మంత్రాలున్నాయి. వాటిల్లో దేనికదే గొప్ప అని ఆయా మంత్రాలు అనుష్టానం చేసేవారు అనుకుంటూ ఉంటారు. వైష్ణవులూ, శైవులూ, శాక్తేయులూ ఇలా ప్రతివారూ వారివారి మంత్రాలే గొప్ప అనుకుంటూ ఉంటారు. వీరిలో ఎవరికి వారే గొప్ప కావచ్చు. కానీ ఈ అన్నింటినీ మించిన చాలా సింపుల్ మంత్రం ఒకటుంది. అదేంటో చెప్పబోయే ముందు, ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన గురించి వినండి.

మొన్న ఒకరోజున మధ్యాన్నం పూట ఒక ఫోనొచ్చింది. ఏదో కొత్త నంబర్. సందేహిస్తూ 'హలో' అన్నాను.

'నాపేరు ఫలానా శర్మ అంటారు. నేను సంస్కృతంలోనూ తెలుగులోనూ పండితుణ్ణి' అన్నాడు ఒకాయన.

'సరే. నమస్తే.' అన్నాను.

'నమస్తే. మీరు వ్రాసిన 'శ్రీవిద్యా రహస్యం' చదివాను. ఒక్కసారి కాదు. చాలాసార్లు చదివాను. విషయం చాలా బాగుంది. అద్భుతంగా చెప్పారు. కానీ పద్యాలలో ఛందస్సు చాలాచోట్ల తప్పింది' అన్నాడాయన.

'అలాగా. సరే' అన్నాను.

నాకు వినపడలేదనుకున్నాడేమో, ఇంకా కొంచం గట్టిగా 'మీరు వ్రాసిన పద్యాలలో యతినియమమూ, చందస్సూ తప్పాయి చాలావాటికి' అన్నాడు.

'అవునా. సరే' అన్నాను మళ్ళీ.

'ఛందస్సు అంటే దేవతాస్వరూపం కదండీ? అలా వాటిని మార్చి వ్రాసేస్తే ఎలా?' అన్నాడాయన.

'అలాగా ! సరే' అన్నాను మళ్ళీ.

'ఒక ప్రముఖ వ్యక్తి గారున్నారు. ఆయన ఏకంగా రామాయణాన్నే తెలుగులో వ్రాశారు. కానీ పద్యాలలో అన్నీ ఛందోదోషాలే. ఏం చేస్తాం ! ఆయన పెద్దవాడు కాబట్టి చెలామణీ అయిపోయింది' అన్నాడు బాధగా.

'అవునా. అయ్యో పాపం' అన్నా నేనుకూడా బాధగానే.

'మీరు కూడా అలాగే వ్రాశారు. అన్ని తప్పులుంటే ఎలాగండి?' అంది స్వరం బాధనూ విసుగునూ కలిపి.

పాటలు పాడీ పాడీ మనకూ కొద్దో గొప్పో మిమిక్రీ వచ్చు గనుక, నేను కూడా అదే పాళ్ళలో బాధనూ విసుగునూ నా స్వరంలో ధ్వనింపజేస్తూ - 'అంతే కదండీ మరి?' అన్నాను.

అవతలవైపునుంచి కొంచం సేపు నిశ్శబ్దం ధ్వనించింది.

'నేను చెప్పేది మీకు వినిపిస్తోందా అసలు?' అడిగాడాయన కొంచం అనుమానంగా.

'చక్కగా వినిపిస్తోంది. చెప్పండి' అన్నాను నేను పెద్దగా అరుస్తూ.

'ఆ ! అదే ! మీ పుస్తకం చాలా బాగుంది. విషయ గాంభీర్యంలో అద్భుతంగా ఉంది గానీ పద్యాలలో ఛందస్సు అక్కడక్కడా తప్పింది ఇదే కాస్త లోపం' అన్నాడాయన మళ్ళీ.

'అలాగా. సరే' అన్నా నేను మళ్ళీ.

నాకు సరిగా వినిపించడం లేదని ఆయనకు గట్టిగా అనుమానం వచ్చేసింది. మళ్ళీ మొదట్నించీ మొదలుపెట్టి ' నాపేరు ఫలానా శర్మ' అని మొత్తం మళ్ళీ చెప్పిందే చెప్పుకుంటూ వచ్చాడు.

ఆయన చెప్పిన ప్రతిమాటనూ మళ్ళీ ఓపికగా వింటూ నేను, ప్రతిమాటకీ ' సరే, సరే ', 'అలాగా' 'అయ్యో పాపం' అంటూ వచ్చా యధావిధిగా.

రికార్దంతా మళ్ళీ వేశాక నాకు ఖచ్చితంగా చెవుడని ఆయనకు పెద్ద అనుమానం వచ్చినట్లుంది. ఇక వీడితో మనకెందుకులే కంఠశోష  అనుకున్నాడో ఏమో 'సరేనండి ఉంటా' అంటూ ఫోన్ పెట్టేశాడు.

నేను నవ్వుకుంటూ ఉండిపోయాను.

ఇప్పుడర్ధమైందా అన్ని మంత్రాలలోకీ గొప్ప మంత్రం ఏంటో?

'సరే' మంత్రం.

ఇది నేను చెప్పిన మాట కాదు. జిల్లెళ్ళమూడి అమ్మగారు చెప్పిన మాట. ఈ విధంగా అన్నింటికీ 'సరే'నంటే ఏ బాధా ఉండదు మనకు. ఇలా కాకుండా, 'నన్నూ నా పద్యాలనూ అంటాడా?' అని రోషం తెచ్చేసుకుని 'ఎక్కడ తప్పులున్నాయి? అవి ఎలా తప్పులయ్యాయి?' అంటూ ఆయనతో వాదన పెట్టుకుంటే ఇద్దరికీ బీపీలు పెరగడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. ఆయన అంటోంది మనల్ని కాదు, మన పద్యాలను కాదు అనుకుంటే ఏ సమస్యా లేదు. అసలాయన చెబుతోంది నాగురించి కాదు ఎవరో థర్డ్ పర్సన్ గురించి - అనుకుంటూ అన్నీ ఓపికగా విన్నా. 'సరే సరే' అనేవాడితో ఆయన మాత్రం చెప్పిందే ఎన్నిసార్లు చెబుతాడు? విసుగు రాదూ మరి !

ఈ ప్రపంచంలో ఎవరూ వారి పధ్ధతి మార్చుకోరు. ఎవడి గోల వాడిది. కాసేపు 'సరే' అంటే పోలా? ఆ తర్వాత ఎలాగూ ఎవరి దారిలోనే వారు పోతూ ఉంటారు కదా !

కొంచం కష్టమే ! కానీ అసాధ్యం మాత్రం కాదు. జీవితాన్నే కామెడీగా చూస్తే అంతా తేలికే. ఏమంటారు?