నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, జూన్ 2018, సోమవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 15 (కారణజన్ముడు యార్లగడ్డ భాస్కరరావన్నయ్య)

శ్రీ యార్లగడ్డ భాస్కరరావుగారు
ఈ ప్రపంచంలో ఎందఱో మనుషులు అనవసరంగా పుట్టి నిరర్ధకంగా జీవించి పురుగూ పుట్రల్లాగా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు. అందరూ తమ చేతనైనంతవరకూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ పంచభూతాలనూ పాడుచేసేవారే గాని తమ ఉనికితో వాటికి పవిత్రతను ఆపాదించేవారు బహు అరుదుగా ఉంటారు. అలాంటి మహనీయులు అవతార మూర్తులనబడతారు. అలాంటి దివ్యమూర్తులు ఈ భూమిమీదకు వచ్చినపుడు వారితోబాటు కొంతమంది వారి అంతరంగ భక్తులు ఈ భూమిమీదకు వస్తూ ఉంటారు. ఆయా మహనీయుల దివ్యలీలలో తమతమ పాత్రలు చక్కగా పోషిస్తారు. ఆ తర్వాత మౌనంగా నిష్క్రమిస్తారు.

వారికి లోకం మెప్పుతో పని లేదు. వారికి మనమిచ్చే బిరుదులూ గౌరవాలూ పొగడ్తలూ అవసరం లేదు. వాటిని వారు తృణప్రాయంగా చూస్తారు. అనవసరంగా మనలాగా వారు వేదికలెక్కి మాట్లాడరు. పెద్దపెద్ద ఉపన్యాసాలివ్వరు. పుస్తకాలు వ్రాయరు. వారి జీవితం ద్వారానే వారు మాట్లాడతారు. మౌనంగా జీవించినా నిరంతరం వారి జీవితం యోగమయమే. తపోమయమే. వారు మన మధ్యనే జీవించిన ఋషులు. అలా జీవించిన ఘనులు ఎందఱో ఉన్నారు. ఈనాటికీ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు యార్లగడ్డ బాస్కరరావుగారు.

ఈ మహాయోగి 12-4-2018 న తన 96 వ ఏట జిల్లెళ్లమూడిలో దేహత్యాగం చేసి అమ్మ పాదాల చెంతకు చేరుకున్నారు. ఈయన గురించి కొంత చెప్పుకుందాం. ఎందుకంటే, అనుకుంటే ఇలాంటి మనుషుల గురించే అనుకోవాలి. లోకంలోని మిగతా చెత్త గురించి ఎంత మాట్లాడుకున్నా కంఠశోష తప్ప ఉపయోగం ఏముంది?

తన చిన్నప్పుడు తన తాతగారైన చిదంబరరావుగారు అమ్మలోని దివ్యత్వాన్ని గమనించి 'అమ్మా! నీ చరిత్రను ఏ పండితుడు వ్రాస్తాడో?' అని అడిగితే ఆ చిన్నపిల్ల ఇలా అందిట.

'నా చరిత్రను పండితుడైన పామరుడు వ్రాయడు. పామరుడైన పండితుడు వ్రాస్తాడు'.

అమ్మ అప్పుడు చెప్పిన ఆ పామరుడైన పండితుడే మన యార్లగడ్డ భాస్కరరావన్నయ్య. అమ్మ జీవితచరిత్రను స్వయంగా అమ్మ చెబుతుండగా తన చేతులతో వ్రాసే భాగ్యం రైతుకుటుంబంలో పుట్టిన ఈ పామరునికి దక్కింది. ఎంత నిష్కల్మష హృదయుడో కదా ఆయన !

జన్మతః కమ్మవారి కుటుంబంలో పుట్టినా, 'జంధ్యం లేని బ్రాహ్మణుడురా మన భాస్కరుడు' అని అమ్మచేత అనిపించుకున్న ధన్యజీవి ఆయన ! నిరంతరం అమ్మ ధ్యానంతో బ్రాహ్మణత్వాన్ని ఋషిత్వాన్ని పొందిన పుణ్యాత్ముడాయన ! 

ఈ లోకంలో పండితులు ఎందఱో ఉంటారు. కానీ వారికందరికీ హృదయపవిత్రత ఉందా అంటే సంశయమే ! పామరులూ ఎందఱో ఉంటారు. వారందరూ నిజంగా పామరులేనా అంటే అదీ సంశయమే ! బయటకు మహాపాండిత్యం ఉండి, లోపల అనుభవం లేని పామరునిగా ఉంటే ఏం లాభం? దానికంటే, బయటకు ఏమీ తెలియని పామరునిగా ఉన్నా సరే, లోలోపల అనుభవజ్ఞానంతో నిండి ఉండటమే వాంఛనీయం కదా !

ఒక మనిషి విలువ అతడి హృదయపవిత్రతను బట్టేగాని అతడు పండితుడా పామరుడా అనేదాన్ని బట్టి రాదనేది ఏ నాటికీ చెరిగిపోని ఆధ్యాత్మిక సత్యం. హృదయపు ఔన్నత్యాన్నీ పవిత్రతనూ బట్టే ఒక మనిషి దైవానికి దగ్గరవడం లేదా దూరమవడం జరుగుతుంది గాని, తనకున్న తెలివిని బట్టి అలా జరగదు. అందుకేనేమో, రేపల్లె దగ్గర మారుమూల గ్రామం సింగుపాలెంలోని ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టిన భాస్కరరావన్నయ్యను తన చరిత్ర వ్రాయడానికి అమ్మ ఎంచుకుంది, ఎంతో మంది పండితులు తన చుట్టూ ఉండగా !

అమ్మ మీద పద్యాలు వ్రాసిన వారున్నారు. పాటలు వ్రాసినవారున్నారు.  పుస్తకాలు వ్రాసినవారున్నారు. వేదికలెక్కి మహోపన్యాసాలు చేసినవారున్నారు. 'నువ్వే జగజ్జననివి ఆదిశక్తివి' అని కీర్తించినవారున్నారు. వారిలో చాలామంది ఆ తర్వాత  జిల్లెళ్లమూడిని వదలి వారివారి దారులలో వెళ్ళిపోయారు. వారిలో కొందరు సొంత కుంపట్లు పెట్టుకున్నారు. కానీ ఏ కుంపటి జోలికీ పోకుండా, అమ్మను వదలకుండా, భక్తి అనే చల్లని అగ్నిలో తానే కాలి పునీతుడైన మనీషి భాస్కరన్నయ్య.

చివరిశ్వాసవరకూ జిల్లెళ్లమూడిని వదలకుండా అమ్మ నామాన్ని వదలకుండా, ఏ విధమైన పటాటోపాలు లేకుండా, భేషజాలు లేకుండా, మౌనంగా తపోమయజీవితాన్ని గడిపి, చెట్టున పండిన పండులా తన 96 ఏట రాలిపోయిన ధన్యజీవి భాస్కరరావన్నయ్య. యోగులంటే, ఋషులంటే, సిద్ధులంటే ఇలాంటివారు కాకపోతే మరెవరౌతారు?

శ్రీరామచంద్రుని దివ్యగాధను రామాయణంగా లోకానికి అందించే ధన్యత్వం వాల్మీకి మహర్షికి దక్కింది. ఆయన పుట్టుకతో బోయవాడు. కానీ పట్టుతో ఋషిత్వాన్ని సాధించిన ఘనుడు. ప్రాచీనకాలంలో ఎందఱో ఋషులున్నారు. వారిలో చాలామంది పేర్లు మనకు తెలియవు. కానీ వాల్మీకి మహర్షి పేరు భూమి ఉన్నంతవరకూ ఉంటుంది.

శ్రీకృష్ణుని లీలావిలాసాలను గ్రంధస్తం చేసే పరమభాగ్యం వ్యాసమహర్షికి దక్కింది. ఆయన మహాపండితుడు, మహాతపస్వి. మహాభక్తుడు, మహాజ్ఞాని. ఇన్ని మహత్తరమైన లక్షణాలున్నాయి గనుక ఆ అదృష్టం ఆయనకు పట్టింది.

శ్రీ రామకృష్ణుల వాక్కులను పుస్తకంగా వ్రాసే అదృష్టం మహేంద్రనాథగుప్త అనే ఒక మామూలు ఉపాధ్యాయునికి పట్టింది. ఆయన నిరహంకారి. తన గురువు వలె పరమశాంతుడు. నిరంతర ధ్యానచిత్తుడు. తన పేరును కూడా ఆ పుస్తకంలో వ్రాసుకోడానికి ఇష్టపడక రచయిత పేరు వ్రాయవలసిన చోట ఉత్త 'మ' అని మాత్రమే వ్రాసుకున్నాడు. అంతటి నిరహంకారి ఆయన ! 'శ్రీరామకృష్ణ కధామృతం' ఉన్నంతవరకూ మహేంద్రనాధగుప్త పేరు నిలిచి ఉంటుంది.

1960 ప్రాంతంలో అమ్మకు పూజ చేసుకుంటున్న ధన్యజీవులు
భాస్కరరావన్నయ్య దంపతులు
మళ్ళీ మన తరంలో చూస్తే, అమ్మ జీవితాన్ని వ్రాసే భాగ్యం యార్లగడ్డ భాస్కరరావన్నయ్యకు దక్కింది. నా దృష్టిలో ఈయన వ్యాస వాల్మీక మహేంద్రనాధుల కోవకు చెందిన మహనీయుడే. అమ్మ చెప్పినట్లుగా పామరుడైన పండితుడు. అమ్మ చరిత్ర ఉన్నంతవరకూ భాస్కరన్నయ్య పేరు ఈ లోకంలో నిలిచిపోతుంది.

అసలు పండితలక్షణం ఏమిటీ అని విచారిస్తే భగవద్గీత వైపు దృష్టి పోతుంది. ప్రసిద్ధమైన గీతాశ్లోకం ఏమంటున్నదో చూద్దాం!

"విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన:"
(శ్రీమద్భగవద్గీత - కర్మయోగాధ్యాయం - 5:18)

అనే శ్లోకంలో స్వయంగా భగవంతుడే పండిత లక్షణాన్ని వివరించాడు.

'విద్యా వినయములున్న బ్రాహ్మణుడినీ, ఆవునూ, ఏనుగునూ, కుక్కనూ, కుక్క మాంసం తినేవాడినీ కూడా పండితుడు సమదృష్టితో చూస్తాడు" అంటూ ఈ శ్లోకంలో చెబుతూ సమదృష్టి గలిగిన జ్ఞాని ఒక్కడే నిజమైన పండితుడు, అంతేగాని ఉత్త శాస్త్రజ్ఞానం ఉన్నవాడు పండితుడు కాడు అని భగవంతుడే చెప్పాడు. సమదర్శిత్వమే పండితలక్షణం గాని పాండిత్యం కాదన్న మహోన్నత భావం భగవద్గీతలో మనకు దర్శనమిస్తుంది.

ఈ సమదర్శిత్వం ఎలా వస్తుంది? ఊరకే అనుకుంటే అది రాదు. 'అందరూ ఒకటే' అని వేదికలెక్కి సోషలిస్ట్ కమ్యూనిష్ట్ ఉపన్యాసాలిస్తే అది రాదు. మన చుట్టూ ఉన్న అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తే అది ఒస్తుంది. అనుభవంతో అది వస్తుంది. దర్శనంతో అది వస్తుంది. అంతేగాని ఉత్త మాటలతో అది రాదు.

'అనేకత్వాన్ని చూడటమే అజ్ఞానం. ఏకత్వాన్ని చూడటం జ్ఞానం' అని శ్రీరామకృష్ణుల మహోపదేశం. అమ్మ కూడా అదే మాటను చెబుతూ, 'అనేకంగా ఉన్నవాటిల్లో ఏకత్వాన్ని చూడటమే బ్రహ్మత్వం' అని అన్నారు. అది సాధనా పరిపక్వతలో కలిగే స్థితేగాని ఊరకే చెప్పుకుంటే వచ్చే మాట కాదు.

వ్యాసవాల్మీకాది మహర్షులను మనం చూడలేదు. వారి గురించి చదివి వారి మహత్తర లక్షణాలను విని ఆశ్చర్యపోతూ ఉంటాం. మనకు ముందటి తరం వారైన మహేంద్రనాధగుప్త గురించి మనకు తెలుసు. ఆయనను చూచిన వారు ఆయనతో కలసి జీవించినవారు వ్రాసిన వాటిని బట్టి ఆయన ఎంతడి ఋషిపుంగవుడో మనం గ్రహించగలం. నిరంతరం ఆయనకు శ్రీరామకృష్ణుని స్మరణమే. ఆయన నోటివెంట ఇంకొక మాట రాదు. ఆయన మనస్సు ఇంకొక విషయం మీదకు పోదు. అలాంటి మహత్తర జీవితం ఆయనది. అందుకనే ఆయన్ను చూచిన అదృష్టం పట్టిన పరమహంస యోగానంద వంటి మహనీయులు ' ఆయన్ను చూస్తే, వేదకాలం నుంచి దిగి మన మధ్యకు వచ్చిన ఎవరో మహర్షియా అన్నట్లు ఉండేది' అని వ్రాశారు.

మన తరంలో యార్లగడ్డ భాస్కరరావన్నయ్య అలాంటి ఘనుడు. అమ్మ చరిత్రను 'అమ్మ జీవిత మహోదధిలో తరంగాలు' గా వ్రాసిన భాగ్యశాలి. అది కూడా అమ్మ స్వయానా చెబుతుంటే.

అమ్మ అలా చెబుతూ ఉండగా, అదే గదిలో ఉన్న మిగతా వారికి ఆ మాటలు వినిపించేవి కావు. ఒక్క భాస్కరరావన్నయ్యకే అవి వినిపించేవని అక్కడ ఉన్నవారు చెబుతారు. అంతేగాక, అమ్మ చరిత్రలోని ఆయా పాత్రలు ఆయన కళ్ళెదురుగా కనిపిస్తూ ఆ మాటలు మళ్ళీ చెబుతూ ఆయా సన్నివేశాలు మళ్ళీ ఆయన మనోనేత్రం ముందు కదులుతూ ఉండగా ఆ రచన సాగింది. ఇలాంటి విచిత్రాలు అమ్మ సన్నిధిలో కోకొల్లలు గనుక ఇది పెద్దగా లెక్కించవలసిన విషయం కాదు. కానీ పల్లెటూరి వాడూ, పెద్దగా చదువుకోని వాడూ అయిన భాస్కరరావన్నయ్య ఆ పుస్తకాన్ని వ్రాసిన తీరు చూస్తే మాత్రం అద్భుతం అనిపిస్తుంది.

అమ్మ చెబుతుండగా తదేకదృష్టిలో వ్రాయడమే గాని, రెండోసారి అడగడం గాని, "మళ్ళీ చెప్పమ్మా" అని రెట్టించడం గాని ఎన్నడూ జరుగలేదు. ఆ వ్రాసిన పుస్తకప్రతిలో ఒక్క కొట్టివేత గాని, ఒక్క దిద్దుబాటు గాని లేదు. అంత దీక్షగా అంత శ్రద్ధగా, తప్పుల్లేకుండా, ఆయనా పుస్తకాన్ని వ్రాశాడు. అలా అమ్మ చరిత్ర వ్రాయడానికి పదిహేను పుస్తకాలయ్యాయట. ధ్యానమంటే ఇది కాకుంటే మరేమిటనుకోవాలి?

'పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట' అంటూ పరమభక్తి తత్పరుడై, వ్రాస్తున్నది తాను కాదన్న పరమ నిరహంకార భావంతో శ్రీమద్భాగవతరచన గావించాడు పోతన్న. భాస్కరన్నయ్య కూడా అదే భావంతో "అమ్మ జీవిత మహోదధిలో తరంగాలు" వ్రాసి మనకాలపు పోతన్న అయ్యాడు.

స్వయానా అమ్మ తన నోటితో - 'భక్తి కరుడు గట్టిన భాస్కరుడురా ఈ భాస్కరుడు' అన్నదీ అంటే మనం తెలుసుకోవచ్చు అన్నయ్య ఎంతడి ధన్యాత్ముడో?

అసలైన భక్తి లక్షణం ఏమిటీ?

స్నానం చేసి గుడికెళ్ళి కాసేపు దణ్ణం పెట్టుకోవడం కాదు. తూతూ మంత్రం పూజలు చెయ్యడం కాదు. మనస్సు ఎక్కడో పెట్టుకుని దేవుడి ముందు విసుగ్గా కూచోడం కాదు.

'సా త్వస్మిన్ పరమప్రేమ రూపా' అంటూ భక్తికి నిర్వచనం ఇచ్చాడు పరమభక్తుడైన నారదమునీంద్రుడు. 'ఇష్టదైవం పట్ల పరమప్రేమయే భక్తి' అన్నాడాయన. అది మామూలు ప్రేమ కాదు. పరమప్రేమ. అంటే, అన్ని కట్టుబాట్లనూ, బంధాలనూ, బంధనాలనూ దాటిన బలీయమైన, ఏకోన్ముఖమైన నిరంతర హృదయ తాదాత్మ్యతయే భక్తి. అటువంటి భక్తి ఉన్నప్పుడు ఇక ఏదీ పట్టదు. ఏదీ నచ్చదు. ఏదీ స్ఫురించదు. ఒకటే భావన ఒకటే ధార ఎల్లప్పుడూ మనస్సులో ప్రవహిస్తూ ఉంటుంది. దానితో హృదయం తాదాత్మ్యం చెంది కరిగిపోతుంది. కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తూ ఉంటాయి. శరీరస్పృహ పోతుంది. 'నేను' అన్నదే అదృశ్యమై పోతుంది. అదీ అసలైన 'భక్తి' అంటే. పురాణకాలంలో గోపికలకు అటువంటి ప్రేమభక్తి ఉండేది. నవీనకాలంలోనైతే, శ్రీరామకృష్ణులకు ఇటువంటి స్థితి రోజులో ఇరవై నాలుగ్గంటలూ ఉండేది. నిరంతరం ఉండేది. ఆయన భక్తులకూ అంతే. మహేంద్రనాధగుప్త అలాంటివాడే. కనుకనే శ్రీరామకృష్ణ కధామృతాన్ని వ్రాయగలిగాడు. భాస్కరన్నయ్యా అలాంటివాడే. కనుకనే అమ్మ చరిత్రను వ్రాస్తే అదృష్టానికి నోచుకున్నాడు.

లలితా సహస్ర నామాలలో ఒక నామం ఉంటుంది. ' భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా' అనేది ఆ నామం. నిన్ననే నా అమెరికా శిష్యులకు ఈ నామాన్ని వివరించి చెప్పాను.

అమ్మ భక్తిప్రియ. భక్తికి లొంగినట్లు అమ్మ ఇక దేనికీ లొంగదు. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ప్రేమయే. తనను తాను మరచిపోయి ప్రేమలో కరగిపోయే స్థితే అసలైన భక్తి. అటువంటి స్థితి మనలో ఉన్నపుడు అమ్మ మన పక్కనే ఉంటుంది. మన గుండెల్లో ఉంటుంది. మన చుట్టూ ఉంటుంది. మనం నిద్రపోతున్నా మనల్ని కాపాడుతూనే ఉంటుంది. నిరంతరం మనతోనే ఉంటుంది. కనుకనే 'భక్తివశ్య' అయింది. అలాంటి భక్తికి గమ్యస్థానం కూడా తనే. కనుక 'భక్తిగమ్యా' అయింది. అలాంటి భక్తి గుండెల్లో నిండి ఉన్నవాడికి ఇక భయం ఏముంటుంది? దేనికి చూచి ఎందుకతడు భయపడాలి? అంతా అమ్మ సృష్టే. భయం ఎందుకు? ఎలా? కనుక అప్పుడు 'భయాపహా' అనే స్థితి సహజంగా వస్తుంది. అదీ నిజమైన భక్తి మహాత్యం.

భాస్కరన్నయ్యకు నిరంతరం అమ్మ నామస్మరణమే. వానైనా వరదైనా ఆయన దినచర్య మానదు. నిరంతరం అమ్మ ధ్యానమే. ఎవరైనా కదిలిస్తే మాట్లాడతాడు.లేకపోతే మౌనమే.అదికూడా క్లుప్తంగా శాంతంగా జవాబిస్తాడు. ఏమాత్రం ఆడంబరం లేకుండా అతి నిరాడంబరునిగా ఉంటాడు. ఒకరోజున చినిగిపోయిన చొక్కాను కుట్టుకుంటుంటే అమ్మ స్వరం - 'ఇంకెందుకు నాన్నా నీకు చొక్కాలు?' - అని వినిపించిందట. అంతే ! ఆ రోజునుంచీ చొక్కా వేసుకోవడం మానేశాడు.

శరీరమే ఆత్మకు చొక్కా. "నీకింక జన్మలు లేవు. నువ్వు మళ్ళీ శరీరాన్ని ధరించవలసిన పని లేదు" అని అమ్మ అలా చెప్పిందన్నమాట తన అశరీర వాణితో ! మోక్షం అంటే ఇదిగాకపోతే ఇంకేమిటి మరి? మహా తపస్వులకు కూడా దక్కని జన్మరాహిత్యం అలా దక్కింది భాస్కరన్నయ్యకు అమ్మ అనుగ్రహంతో, అమ్మ ధ్యానంతో !

ఆయనకు కోపం రాగా ఎవ్వరూ చూడలేదట ఈ 95 ఏళ్ళలో. పరుష వాక్కు అనేదాన్ని ఆయన నోటివెంట ఎవ్వరూ వినలేదట ఒక్కసారి కూడా ! ఎలా సాధ్యం అంతటి ఇంద్రియ నిగ్రహం? అంతటి స్థితప్రజ్ఞత్వం? ఒక పల్లెటూరి మామూలు మనిషికి? 'పామరుడైన పండితుడు' అని అమ్మ నోటివెంట వచ్చిన మాట వృధా ఎలా అవుతుంది?

ఆయన ఏ పూజలూ చెయ్యలేదు. ఏ యాగాలూ ఏ హోమాలూ చెయ్యలేదు. ఏ జపాలూ చెయ్యలేదు. ఏ దీక్షలూ పట్టలేదు. ఏ కవిత్వాలూ వ్రాయలేదు. ఏ వేదికలమీదా ఆసీనుడై ఉపన్యాసాలు ఇవ్వలేదు. మనం జిల్లెళ్ళమూడి వెళితే వేరేవాళ్ళు చెప్పనిదే ఆయనెవరో కూడా మనకు తెలీదు. భోజనాల దగ్గరో, ఇంకెక్కడో, ఆయన మనపక్కనే కూచున్నా కూడా మనకు తెలీదు. ఎవరో పల్లెటూరు వృద్ధుడు అనుకుంటాం అంతే ! అంతటి నిరహంకారి ! నిరంతరం అమ్మ ధ్యానంలో పండిపోయాడు. పండి - పోయాడు.

అమ్మ 1985 లో దేహాన్ని వదలి వెళ్ళిపోయింది. అంతకు ముందు ఎప్పుడో, అంటే ఏ 1950 లోనో, 1960 లోనో అమ్మ ఇలా అన్నదట భాస్కరన్నయ్యతో - " నేను పోయేటప్పుడు ఒక విమానం వస్తుంది నాకోసం". అమ్మ మాటలు చాలా యధాలాపంగా అన్నట్లు ఉంటాయి. వాటిల్లో ప్రత్యేకత ఏమీ ఉండదు. అందుకని చాలామంది వాటిని విని వదిలేస్తూ ఉంటారు. కానీ అవి జరిగిన తర్వాత వెనక్కు తిరిగి చూచుకుని ఆశ్చర్యపోతూ ఉంటారు - 'ఇదా అమ్మ మాటల్లో అంతరార్ధం?' అని !

అమ్మ ఈ మాటన్న ఎన్నో ఏళ్ళకు 1985 లో రాత్రి పూట అందరూ భోజనాల షెడ్డులో కూచుని భోజనాలు చేస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఏదో విమానం వచ్చి షెడ్డు మీద దిగినట్లు పెద్ద హోరు ధ్వని వినిపించింది. ఆ ధ్వని అందరికీ వినిపించలేదు. ఒక్క భాస్కరన్నయ్యకే వినిపించింది. ఆయన వెంటనే కంగారు పడుతూ - ' ఏదో విమానం వచ్చి షెడ్డు మీద దిగింది. అందరూ లేచి బయటకు పరుగెత్తండి. షెడ్డు కూలిపోతుందేమో?' అని గోల చేసాడట. కానీ చూస్తే, అక్కడ ఏ విమానమూ ఎవరికీ కనిపించలేదు. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే అమ్మ దేహత్యాగం చేసిందన్న వార్త వీరికి తెలిసింది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది ఆయనకు.

మామూలు మనుషులు చనిపోయేటప్పుడు యమభటులు వచ్చి కొడుతూ తిడుతూ నానా నరకయాతన పెడుతూ ఆ జీవిని ఈడ్చుకుపోతారని మన గ్రంధాలు చెబుతున్నాయి. అంటే, జీవితమంతా అధర్మంతో బ్రతికి, వ్యామోహాలలో కూరుకుపోయిన జీవులు మరణసమయంలోనూ ఆ తర్వాతా పడే నరకయాతన ఎలా ఉంటుందో అవి వర్ణిస్తాయి. కానీ మహనీయులైన యోగులు, జ్ఞానులు, సిద్ధులు చనిపోయే సమయంలో దేవదూతలు వచ్చి వారిని సాదరంగా తీసుకుపోతారని కూడా అవి చెబుతాయి. ఇక అవతార పురుషులూ, దైవాంశ సంభూతులూ, వారి అనుచరులూ పోయే సమయంలో దివ్యవిమానాలు వచ్చి వారిని ఆయా లోకాలకు చేరుస్తాయని మన గ్రంధాలలో ఉన్నది. అది నిజమే అని అమ్మ దేహత్యాగ సమయంలో వచ్చిన ఈ విమానం సంగతి స్పష్టం చేస్తున్నది. దానిని చూడలేకపోయినా కనీసం ఆ ధ్వనిని వినే భాగ్యం భాస్కరన్నయ్య కు కలిగింది.

శ్రీ రామకృష్ణుల మహాభక్తులైన బలరాం బోస్, రామచంద్ర దత్తా వంటి మహనీయులు మరణించిన సమయంలో దివ్యవిమానాలు వచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు తీసుకుపోవడం వారి బంధువులలో యోగదృష్టి ఉన్న కొందరు స్వయానా చూచినవారున్నారు. ఉన్నతాత్మలకు అలాగే జరుగుతుంది. వారికోసం దివ్యవిమానాలే వస్తాయి. అదే మనబోటి వారికోసమైతే యమభటులు వస్తారు కొరడాలు కాల్చిన అట్లకాడలు తీసుకుని. జీవితమంతా మనిష్టం వచ్చినట్లు బ్రతికి చివరిలో అంతా ఘనంగా జరగాలంటే కుదరదు. ఇప్పటినుంచీ సక్రమంగా ఉంటేనే అప్పుడు సక్రమంగా జరిగేది !

భాస్కరన్నయ్య గొప్ప కర్మజీవి. స్వయానా రైతు. జిల్లెళ్లమూడిలో అమ్మ ఉన్నప్పుడు జరిగిన అనేక కట్టుబడులలోనూ, ఉత్సవాలలోనూ, సమావేశాలలోనూ అన్నయ్య పాత్ర చాలా నిశ్శబ్దంగా యధోచితంగా ఉండేది. అన్నింటిలోనూ తానూ కష్టపడి తనవంతు పని చేసేవాడు కానీ మౌనంగా ఉండేవాడు.

నిరంతరం అమ్మ నామాన్ని స్మరిస్తూ అమ్మ ధ్యానంలో పునీతుడైన ఈ 'భక్తి కరడు గట్టిన భాస్కరుడు', 12-4-2018 న సరిగ్గా సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉచ్ఛస్థితిలోకి రాబోతున్న సమయంలో, ఈ జన్మలో తన నాటకాన్ని ముగించుకుని, అమ్మ పాదాల చెంతకు చేరుకున్నాడు. అంటే, మహాతేజస్సులో లీనమైనాడనీ, తేజోమయ లోకాలకు చేరుకున్నాడనీ దాని అర్ధం ! భాస్కరుడు వెలుగులోకి చేరడం సహజమే కదా మరి !

అమ్మ వంటి దేవతామూర్తులను నిరంతరం ధ్యానించడం మహాదృష్ట ఫలం ! ఎన్నో జన్మలలో ఎంతో పుణ్యం చేసుకున్న ధన్యజీవులకు కానీ అంతటి భాగ్యం దక్కదు. మరి మనవంటి అల్పజీవులకేది దారి? అంటే - అమ్మను స్మరించలేకపోయినా, అమ్మను ధ్యానించి మెప్పించలేక పోయినా, కనీసం అమ్మ ధ్యానంలో పునీతులైన యార్లగడ్డ భాస్కరన్నయ్య వంటి మహనీయులను స్మరించుకుంటే చాలు మనలాంటి వాళ్ళ జన్మలు ధన్యములౌతాయని నా ప్రగాఢ విశ్వాసం.

ఈ మౌనకర్మయోగికి, ఈ స్థితప్రజ్ఞునికి, ఈ మహాభక్తునికి, ఈ అమ్మ ముద్దుబిడ్డ పాదాలకు భక్తిపూర్వకంగా మనస్సులోనే ప్రణామం గావిస్తున్నాను.