నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, ఆగస్టు 2018, శుక్రవారం

బ్లాగు భేతాళ కధలు - 5 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)


ఈ సంభాషణ జరిగిన తర్వాత ఒకటి రెండు నెలలపాటు సూర్య మళ్ళీ నాకు ఫోన్ చెయ్యలేదు. 'ఏం జరిగిందో ఏమోలే!' అని నేనూ తనని కదిలించలేదు. ఇలా ఉండగా ఉన్నట్టుండి ఒకరోజున మళ్ళీ సూర్యనుంచి ఫోనొచ్చింది.

'ఏమైంది సూర్యా? నీ సమస్య తీరిందా? హోమం చేయించావా? మీ ముత్తాత ఇంకా అటకమీదే ఉన్నాడా వెళ్ళిపోయాడా?' అడిగాను.

'ఏమో ఎవరికి తెలుసు? ఇప్పుడాయన్ని పట్టించుకోవడం మానేశాం' అన్నాడు.

'అదేంటి మరి? ఇప్పుడెవర్ని పట్టించుకుంటున్నావ్?' అడిగాను.

'అదో పెద్ద కధలే. ఈ రెండు నెలల్లో చాలా జరిగింది.' అన్నాడు.

'ఏంటో చెప్పు మరి.' అన్నాను ఉత్సాహంగా.

చెప్పడం మొదలుపెట్టాడు సూర్య.

'ఒకరోజున అర్జెంటుగా రమ్మని స్వామీజీనుంచి ఫోనొచ్చింది నాకు. ఆశ్రమానికి వెళ్లాను. అక్కడే మాతాజీ పరిచయమైంది.' అన్నాడు.

'మధ్యలో ఈమెవరు?' అడిగాను.

'స్వామీజీ తర్వాత ప్రస్తుతం నెంబర్ టు పొజిషన్ లొ ఉంది. ఈమె పేరు మాతా దివ్యభారతి' అన్నాడు.

'అదేంటి అదేదో హీరోయిన్ పేరులా ఉందే? ఆమె ఏదో యాక్సిడెంట్లో చనిపోయింది కదూ?' అడిగాను నాకున్న కొద్దో గొప్పో సినిమా నాలెడ్జి ఉపయోగిస్తూ.

'అవును. చెప్తా విను. స్వామీజీగా మారకముందు ఈయన హైదరాబాద్ లో ఒక కోచింగ్ సెంటర్ నడిపేవాడు. ఆ టైంలో దివ్యభారతి అని ఒక సినిమా యాక్టర్ ఉండేది. ఈయన ఆమెకు వీరాభిమాని. అప్పట్లో దివ్యభారతి ఫాన్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు కూడా. ఆమె అర్ధాంతరంగా చనిపోయింది. ఆ బాధలో ఈయన చాలాకాలం పిచ్చోడిలా హైదరాబాద్ రోడ్లమీద తిరిగాడు. అందుకని స్వామీజీగా మారాక కూడా తన అభిమాన నటిని మర్చిపోలేక తన శిష్యురాలికి ఆ పేరు పెట్టుకున్నాడు' అన్నాడు.

'పాపం ! ఆ తారంటే లవ్వు చాలా ఎక్కువగా ఉన్నట్టుందే? సన్యాసాశ్రమం స్వీకరించాక కూడా పూర్వాశ్రమాన్ని మర్చిపోలేక పోతున్నాడల్లే ఉంది.' అన్నాను.

'నాకూ అలాగే అనిపించింది.' అన్నాడు సూర్య.

'సర్లే కథలోకి రా' అన్నాను.

'నేను వెళ్లేసరికి 'ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టాన్ని' ఎంతో రసవత్తరంగా ఒక గంటనుంచీ ఉపన్యాసం చెబుతున్నాడు స్వామీజీ' అన్నాడు సూర్య.

నేను పడీ పడీ నవ్వాను.

'ఏం? అంతకంటే మంచిఘట్టం ఇంకేమీ దొరకలేదా ఆయనకు?' అడిగాను.

'నవ్వకు. అది ఆయన ఫేవరేట్ ఘట్టాలలో ఒకటి. ఆయనకిష్టమైన ఇంకొక సీన్ - గోపికా వస్త్రాపహరణం' అన్నాడు సూర్య.

'ఇంత దరిద్రంగా ఉందేంటి స్వామీజీ టేస్ట్? మన పురాణాల్లో ఈ ఘట్టాలు తప్ప ఇంకేమీ లేవా అంతలా వర్ణించి చెప్పడానికి ?' అడిగాను అయోమయంగా.

'ఉన్నాయి. అవి ఇంకా ఘోరంగా ఉంటాయి. నీళ్ళ మధ్యలో ఉన్న పడవలోనే మత్స్యగంధికి పరాశరమహర్షి ఏ విధంగా గర్భాధానం చేశాడో కూడా రెండుగంటలపాటు బోరు కొట్టకుండా వర్ణించగలడు ఆయన' అన్నాడు సూర్య తనూ నవ్వుతూ.

'అదేంటి? గర్భాధానాలూ, సద్యోగర్భాలూ, ప్రసవాలూ ఇవా ఆయన చెప్పేది, వీళ్ళు వినేది? దీనికంటే ఆ వస్త్రాపహరణ ఘట్టాలే నయమేమో? ఇలాంటి కధలు తప్ప, ఒక ఉన్నతమైన ఫిలాసఫీ గాని, ఒక elevated thinking గాని ఉండవా ఆయన ఉపన్యాసాలలో?' అడిగాను నేను మళ్ళీ అమాయకంగా.

'ఏదో ఒకట్లే ! ఆయన అలాంటి కధలే చెబుతున్నాడు. ఆయన టేస్ట్ అది ! మధ్యలో నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తే నేనేం చేసేది?' అన్నాడు సూర్య విసుగ్గా.

'సర్లే చెప్పు' అన్నా నోటిమీద వేలేసుకుంటూ.

'ఉపన్యాసం అయిపోయింది. జనం అంతా, గొప్ప కధను వినిన తన్మయత్వంలో, జోంబీల్లా తూలుతూ ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. నేను మెల్లిగా స్వామీజీ దగ్గరకు వెళ్లాను.

నన్ను చూస్తూనే స్వామీజీ కోపంగా - ' ఏమండి? మేము చెప్పిన ఆదేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు. ఇది మీకు మంచిది కాదు. ఒక ప్రేతాత్మను అలా ఇంట్లో ఉంచుకోకండి. ముందు ముందు మీకుగాని మీ ఫేమిలీకి గాని ఏదైనా జరిగితే నేను బాధ్యున్ని కాను.' అన్నాడు.

'కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికి హోమం చేయించలేను స్వామీజీ. నన్నర్ధం చేసుకోండి' అన్నాను ఆయన కాళ్ళకు ప్రణామం చేస్తూ.

సాలోచనగా తల పంకించాడు స్వామీజీ.

'అర్ధమైంది. ప్రేతాత్మ శక్తి చాలా ఎక్కువగా ఉంది. అందుకే మిమ్మల్ని హోమం చెయ్యనివ్వడం లేదది. సరే. ఒక ఉపాయం చెప్తాను. చేస్తారా మరి?' అన్నాడు కోపంగా.

'చెప్పండి స్వామీ' అన్నాను నేనూ నిజంగానే భయపడుతూ.

ఆయన వెంటనే పక్కనున్న మాతా దివ్యభారతి వైపు తిరిగి ' మాతాజీ ! ఈయనకు ప్రత్యంగిరా మంత్రాన్ని ఉపదేశించండి.' అంటూ నావైపు తిరిగి - 'ఈ మంత్రాన్ని కోటిసార్లు జపం చేసి ఆ తర్వాత మళ్ళీ రండి. అప్పుడు మీరు హోమం చెయ్యగలుగుతారు.' అన్నాడు.

మాతాజీ వైపు చూశాను. అప్పటిదాకా నా వైపే చూస్తున్న మాతాజీ నేను చూడగానే తల దించుకుంది. నేను క్యూలోనుంచి జరిగి మాతాజీ ముందుకొచ్చాను.

ఆ మాతాజీ దగ్గర ఒక కాగితాల కట్ట ఉంది. స్వామీజీ చెప్పినవారికి చెప్పినట్లు కాగితం మీద మంత్రాలను వ్రాసి జనానికి ఇస్తోంది. అలా నాకూ ఒక కాయితం ఇచ్చింది.

'అందులో ఆ మంత్రం ఉందా?' అడిగాను నేను కుతూహలంగా.

'లేదు. ఆమె ఫోన్ నంబరుంది' అన్నాడు సూర్య చాలా సీరియస్ గా.

బిత్తరపోయాన్నేను.

'ఇదేంటి కధ ఇలా ట్విస్ట్ అయింది? తన ఫోన్ నంబర్ని నీకిచ్చిందా?' అన్నాను ఆశ్చర్యంగా.

'ఆ! లేకపోతే నీ ఫోన్ నంబర్ ఇస్తుందా? ముందు నేనూ నీలాగే ఆశ్చర్యపోయాను. తలెత్తి ఆమెకేసి చూశాను. 'ప్లీజ్. అర్ధం చేసుకోండి' అన్నట్లు సైగ చేసింది కళ్ళతో.' అన్నాడు సూర్య.

'మరి స్వామీజీ ఇదంతా చూడలేదా?' అడిగాను ఆశ్చర్యంగా.

'ఆయన ఇంకో కస్టమర్ తో బిజీగా ఉన్నాడు. మమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు' అన్నాడు సూర్య.

'డామిట్ ! కధ అడ్డం తిరిగినట్టుందే?' అనుకున్నా మనసులో.

(ఇంకా ఉంది)