Pages - Menu

Pages

6, జూన్ 2018, బుధవారం

ఖర్మ భూమి

ఈ దేశం వేదభూమి
ఈ దేశం ధర్మభూమి
ఈ దేశం కర్మ భూమి
అని ఎవర్రా కూసింది?

ఇది వేదభూమి కాదు
వెధవభూమి
ఇది ధర్మభూమి కాదు
అధర్మభూమి
ఇది కర్మభూమి కాదు
ఖర్మభూమి

ఇక్కడ శిశువులు కూడా రేప్ కు గురౌతారు
ఎవరికీ ఏమీ పట్టదు
ఇక్కడ అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడతారు
ఎవరికీ చీమకూడా కుట్టదు
ఇక్కడ విద్యార్ధులు వేదనతో ప్రాణాలు తీసుకుంటారు
ఎవరికీ ఏమీ అనిపించదు
ఇక్కడ ప్రతిదాన్నీ వ్యాపారంగా మారుస్తారు
ఎవరికీ ఏమీ బాధ కలగదు

ఇక్కడ తెలివి తేటలకు విలువలేదు
నీతీనిజాయితీల అడ్రసే దొరకదు
ఇక్కడ దౌర్జన్యం నాట్యం చేస్తూ ఉంటుంది
దోపిడీ రాజ్యం చేస్తూ ఉంటుంది
డబ్బొస్తుందంటే ఈ దేశంలో
ఏ గబ్బైనా నాకుతారు
పనైపోతుందంటే ఈ దేశంలో
ఏ పాపమైనా చేస్తారు

కదిలిస్తే అందరూ మానవహక్కులంటారు
కానీ మనుషులంటూ ఎవరూ కనిపించరు
కదిలించకపోయినా అందరూ నీతులే చెబుతారు
కానీ ఆ నీతులను ఎవరూ పాటించరు
అందరూ భక్తులమేనంటారు
జీవితంలో విలువలు మాత్రం ఎవరూ పాటించరు

మా దేశంలో ఏదీ అనర్హం కాదు - వ్యాపారానికి
మా దేశంలో ఏదీ అశుద్ధం కాదు - వాడకానికి
మా దేశంలో అవకాశాల కన్నా
అవకాశవాదులెక్కువ
మా దేశంలో దొరలకన్నా
దొరల్లాంటి దొంగలే ఎక్కువ

మా దేశంలో - 
విద్యా వైద్యం భూమీ సేద్యం
అంతా మాఫియానే
మా దేశంలో - 
ఆహారం వ్యవహారం ఉద్యోగం వ్యాపారం
అన్నీ విషపు రూపాలే
మా దేశంలో -
బళ్ళూ కాపురాలూ గుళ్ళూ గోపురాలూ
అన్నీ మురికికూపాలే

అందుకే చెబుతున్నా - 

తెలివైన వాళ్ళు
ఈ దేశాన్ని వదిలి వెళ్ళండి
తిరిగి ఈ దేశానికి రాకండి
కష్టపడే తత్త్వం ఉన్నవాళ్ళు
మా దేశాన్ని వదలి పారిపోండి
తిరిగి ఇటువైపు చూడకండి

ఒకప్పుడు ఇది వేదభూమి అయి ఉండవచ్చు
కానీ ఇప్పుడు వెధవలభూమి
ఒకప్పుడు ఇది ధర్మభూమి అయుండవచ్చు
ఇప్పుడు అసలైన దొంగలభూమి
ఒకప్పుడు ఇది కర్మభూమి అయుండవచ్చు
ఇప్పుడు చేతగాని ఖర్మభూమి

మంచివాళ్ళకు ఇక్కడ స్థానం లేదు
నీతిగా బ్రతికేవాళ్ళకు నయం లేదు
చదువుకునే వాళ్లకు ఇక్కడ చోటు లేదు
తెలివైన వాళ్లకు ఇక్కడ పాటు కాదు
కష్టపడే వాళ్లకు ఇక్కడ కలిసిరాదు
బరి తెగించకపోతే ఇక్కడ బ్రతుకులేదు

అందుకే అందరూ
ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపొండి
వెనక్కి తిరిగిచూడకుండా పారిపొండి

అందరూ అలా పారిపోతే
చివరకు ఇక్కడ మిగిలేదెవరో తెలుసా?

అవినీతి ఉద్యోగులూ కులపిచ్చి పౌరులూ
మాఫియా వ్యాపారులూ మతిలేని రాజకీయులూ
కష్టపడకుండా అన్నీ కావాలనుకునే సోమరులూ
దేశాన్ని దోచుకుంటూ బ్రతికే దొంగలూ
అన్నింటినీ కబళించే బకాసురులూ
అన్నీ అబద్దాలే చెప్పే కాకాసురులూ
రాముడి వేషంలో తిరిగే రావణులూ
బుద్ధుడి వేషంలో బ్రతికే కీచకులూ
అన్నింటినీ మించి మేమే వ్రాసుకున్న
ఒక చెత్త కాపీ పుస్తకమూ
ఇవే చివరకు మాకు మిగిలేవి

మేమెటు పోతున్నామో
మాకే తెలీదు
మంచి దారి చెప్పేవాడిని కూడా
గోదాట్లోకి ఈడవడం తప్ప
మాకింకేమీ రాదు
అన్నింటినీ అమ్ముకోవడం
ఆ డబ్బుల్ని ఎక్కడో దాచుకోవడం
ఎవరైనా ఇది తప్పు అంటే
వాడిమీద బురద చల్లడం తప్ప
ఇతర ఆలోచనలు మాకు రావు

మరి దీనికంతా పరిష్కారం లేదా?
లేకేం? చక్కగా ఉంది

ఈ భూమి బ్రద్దలవడం ఒక్కటే మార్గం
ఈ దేశం సర్వనాశనం కావడం తధ్యం
దేవుడు కూడా దీన్ని ఆపలేడు
ఒకవేళ ఆయన ఆపబోయినా
మేమే ఆయన్ను అడ్డుకుంటాం
మా గొయ్యి చక్కగా మేమే త్రవ్వుకుంటాం...

(ర్యాంకులు రాక, టెన్షన్ భరించలేక, భవిష్యత్తు ఏమౌతుందో అన్న భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్ధులకూ, మంచి ర్యాంకులు వచ్చినా సీట్లు రాక నిరాశతో, 'ఈ దేశంలో ఎందుకు పుట్టామురా దేవుడా?' అని విలపిస్తున్న మెడికల్ పీజీ మెరిట్  రాంకర్లకూ ఈ పోస్ట్ అంకితం)