Pages - Menu

Pages

16, జులై 2018, సోమవారం

బ్రూస్లీ మరణానికి ఇది కూడా ఒక కారణమా???

బ్రూస్లీ 1940 లో పుట్టి, 1973 లో చనిపోయాడు. ఆ సమయానికి అతనికి 32 ఏళ్ళే. ఆరోగ్య పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని, అంత చక్కని ఆల్ రౌండ్ ఫిట్నెస్ తో ఉన్న ఒక మార్షల్ ఆర్టిస్ట్ కు ఆ విధమైన అకాల మరణం ఎందుకొచ్చింది?

దీని గురించి ఇంతకు ముందు నేనొక పోస్ట్ వ్రాస్తూ జ్యోతిష్య పరంగా ఈ ప్రశ్నలను విశ్లేషించాను. ఇప్పుడు దీనినే ఇంకొక కోణంలో చూద్దాం.

ఏ మనిషికైనా ఒంట్లో కొవ్వు అనేది కొంత అవసరమే. అది ఎక్కువగానూ ఉండకూడదు. తక్కువగానూ ఉండకూడదు. సైన్సు చెప్పేదాని ప్రకారం ప్రతి మనిషికీ తన బరువులో 9% నుండి 19% మధ్యలో కొవ్వు అతని శరీరంలో ఉండవచ్చు. అది ఆరోగ్యకరమైన రేంజ్ గా చెప్పబడుతుంది.

బ్రూస్లీ బరువు 65 కేజీలు గా ఉండేది. అంటే, అతనిలో దాదాపుగా 6 కేజీల నుంచి 12 కేజీల వరకూ కొవ్వు ఉండవచ్చు. కానీ, మెడికల్ రిపోర్ట్ ల ప్రకారం అతనిలో 1 కేజీ కూడా కొవ్వు లేదు. అర్దకేజీ కంటే తక్కువ ఉంది. అతని ఒంట్లో మొత్తం కండ ఉండేది గాని కొవ్వు ఉండేది కాదు. ఎక్కడ ఏమాత్రం కొవ్వు కన్పించినా దాన్ని కరిగించేవరకూ అతనికి నిద్ర పట్టేది కాదు. అతనొక Fitness freak అని చెప్పవచ్చు. హాలీవుడ్ నటులు కూడా అతని శరీరాన్ని చూచి చాలా ఆశ్చర్యపోతూ ఉండేవారు. అమెరికన్స్ అయిన తమకు కూడా అలాంటి గట్టి శరీరం లేదే అని అసూయపడుతూ ఉండేవారు.

ఇదిలా ఉండగా, Enter the Dragon సినిమా సెట్ల మీద బ్రూస్లీ ఒకరోజున పెద్ద జ్వరంతో కూలబడి పోయాడు. అతనికి ఫిట్స్ కూడా వచ్చాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్ష చేసిన డాక్టర్లు అతని మెదడులో వాపు లాంటిది ఉందని చెప్పి తాత్కాలికంగా ఏవో మందులిచ్చారు. అంతేగాక అతనికి నేపాల్ నుంచి తెప్పించిన ముడి మాదకద్రవ్యం 'హషీష్' తీసుకునే అలవాటుందని కూడా వారికి అప్పుడే తెలిసింది.

అతని శరీరంలో 1% కూడా కొవ్వు లేదని కూడా మెడికల్ రిపోర్ట్స్ లో వచ్చింది. ఒక అథ్లెట్ కు ఇది గర్వకారణమే గాని, ఆరోగ్యరీత్యా ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే, మత్తుమందులు తీసుకున్నప్పుడు అవి గుండె, లివర్ మొదలైన అవయవాలకు చేరకుండా ఒంట్లో ఉన్న కొవ్వు అడ్డుపడి ఆ మత్తుమందుల్ని తను ఇముడ్చుకుంటుంది. తద్వారా అది శరీరాన్ని రక్షిస్తుంది. ఈ ప్రక్రియ బ్రూస్లీ శరీరంలో జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఉండవలసిన 9% - 19% మధ్యలో కొవ్వు లేకపోగా, కనీసం 1 % కూడా అతనిలో లేదు. అంతా మజిలే ఉంది. కనుక అతను తీసుకుంటున్న హషీష్ అనేది సరాసరి మెదడుకు చేరుతోంది. ఆ క్రమంలో మెదడు వాపుకు గురౌతోంది.

నీ ఒంట్లో తగినంత కొవ్వు లేదు, కనుక హషీష్ వాడకం మానుకోమని, అది ప్రమాదకరమని వైద్యులు చెప్పినా బ్రూస్లీ వినలేదు. పైగా అతను చేసే వ్యాయామాలు చూస్తే మామూలు మనుషులు భయపడతారు. అలాంటి ఘోరమైన వ్యాయామాలు చేసేవాడు. అలాగే హషీష్ కూడా తీసుకునేవాడు. అతనికి ఆ అలవాటుందని, రిలాక్స్ అవడానికి దానిని తీసుకుంటూ ఉంటాడని అతని భార్య "లిండా లీ" కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. ఒకవైపు హషీష్, ఒకవైపు మితిమీరిన వ్యాయామాలు, ఒంట్లో కొవ్వు లేకపోవడం వల్ల అతని మెదడులో పొరలు వాచి, ఫిట్స్ కు గురై చనిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ బెట్టీ ఇచ్చిన ఆస్ప్రిన్ అతన్ని చంపలేదు. హషీష్ చంపింది. మితిమీరిన వ్యాయామాలు చంపాయి. తగినంత కొవ్వు లేకపోవడం చంపింది. !!

అందుకే అంటారు ! అతి ఎందులోనూ పనికిరాదని ! ఫిట్నెస్ మంచిదే. కానీ అదే ఒక వ్యసనం కాకూడదు. దానికి తోడు డ్రగ్స్ అలవాటైతే ఏమౌతుందో బ్రూస్లీ జీవితమే ఒక ఉదాహరణ !

ఒంట్లో కొంత కొవ్వు కూడా ఉండాలని, అయితే అది తగు మోతాదులో మాత్రమే ఉండాలని వ్యాయామాలు చేసేవారు మర్చిపోకండి !