Pages - Menu

Pages

27, జులై 2018, శుక్రవారం

"విజ్ఞాన భైరవ తంత్రము" - Telugu E Book నేడు విడుదలైంది

ఈరోజు గురుపూర్ణిమ.

సమస్త జగత్తులకూ పరమగురువగు పరమేశ్వరుని స్మరిస్తూ ఈ రోజున మా "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" నుంచి ఆరవ E-Book గా "విజ్ఞాన భైరవతంత్రము" ను విడుదల చేస్తున్నాము. తంత్రాచారములలో ఇది కౌలాచారమునకు చెందినది. ఆగమములలో భైరవాగమమునకు చెందినది. దీనియందు, పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లుగా చెప్పబడిన నూట పన్నెండు ధారణా విధానములు ఇవ్వబడినవి. తాంత్రిక ధ్యానాభ్యాసులకు ఇదొక భగవద్గీత వంటిది.

దీనిలోని అన్ని సాధనలను శ్రీరామకృష్ణులు తమ సాధనా కాలమున కొద్ది రోజులలో సాధించగలిగినారు. మనబోటి సామాన్యులకు వీటిలోని ఒక సాధనకు ఒక జన్మ పడుతుంది.

దాదాపు తొమ్మిదేళ్ళ క్రితం నేను బ్లాగు వ్రాయడం ప్రారంభించిన కొత్తల్లో 'విజ్ఞాన భైరవతంత్రం' మీద వరుసగా పోస్టులు వ్రాద్దామని అనుకున్నాను. అది నాకు చాలా ఇష్టమైన పుస్తకం, ఎందుకంటే, చిన్నప్పటి నుంచీ నేను చేసిన సాధనలు దానిలో చాలా ఉన్నాయి. కానీ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదీ అందరికీ చెప్పడం ఎందుకు? అన్న ఉద్దేశ్యంతో ఆ ప్రయత్నాన్ని విరమించాను. అది "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" నుంచి పుస్తకంగా విడుదలయ్యే ముహూర్తం ఇప్పటికి వచ్చింది.

దీనికి అనేక వ్యాఖ్యానములు ఎప్పటినుంచో ఉత్తర భారతదేశమున ఉన్నవి. నవీన కాలపు వివాదాస్పద గురువులలో ఓషో రజనీష్ దీనిపైన ఉపన్యాసాలిచ్చాడు. బైటకు చెప్పినా చెప్పకున్నా మోడరన్ గురువులందరూ చాలావరకూ దీనినే అనుసరిస్తున్నారు. ఈ గురువులందరూ వారి వారి అనుభవములను బట్టి జ్ఞానమును బట్టి దీనిని వ్యాఖ్యానించారు. నేను కూడా నా అనుభవములను ఆధారము చేసికొని దీనికి వ్యాఖ్యానమును వ్రాశాను.

ఇదొక ప్రాక్టికల్ గైడ్ బుక్. కానీ దీనిలోని ధారణల లోతుపాతులు అనుభవం ఉన్న గురువు దగ్గర వ్యక్తిగతంగా నేర్చుకున్నప్పుడే అర్ధమౌతాయి. నా శిష్యులలో అర్హులైనవారికి, నమ్మకంగా నన్ను అనుసరించేవారికి ఈ ధారణల లోతుపాతులను ప్రాక్టికల్ గా నేర్పించడం, అసలైన తంత్రసాధన అంటే ఏమిటో వారికి రుచి చూపించడం జరుగుతుంది.

అతి తక్కువకాలంలో (మూడు వారాలలో) ఈ పుస్తకాన్ని వ్రాయడంలో ఎంతో సహకరించిన నా అమెరికా శిష్యులకు కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

ఈ E-Book కావలసిన వారు google play books నుంచి డౌన్లోడ్ చేసుకొనవచ్చును.