నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

8, జులై 2018, ఆదివారం

బ్రతుకులు చెడగొడుతున్న జ్యోతిష్యం

"బ్రతుకు నిలబెట్టిన జ్యోతిష్యం" - అని కొన్నేళ్ళక్రితం ఒక పోస్టు వ్రాశాను. జ్యోతిష్యం అనేది బ్రతుకులు నిలబెట్టడమే కాదు. చెడగొడుతుంది కూడా. ఎలా అని అనుమానం వస్తోందా? ఈ పోస్టు చదవండి.

రామారావు హైదరాబాద్ లో బ్యాంక్ మేనేజర్. భార్య ప్రైవేటు స్కూల్లో టీచరుగా పనిచేస్తోంది. ఒక అమ్మాయి. ఒక అబ్బాయి. చక్కటి సంసారం. కానీ జ్యోతిష్యం వాళ్ళ సంసారంలో నిప్పులు పోసింది.

అమ్మాయి హైద్రాబాదులోనే ఇంజనీరింగ్ చదివింది. ఆ తరువాత అమెరికాలో ఎమ్మెస్ చెయ్యడానికి వెళ్ళింది. పూర్తిచేసింది. ఉద్యోగం తెచ్చుకుంది. ఈ లోపల H1B వచ్చేసింది. ఇంకేముంది? అమెరికాలో ఇలాగే ఎమ్మెస్ చదివి ఉద్యోగం చేస్తున్న ఒక అబ్బాయిని చూచి పెళ్లి చేస్తే ఒకపని అయిపోతుందని అనుకుని మురిసిపోయారు. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అప్పుడే అసలు కష్టాలు మొదలయ్యాయి.

ఖర్మ బాలేనప్పుడు ఎవడో ఒకడు మనకు చెడుగ్రహంలాగా తయారౌతాడు. వీరి విషయంలో అయితే వీళ్ళ కుటుంబ జ్యోతిష్కుడే ఆ చెడుగ్రహం అయి కూచున్నాడు.

ఏ సంబంధం తెచ్చినా ఇది బాలేదు, అది బాలేదు, నక్షత్రం కుదరలేదు, ఇంకోటి కుదరలేదని అన్ని సంబంధాలూ చెడగొట్టేవాడు. వీళ్లేమో గుడ్డి నమ్మకంతో అతడు చెప్పినది వేదంలా భావించి మంచి మంచి సంబంధాలన్నీ చెడగొట్టుకున్నారు. అప్పుడప్పుడూ కొన్ని సంబంధాలను ఆ జ్యోతిష్కుడే తెచ్చేవాడు. కానీ అవి వీళ్ళ అమ్మాయికి నచ్చేవి కావు. అబ్బాయికి అది బాలేదు ఇది బాలేదని ఆ అమ్మాయి వాటిని తిరస్కరించేది. ఇలా ఉండగా, చూస్తూ ఉండగానే అమ్మాయికి 30 ఏళ్ళు దాటాయి. సంబంధాలు రావడం తగ్గిపోయాయి.

ఇంతకు ముందు అబ్బాయిలకు వీళ్ళు కండిషన్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మార్చుకుని డైవర్సీ సంబందాలైన పరవాలేదు అనే స్థితికి వచ్చారు. అయితే, అవి కూడా మంచివి రావడం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. అమ్మాయికి 33 ఏళ్ళు వచ్చేశాయి. ఈ లోపల ఒక రోజున వాళ్ళమ్మాయి ఈయనకు ఫోను చేసి ' నాన్నా, నాకు సంబంధాలు చూడొద్దు. ఇంక నేను పెళ్లి చేసుకోను' అని చెప్పేసింది.

ఈ పరిస్థితిలో అమ్మాయి జాతకం చూడమని నన్ను ఫోన్లో అడిగాడు తండ్రి.

ఏడేళ్ళక్రితం ఈ అమ్మాయి జాతకంలో వివాహదశలు నడిచాయి. అదే మాట తండ్రితో అన్నాను.

'నిజమే సార్ ! అప్పట్లో మంచి మంచి సంబంధాలు వచ్చాయి. కానీ మేమే వద్దనుకున్నాం. ఇప్పుడు రావడం లేదు.' అన్నాడు.

'ఇంకా ఎన్నేళ్ళపాటు మీకదే పనిగా సంబంధాలు వస్తాయని మీరనుకుంటున్నారు? మీ పెళ్లప్పుడు మీకెంత వయసు?' అడిగాను.

'ఇరవై అయిదు. మా ఆవిడకు ఇరవై రెండు' అన్నాడు.

'మరి ముప్పై మూడున్న అమ్మాయిని మీరెందుకు చేసుకోలేదు?' అడిగాను.

'అంతవరకూ ఎలా ఆగుతాం?' అన్నాడు.

'మరి ఇప్పటి అబ్బాయిలు కూడా అంతే కదా? మహా అయితే 30 వరకూ చూస్తారు. ఆ తర్వాతంటే అమ్మాయిలకు ఏజి బార్ అయినట్లే.' అన్నాను.

'అదే ఇప్పుడు మా సమస్య' అన్నాడు.

'మంచి సంబంధాలు వచ్చినప్పుడు మీరెందుకు వద్దనుకున్నారు?' అడిగాను.

'అంతా మా జ్యోతిష్కుడు చేశాడు. మాకేమో ఆ జ్యోతిష్యం తెలీదు. అతన్ని నమ్మాము. ఇలా చేశాడు. ఆ తర్వాత మాకు తెలిసినది ఏమంటే - మా ఫేమిలీ విషయాలన్నీ అతనికి తెలుసు. మా భావాలు, మా నమ్మకాలు, మా వీక్నెస్సులు అన్నీ తెలుసు. వాటితో ఆడుకున్నాడు. ఒక ఉదాహరణ చెప్తా వినండి.

జాతకపరంగా నక్షత్రాలు కలుస్తాయా లేదా చూచేటప్పుడు అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సరిపోతుందా లేదా అనే చూస్తారట. కానీ ఇతను అబ్బాయి నుంచి కూడా అమ్మాయికి చూచేవాడు. అలా చూస్తే, ఎక్కడో తప్ప ఎవరికీ సంబంధాలు కుదరవు. ఈ విధంగా సంబంధాలన్నీ చెడగొట్టాడు.' అన్నాడు.

'అవును. అమ్మాయి నుంచి అబ్బాయి నక్షత్రానికి చూడాలి. అదే సాంప్రదాయ పరంగా నక్షత్రపొంతనం చూచే విధానం. అతనేంటి ఏదో కొత్తగా ఉందే?' అన్నాను.

'మా ఖర్మకొద్దీ దొరికాడు వీడు. ఇంకా వినండి. కొన్నింటికి నక్షత్రం సరిపోలేదని చెప్పేవాడు. ఇంకొన్నింటికి సర్పదోషం అనేవాడు, ఇంకొన్నింటికి కుజదోషం అనేవాడు. ఇంకొన్నిటికి ఇంకేదో చెప్పేవాడు. ఇలా కావాలని చెడగొట్టేవాడు.' అన్నాడు.

'కావాలనా? అదేంటి?' అడిగాను.

'అవును. మాకు తర్వాత తెలిసింది. మా కుటుంబం గురించి అతనికి బాగా తెలుసు కదా ! అందుకని వేరే వాళ్ళ దగ్గర కమీషన్ తీసుకుని, వాళ్ళ అబ్బాయి జాతకం కొద్దిగా మార్చి మా అమ్మాయికి సరిపెట్టి, 'ఇది మంచి జాతకం. చేసుకోండి' అని చెప్పేవాడు. కుదిరితే మా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాడు కదా ! రెండుపక్కలా నొక్కొచ్చని ప్లానేశాడు. అయితే ఆ సంబంధాలు మా అమ్మాయికి నచ్చేవి కావు.

ఇదంతా మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. వాళ్లకు కూడా ఇలాగే చేసి, జాతకాలు మార్చి, అంతా బాగుందని చెప్పి పెళ్లి చేశాడు. ఏడాది తిరక్కుండా వాళ్లకు విడాకులైపోయాయి. అదేంటని అడిగితే - ' నేను దేవుణ్ణి కాను. జాతకాలు మ్యాచింగ్ చెయ్యగలను గాని వాళ్ళ విధిని నేను మార్చలేను కదా !' అని తప్పించుకున్నాడు. అంతే కాదు ! రెండో పెళ్లి చేద్దామని మళ్ళీ డబ్బులు తీసుకుని సంబంధాలు తేవడం మొదలుపెట్టాడు. ఈ విధంగా చాలామంది జీవితాలు పాడు చేశాడు.' అన్నాడు.

'ఎవరతను?' అడిగాను.

'హైదరాబాద్ లో పేరున్న జ్యోతిష్కుడు' అంటూ అతని పేరు చెప్పాడు రామారావ్.

'మరి పరిహారాలు చెప్పలేదా మీకు?' అడిగాను.

'లేకేం? ఎన్నో చేశాం. వాటికి దాదాపు పదిలక్షలు వదిలింది. అమెరికా నుంచి మా అమ్మాయి పంపింది ఆ డబ్బులు' అన్నాడు ఏడుపు గొంతుతో

'పాపం ! అమెరికాలో తను సంపాదించినది ఈ దొంగ జ్యోతిష్కుడికి పోసిందన్నమాట ఈ అమ్మాయి?' అనుకున్నా.

'మరి మీ అబ్బాయి సంగతేంటి?' అడిగాను.

'వాడూ అమెరికాలోనే ఉన్నాడు. అక్కకు కాలేదని తనూ చేసుకోలేదు. వాడికీ 31 వచ్చాయి. చూస్తున్నాం.' అన్నాడు.

'మరి అదే జ్యోతిష్కుడికి చూపిస్తున్నారా ఇంకా?' అడిగాను.

'లేదండి. మాకు జ్యోతిష్యం అంటేనే నమ్మకం పోయింది. మా అమ్మాయి జీవితం ఇలా అవడానికి కారణం జ్యోతిష్యమే. అందుకే మా వాడికి జాతకం చూడటం లేదు. అమ్మాయి నచ్చితే చేసుకుంటాం. అంతే! ' అన్నాడు.

'వెరీ గుడ్. మంచి పని. ప్రొసీడ్ ! ' అన్నాను.

వీళ్ళమ్మాయి కధ వింటే చాలా బాధేసింది.

'ఇప్పుడు నానుంచి మీకేం కావాలి?' అడిగాను.

'అమ్మాయి భవిష్యత్తు చెప్పండి. రెమెడీలు చెప్పండి' అడిగాడు.

'జాతకమంటే నమ్మకం లేదన్నారుగా? మళ్ళీ ఇదేంటి?' అడిగాను.

'ఏ మూలో ఇంకా కొద్దిగా ఉండండి. మీరు కరెక్ట్ గా చెబుతారనీ, డబ్బులు తీసుకోరనీ మా ఫ్రెండ్స్ చెప్పారు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను.' అన్నాడు.

'సరేగాని, ఒక్కమాట చెప్పండి. మీ అమ్మాయికి ఏజ్ బార్ అయిపోతున్నా కూడా ఎందుకు అతన్నే నమ్ముకుని కూచున్నారు మీరు?' అడిగాను.

'అంతా మా ఖర్మ సార్ ! అప్పుడర్ధం కాలేదు. అర్ధం అయ్యేసరికి టైం అయిపోయింది' అన్నాడు.

'మీ పెళ్ళప్పుడు ఈ జాతకాలు చూచారా? జాతకాలు చూచే మీ పెళ్లి చేసుకున్నారా?' అడిగాను.

'లేదండి. మా ఆవిడకు అసలు జాతకమే లేదు. మా నాన్నకు వాళ్ళ కుటుంబం నచ్చింది. అమ్మాయి నచ్చింది. చేసుకున్నాం.' అన్నాడు.

ఒకపక్క నవ్వొచ్చింది. ఇంకోపక్క బాధేసింది. జాతకం చూచి అతనికి కావలసిన విషయాలు ఫోన్లోనే చెప్పేశాను.

'చాలా ధ్యాంక్స్ సార్ ! మీరు మాకొక ఇరవై ఏళ్ళ క్రితం పరిచయం అయి ఉంటే మా జీవితాలు ఇంకోలా ఉండేవనిపిస్తోంది' అంటూ ఫోన్ పెట్టేశాడాయన.

ఫోన్ పెట్టేశాక చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాను.

జ్యోతిష్యాన్ని అతిగా నమ్మకూడదు. దానినొక గైడెన్స్ గా తీసుకోవాలే గాని, పొద్దున్న లేచి "టాయిలెట్ కు వెళదామా వద్దా? ఇప్పుడు ఏ హోర నడుస్తోంది? ఈరోజు నక్షత్రం ఏమిటి?" అని ఆలోచిస్తూ కూచోకూడదు. అలా కూచుంటే అన్నీ అక్కడే అయిపోతాయి.

ఆ జ్యోతిష్కుడు ఇలా జనాన్ని మోసం చేసి డబ్బు బాగా సంపాదించి ఉండవచ్చు, కానీ దానితో బాటు అతను పోగుచేసుకున్న ఖర్మను తలచుకుంటే నాకు భయం వేసింది. ఇలాంటి తెలిసి తెలియని జోస్యాలు చెప్పి జీవితాలను పాడు చెయ్యడం వల్ల, వచ్చే జన్మలో ఏ రోడ్డు కుక్కగానో, ఏ పందిగానో పుట్టవలసి వస్తుంది.

ఈ విధంగా తెలిసీ తెలియని జోస్యాలు చెప్పి చాలామంది జ్యోతిష్కులు ఎన్నో పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారు. ఇంతా చేస్తే వాళ్ళేమీ బ్రహ్మదేవుళ్ళు కారు. అసలు చెప్పాలంటే - మ్యారేజ్ మ్యాచింగ్ ఇలాగే చెయ్యాలి - అంటూ చెప్పే ఖచ్చితమైన పద్ధతులేవీ జ్యోతిష్యశాస్త్రంలో లేవు. మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేస్తూ ఉంటారు. దీంట్లో స్టాండర్డ్ పద్ధతులంటూ ఏవీ లేవు. ఎవడికి తోచిన విధంగా వాడు చేస్తూ ఉంటాడు. నమ్మే గొర్రెలు నమ్ముతూ ఉంటాయి.

నిజం చెప్పాలంటే - జాతకం కలవకపోవడం - అంటూ ఏమీ ఉండదు. ఎంత పర్సెంటేజి కలిసింది? అనేదే ప్రశ్న. ఆదర్శ దంపతుల జాతకాలే 100% కలవవు. అక్కడదాకా ఎందుకు? రాముడు సీతాదేవి జాతకాలే 100% కలవలేదు. ఇక మామూలు మనుషుల జాతకాల గురించి చెప్పాలా? మరి వీళ్ళిద్దరి పెళ్లినీ  బ్రహ్మర్షి అయిన వశిష్టుడు దగ్గరుండి ఎలా చేయించాడు? దీనికి సమాధానం లేదు. ఎవ్వరూ చెప్పలేరు కూడా !

మనుషుల జాతకాలు ఎవరివైనా సరే, చాలావరకూ కలుస్తూనే ఉంటాయి. ఏవో కొన్నికొన్ని జాతకాలలో భయంకరమైన దోషాలుంటాయి. అలాంటివాటిని పరిహారాలతో సరిచెయ్యాలిగాని, ప్రతి జాతకానికీ పరిహారాలు అవసరం ఉండవు. కనుక నా దృష్టిలో - 'జాతకం కలవలేదు' అని చెప్పడమే చాలా తప్పు ! అలా చెప్పే జ్యోతిష్కుడికి అసలు శాస్త్రం తెలీదని నేనంటాను.

ఈ విధంగా "జాతకం కుదరలేదు. ఈ సంబంధం చేసుకోవద్దు" అని చెప్పి పెళ్ళిళ్ళు చెడగొడుతున్న కుహనా జ్యోతిష్కులకు నేనొక ఓపన్ చాలెంజ్ చేస్తున్నా !

మీలో ఎవరైనా సరే, మీ దగ్గరకు వచ్చిన జాతకాలలో, "ఇతనికి గానీ ఈమెకు గానీ, పలానా సంవత్సరంలో, ఫలానా నెలలో, ఫలానా తేదీన, ఫలానా ఊళ్ళో పెళ్లి అవుతుందని ఖచ్చితంగా చెప్పగలరా?" చెప్పలేరు. మరి అలా చెప్పలేనప్పుడు - గణాలు కుదరలేదు, గుణాలు కుదరలేదు, సంబంధం కుదరలేదు, చేసుకోవద్దు - అంటూ, తెలిసీ తెలియని జోస్యాలు చెప్పి, జీవితాలతో ఆడుకోవడం తప్పు కదూ?

జ్యోతిష్కుల్లారా ! సిగ్గు తెచ్చుకోండి ! చేతనైతే మంచి చెయ్యండి. అంతేగాని మనుషుల జీవితాలలో ఆడుకోకండి. చెడుకర్మను పోగు చేసుకోకండి. వచ్చే జన్మలలో కుక్కలుగా నక్కలుగా పుట్టకండి. వచ్చే జన్మదాకా అక్కర్లేదు. ప్రముఖ జ్యోతిష్కుల కుటుంబాలలో తీరని పెద్ద పెద్ద సమస్యలుండటం నాకు తెలుసు. ఎంతో మంది కమర్షియల్ జ్యోతిష్కుల కుటుంబాలలో దీనిని నేను గమనించాను. అవన్నీ ఎందుకొస్తున్నాయి? మీరు సక్రమంగా ఉంటే, మీ కుటుంబాలలో ఆ సమస్యలెందుకున్నాయి? లోకుల సమస్యలు తీర్చే మీరు, మీ సమస్యలు ఎందుకు తీర్చుకోలేకపోతున్నారు? ఆలోచించుకోండి !

జ్యోతిష్యం యొక్క నిజమైన ప్రయోజనం జీవితానికి సరియైన దారిని చూపడం. కానీ కుహనా జ్యోతిష్కుల వల్ల నేడది జీవితాలను తప్పు దారి పట్టించి వాటిని చెడగొట్టే వ్యాపారంగా మారిపోయింది. అందుకే చెబుతున్నాను. 'కళ్ళు పోయేంత కాటుక పెట్టుకోకూడ' దని సామెత ఉంది. అలాగే అతిగా జ్యోతిష్యాన్ని నమ్మి జీవితాలు పాడు చేసుకోకండి. ఎందుకంటే జ్యోతిష్కుడు దేవుడు కాదు. వాడూ మనలాంటి మనిషే. వాడి లిమిట్స్ వాడికి ఉంటాయి. వాడు చెప్పేది వేదం ఏమీ కాదు. పోనీ జ్యోతిష్యశాస్త్రం చూద్దామా అంటే ఇదేమీ ఒక Standardized Science కాదు. ఇందులో ఎవడి పద్దతి వాడిది. కనుక, మీకు దేవుడిచ్చిన తెలివిని వాడండి. ఎవడో చెప్పిన మాయమాటలను కాదు !

ఇలాంటి జ్యోతిష్కుల వల్లే నిజమైన శాస్త్రానికి విలువ లేకుండా పోతోంది. ఇది కూడా కలిమాయేగా మరి !