నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, జూన్ 2018, బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 18 (అప్పారావన్నయ్యతో సంభాషణ)





అప్పారావన్న గారింటికి వెళుతూ ఉండగా దారిలో చాలామంది పల్లెటూరి మనుషులు గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటూ కనిపించారు. వారంతా రాజకీయాలు మాట్లాడుకుంటున్నారని అర్ధమైంది. కొంతమంది అరుగుల మీద కూచుని ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా విశ్వజననీ పరిషత్ కాంపౌండ్ బయటే జరుగుతోంది. నాతో నడుస్తున్న రామ్మూర్తితో ఇలా చెప్పాను.

'చూడు రామ్మూర్తీ ! మనుషులలో ఎంత అజ్ఞానం ఉంటుందో చూడు. మనం ఎక్కడనుంచో ఇక్కడకు వచ్చాం. అమెరికా నుంచి ఇతర దేశాల నుంచీ ఇక్కడకు వస్తున్నారు. కానీ ఈ ఊరిలోనే ఉన్నవారికి అమ్మ విలువ తెలీదు. గమనించు' అన్నాను.

'అదే నేను చూస్తున్నాను గురువుగారు! ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలంటే ఇంకా అమ్మలాంటి వాళ్ళు ఎన్ని వేలమంది రావాలో? అనే ఆలోచిస్తున్నాను.' అన్నాడు మూర్తి.

'అవును చూడు. వీళ్ళంతా ఈ సంధ్యా సమయంలో గోడ బయటే కూచుని కబుర్లు చెప్పుకుంటూ రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు గాని, ఒక్కరు కూడా లోపలి వచ్చి అమ్మ ఆలయం దర్శించి చక్కగా కూచుని ధ్యానం చేద్దామని అనుకోరు. పోనీ ఇక్కడేమైనా కట్టుబాట్లున్నాయా అంటే అవీ లేవు. అందరినీ అమ్మ తన బిడ్డలుగా ఆదరించింది. మరి వీళ్ళెందుకు రారు? ఎందుకిలా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు? ఇంకొకటి చూడు. ఇక్కడే ఇంకో గుడి కట్టి అక్కడ కూచుని ఏవో సినిమా పాటలలాంటి భజనలు చేస్తున్నారు. ఏంటిదంతా?' అన్నాను.

'అదే నాకూ అర్ధం కావడం లేదు గురువుగారు' అన్నాడు మూర్తి.

'ఇందులో ఏమీ లేదు మూర్తీ. శ్రీరామకృష్ణులు చెప్పారు. అమ్మ కూడా అదే చెప్పింది. "దీపం చుట్టూ క్రీనీడ ఉంటుంది. దాని వెలుగు దూరానికి ప్రసరిస్తుంది."  అంతే ! వెరీ సింపుల్ !' అన్నాను.

'కానీ ఒక్క విషయం చాలా కష్టం గురువుగారు. మహనీయులు రానంతవరకూ రాలేదు, మాకెవరూ లేరని బాధ పడతాం. వచ్చాకేమో, వాళ్ళూ మనలాగే రెండు కాళ్ళూ రెండు చేతులతో ఉంటారని చిన్నచూపు చూస్తాం. మనిషి స్వభావం చాలా విచిత్రం కదా?' అన్నాడు మూర్తి.

నవ్వాను.

'అంతేకదా మూర్తి? రామకృష్ణులు దేహంతో ఉన్నపుడు ఎందరు ఆయన్ను గుర్తించారు? ఆయనకూ మనలాగే ఆకలి దప్పులున్నాయ్.  ఆయనా రోగాలతో బాధపడ్డారు. కనుక ఆయన దేవుడెలా అవుతాడు? ఆయనకు గొంతు కేన్సర్ వచ్చినపుడు ఏమన్నారు? ఈయన తన రోగాన్నే తగ్గించుకోలేడు. ఇక మనకేం వరాలిస్తాడులే? అని చాలామంది ఆయన్ను వదలి వెళ్ళిపోయారు. అంతరంగిక భక్తులు మాత్రం పోకుండా ఆయనతో అంటిపెట్టుకుని ఉన్నారు. అలాగే హైమక్కయ్య చనిపోయినప్పుడు అమ్మను కూడా సందేహించి చాలామంది వెళ్ళిపోయారు. తన కూతుర్ని బ్రతికించుకోలేక పోయింది అమ్మ. ఈమె మనకేం వరాలిస్తుంది? అని. కానీ అమ్మే కావాలనుకున్నవాళ్ళు ఆ సమయంలో కూడా అమ్మతోనే ఉన్నారు.

పోయింది పొట్టు. మిగిలింది ధాన్యం. జారిపోయేవాళ్లకు కావలసింది శ్రీరామకృష్ణులు కాదు, అమ్మా కాదు. వాళ్ళలో దైవత్వం ఉన్నది గనుక వాళ్ళిచ్చే వరాలు కావాలి. ఆ వరాలను ప్రేమిస్తారుగాని వీరిని ప్రేమించరు.

పనులు కావడం కోసం, ఏవేవో గొంతెమ్మ కోరికలకోసం వచ్చేవాళ్ళు ఏదో ఒకరోజున జారిపోతారు. ఏవేవో గొడవలు పెట్టుకుని మనల్ని వదలి వెళ్ళిపోతారు. కానీ నిజమైన తత్వాన్ని అర్ధం చేసుకున్నవాళ్ళు, మనల్ని మనకోసం ప్రేమించేవాళ్ళు ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టరు. ఏది ఏమైనా వాళ్ళు మనతోనే ఉంటారు.

ఈ మనుషులు ఎప్పటికీ ఇంతే ! వీళ్ళు మారరు. వీళ్ళకు చెప్పీ చెప్పీ మన నోళ్ళు అరిగిపోవాల్సిందే గాని వీళ్ళు తత్వాన్ని అర్ధం చేసుకోరు. మారరు. ఇలాంటివారినే 'పెంటలో పురుగులు. వాటికి అక్కడే హాయిగా ఉంటుంది.' అని శ్రీరామకృష్ణులు అనేవారు. ఇలాంటి లోకాన్ని చూచే తన చివరి రోజులలో వివేకానందస్వామి 'ఈ లోకం కుక్కతోక. ఎంతచెప్పినా ఇది మారదు' అని తనదారిన తాను దేహాన్ని వదలి వెళ్ళిపోయారు. అటు చూడు. ఆ డాబామీద ఏం జరుగుతోందో?' అన్నాను.

దారిలో ఒక డాబామీద ఒక ఇరవై ఏళ్ళ లోపు అమ్మాయి కూచుని చేతిలో రెండు మొబైల్ ఫోన్స్ పెట్టుకుని వాటిల్లోకి చూస్తో తన లోకంలో తనుంది. మళ్ళీ అదేమీ పెద్ద ఇల్లు కాదు. ఒక మామూలు రైతు ఇల్లు. ఎదురుగానే 'విశ్వజననీ పరిషత్ కాంపౌండ్' ఉంది.

'అదీ సంగతి మూర్తీ' అన్నాను తలపంకిస్తూ.

తను కూడా నిట్టూర్చాడు.

మాటల్లో ఉండగానే అప్పారావన్నయ్య గారుండే 'శ్రీవిద్యా సదన్' వచ్చేసింది. అక్కడ వాకబు చేస్తే, ఆ పక్కన ఇంకొక అపార్ట్ మెంట్లో ఆయనున్నారని తెలిసింది. అక్కడకు వెళ్లాం.

అప్పారావన్నయ్య షట్చక్ర సాధనలో మంచి అనుభవం కలిగిన యోగి. యోగధ్యాన రతుడు. నియమిత ఆహారం, నియమిత జీవనశైలి, నిత్యధ్యానం, బోధనా ఇదీ ఆయన జీవన విధానం. గృహస్థ యోగి. అమ్మకు మంచి భక్తుడు.

మేం వెళ్లేసరికి ఆయన ఒక గదిలో కూచుని ఉన్నారు. ఆయన చుట్టూ కొంతమంది కూచుని ఉన్నారు. చూడటం తోనే అక్కడ ధ్యానం జరుగుతోందని అర్ధమైంది. మేం కూడా నిశ్శబ్దంగా లోనికి వెళ్లాం. నన్ను చూట్టంతోనే ఆయన గుర్తుపట్టి కూర్చోమని నవ్వుతూ సైగ చేశారు. రెండేళ్ళ క్రితం ఉన్నట్లే ఆయనున్నారు. పెద్దగా మార్పు లేదు.

ఆయన చెయ్యి పట్టుకుని ఒకామె కళ్ళుమూసుకుని ధ్యానంలో కూర్చుని ఉంది, ఈయనకూడా మౌనంగా కూచుని ఉన్నారు. ప్రాణశక్తి ప్రవాహం జరుగుతోందని నాకు అర్ధమైంది. మిగతావాళ్ళు చూస్తున్నారు. మేమూ మౌనంగా కూచున్నాం.

కాసేపటికి ఆయన లేచి కాళ్ళూ చేతులూ కడుక్కుని మా దగ్గరకు వచ్చి కూచున్నారు.

'ఈమె మంచి ప్రాణిక్ హీలర్ అన్నయ్యా! వీళ్ళందరూ మంచి ధ్యానులు. వీళ్ళకు నాకు తెలిసినది కొంత చెబుతూ ఉంటాను.' అన్నారాయన. నేను తలపంకించాను. ఆయన వయస్సు ఎనభై పైమాటే. కానీ నన్ను అన్నయ్యా అన్నారాయన.

అమ్మ భక్తులలో ఇది మామూలే. అందరం అమ్మ బిడ్డలమే అనే భావంతో, వయసులో పెద్దైనా చిన్నైనా అందరూ అందరినీ అన్నయ్యా అక్కయ్యా అనే పిలుచుకుంటారు.

ఆయన సరాసరి సంభాషణలోకి వచ్చారు.

'మీరు వచ్చి చాలా రోజులైంది. నేను మీ ఇంటికి వచ్చాను. మీ కార్లో నన్ను ఇక్కడకు తెచ్చారు ఆరోజున. గుర్తుంది.' అన్నారాయన.

నేను సంతోషంగా నవ్వాను.

'ఒక విషయాన్ని మనం అనుభవించడం వేరు. మన అనుభవంలోకి వచ్చినదాన్ని నలుగురికీ చెప్పి వాళ్ళను కూడా ఆ దారిలో నడిపించడం వేరు. మొదటిదానికంటే రెండోది పైమెట్టు. ఎప్పుడైతే నీకు తెలిసినదాన్ని నువ్వు నిస్వార్ధంగా ఇతరులతో పంచుకుంటావో అప్పుడు నీలో నువ్వు లేవు. నీలో ఆ దైవమే పని చేస్తుంది. అంతేనా అన్నయ్యా?' అన్నాడాయన.

'అంతే అన్నయ్యా' అన్నాను నేను.

'నేను అదే చేస్తున్నాను. మీరూ అదే చేస్తున్నారు. నాకు తెలుసు.' అంటూ ఆయనతో ఉన్న మిగతా వారివైపు తిరిగి ఇలా అన్నారు.

'సత్యనారాయణగారు సామాన్యవ్యక్తి కారు. ఈయనకు చాలా ఫాలోయింగ్ ఉంది. వాళ్ళింటికి వెళ్ళినపుడు నేను చూచాను. మంచి పుస్తకాలు వ్రాశారు. శ్రీవిద్యోపాసకులు. అమ్మ ఈయన్ను తన ఉపకరణంగా వాడుతున్నది. ఎంతోమంది ఈయనద్వారా జ్ఞానాన్ని పొందుతున్నారు.'

వాళ్ళంతా కొంచం భయంగా నాకు చేతులు జోడించారు. నేనూ మౌనంగా ప్రతినమస్కారం చేశాను. అందరం ఆయన చెప్పే మాటలని ఏకాగ్రతగా వింటున్నాం.

ఆయనిలా అన్నారు.

'దేహమే శ్రీచక్రం అని అమ్మ కూడా అన్నారు. ఇందులోనే అన్ని శక్తులూ ఉన్నాయి. బిందువులో నీవున్నావు. నీ చుట్టూ అన్ని దళాలూ కోణాలూ ఉన్నాయి. నీ దేహాన్ని నడిపించే శక్తులందరూ ఆయా స్థానాలలో ఉన్నారు. అమ్మ ఇదే చెప్పేవారు.

(మనో) నిగ్రహం కోసమే విగ్రహం అని అమ్మ అనేవారు. కొందరు బాహ్యపూజ చేస్తారు. పసుపు ముద్దను పెట్టి వినాయకుడు అంటున్నాం. అందులో దైవాన్ని చూస్తాం. కొంతమంది విగ్రహంలో చూస్తారు. కొంతమంది పటంలో చూస్తారు. ఆ పూజలలో మనస్సు వాటిమీద నిలబడి పోతుంది. అప్పుడు బాహ్యకుంభకం సిద్ధిస్తుంది. ఇంకొంతమంది శరీరంలోని షట్చక్రాలలో మనస్సు నిలుపుతారు. శ్రీవిద్య ప్రకారం మనలో తొమ్మిది ఆవరణలున్నాయి. తొమ్మిది చక్రాలున్నాయి. పైన ఉన్న సహస్రారానికి తోడు అధోసహస్రారం ఉంటుంది. ఆజ్ఞా చక్రం పైన లాలన మొదలైన కొన్ని చక్రాలుంటాయి.వాటిమీద మనస్సు నిలిపే వారికి అంతరిక కుంభకం సిద్ధిస్తుంది. కుంభకం బాహ్యమైనా, అంతరికమైనా అది కుంభకమే. ఎప్పుడైతే కుంభకం వచ్చిందో మనసు నిలిచిపోతుంది. ఎప్పుడైతే మనసు నిలిచిపోయిందో వెంటనే ధ్యానం సిద్ధిస్తుంది. అప్పుడు అంతరికనాదం వైఖరిగా బయటకు రాదు. ఎందుకంటే మనం నోటిని మూసేశాం గనుక. అప్పుడు హృదయస్థానం నుంచి విశుద్ధచక్రాన్ని దాటి సరాసరి ఆజ్ఞాచక్రానికి అవి వెళుతుంది. అక్కడ దగ్ధం అయిపోతుంది. అంటే, పూర్వ సంస్కారాలు నశించి పోతున్నాయి. కొత్తవి పుట్టవు. ఇంకేం కావాలన్నయ్యా? చెప్పండి. ఇదే కదా యోగస్థితి? ఏమంటారు?' అన్నారాయన.

నేను మౌనంగా కళ్ళతోనే 'ఔను' అన్నాను. ఆయనిదంతా వర్ణిస్తున్నపుడే నాకా స్థితి వచ్చేసింది. ఉన్నతస్థాయిలకు చెందిన సాధకుల సమక్షంలో వారి ఆరా చాలా బలంగా ఉంటుంది. అది మనకు వెంటనే తెలుస్తుంది. అప్రయత్నంగా ఆ స్థితి మనకు పైకొంటుంది.

ఆయన ఒక్క క్షణం నావైపు నిదానంగా చూచి నాగమణి వాళ్ళతో ఇలా అన్నారు.

'మీ గురువు సామాన్యుడు కాదమ్మా. చూడండి. ఆయనిప్పుడు ధ్యానస్థితిలో ఉన్నాడు. కేవల కుంభకం ఆయనలో మొదలైంది. మీలో ఎవరైనా ఆయనకు శ్వాస ఉందో లేదో గమనించండి. ముక్కు క్రింద వేలు పెట్టి చూడండి. మీకు శ్వాస తెలీదు.' అన్నాడు.

వీళ్ళెవరూ అంత సాహసం చెయ్యలేదు.

'అన్నయ్యా. మిమ్మల్ని చూస్తుంటే మీరే స్థితిలో ఉన్నారో నాకు తెలుస్తున్నది. మీకిప్పుడు బాహ్యశ్వాస లేదు. కేవలం లోలోపల నడుస్తున్నది. మీరిప్పుడు కేవలకుంభకంలో ఉన్నారు. అవునా?' అడిగాడాయన.

ఆయన చెబుతున్నది నిజమే కావడంతో నేను మౌనంగా చిరునవ్వు నవ్వాను. తలకూడా కదిలించే స్థితిలో లేను. ఆయన మహదానంద పడిపోయారు. నా చేతులు రెండూ ఆయన చేతులలోకి తీసుకున్నారు.

'మీరివ్వాళ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్యా' అన్నారాయన. 80 ఏళ్ళ వృద్ధుడు ఆయనలా అంటుంటే నాకు కొంచం ఇబ్బందిగా అనిపించింది. ఆ స్థితిలో మాట్లాడటం కష్టమే. అయినా తప్పలేదు.

'మాకూ ఆనందంగానే ఉందన్నయ్యా! మీరు మాత్రం సామాన్యులా?  వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు. అన్నీ తెలిసిన వారు. అమ్మను చూచి ఎన్నో ఏండ్లు అమ్మను సేవించారు. మిమ్మల్ని చూడటమే మా అదృష్టం' అని నెమ్మదిగా అంటూ  నేను ఆయన పాదాలు స్ప్రుశించాను.

'మీకు తెలుసు కదన్నయ్యా! అమ్మ సూక్తులలో ఒకటుంది. 'రెండుగా కనిపిస్తుంది కానీ ఒక్కటే అనిపిస్తుంది' అంది అమ్మ. ఈ చరాచర జగత్తంతా పాంచభౌతికమే. ఇది బహుధా కన్పిస్తుంది. కానీ అనుభూతికి అంతా ఒక్కటిగానే అనిపిస్తుంది. వస్తుత: భేదమే గాని తత్వత: భేదం లేదు. మీలోనూ నాలోనూ ఉన్నది ఒకటే. అవునా?' అన్నారాయన.

అవునంటూ మౌనంగా తలాడించాను.

'నాకు ఇంకో సందేహం ఉండేది. గీతలో ఒక శ్లోకం ఉంది. "మత్త పరతరం నాన్య కిన్చిదస్తి ధనంజయ, మయి సర్వమిదం శ్రోతం సూత్రే మణిగణానివ" అని. మొదటి పాదంలోనేమో, నేను తప్ప ఇంకేదీ ఈ సృష్టిలో లేదని అంటాడు. రెండో పాదంలో అన్నింటిలో నేను మణిహారంలో సూత్రంలాగా వ్యాపించి యున్నాను అంటాడు. అంతా తానే అయినప్పుడు మళ్ళీ సూత్రంలాగా వ్యాపించడం ఏమిటి? దీనికి సమన్వయం నాకు కుదరలేదు. అందుకని అమ్మనే అడిగాను.

అప్పుడు అమ్మ "బంగారు గాజు- బంగారం- మట్టి- అదే' అనే ఉపమానంతో నాకు అర్ధమయ్యేలా చేశారు. ఇంతకు ముందు మీకది చెప్పాను కదా' అన్నాడాయన.

"అవునన్నయ్యా. చెప్పారు. కానీ ఎన్నిసార్లు విన్నా అది మధురంగానే ఉంటుంది మళ్ళీ చెప్పండి" - అన్నాను.

అదంతా మళ్ళీ వివరించి చెప్పారాయన.

(వివరాలకు ఇదే శీర్షిక క్రింద ఇంతకు ముందరి భాగాలు చదవండి)

'మీకు ఇంతకు ముందు చెప్పాను. నేను వ్యాపారంలో అన్నీ నష్టపోయినప్పుడు అమ్మను అడిగాను. ఏంటమ్మా? ఇలా చేశావు. ఎన్ని ఏళ్ళో కష్టపడి సంపాదించినది ఒక్కరోజులో పోయింది. ఇప్పుడు నన్నేం చెయ్యమంటావమ్మా?' అని. దానికి అమ్మ ఏమందో తెలుసా?

'జరిగేది జరుగుతుంది. నువ్వు ఊరకే చూస్తుండు నాన్నా' అన్నది.

'ఎలా చూడనమ్మా?' అన్నాను.

'హాయిగా చూడు నాన్నా' అన్నది అమ్మ.

ఎలా కుదురుతుంది? మనం ఒకపక్కన సర్వనాశనం అయిపోతూ ఉంటె హాయిగా చూస్తూ ఉండమంటే ఎలా ఉండగలం? అమ్మకేం ఎన్నైనా చెబుతుంది? మనకెలా సాధ్యమౌతుంది ఆ స్థితి? కానీ కర్మను అనుభవించక తప్పదు. కనుక ఇలా అడిగాను.

'దీన్ని భరించే శక్తిని ఇవ్వమ్మా?

అమ్మ సరేనంది. అంతే ! ఆ శక్తి నాలోకి వచ్చేసింది. అప్పుడు సాక్షిగా చూడగలిగాను. ఆ బాధను తేలికగా భరించగలిగాను. ఆ తర్వాత కాలంలో, పోగొట్టుకున్న డబ్బును మళ్ళీ తిరిగి సంపాదించాను. అది వేరే సంగతి.

అమ్మ ఇంకో మాటంది నాతో.

'నీ ప్రయత్నం ఏదీ లేదురా' అంది.

'అదేంటి? మన ప్రయత్నం లేకుండా ఎలా ఉంటుంది? ఏదైనా మనం ప్రయత్నం చెయ్యాల్సిందేగా?' అని నాకు సందేహం ఉండేది. అమ్మనే అడిగి తేల్చుకుందామని బయల్దేరాను.

అప్పట్లో నేను ఏలూర్లో ఉండేవాడిని. పొద్దున్నే లేచి స్నానం అదీ కానిచ్చి స్టేషన్ కి వచ్చాను. తీరా వచ్చాక రైల్వే స్ట్రైక్ అన్నారు. జై ఆంధ్రా ఉద్యమం టైం అది. జిల్లెల్లమూడికి వద్దామని మన ప్రయత్నం చేశాం. కానీ అవలేదు కదా? అయినా సరే, ప్రయత్నం మానరాదని ఏవేవో తంటాలు పడి బస్సులూ లారీలూ ఎక్కి చివరకు జిల్లెళ్ళమూడి చేరుకున్నాను. ఒక వంద గజాల దూరంలో అమ్మ కూచుని ఉన్నది. నేను దూరంగా గోడదగ్గర కూచుని 'ఎలాగైనా ఈ సందేహాన్ని అమ్మనడిగి నివృత్తి చేసుకోవాలి' అని ఆలోచిస్తూ గబుక్కున లేచి అమ్మ దగ్గరకు వచ్చాను. దగ్గరకు వచ్చానూ అంటే, నా ప్రయత్నం ఉన్నట్టే కదా!

'నీ ప్రయత్నం లేదు నాన్నా!' అంది అమ్మ.

'ఎట్లా అమ్మా? ఇంత ప్రయత్నం తోనే కదా ఇక్కడకు వచ్చాను' అని నేనన్నాను.

'నీ ప్రయత్నానికి ముందు ఇక్కడకు వద్దామని సంకల్పం వచ్చింది కదూ నాన్నా! దూరంగా కూచున్న వాడివి దగ్గరకు వద్దామని సంకల్పం వచ్చింది కదా? ఆ సంకల్పానికి మూలం ఏది నాన్నా?' అంది అమ్మ.

నేను బిత్తరపోయాను.

'అన్ని సంకల్పాలకూ మూలం ఒకటే. అదే !' అని అర్ధమైంది. మన ప్రయత్నం ఉన్నట్టు తోస్తుంది గాని నిజానికి లేదని అర్ధమైంది.

అందుకే అమ్మ అనేవారు ' రెండుగా కన్పిస్తుంది కానీ ఒక్కటే అనిపిస్తుంది' - అని. భేదం పైపైనే, లోలోపల ఏ భేదమూ లేదు.

అలాంటి అమ్మ దగ్గరకు నేను కూడా పదేళ్ళు రాకుండా దూరంగా ఉన్నాను. చివరకు ఒకరోజున వచ్చాను.

'చాలా రోజులైంది నాన్నా నువ్వు వచ్చి' అన్నది అమ్మ.

'అవునమ్మా! పన్నెండు ఏళ్ళు అయింది' అన్నాను.

'కాదు నాన్నా తొమ్మిదేళ్ళ పదినెలల ఇరవై రోజులైంది' అన్నది అమ్మ.

నేను ఆశ్చర్యపోయాను.

'పోయినసారి నువ్వొచ్చినప్పుడు కుళ్ళిపోయిన కమలా పండ్లు తెచ్చావు. అదే నువ్వు ఆఖరుసారి రావడం' అన్నది అమ్మ.

'లేదమ్మా. నేనలా తేలేదు' అన్నాను.

'కాదు నాన్నా. తెచ్చావు. గుర్తు తెచ్చుకో.' అన్నది అమ్మ.

'అప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే గుర్తొచ్చింది. పెదనందిపాడు సెంటర్లో బస్సు దిగి అక్కడ పండ్లు కొన్నాను. కమలాలు ముచ్చికల దగ్గర కొంచం మెత్తబడి నల్లబారినట్లు ఉన్నాయి. పరవాలేదులే, కొంచమే నల్లబడ్డాయి. బాగానే ఉన్నాయి అని వాటిని కొని అమ్మకు తెచ్చి ఇచ్చాను. అది అమ్మ గుర్తు పెట్టుకుంది. అన్ని వందల మందిలో. అమ్మదంతా మానవాతీతమే. మనకస్సలు అర్ధం కాదు.'

'మరి అలాంటి అమ్మ దగ్గరకు కూడా నేను పదేళ్ళపాటు రాలేక దూరంగా ఉన్నాను. ఇదేంటి? ఇలా ఎందుకు జరిగింది? అంటే, అలా దూరంగా ఉండటం, దగ్గరకు రాలేకపోవడం కూడా అమ్మ ప్లాన్ లో భాగాలే. కొన్నిసార్లు మనల్ని దూరంగా ఉంచుతుంది. ఆ సమయంలో మనలో ఎంతో పశ్చాత్తాపం, వేదనా, ఆలోచనా, మధనా కలిగేట్లు చేస్తుంది. అది కూడా సాధనలో భాగమే.

ఒక పండు పండుతూ ఉండగా, అది గంటగంటకూ మారుతూ ఉంటుంది. కానీ ఆ మార్పు మనకు తెలీదు. పండు పూర్తిగా పండినప్పుడే మనకు ఆ మార్పు తెలుస్తుంది. సాధన కూడా అలాంటిదే. ఒక స్థాయికి వస్తేగాని ఆ మార్పు అర్ధం కాదు. కనుక దూరంగా ఉంచడం కూడా సాధనలో భాగమే. శిక్షణలో భాగమే.

మీ దగ్గరకు ఎంతోమంది వస్తారు. కొంతకాలం దగ్గరగా ఉండి దూరమైపోతారు. మళ్ళీ ఎప్పుడో చాలాకాలానికి దగ్గరగా వస్తారు. అవునా?' అడిగాడాయన.

అలా నాకు దూరమైన వాళ్ళందరూ గుర్తొచ్చారు.

మౌనంగా నవ్వాను. 

మిగతా అందరూ సంభ్రమంగా వింటున్నారు.

'అమ్మ పోయిన తర్వాత దాదాపు ఏడాది పాటు నేను మనిషిని కాలేకపోయాను. ఆ తర్వాత నిదానంగా కోలుకున్నాను. ఆ తర్వాత వేదాద్రి మహర్షి గారి కుండలినీ యోగాన్ని అభ్యాసం చేశాను. దానిలో మంచి అనుభవాలు నాకున్నాయి.' అన్నారాయన.

'తెలుసన్నయ్యా. మీరు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందాక నా స్థితిని మీరెలా గమనించారో మీ స్థితినీ నేనూ అర్ధం చేసుకున్నాను' అన్నా నేను.

'అప్పుడు అమ్మ చెప్పిన మాటలోని లోతు నాకర్ధమైంది. ఆస్తి పోయినప్పుడు జరిగేదాన్ని సాక్షిగా చూడమంది అమ్మ. యోగాభ్యాసం నేర్చుకుని చేస్తున్నపుడు జరిగింది కూడా అదే. దేహంలో ప్రాణసంచారం జరుగుతూ ఉంటుంది. మనం సాక్షిగా దాన్ని గమనిస్తూ ఉండాలి. అమ్మ చెప్పిన మాటలో ఇంత లోతుందా? అన్న విషయం నాకప్పుడు అర్ధమైంది. అంతేనా అన్నయ్యా?' అడిగారాయన.

'అంతే అన్నయ్యా' అన్నాను నేను మెల్లిగా.

ఒక డబ్బాలోనించి నేతితో చేసిన కొబ్బరి లౌజులు తీసి అందరికీ అమ్మ ప్రసాదంగా ఇచ్చారాయన. అందరం వాటిని తినేశాం. చాలా మధురంగా ఏదో ప్రత్యేక రుచితో ఉన్నాయవి.

'మీ స్థితిని చూస్తె చాలా ఆనందంగా ఉన్నదన్నయ్యా' అని మళ్ళీ అన్నారాయన. నేనేమీ మాట్లాడలేదు. ఒక యోగిని ఇంకొక యోగి మాత్రమే గ్రహించగలడు. ఆయా స్థితులను అనుభవంలో పొందినవారే ఇంకొకరిలో ఆ అనుభూతి ఉన్న విషయాన్ని గుర్తించగలరు. మామూలు మనుషులకు ఈ స్థితులు అర్ధం కావు. ఇది నిజమే కావడంతో నేనేమీ మాట్లాడలేదు.

సమయం ఏడు అవుతున్నది. దారిలో కొంచం పని ఉండటంతో బయలుదేరక తప్పింది కాదు.

అందరం మౌనంగా ఆయన పాదాలకు నమస్కారం చేసి సెలవు తీసుకుని బయటకు వచ్చాం. ఆప్యాయంగా నా చెయ్యి పట్టుకుని బయటదాకా వచ్చారాయన. వారి ఇంటినుంచి, ఆయన వ్రాసిన 'అమ్మ అమ్మే' అనే పుస్తకాలు ఒక కట్ట తెచ్చి నాకిస్తూ ఇలా అన్నారు - "వీటిని ఎవరికైనా మీరే ఇవ్వండి."

అది చాలా మంచి పుస్తకం. ఆయన తన యోగానుభవాలను అమ్మ సూక్తులను కలగలిపి వ్రాసిన గొప్ప పుస్తకం.

ఆయనింకా ఇలా అన్నారు.

'మీరు ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి స్థిరపడే ప్రయత్నం చెయ్యండి. ఈ చోటు మామూలు చోటు కాదు. చూచారుగా ఇందాక మీకు అప్రయత్నంగా ఎలాంటి స్థితి కలిగిందో? నాకు ఏలూరు లో మంచి ఫాలోయింగ్ ఉన్నది. వారిని వదిలి  ఇక్కడకు వచ్చేటప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడకు వచ్చాక అర్ధమైంది. ఈ వాతావరణంలో ఏదో తెలీని శక్తి ఉన్నది. ఇక్కడ యోగస్థితులు వాటంతట అవే వచ్చేస్తాయి. అది అమ్మ ప్రభావం. అందుకే మీకు చెబుతున్నాను. ఎప్పటికైనా మీరు ఇక్కడ వచ్చి స్థిరపడండి. మాకూ ఆనందంగా ఉంటుంది." 

'సరే అన్నయ్యా' అంటూ మేమందరం ఆయనకు నమస్కరించి బయల్దేరాం.