Pages - Menu

Pages

21, ఆగస్టు 2018, మంగళవారం

బ్లాగు భేతాళ కధలు - 6 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)

'మాతాజీతో తర్వాతి సమావేశం 'శ్రావణమోసం' లో జరిగింది.' అన్నాడు సూర్య.

'అదేంటి? శ్రావణమోసమా? శ్రావణమాసం విన్నానుగాని. శ్రావణమోసం వినలేదే? ఇదేదైనా కొత్త ఆధ్యాత్మిక కార్యక్రమమా?' అడిగాను కుతూహలంతో.

'అవును. నాకూ ఈ మధ్యనే తెలిసింది. బిజినెస్ లో కొత్త కొత్త ప్రాడక్ట్స్ విడుదల చేసినట్లు ఈ స్వామీజీలు కూడా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకు - నిన్నొక లక్షరూపాయలు ఆశ్రమానికి డొనేషన్ అడిగామనుకో. వెంటనే ఇస్తావా?' అడిగాడు సూర్య.

'కొంచం ఆలోచిస్తాను' చెప్పాను.

'అదే ఒక వెయ్యి రూపాయలు అడిగితే?' మళ్ళీ అడిగాడు సూర్య.

'అదెంత పని? కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాను.' అన్నాను.

'అదే మరి ట్రిక్ అంటే! అందుకని, వెయ్యిమందితో వెయ్యి హోమగుండాలతో 'లలితాహోమం' అని పెడతారు. ఒక్కొక్క జంట నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు. మొత్తం పది లక్షలు వస్తుంది. ఏర్పాట్లకు అయిదు లక్షలు పోయినా ఒక్కరోజులో అయిదు లక్షలు మిగుల్తుంది. దీనికి శ్రావణమాసం అనే సెంటిమెంట్ జత చేస్తారు. 'శ్రావణ మాసం-అమ్మవారి పూజ' అనేది డెడ్లీ కాంబినేషన్. దీనికి పడని హిందూ కుటుంబం సాధారణంగా ఉండదు. ఈ రకంగా శ్రావణమాసంలో  వచ్చే నాలుగు వీకెండ్స్ లో కలిపి నెలకు ఇరవై లక్షలు మిగుల్తుంది. ఎవరికొస్తుంది అంత డబ్బు?  అమెరికాలో గూగుల్లో పనిచేసే టాప్ ఎండ్ సాఫ్ట్ వేర్  ఇంజనీర్ కి కూడా అంత నెలజీతం రాదు. ఇదీ "శ్రావణ మోసం" అంటే !' అన్నాడు సూర్య.

నాకమాంతం కళ్ళు తిరిగాయి.

'బాబోయ్ ! రెలిజియస్ సెంటిమెంట్ తో ఎంత బిజినెస్ జరుగుతోంది?' అనుకున్నా.

'అదేమరి ! అందుకే నిన్ను త్వరగా స్వామీజీ అవతారం ఎత్తమని చెప్పేది!' అన్నాడు సూర్య నా మనసులో మాటను పట్టేసి.

'ఎత్తినా మనకలాంటి పనులు చేతకావులే! ఇప్పటికి చేస్తున్న పూజలే వదిలెయ్యమని నేను చెబుతుంటే, ఇలాంటి వేషాలు మనకెలా కుదురుతాయి?' అడిగా నేను.

'సరే ఏదో ఒకటి చెయ్యిగాని, కధ విను. ఆ హోమం సందర్భంగా మళ్ళీ మాతాజీని కలిసే అవకాశం దొరికింది.'  అన్నాడు.

'అదేంటి? ఆమె  ఫోన్ నంబర్ ఇచ్చిందిగా? నువ్వు మధ్యలో ఫోన్ చెయ్యలేదా?' అడిగాను.

'లేదు. ఈ మధ్యన ఫోన్ టాక్ రికార్డ్ చేసి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ముందుగా ఫోన్ చేసి మనల్ని వాళ్ళే టెంప్ట్ చేస్తారు. మనం కొంచం బేలన్స్ తప్పి మాట్లాడితే అది రికార్డ్ చేసి ఇక మన తాట వలుస్తారు. ఈ గోలంతా ఎందుకని భయం వేసి ఫోన్ చెయ్యలేదు.' అన్నాడు.

'సరే హోమంలో కలిసిన మాతాజీ  ఏమంది?' అడిగాను.

'అక్కడేం మాట్లాడలేదు. చాలా సీరియస్ గా ఉంది. కానీ హోమం అయిపోతూ ఉండగా ఒకాయన వచ్చి 'మాతాజీ మిమ్మల్ని రమ్మంటున్నారు' అని చెప్పాడు. ఆమె రూమ్ కి వెళ్లాను. అక్కడ మాట్లాడటం జరిగింది.' అన్నాడు.

'ఏం మాట్లాడింది?' అడిగాను.

'చాలా చెప్పింది. మొదట్లో ఈమెకూడా 'అష్టసిద్ధులను అరచేతిలో ఉంచుకున్న ప్రత్యంగిరానంద' అనే చుండూరి సోమేశ్వర్ వీడియోలు చూసి ఫ్లాట్ అయిపోయి ఈ స్వామీజీని ఎలాగైనా కలవాలని అనుకుందట.' అన్నాడు.

'ఈ చుండూరి శాల్తీకి వేరే పనేమీ లేదా? ఇలాంటి చవకబారు వీడియోలు చేసి జనాన్ని బురిడీ కొట్టించకపోతే?' అడిగాను.

'ఆ విషయం కూడా చెప్పింది. ఇతను స్వామీజీ ఏజంట్ ట. ఇలా వీడియోలు చేసి, ఉన్నవీ లేనివీ అబద్దాలు చెప్పి జనాన్ని స్వామీజీ వైపు ఆకర్షించడం అతని పని. వీళ్ళిద్దరి మధ్యనా డీల్ అది.' అన్నాడు సూర్య.

'ఓహో. అలా చేసినందుకు డబ్బులిస్తాడేమో స్వామీజీ?' అడిగాను  అనుమానంగా.

'భలే పిచ్చోడివి నువ్వు! స్వామీజీ అంటే ఏమనుకుంటున్నావ్?   హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివినవాళ్ళు కూడా ఆయన ముందు బలాదూరే. సోమేశ్వరే ఎదురివ్వాలి స్వామీజీకి.' అన్నాడు సూర్య.

మతిపోయింది నాకు. 'అదేంటి?' అన్నా.

'అవును. నా మీద నువ్వు వీడియో చేశావ్. దాన్ని లక్షమంది చూశారు. ఆ కౌంట్ ని బట్టి గూగుల్ వాడు నీకు డబ్బులిస్తున్నాడు. అంటే నా ఇమేజిని నువ్వు క్యాష్ చేసుకుంటున్నావ్. కనుక నీకొచ్చే డబ్బుల్లో నాకు షేర్ ఇవ్వమనిచెప్పి సోమేశ్వర్ ముక్కుపిండి మరీ లాగుతాట్ట స్వామీజీ.' అన్నాడు సూర్య.

'ఇదంతా నీకెలా తెలుసు?' అడిగా అనుమానంగా.

'నాకు తెలీదు. మాతాజీ దగ్గర చెప్పుకుని ఏడిచాట్ట సోమేశ్వర్. సరే, ఇదంతా ఇప్పటి సంగతి. మనం ఇంకా  ఆ సీన్ లోకి రాలేదు.  మాతాజీ ఇంకా మాతాజీ కానప్పటి రోజుల్లో ఉన్నాం.' అప్పట్లో ఆమె సోమేశ్వర్ వీడియోలు చూసింది.' అన్నాడు సూర్య.

'సరే చెప్పు'  అన్నా బుద్ధిగా.

'ఆ తర్వాత స్వామీజీ ఉపన్యాసాలు వినడానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం కోసం క్యూలో నిలబదిందట.' అన్నాడు సూర్య.

'అదేంటి? వస్త్రాపహరణాలూ గర్భాధానాలూ ఇలాంటి కధలు విన్న తర్వాత కూడా ఇంకా ఆయన దర్శనం కోసం క్యూలో నిలబడిందా?' అడిగాను నేను హాశ్చర్యపోతూ.

'అబ్బా ! మధ్యలో అడ్డు తగలకు. చెప్పేది విను. ఫ్లో ఆగిపోతుంది' అని విసుక్కున్నాడు సూర్య.

'సారీ సారీ ! చెప్పు' అన్నా చెంపలేసుకుంటూ.

'అలా క్యూలో నిలబడి సాయిబాబాను ప్రార్ధిస్తూ ఇలా అనుకుందిట ' హే సాయిబాబా! ఇన్నాళ్ళూ ఒక గురువుకోసం ఎంతో వెదికాను. దొరకలేదు. ఇప్పుడైనా నా గురువును నాకు చూపించవా?'

'అదేంటి? మధ్యలో సాయిబాబా ఎందుకు?' అడిగాడు నాలోని సందేహసుందరం.

'అదే మరి! నీకీ డౌట్ వస్తుందని నేను ముందే ఊహించా గాని విను. ఈ స్వామీజీ వలలో పడకముందు ఈమె సాయిబాబా భక్తురాలు.' అన్నాడు సూర్య.

'వలలో పడిందా? అదేంటి ఆమేమైనా చేపా అలా వలలో పడటానికి?' అడిగా నేను మళ్ళీ అయోమయంగా.

'నువ్వు మరీ నటించకు! ఏదో మాటవరసకి అన్నానని నీకర్ధమైఁదని నాకర్ధమైంది' అన్నాడు సూర్య.

'సరే సరే చెప్పు' అన్నా నాల్గోసారి నోటిమీద వేలేసుకుంటూ.

'ఆమె అలా క్యూలో నిలబడి ప్రార్ధిస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ఉన్నట్టుండి ఆమె చెవులో ఒక స్వరం - 'ప్రత్యంగిరానందే నీ గురువు. ప్రత్యంగిరానందే నీ గురువు.' అంటూ స్టీరియో సౌండులో వినిపించింది. ఆమె అదిరిపడి వెనక్కు చూసింది ఎవరైనా క్యూలో వెనకనుంచి చెవులో చెబుతున్నారేమో అని. కానీ ఆమె వెనుక ఒక చిన్నపిల్లాడు నిలబడి ఉన్నాడు. ఆమె బిత్తరపోయి, అది సాయిబాబా ఆదేశమని, ఈయనే తన గురువన్న నిశ్చయానికి వచ్చేసింది.' అన్నాడు సూర్య.

'అదెలా సాధ్యమబ్బా? మాతాజీ నీకు టోపీ వేసినట్టుంది.' అన్నాను.

'కాదు. నీకన్నీ అనుమానాలే. స్వామీజీ దగ్గర కర్ణపిశాచి అని ఒక క్షుద్రశక్తి ఉంది. దాని సహాయంతో తను అనుకున్న వారి చెవిలో తను అనుకున్న మాటలు అలా చెప్పిస్తాడు. ఈ సంగతి మాతాజీ అయ్యాక ఆమెకు తెలిసిందిట.' అన్నాడు సూర్య.

'ఒక చిన్న డౌట్. కర్ణపిశాచి ఆడది కదా? మగగొంతుతో సాయిబాబాలా ఎలా మాట్లాడింది? - అడిగాను.

'అంటే పిశాచికి మిమిక్రీ రాదని నీ ఉద్దేశ్యమా? లేక రాకూడదా? నువ్వే రకరకాల గొంతులు పెట్టి పాటలు పాడుతున్నావు. అది పిశాచి. నీ మాత్రం టాలెంట్ దానికి ఉండదా?' అడిగాడు సూర్య సీరియస్ గా.

'అబ్బే అలా కాదు. కానీ సాయిబాబా భక్తురాలి చెవిలో కూడా అలా చెప్పగల శక్తి ఆ పిశాచికి ఉంటుందా?' మళ్ళీ అడిగాను.

'సాయిబాబా భక్తురాలని ఈమె అనుకుంటోంది. కానీ ఈమె ఎవరో సాయిబాబాకి తెలియాలని గ్యారంటీ ఏమీ లేదు. మన భయం, మన గిల్టీ ఫీలింగూ పోవడం కోసం 'నేను ఫలానా భక్తుడిని' అని మనం అనుకోవచ్చు. అది నీ చాయిస్. కానీ నువ్వలా అనుకున్నంత మాత్రాన ఆ దేవుడు నీ వెంటనంటి ఉండాలని రూలేమీ లేదు. నువ్వెవరైనా పిశాచికి ఒకటే. అది అలా చెప్పగలదు' అన్నాడు సూర్య.

'ఓకే. కానీ ఇంకో డౌట్. ఈమె చెవిలోనే ఎందుకలా చెప్పించాడు స్వామీజీ?' అనడిగా నేను.

నవ్వాడు సూర్య.

'ఇప్పుడు...ఇప్పుడు నీకు కరెక్టు డౌటొచ్చింది. ఎందుకంటే క్యూలో ఉన్న ఈమెమీద స్వామీజీ కన్ను పడింది. అలా ఎందుకూ అంటే..తన అభిమాన నటి దివ్యభారతి పోలికలు ఈమెలో ఉన్నాయి గనుక. ఆ పోలికలు చూచిన స్వామీజీ వెంటనే కర్ణపిశాచి మంత్రాన్ని జపించి ఆమె చెవులో అలా చెప్పమని దానికి మెసేజి పాస్ చేశాడు. వెంటనే అది ఆ పనిని చేసేసింది. ఆ విధంగా ఈ స్వామీజీనే తన గురువన్న నమ్మకానికి ఈ అమ్మాయి వచ్చేసింది. ఆ విధంగా ఆమెను తన బుట్టలో వేసుకున్నాడన్న మాట స్వామీజీ.' అన్నాడు సూర్య.

'బుట్టలో వేసుకోడానికి ఈమెమైనా కోడిపిల్లా?' అన్న మాట నోటిదాకా వచ్చిందిగాని సూర్య తిడతాదని భయమేసి మింగేశాను.

తమాయించుకుని - 'అంటే కొన్ని క్షుద్రవిద్యలు ఈ స్వామీజీ దగ్గర ఉన్నాయన్న మాట' - అన్నాను.

ఇలా అంటుండగానే కరెంట్ పోయింది. అదే మాట సూర్యతో చెప్పాను ఫోన్లో.

'చూశావా మరి? అదే స్వామీజీ పవరంటే! నువ్వాయన్ను అనుమానించావు గనుక మీ ఇంట్లో కరెంట్ పోయింది. ఖచ్చితంగా ఈయనకు కొన్ని క్షుద్రశక్తులున్నాయి. ఆ కధంతా తర్వాత చెబుతాను.' అన్నాడు సూర్య.

'ఏడిచినట్టుంది నీ గోల. ఒక్క మా ఇంట్లోనే పోలేదు కరెంటు. ఊరంతా పోయింది.' అన్నాను నేను కిటికీలోంచి బయటకు చూస్తూ.

'అంతేమరి ! స్వామీజీని నమ్మని వాళ్ళున్న ఊర్లో అలాగే జరుగుతుంది' అన్నాడు సూర్య నవ్వుతూ.

'అవును ! ఇప్పుడు నా చెవులో కూడా ఎవరో చెబుతున్నారు. 'సూర్య చెప్పేది నిజం సూర్య చెప్పేది నిజం' అంటూ. బహుశా మనిద్దరం ఇలా మాట్లాడుకుంటున్నట్లు స్వామీజీకి తెల్సిపోయి ఉంటుంది.' అన్నా నేనూ నవ్వుతూ.

(ఇంకా ఉంది)