Pages - Menu

Pages

27, ఆగస్టు 2018, సోమవారం

బ్లాగు భేతాళ కధలు - 7 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)

va
'అసలు స్వామీజీకి ఈ క్షుద్రశక్తులెలా వచ్చాయి?' అడిగాను.

'అదంతా పెద్ద కధ. నాకూ తెలీదు. మాతాజీ చెప్పింది.' అన్నాడు సూర్య.

'ఎంత పెద్ద కధైనా సరే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను' అన్నాన్నేను.

'సరే నీ ఖర్మ ! విను ! హైదరాబాద్ లో చదువుకుంటున్నప్పుడే, అంటే దాదాపు ఏభై ఏళ్ళ క్రితమే, స్వామీజీ తెలుగు సినిమాలు బాగా చూసేవాడు. వాటిల్లో ఆయనకు బాగా నచ్చిన సినిమాలు కొన్నున్నాయి. అవే - బాలనాగమ్మ, పాతాళభైరవి, మహామంత్రి తిమ్మరుసు, శ్రీనాధ కవిసార్వభౌముడు' అన్నాడు సూర్య.

'అదేంటి ఆయన టేస్ట్ అలా ఉంది? ఆయన ఎన్టీఆర్ వీరాభిమానా?' అడిగాను.

'కాదు. మంత్రతంత్రాల అభిమాని. జానపద చిత్రాల అభిమాని' అన్నాడు.

'నేనూ అంతేగా ! మా ఇద్దరి టేస్టూ ఒకటే ఈ విషయంలో' అన్నా నేనూ నవ్వుతూ.

'అవునా? ఆ సినిమాలు చూసి వాటిల్లోని మాంత్రికులలాగా ఈయన ఫీలై పోతూ ఉండేవాడు. ఎవరైనా హీరోతో ఐడెంటిఫై   అవుతారు. కానీ ఈయన విలన్ తో అయ్యేవాడు. ఆ సినిమాల్లోని మాంత్రికులే ఈయన రోల్ మోడల్స్. తన ఇల్లు కూడా బాలనాగమ్మ సినిమాలో మాంత్రికుడి గుహలాగా కట్టించుకున్నాడు. ఎన్నో క్షుద్రదేవతా విగ్రహాలను ఆ ఇంట్లో పెట్టించుకున్నాడు. వీళ్ళింటికి వెళితే, వాటిని దాటుకుంటూనే మనం ఈయన్ను కలవాలి. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయలు లాగా, తిమ్మరుసు లాగా, శ్రీనాధుడిలాగా తనను తాను ఊహించుకుంటూ ఊహల్లో బ్రతుకుతూ ఉండేవాడు. ఆ క్రమంలో - 'పూర్వజన్మలో వీళ్ళందరూ తానే' అన్న గట్టి నమ్మకానికి వచ్చేసాడు.' అన్నాడు సూర్య.

'ఇదొక మానసిక రోగం సూర్యా! దీనినే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. ఇలాంటి వాళ్ళు తమను తాము పురాణపురుషుల లాగా ఊహించుకుంటూ ఉంటారు. అంతేకాదు, తమ చుట్టూ ఉన్నవాళ్ళను కూడా ఆ జన్మల్లో తమ అనుచరులుగా భావిస్తూ ఉంటారు. నేటి కుర్రకారులో కూడా చాలామంది సినిమా హీరోల లాగా ఊహించుకుంటూ జీవితంలో అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అవే డైలాగులు చెబుతూ ఉంటారు. వీళ్ళంతా మానసిక రోగులు. హిస్టీరియా ఫస్ట్ స్టేజిలో ఉన్నవాళ్ళు. వీళ్ళకు సైకియాట్రీ ట్రీట్మెంట్ అవసరం.' అన్నాను.

'భలే చెప్పావ్ ! అలాగే జరిగింది.' అన్నాడు సూర్య.

'ఏమైంది? పిచ్చాసుపత్రిలో చేరాడా ఈయన?' అన్నా నేనూ ఉత్సాహంగా.

'లేదు. ఇలాంటి పిచ్చోడే ఇంకోడు ఈయనకు పరిచయం అయ్యాడు' అన్నాడు సూర్య.

'అవునా? ఎవరాయన? ఏమా కధ?' అడిగాను.

'అతని పేరు తిమ్మయ్య గౌడ్. ఇతను హైదరాబాద్ చుట్టుపక్కల, నల్గొండ, మిర్యాలగూడెం పరిసరాల్లో దొంగసారా బట్టీల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. కాలక్రమేణా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తిమ్మయ్య పేరు చూసి, ఇతనే పూర్వజన్మలో మహామంత్రి తిమ్మరుసని, తను క్రిష్ణదేవరాయలనీ అనుకున్నాడు స్వామీజీ.' అన్నాడు సూర్య.

'ఇంకా నయం. తను డాన్ క్విక్జోట్ అనీ, తిమ్మణ్ణి శాంకోపాంజా అనీ అనుకోలేదు సంతోషం' అన్నా నేను నవ్వుతూ.

'వాళ్ళెవరు?' అన్నాడు సూర్య ప్రశ్నార్ధకంగా.

'వాళ్ళా? నీ పూర్వజన్మలో నా బంధువుల్లే ! నువ్వు కానీ !' అన్నా నేను.

'నువ్వొకడివి. ఈ స్వామీజీకి తోడుబోయినట్టే ఉన్నావ్ ! అర్ధం కాని కేరెక్టర్స్ పేర్లు చెబుతూ ఉంటావ్!' అన్నాడు సూర్య.

'అది సరే ! కనీసం కామన్ సెన్స్ కూడా లేనట్టుందే ఈ స్వామీజీకి ! మహామంత్రి తిమ్మరుసు ఈ జన్మలో దొంగసారా బట్టీల వ్యాపారం ఎందుకు చేస్తాడు? తను గతజన్మలో కృష్ణదేవరాయలు అయితే ఈ జన్మలో కోచింగ్ సెంటర్ ఎందుకు నడుపుతాడు? కనీసం ఈ ఆలోచనైనా రాలేదా ఆయనకీ?' అడిగాను.

'ఏమో నాకదంతా తెలీదు. నువ్వు చెప్పినట్టే ఈ స్వామీజీకి ఏదో మానసిక రోగం ఉన్నట్టే ఉంది' అన్నాడు సూర్య.

'సరే. ఈ తిమ్మడు ఈయనకెలా పరిచయం అయ్యేడు?' అడిగా.

'వీళ్ళిద్దరికీ ఎక్కడ పరిచయమయిందీ తెలియాలంటే, అంతకంటే ముందు నీకు సుద్ధంకి రామ్మూర్తి గురించి చెప్పాలి' అన్నాడు సూర్య.

'మధ్యలో ఈ కేరెక్టర్ ఎవరు? నీ ఇష్టం వచ్చినట్టు కొత్త కొత్త క్యారెక్టర్స్ ని ప్రవేశపెడుతూ పోతే కధ చాలా పెద్దదై పోతుంది. తర్వాత నేను ఎడిట్ చెయ్యలేను' అన్నా నేను తనని ఉడికిస్తూ.

'ఇతనే ఈ కధలోకెల్లా చాలా ముఖ్యమైన కేరెక్టర్. విను. ఈ సుద్ధంకి రామ్మూర్తి ఒక మహామాంత్రికుడు. మనకు తెలిసిన బాబాల కంటే గొప్ప మహత్యాలు నిజంగా చెయ్యగల శక్తిమంతుడు. మంత్రతంత్రాలు నేర్చుకోడం కోసం స్వామీజీ ఈ రామ్మూర్తి దగ్గరకు పోతూ ఉండేవాడు. ఆయన దగ్గరే ఇతను ప్రత్యంగిరా మంత్రం నేర్చుకున్నాడు. దాన్ని సాధించాలంటే, సారాయి త్రాగి రాత్రిపూట నగ్నంగా స్మశానంలో కూచుని తెల్లవార్లూ జపం చెయ్యాలి. ఆ సారాయి కోసం తిమ్మయ్య గౌడ్ ని సారాబట్టీలో అప్రోచ్ అయ్యాడు స్వామీజీ. అలా వీళ్ళిద్దరికీ పరిచయం అయింది.' అన్నాడు సూర్య.

'ఏడిసినట్టుంది వీళ్ళ పరిచయం! అదేదో గాంధీకీ నెహ్రూకీ పరిచయం అయినట్టు చెబుతున్నావే? ఇంతకీ ప్రత్యంగిరామంత్రం ఈయనకు సిద్ధించిందా?' అడిగా నేను నవ్వుతూ.

'అదేమో నాకు తెలియదుగాని రోజూ సారాయి పుచ్చుకోవడం మాత్రం బాగా సిద్ధించింది. ఆ మత్తులో కూచుని వాగుకుంటూ 'నువ్వు కృష్ణదేవరాయలు, నేను తిమ్మరుసు, నువ్వు ప్రోలయ వేమారెడ్డి, నేను శ్రీనాధకవి సార్వభౌముడను అని ఇద్దరూ మురిసిపోతూ ఉండేవారు' అన్నాడు సూర్య.

పగలబడి నవ్వాను నేను.

'భలే బాగుంది కధ ! ఇంకా చెప్పు' అన్నా.

'ఇలా ఉండగా, ఈ స్వామీజీ మాయమాటలు నమ్మి కొందరు ఈయన చుట్టూ చేరడం మొదలుపెట్టారు. వాళ్లకు ఇలాగే కాకమ్మ కబుర్లు చెబుతూ, తనకు తోచిన మంత్రాలు వాళ్లకు ఉపదేశిస్తూ వాటిని జపించమని చెబుతూ ఉండేవాడు. ఆ మంత్రాలన్నింటినీ కోటీ సెంటర్లో ఆదివారంనాడు ఫుట్ పాత్ మీద అమ్మే పుస్తకాలలో తను కొన్న 'మళయాళ మంత్ర రహస్యములు' అనే పుస్తకం నుంచి సేకరించి వీళ్ళకు ఉపదేశిస్తూ ఉండేవాడు. ఇంకొంతమంది చేత, అర్ధరాత్రిపూట ఎండు మిరపకాయలు, మిరియాలు, ఆవాలు, బొగ్గులు, వెంట్రుకలు... ఇలాంటి వాటితో నానా ఛండాలపు హోమాలు చేయిస్తూ ఉండేవాడు. ఆ హోమాలన్నింటికీ తిమ్మరుసు ఇంచార్జిగా ఉండేవాడు. సారా బిజినెస్సు కంటే ఇదే బాగుందనిపించిన తిమ్మరుసు సారాబట్టీలు మూసేసి, హోమాలు చేయించడంలో బిజీ అయ్యాడు. అక్కడైతే, పోలీస్ రైడ్స్, ఎక్సైజ్ వాళ్ళను మేపడం ఈ గోలంతా ఉండేది. ఇక్కడదేమీ లేదు. ఒక్కో హోమానికి పదివేల నుంచి, లక్షదాకా వసూలయ్యేది. రోజుకు కనీసం నాలుగు హోమాలు జరిగేవి. రోజుకు ఎంత లేదన్నా మినిమం రెండు లక్షలు మిగిలేది.

వీళ్ళ కొత్త బిజినెస్సు ఈ రకంగా బ్రహ్మాండంగా సాగుతూ ఉండగా ఒక విచిత్రం జరిగింది. ఒకరోజున స్వామీజీ పూజించే ప్రత్యంగిరాదేవత విగ్రహం ఏరోప్లేన్ లాగా గాల్లోంచి తేలుకుంటూ వచ్చి ఈయన ఇంటి డాబామీద దిగి, మెట్లమీదుగా నడుచుకుంటూ కిందకొచ్చి, ఒక గదిలో సెటిలైంది.' అన్నాడు సూర్య.

నన్ను నేనే ఒకసారి గట్టిగా గిచ్చుకున్నా.

'చూడు బాసూ ! ఏదో వింటున్నా కదా అని, మరీ కాకమ్మ పిచ్చికమ్మ కధలు చెప్పకు. ఎలా కనిపిస్తున్నా నీకు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది.' అన్నా.

గట్టిగా నవ్వాడు సూర్య.

'అది లోకానికి వీళ్ళు ప్రచారం చేసిన కధ. అసలు కధ ఏంటో నేను చెబుతా విను.' అన్నాడు.

(ఇంకా ఉంది)

26, ఆగస్టు 2018, ఆదివారం

October 19 నుండి 26 వరకూ ప్రమాద సమయం! జాగ్రత్త వహించండి !!

చాలామందికి మూడబోతున్న సమయం అతి దగ్గరలో అక్టోబర్ నెలలో  రాబోతున్నది. అదే 19-10-2018 నుంచి 26-10-2018 వరకూ ఉన్న ఎనిమిది రోజుల గడ్డుకాలం. దీనికి రెండు మూడు రోజులు అటూ ఇటూ కుషన్ గా తీసుకోవచ్చు.

ఈ సమయంలో అనేక ప్రకృతి ప్రమాదాలు జరుగుతాయి. యాక్సిడెంట్లు అవుతాయి. నేరాలు ఘోరాలు పెరుగుతాయి. దీర్ఘవ్యాధులు  అసాధ్య వ్యాధులు బయటపడతాయి. కొందరు పరలోక ప్రయాణం కడతారు కూడా!  చాలామంది జీవితాలు ఈ సమయంలో ఊహించని మార్పులకు లోనౌతాయి. తల్లక్రిందులౌతాయి. ధర్మాన్ని అనుసరించేవారు రక్షింపబడతారు. లేనివారికి శిక్షలు పడతాయి. ఆ పదిరోజుల్లో సరిగ్గా ఉంటే సరిపోదు. గతాన్ని లెక్కలోకి తీసుకుని ఇవన్నీ జరుగుతాయి. రెండు నెలల ముందుగానే హెచ్చరిస్తున్నా!

తస్మాత్ జాగ్రత !!

'విజ్ఞాన భైరవ తంత్రము' - తెలుగు ప్రింట్ పుస్తకం విడుదలైంది

నేడు శ్రావణ పౌర్ణమి. అందుకని ఈ రోజున 'విజ్ఞాన భైరవ తంత్రము' తెలుగు ప్రింట్ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాను. కావలసిన వారు యధావిధిగా pustakam.org నుంచి పొందవచ్చును.

"ఈ - బుక్" అనేది ఒక్క నిముషంలో డౌన్లోడ్ అయ్యేది అయినప్పటికీ, ఎందులోనైనా తేలికగా ఇమిడిపోయేది అయినప్పటికీ, కొంతమందికి పుస్తకాన్ని చేతితో పట్టుకుని చదివితేగాని బాగుండదు, చదివిన 'ఫీల్' రాదు. అలాంటివారికోసం ఈ పుస్తకాన్ని ముద్రణ చేయించడం జరిగింది.

'ఈ - బుక్' చదివిన అనేకమంది - పుస్తకం చిన్నదిగా కన్పించినా ఇందులోని విషయం చాలా లోతైనదనీ, దీనిని అర్ధం చేసుకోడానికి, ఆచరణలోకి తేవడానికి ఒక జన్మ చాలదని అంటున్నారు. అది నిజమే. నేను వ్రాస్తున్నవి ఉబుసుపోని కాలక్షేపం కథల పుస్తకాలు కావు. ఎంతసేపూ డబ్బు, తిండి, విలాసాలు, సోది మాటలతో నిరర్ధకంగా గడుస్తున్న జీవితాలకు జ్ఞాన దిక్సూచుల వలె ఒక దిశను ఇవ్వగల శక్తి వీటికి ఉన్నది. అర్ధం చేసుకుని అనుసరించేవారు, ఆచరించేవారు అదృష్టవంతులు.

ఒకటి రెండు రోజులలో, అంతర్జాతీయ పాఠకుల కోసం ఇదే పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్ 'ఈ - బుక్' గా విడుదల అవుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

21, ఆగస్టు 2018, మంగళవారం

బ్లాగు భేతాళ కధలు - 6 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)

'మాతాజీతో తర్వాతి సమావేశం 'శ్రావణమోసం' లో జరిగింది.' అన్నాడు సూర్య.

'అదేంటి? శ్రావణమోసమా? శ్రావణమాసం విన్నానుగాని. శ్రావణమోసం వినలేదే? ఇదేదైనా కొత్త ఆధ్యాత్మిక కార్యక్రమమా?' అడిగాను కుతూహలంతో.

'అవును. నాకూ ఈ మధ్యనే తెలిసింది. బిజినెస్ లో కొత్త కొత్త ప్రాడక్ట్స్ విడుదల చేసినట్లు ఈ స్వామీజీలు కూడా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకు - నిన్నొక లక్షరూపాయలు ఆశ్రమానికి డొనేషన్ అడిగామనుకో. వెంటనే ఇస్తావా?' అడిగాడు సూర్య.

'కొంచం ఆలోచిస్తాను' చెప్పాను.

'అదే ఒక వెయ్యి రూపాయలు అడిగితే?' మళ్ళీ అడిగాడు సూర్య.

'అదెంత పని? కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాను.' అన్నాను.

'అదే మరి ట్రిక్ అంటే! అందుకని, వెయ్యిమందితో వెయ్యి హోమగుండాలతో 'లలితాహోమం' అని పెడతారు. ఒక్కొక్క జంట నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు. మొత్తం పది లక్షలు వస్తుంది. ఏర్పాట్లకు అయిదు లక్షలు పోయినా ఒక్కరోజులో అయిదు లక్షలు మిగుల్తుంది. దీనికి శ్రావణమాసం అనే సెంటిమెంట్ జత చేస్తారు. 'శ్రావణ మాసం-అమ్మవారి పూజ' అనేది డెడ్లీ కాంబినేషన్. దీనికి పడని హిందూ కుటుంబం సాధారణంగా ఉండదు. ఈ రకంగా శ్రావణమాసంలో  వచ్చే నాలుగు వీకెండ్స్ లో కలిపి నెలకు ఇరవై లక్షలు మిగుల్తుంది. ఎవరికొస్తుంది అంత డబ్బు?  అమెరికాలో గూగుల్లో పనిచేసే టాప్ ఎండ్ సాఫ్ట్ వేర్  ఇంజనీర్ కి కూడా అంత నెలజీతం రాదు. ఇదీ "శ్రావణ మోసం" అంటే !' అన్నాడు సూర్య.

నాకమాంతం కళ్ళు తిరిగాయి.

'బాబోయ్ ! రెలిజియస్ సెంటిమెంట్ తో ఎంత బిజినెస్ జరుగుతోంది?' అనుకున్నా.

'అదేమరి ! అందుకే నిన్ను త్వరగా స్వామీజీ అవతారం ఎత్తమని చెప్పేది!' అన్నాడు సూర్య నా మనసులో మాటను పట్టేసి.

'ఎత్తినా మనకలాంటి పనులు చేతకావులే! ఇప్పటికి చేస్తున్న పూజలే వదిలెయ్యమని నేను చెబుతుంటే, ఇలాంటి వేషాలు మనకెలా కుదురుతాయి?' అడిగా నేను.

'సరే ఏదో ఒకటి చెయ్యిగాని, కధ విను. ఆ హోమం సందర్భంగా మళ్ళీ మాతాజీని కలిసే అవకాశం దొరికింది.'  అన్నాడు.

'అదేంటి? ఆమె  ఫోన్ నంబర్ ఇచ్చిందిగా? నువ్వు మధ్యలో ఫోన్ చెయ్యలేదా?' అడిగాను.

'లేదు. ఈ మధ్యన ఫోన్ టాక్ రికార్డ్ చేసి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ముందుగా ఫోన్ చేసి మనల్ని వాళ్ళే టెంప్ట్ చేస్తారు. మనం కొంచం బేలన్స్ తప్పి మాట్లాడితే అది రికార్డ్ చేసి ఇక మన తాట వలుస్తారు. ఈ గోలంతా ఎందుకని భయం వేసి ఫోన్ చెయ్యలేదు.' అన్నాడు.

'సరే హోమంలో కలిసిన మాతాజీ  ఏమంది?' అడిగాను.

'అక్కడేం మాట్లాడలేదు. చాలా సీరియస్ గా ఉంది. కానీ హోమం అయిపోతూ ఉండగా ఒకాయన వచ్చి 'మాతాజీ మిమ్మల్ని రమ్మంటున్నారు' అని చెప్పాడు. ఆమె రూమ్ కి వెళ్లాను. అక్కడ మాట్లాడటం జరిగింది.' అన్నాడు.

'ఏం మాట్లాడింది?' అడిగాను.

'చాలా చెప్పింది. మొదట్లో ఈమెకూడా 'అష్టసిద్ధులను అరచేతిలో ఉంచుకున్న ప్రత్యంగిరానంద' అనే చుండూరి సోమేశ్వర్ వీడియోలు చూసి ఫ్లాట్ అయిపోయి ఈ స్వామీజీని ఎలాగైనా కలవాలని అనుకుందట.' అన్నాడు.

'ఈ చుండూరి శాల్తీకి వేరే పనేమీ లేదా? ఇలాంటి చవకబారు వీడియోలు చేసి జనాన్ని బురిడీ కొట్టించకపోతే?' అడిగాను.

'ఆ విషయం కూడా చెప్పింది. ఇతను స్వామీజీ ఏజంట్ ట. ఇలా వీడియోలు చేసి, ఉన్నవీ లేనివీ అబద్దాలు చెప్పి జనాన్ని స్వామీజీ వైపు ఆకర్షించడం అతని పని. వీళ్ళిద్దరి మధ్యనా డీల్ అది.' అన్నాడు సూర్య.

'ఓహో. అలా చేసినందుకు డబ్బులిస్తాడేమో స్వామీజీ?' అడిగాను  అనుమానంగా.

'భలే పిచ్చోడివి నువ్వు! స్వామీజీ అంటే ఏమనుకుంటున్నావ్?   హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివినవాళ్ళు కూడా ఆయన ముందు బలాదూరే. సోమేశ్వరే ఎదురివ్వాలి స్వామీజీకి.' అన్నాడు సూర్య.

మతిపోయింది నాకు. 'అదేంటి?' అన్నా.

'అవును. నా మీద నువ్వు వీడియో చేశావ్. దాన్ని లక్షమంది చూశారు. ఆ కౌంట్ ని బట్టి గూగుల్ వాడు నీకు డబ్బులిస్తున్నాడు. అంటే నా ఇమేజిని నువ్వు క్యాష్ చేసుకుంటున్నావ్. కనుక నీకొచ్చే డబ్బుల్లో నాకు షేర్ ఇవ్వమనిచెప్పి సోమేశ్వర్ ముక్కుపిండి మరీ లాగుతాట్ట స్వామీజీ.' అన్నాడు సూర్య.

'ఇదంతా నీకెలా తెలుసు?' అడిగా అనుమానంగా.

'నాకు తెలీదు. మాతాజీ దగ్గర చెప్పుకుని ఏడిచాట్ట సోమేశ్వర్. సరే, ఇదంతా ఇప్పటి సంగతి. మనం ఇంకా  ఆ సీన్ లోకి రాలేదు.  మాతాజీ ఇంకా మాతాజీ కానప్పటి రోజుల్లో ఉన్నాం.' అప్పట్లో ఆమె సోమేశ్వర్ వీడియోలు చూసింది.' అన్నాడు సూర్య.

'సరే చెప్పు'  అన్నా బుద్ధిగా.

'ఆ తర్వాత స్వామీజీ ఉపన్యాసాలు వినడానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం కోసం క్యూలో నిలబదిందట.' అన్నాడు సూర్య.

'అదేంటి? వస్త్రాపహరణాలూ గర్భాధానాలూ ఇలాంటి కధలు విన్న తర్వాత కూడా ఇంకా ఆయన దర్శనం కోసం క్యూలో నిలబడిందా?' అడిగాను నేను హాశ్చర్యపోతూ.

'అబ్బా ! మధ్యలో అడ్డు తగలకు. చెప్పేది విను. ఫ్లో ఆగిపోతుంది' అని విసుక్కున్నాడు సూర్య.

'సారీ సారీ ! చెప్పు' అన్నా చెంపలేసుకుంటూ.

'అలా క్యూలో నిలబడి సాయిబాబాను ప్రార్ధిస్తూ ఇలా అనుకుందిట ' హే సాయిబాబా! ఇన్నాళ్ళూ ఒక గురువుకోసం ఎంతో వెదికాను. దొరకలేదు. ఇప్పుడైనా నా గురువును నాకు చూపించవా?'

'అదేంటి? మధ్యలో సాయిబాబా ఎందుకు?' అడిగాడు నాలోని సందేహసుందరం.

'అదే మరి! నీకీ డౌట్ వస్తుందని నేను ముందే ఊహించా గాని విను. ఈ స్వామీజీ వలలో పడకముందు ఈమె సాయిబాబా భక్తురాలు.' అన్నాడు సూర్య.

'వలలో పడిందా? అదేంటి ఆమేమైనా చేపా అలా వలలో పడటానికి?' అడిగా నేను మళ్ళీ అయోమయంగా.

'నువ్వు మరీ నటించకు! ఏదో మాటవరసకి అన్నానని నీకర్ధమైఁదని నాకర్ధమైంది' అన్నాడు సూర్య.

'సరే సరే చెప్పు' అన్నా నాల్గోసారి నోటిమీద వేలేసుకుంటూ.

'ఆమె అలా క్యూలో నిలబడి ప్రార్ధిస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ఉన్నట్టుండి ఆమె చెవులో ఒక స్వరం - 'ప్రత్యంగిరానందే నీ గురువు. ప్రత్యంగిరానందే నీ గురువు.' అంటూ స్టీరియో సౌండులో వినిపించింది. ఆమె అదిరిపడి వెనక్కు చూసింది ఎవరైనా క్యూలో వెనకనుంచి చెవులో చెబుతున్నారేమో అని. కానీ ఆమె వెనుక ఒక చిన్నపిల్లాడు నిలబడి ఉన్నాడు. ఆమె బిత్తరపోయి, అది సాయిబాబా ఆదేశమని, ఈయనే తన గురువన్న నిశ్చయానికి వచ్చేసింది.' అన్నాడు సూర్య.

'అదెలా సాధ్యమబ్బా? మాతాజీ నీకు టోపీ వేసినట్టుంది.' అన్నాను.

'కాదు. నీకన్నీ అనుమానాలే. స్వామీజీ దగ్గర కర్ణపిశాచి అని ఒక క్షుద్రశక్తి ఉంది. దాని సహాయంతో తను అనుకున్న వారి చెవిలో తను అనుకున్న మాటలు అలా చెప్పిస్తాడు. ఈ సంగతి మాతాజీ అయ్యాక ఆమెకు తెలిసిందిట.' అన్నాడు సూర్య.

'ఒక చిన్న డౌట్. కర్ణపిశాచి ఆడది కదా? మగగొంతుతో సాయిబాబాలా ఎలా మాట్లాడింది? - అడిగాను.

'అంటే పిశాచికి మిమిక్రీ రాదని నీ ఉద్దేశ్యమా? లేక రాకూడదా? నువ్వే రకరకాల గొంతులు పెట్టి పాటలు పాడుతున్నావు. అది పిశాచి. నీ మాత్రం టాలెంట్ దానికి ఉండదా?' అడిగాడు సూర్య సీరియస్ గా.

'అబ్బే అలా కాదు. కానీ సాయిబాబా భక్తురాలి చెవిలో కూడా అలా చెప్పగల శక్తి ఆ పిశాచికి ఉంటుందా?' మళ్ళీ అడిగాను.

'సాయిబాబా భక్తురాలని ఈమె అనుకుంటోంది. కానీ ఈమె ఎవరో సాయిబాబాకి తెలియాలని గ్యారంటీ ఏమీ లేదు. మన భయం, మన గిల్టీ ఫీలింగూ పోవడం కోసం 'నేను ఫలానా భక్తుడిని' అని మనం అనుకోవచ్చు. అది నీ చాయిస్. కానీ నువ్వలా అనుకున్నంత మాత్రాన ఆ దేవుడు నీ వెంటనంటి ఉండాలని రూలేమీ లేదు. నువ్వెవరైనా పిశాచికి ఒకటే. అది అలా చెప్పగలదు' అన్నాడు సూర్య.

'ఓకే. కానీ ఇంకో డౌట్. ఈమె చెవిలోనే ఎందుకలా చెప్పించాడు స్వామీజీ?' అనడిగా నేను.

నవ్వాడు సూర్య.

'ఇప్పుడు...ఇప్పుడు నీకు కరెక్టు డౌటొచ్చింది. ఎందుకంటే క్యూలో ఉన్న ఈమెమీద స్వామీజీ కన్ను పడింది. అలా ఎందుకూ అంటే..తన అభిమాన నటి దివ్యభారతి పోలికలు ఈమెలో ఉన్నాయి గనుక. ఆ పోలికలు చూచిన స్వామీజీ వెంటనే కర్ణపిశాచి మంత్రాన్ని జపించి ఆమె చెవులో అలా చెప్పమని దానికి మెసేజి పాస్ చేశాడు. వెంటనే అది ఆ పనిని చేసేసింది. ఆ విధంగా ఈ స్వామీజీనే తన గురువన్న నమ్మకానికి ఈ అమ్మాయి వచ్చేసింది. ఆ విధంగా ఆమెను తన బుట్టలో వేసుకున్నాడన్న మాట స్వామీజీ.' అన్నాడు సూర్య.

'బుట్టలో వేసుకోడానికి ఈమెమైనా కోడిపిల్లా?' అన్న మాట నోటిదాకా వచ్చిందిగాని సూర్య తిడతాదని భయమేసి మింగేశాను.

తమాయించుకుని - 'అంటే కొన్ని క్షుద్రవిద్యలు ఈ స్వామీజీ దగ్గర ఉన్నాయన్న మాట' - అన్నాను.

ఇలా అంటుండగానే కరెంట్ పోయింది. అదే మాట సూర్యతో చెప్పాను ఫోన్లో.

'చూశావా మరి? అదే స్వామీజీ పవరంటే! నువ్వాయన్ను అనుమానించావు గనుక మీ ఇంట్లో కరెంట్ పోయింది. ఖచ్చితంగా ఈయనకు కొన్ని క్షుద్రశక్తులున్నాయి. ఆ కధంతా తర్వాత చెబుతాను.' అన్నాడు సూర్య.

'ఏడిచినట్టుంది నీ గోల. ఒక్క మా ఇంట్లోనే పోలేదు కరెంటు. ఊరంతా పోయింది.' అన్నాను నేను కిటికీలోంచి బయటకు చూస్తూ.

'అంతేమరి ! స్వామీజీని నమ్మని వాళ్ళున్న ఊర్లో అలాగే జరుగుతుంది' అన్నాడు సూర్య నవ్వుతూ.

'అవును ! ఇప్పుడు నా చెవులో కూడా ఎవరో చెబుతున్నారు. 'సూర్య చెప్పేది నిజం సూర్య చెప్పేది నిజం' అంటూ. బహుశా మనిద్దరం ఇలా మాట్లాడుకుంటున్నట్లు స్వామీజీకి తెల్సిపోయి ఉంటుంది.' అన్నా నేనూ నవ్వుతూ.

(ఇంకా ఉంది)

'ఉద్యోగంలో వేధింపులు ఎక్కువయ్యాయి' - ప్రశ్నశాస్త్రం

18-8-2018 సాయంత్రం 6-13 నిముషాలకు ఫోన్లో నన్నొకరు ఈ ప్రశ్న అడిగారు.

"ఈ మధ్య నా ఉద్యోగంలో చికాకులు ఎక్కువయ్యాయి. ఎంత పనిచేసినా గుర్తింపు ఉండటం లేదు. ప్రొమోషన్ రావడం లేదు. పైగా బాస్ నుంచి వేధింపులు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు.  దయచేసి సలహా ఇవ్వండి."

ఆ సమయానికి వేసిన ప్రశ్నచక్రం ఇలా ఉన్నది.

సహజ దశమం అయిన మకరలగ్నం ఉదయిస్తూ వృత్తి పరమైన ప్రశ్న అని సూచిస్తున్నది. సప్తమాధిపతి మరియు మన:కారకుడు అయిన చంద్రుడు నీచరాశిలో ఉంటూ సాటి ఉద్యోగులతో భాగస్తులతో గొడవలను సూచిస్తున్నాడు. అంతేగాక ఇతని ఆందోళనాపూరిత పరిస్థితిని కూడా సూచిస్తున్నాడు.

ద్వాదశాదిపతి అయిన గురువు దశమంలో ఉంటూ పనిచేసే చోట నష్టాలను సూచిస్తున్నాడు. గురువు పై అధికారులకు సూచకుడు కనుక వారివల్ల ఇతనికి జరుగుతున్న వేధింపులను సూచిస్తున్నాడు.

దశమాధిపతి అయిన శుక్రుడు నవమంలో నీచరాశిలో ఉండటం వల్ల గతంలో ఇతను ధర్మం తప్పి చేసిన పొరపాట్లే ఇప్పటి గ్రహపాటుకు కారణం అని స్పష్టంగా తెలుస్తున్నది.

నవమాధిపతి అయిన బుధుడు సప్తమంలో రాహువుతో కలసి వక్రించి ఉండటమూ, ఆ రాహువు చంద్రుని సూచిస్తూ ఉండటమూ, వెరసి సప్తమంలో చంద్రబుధుల కలయిక కనిపిస్తూ, ఆఫీసులో గొడవలు జరుగుతున్నాయని, దానికి కారణం జాతకుని అనైతిక ప్రవర్తనే అనీ స్పష్టంగా తెలుస్తోంది.

ప్రశ్న అడుగబడిన సమయంలో శని-శని-బుధ దశ జరుగుతున్నది. శని బుధుల వక్రస్తితిని బట్టి వారిద్దరి షష్టాష్టక స్థితిని బట్టి జాతకుడు గతంలో ధర్మాన్ని తప్పడం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తిందని, దీనివల్ల ఇతను ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నాడనీ స్పష్టంగా తెలుస్తున్నది.

పరిస్థితిని అతనికి వివరించి, దీనిని వేరెవరో కారకులు కారనీ, గతంలో తను చేసిన తప్పులే దీనికి కారణమనీ చెప్పి, రెమెడీలు చెప్పడం జరిగింది.

ప్రశ్నశాస్త్రం ఎంత కరెక్ట్ గా పనిచేస్తుందో ఈ సింపుల్ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు.

17, ఆగస్టు 2018, శుక్రవారం

బ్లాగు భేతాళ కధలు - 5 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)


ఈ సంభాషణ జరిగిన తర్వాత ఒకటి రెండు నెలలపాటు సూర్య మళ్ళీ నాకు ఫోన్ చెయ్యలేదు. 'ఏం జరిగిందో ఏమోలే!' అని నేనూ తనని కదిలించలేదు. ఇలా ఉండగా ఉన్నట్టుండి ఒకరోజున మళ్ళీ సూర్యనుంచి ఫోనొచ్చింది.

'ఏమైంది సూర్యా? నీ సమస్య తీరిందా? హోమం చేయించావా? మీ ముత్తాత ఇంకా అటకమీదే ఉన్నాడా వెళ్ళిపోయాడా?' అడిగాను.

'ఏమో ఎవరికి తెలుసు? ఇప్పుడాయన్ని పట్టించుకోవడం మానేశాం' అన్నాడు.

'అదేంటి మరి? ఇప్పుడెవర్ని పట్టించుకుంటున్నావ్?' అడిగాను.

'అదో పెద్ద కధలే. ఈ రెండు నెలల్లో చాలా జరిగింది.' అన్నాడు.

'ఏంటో చెప్పు మరి.' అన్నాను ఉత్సాహంగా.

చెప్పడం మొదలుపెట్టాడు సూర్య.

'ఒకరోజున అర్జెంటుగా రమ్మని స్వామీజీనుంచి ఫోనొచ్చింది నాకు. ఆశ్రమానికి వెళ్లాను. అక్కడే మాతాజీ పరిచయమైంది.' అన్నాడు.

'మధ్యలో ఈమెవరు?' అడిగాను.

'స్వామీజీ తర్వాత ప్రస్తుతం నెంబర్ టు పొజిషన్ లొ ఉంది. ఈమె పేరు మాతా దివ్యభారతి' అన్నాడు.

'అదేంటి అదేదో హీరోయిన్ పేరులా ఉందే? ఆమె ఏదో యాక్సిడెంట్లో చనిపోయింది కదూ?' అడిగాను నాకున్న కొద్దో గొప్పో సినిమా నాలెడ్జి ఉపయోగిస్తూ.

'అవును. చెప్తా విను. స్వామీజీగా మారకముందు ఈయన హైదరాబాద్ లో ఒక కోచింగ్ సెంటర్ నడిపేవాడు. ఆ టైంలో దివ్యభారతి అని ఒక సినిమా యాక్టర్ ఉండేది. ఈయన ఆమెకు వీరాభిమాని. అప్పట్లో దివ్యభారతి ఫాన్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు కూడా. ఆమె అర్ధాంతరంగా చనిపోయింది. ఆ బాధలో ఈయన చాలాకాలం పిచ్చోడిలా హైదరాబాద్ రోడ్లమీద తిరిగాడు. అందుకని స్వామీజీగా మారాక కూడా తన అభిమాన నటిని మర్చిపోలేక తన శిష్యురాలికి ఆ పేరు పెట్టుకున్నాడు' అన్నాడు.

'పాపం ! ఆ తారంటే లవ్వు చాలా ఎక్కువగా ఉన్నట్టుందే? సన్యాసాశ్రమం స్వీకరించాక కూడా పూర్వాశ్రమాన్ని మర్చిపోలేక పోతున్నాడల్లే ఉంది.' అన్నాను.

'నాకూ అలాగే అనిపించింది.' అన్నాడు సూర్య.

'సర్లే కథలోకి రా' అన్నాను.

'నేను వెళ్లేసరికి 'ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టాన్ని' ఎంతో రసవత్తరంగా ఒక గంటనుంచీ ఉపన్యాసం చెబుతున్నాడు స్వామీజీ' అన్నాడు సూర్య.

నేను పడీ పడీ నవ్వాను.

'ఏం? అంతకంటే మంచిఘట్టం ఇంకేమీ దొరకలేదా ఆయనకు?' అడిగాను.

'నవ్వకు. అది ఆయన ఫేవరేట్ ఘట్టాలలో ఒకటి. ఆయనకిష్టమైన ఇంకొక సీన్ - గోపికా వస్త్రాపహరణం' అన్నాడు సూర్య.

'ఇంత దరిద్రంగా ఉందేంటి స్వామీజీ టేస్ట్? మన పురాణాల్లో ఈ ఘట్టాలు తప్ప ఇంకేమీ లేవా అంతలా వర్ణించి చెప్పడానికి ?' అడిగాను అయోమయంగా.

'ఉన్నాయి. అవి ఇంకా ఘోరంగా ఉంటాయి. నీళ్ళ మధ్యలో ఉన్న పడవలోనే మత్స్యగంధికి పరాశరమహర్షి ఏ విధంగా గర్భాధానం చేశాడో కూడా రెండుగంటలపాటు బోరు కొట్టకుండా వర్ణించగలడు ఆయన' అన్నాడు సూర్య తనూ నవ్వుతూ.

'అదేంటి? గర్భాధానాలూ, సద్యోగర్భాలూ, ప్రసవాలూ ఇవా ఆయన చెప్పేది, వీళ్ళు వినేది? దీనికంటే ఆ వస్త్రాపహరణ ఘట్టాలే నయమేమో? ఇలాంటి కధలు తప్ప, ఒక ఉన్నతమైన ఫిలాసఫీ గాని, ఒక elevated thinking గాని ఉండవా ఆయన ఉపన్యాసాలలో?' అడిగాను నేను మళ్ళీ అమాయకంగా.

'ఏదో ఒకట్లే ! ఆయన అలాంటి కధలే చెబుతున్నాడు. ఆయన టేస్ట్ అది ! మధ్యలో నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తే నేనేం చేసేది?' అన్నాడు సూర్య విసుగ్గా.

'సర్లే చెప్పు' అన్నా నోటిమీద వేలేసుకుంటూ.

'ఉపన్యాసం అయిపోయింది. జనం అంతా, గొప్ప కధను వినిన తన్మయత్వంలో, జోంబీల్లా తూలుతూ ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. నేను మెల్లిగా స్వామీజీ దగ్గరకు వెళ్లాను.

నన్ను చూస్తూనే స్వామీజీ కోపంగా - ' ఏమండి? మేము చెప్పిన ఆదేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు. ఇది మీకు మంచిది కాదు. ఒక ప్రేతాత్మను అలా ఇంట్లో ఉంచుకోకండి. ముందు ముందు మీకుగాని మీ ఫేమిలీకి గాని ఏదైనా జరిగితే నేను బాధ్యున్ని కాను.' అన్నాడు.

'కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికి హోమం చేయించలేను స్వామీజీ. నన్నర్ధం చేసుకోండి' అన్నాను ఆయన కాళ్ళకు ప్రణామం చేస్తూ.

సాలోచనగా తల పంకించాడు స్వామీజీ.

'అర్ధమైంది. ప్రేతాత్మ శక్తి చాలా ఎక్కువగా ఉంది. అందుకే మిమ్మల్ని హోమం చెయ్యనివ్వడం లేదది. సరే. ఒక ఉపాయం చెప్తాను. చేస్తారా మరి?' అన్నాడు కోపంగా.

'చెప్పండి స్వామీ' అన్నాను నేనూ నిజంగానే భయపడుతూ.

ఆయన వెంటనే పక్కనున్న మాతా దివ్యభారతి వైపు తిరిగి ' మాతాజీ ! ఈయనకు ప్రత్యంగిరా మంత్రాన్ని ఉపదేశించండి.' అంటూ నావైపు తిరిగి - 'ఈ మంత్రాన్ని కోటిసార్లు జపం చేసి ఆ తర్వాత మళ్ళీ రండి. అప్పుడు మీరు హోమం చెయ్యగలుగుతారు.' అన్నాడు.

మాతాజీ వైపు చూశాను. అప్పటిదాకా నా వైపే చూస్తున్న మాతాజీ నేను చూడగానే తల దించుకుంది. నేను క్యూలోనుంచి జరిగి మాతాజీ ముందుకొచ్చాను.

ఆ మాతాజీ దగ్గర ఒక కాగితాల కట్ట ఉంది. స్వామీజీ చెప్పినవారికి చెప్పినట్లు కాగితం మీద మంత్రాలను వ్రాసి జనానికి ఇస్తోంది. అలా నాకూ ఒక కాయితం ఇచ్చింది.

'అందులో ఆ మంత్రం ఉందా?' అడిగాను నేను కుతూహలంగా.

'లేదు. ఆమె ఫోన్ నంబరుంది' అన్నాడు సూర్య చాలా సీరియస్ గా.

బిత్తరపోయాన్నేను.

'ఇదేంటి కధ ఇలా ట్విస్ట్ అయింది? తన ఫోన్ నంబర్ని నీకిచ్చిందా?' అన్నాను ఆశ్చర్యంగా.

'ఆ! లేకపోతే నీ ఫోన్ నంబర్ ఇస్తుందా? ముందు నేనూ నీలాగే ఆశ్చర్యపోయాను. తలెత్తి ఆమెకేసి చూశాను. 'ప్లీజ్. అర్ధం చేసుకోండి' అన్నట్లు సైగ చేసింది కళ్ళతో.' అన్నాడు సూర్య.

'మరి స్వామీజీ ఇదంతా చూడలేదా?' అడిగాను ఆశ్చర్యంగా.

'ఆయన ఇంకో కస్టమర్ తో బిజీగా ఉన్నాడు. మమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు' అన్నాడు సూర్య.

'డామిట్ ! కధ అడ్డం తిరిగినట్టుందే?' అనుకున్నా మనసులో.

(ఇంకా ఉంది)

15, ఆగస్టు 2018, బుధవారం

బ్లాగు భేతాళ కధలు - 4 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)

'ఒకరోజున ఏదో దుర్ముహూర్తంలో ఏమీ తోచక యూట్యూబ్ లొ వెదుకుతూ ఉంటే ఈ స్వామీజీ గురించి సమాచారం కనిపించింది.' అన్నాడు సూర్య.

'అలాగా' అన్నాను.

ఏమీ తోచక ఇంటర్ నెట్లో లేజీగా వెదకడమే చాలాసార్లు మనిషిని చెడగొడుతూ ఉంటుంది. నా బ్లాగు కూడా ఇలాగే చాలామందికి కనిపిస్తూ ఉంటుంది.

'చుండూరి సోమేశ్వర్ అని ఒకాయనున్నాడు. ఆయన ఈ స్వామీజీకి వీరభక్తుడు. ఆయనొక వీడియో చేసి నెట్లో పెట్టాడు. అందులో ఈయన్ని "నడిచే శంకరాచార్య - పాకే ప్రత్యంగిరానంద" అంటూ తెగ పొగిడాడు.' అన్నాడు.

'అదేంటి? పాకే ప్రత్యంగిరానందా? అలా పెట్టాడేంటి?' అడిగాను నవ్వుతూ.

'బహుశా ప్రాసకోసం అలా పెట్టి ఉంటాడు. పైగా స్వామీజీ చేతిలో ఒక కర్రతో మెల్లిగా పాకుతున్నట్లే నడుస్తాడు' అన్నాడు సూర్య.

'సో ! ఆ వీడియో చూచి నువ్వు ఫ్లాట్ అయిపోయావన్నమాట' అన్నాను.

'ఊ! అదే మరి నా ఖర్మ! అదీగాక మా కజిన్ బాలాజీ కూడా ఈయన గురించి గొప్పగా చెప్పాడు' అన్నాడు.

'మీ కజిన్ కి ఎంతమంది స్వామీజీలతో సంబంధాలున్నాయి?' అడిగాను నవ్వుతూ.

'వాడికి చాలామంది తెలుసు.' అన్నాడు.

'సరే. ఏం చెప్పాడెంటి బాలాజీ ఈయనగురించి?' అడిగాను.

'ఈయన మహా మాంత్రికుడట. చేతబడులు వదిలిస్తాడట. దయ్యాల్ని పారద్రోలతాడట. వశీకరణం కూడా వచ్చట. పూర్వజన్మలు తెలుసట. ఇంకా ఇలాంటివే ఏవేవో చెప్పాడు' - అన్నాడు.

'అవన్నీ నువ్వు నమ్మావా?' అడిగాను.

'నమ్మలేదు. కానీ పుస్తకంలో స్వామీజీ వ్రాసుకున్నాడు. 400 ఏళ్ళ తర్వాత తను హైదరాబాద్ లో పుడతానని అప్పట్లోనే బుద్దాశ్రమంలో చెట్టుమీద ఒక కోతి మిగతా కోతులతో చెప్పిందట' అన్నాడు.

'ఈ సోది సర్లేగాని, స్వామీజీ అన్నావ్ కదా? మరి ఈ మంత్రగాడి వేషాలేంటి? సంప్రదాయ స్వామీజీలకు ఉండాల్సిన లక్షణాలు ఇవికావు కదా?' అడిగాను.

'వాళ్ళు పనికిరాని వాళ్ళనీ, తాను నిజమైన శక్తి ఉన్నవాడిననీ, స్వామీజీ అయినప్పుడు ఇతరుల బాధలు తీర్చాలనీ ఈయన అంటాడు. ఈయన చాలా మహిమలు కూడా చేశాడని ఆ బుక్కులో వ్రాశారు.' అన్నాడు.

'ఏం చేశాదేంటి మహిమలు?' అడిగాను.

'ఈయనొకసారి లేటుగా ఎయిర్ పోర్టుకు వచ్చాడట. ఈయన ఎక్కాల్సిన విమానం టేకాఫ్ అయి వెళ్ళిపోయి అప్పటికే అరగంట అయిందట. విమానం వెళ్ళిపోయిందని వాళ్ళు చెబితే ఈయన నవ్వి ప్రత్యంగిరా మంత్రాన్ని జపిస్తూ లాంజ్ లొ కూచున్నాడట. ఈలోపల, ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం, పైలట్ పట్టు తప్పి, ఎవరో నడుపుతున్నట్లు వెనక్కి తిరిగి, రూటు మార్చుకుని, ఇదే ఎయిర్ పోర్ట్ కి వచ్చి దిగిందట. స్వామీజీ చిద్విలాసంగా నవ్వుతూ విమానం ఎక్కాక మళ్ళీ టేకాఫ్ అయిందట. ఇదంతా బుక్కులో వ్రాశారు.' అన్నాడు.

'ఈ చెత్తంతా నువ్వు నిజంగా నమ్ముతున్నావా?' అడిగాను సీరియస్ గా.

'లేదనుకో. కానీ ఆ బుక్కంతా ఇలాగే ఉంది. కాసేపు రిలాక్సేషన్ కోసం సరదాగా చదువుతూ నవ్వుకుంటున్నా అంతే! ఇంకా ఉంది విను. విమానం వెళ్ళిపోయిందని చెప్పి స్వామీజీని లోపలకు రానివ్వని ఎయిర్ పోర్ట్ స్టాఫ్ రక్తం కక్కుకుని ఈ శిష్యుల కళ్ళముందే చనిపోయిందట.' అన్నాడు.

'అదేంటి? ఆమె తప్పేముంది అందులో? ఫ్లైట్ టైముకి నువ్వు రావాలి. అంతేగాని అది వెళ్ళిపోయిన గంటకు లార్డులాగా వచ్చి తను చేసిన తప్పుకి అక్కడ స్టాఫ్ కి శాపాలు పెడతానంటే అదేమి దివ్యత్వం నా బొందలా ఉంది. ఇలాంటి చెత్త వ్రాసినవాడిని అనుకోవాలి ముందు' అన్నాను.

'ఈయన స్పీచులూ ఈయన భక్తుల వ్రాతలూ అన్నీ ఇలాగే చవకబారు మహిమలతో కూడుకుని ఉంటాయి.' అన్నాడు సూర్య.

'బాబోయ్! నేనిక భరించలేనుగాని ఆపు. ఈ కట్టుకథలు ఎలా నమ్ముతున్నారో జనం?' అడిగాను విసుగ్గా.

'నమ్మడమేంటి? మనం ఇలా మాట్లాడుతున్నామని తెలిస్తే మనల్ని రాళ్ళతో కొట్టి చంపుతారు. అంత వీరభక్తులున్నారు ఈయనకు. అంతేకాదు. ఇంకా ఉన్నాయి విను. వాజపేయిగారికి ఒక సమయంలో దయ్యం పడితే ఈయన హోమం చేసి వదిలించాదట. ఆ బుక్కులో వ్రాసుంది.' అన్నాడు సూర్య.

'వాయ్యా !' అని అరుస్తూ జుట్టు పీక్కోవాలని బలంగా అనిపించింది. ఆ చాన్స్ మనకు లేదుగనుక చేతిలో ఉన్న పేపర్ని పరపరా చించి పారేసి కసితీర్చుకున్నా.

'ఇవన్నీ చదివి కూడా మళ్ళీ ఆ స్వామీజీ దగ్గరకు వెళ్లావు చూడు! అక్కడ నీకు హాట్సాఫ్ ' అన్నా.

'ఏం చెయ్యను? ఫిట్టింగ్ పెట్టాడు కదా?' అన్నాడు నీరసంగా.

'ఏం పెట్టాడు?' అడిగాను.

'మొదటిసారి మా అబ్బాయిని తీసుకుని ఆయన బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళినపుడే ఒక మాటన్నాడు.'మీ ఇంట్లో దోషం ఉంది. అందుకే మీకు చిన్నవయసులోనే షుగర్ వచ్చింది' అన్నాడు.

'అదేంటి నీకు షుగర్ ఉన్నట్టు ఆయనకెవరు చెప్పారు?' అడిగాను.

'నేనే చెప్పాను. ఏదో మాటల సందర్భంలో చెబితే ఇక దాన్ని పట్టుకుని "మీ ఇంట్లో దోషం ఉంది నేను చూడాలి" అని బ్లాక్ మెయిల్ మొదలెట్టాడు.' అన్నాడు సూర్య.

'ఏంటి కొంపదీసి మీ ఇంటికి తీసికెళ్లావా?' అడిగాను.

'అవును. అదీ అయింది ఒకరోజున.' అన్నాడు సూర్య.

'ఏమన్నాడు మీ ఇల్లు చూచాక?' అడిగాను.

'నువ్వు చెబితే ఆశ్చర్యపోతావని ఇందాక అన్నాను కదా? ఆ ఘట్టం ఇప్పుడొచ్చింది. కాస్త గట్టిగా దేన్నైనా పట్టుకుని విను పడిపోకుండా' అన్నాడు.

'సరే చెప్పు.' అన్నాను నవ్వుకుంటూ.

'మా ఇంట్లోకి అడుగు పెడుతూనే సడన్ గా కాలు వెనక్కు తీసుకుని స్టన్ అయినట్లు బయటే ఉండిపోయాడు కాసేపు. అక్కడే మాకు భయం వేసింది' అన్నాడు సూర్య.

'ఇది చాలా పాత టెక్నిక్. 'చంద్రముఖి' సినిమాలో రామచంద్ర సిద్ధాంతి ఇదే చేశాడు. చూడలేదా నువ్వు?' అడిగాను.

'నువ్వు జోకులాపు. మా గడపలో ఆయనిచ్చిన ఎక్స్ ప్రెషన్ కి మాకందరికీ చెమటలు పట్టాయి' అన్నాడు.

ఆ సీన్ ఊహించుకుంటే భలే నవ్వొచ్చింది.

'సరే ఏమైందో చెప్పు?' అన్నాను ఆత్రుతగా.

'కాసేపటికి లోపలకొచ్చి కూచున్నాడు. అప్పుడు చల్లగా ఈ విషయం చెప్పాడు. ఎప్పుడో చనిపోయిన మా ముత్తాత దయ్యమై మా ఇంట్లోనే ఉన్నాడుట. మా ఇంటి అటకలో ఆయన కూచుని ఉన్నాడని, తను లోపలకొస్తుంటే వద్దని ఉగ్రంగా అరిచాడని చెప్పాడు స్వామీజీ' అన్నాడు.

పడీ పడీ నవ్వాను.

'నీకు బాధేసి ఉండాలే చాలా దారుణంగా?' అడిగాను సింపతీ వాయిస్ పెట్టి.

'అవును. నేనూ మా ఆవిడా హాయిగా ఏసీ బెడ్రూములో డబల్ బెడ్ మీద నిద్రపోతుంటే మా ముత్తాత అలా అటకమీద కూచుని ఉంటే బాధగా ఉండక ఇంకేముంటుంది? ' అన్నాడు సూర్య ఏడుపు గొంతుతో.

'దీనికి ఇంత బాధపడాల్సినది ఏముంది? వెరీ సింపుల్' అన్నాను.

'ఎలా?' అడిగాడు.

'ఏముంది? మీ ముత్తాతని బెడ్రూంలో పడుకోబెట్టి నువ్వూ మీ ఆవిడా అటకెక్కి కూచుంటే సరి ! ప్రాబ్లం సాల్వ్' అన్నాను నవ్వుతూ.

'నేనింత బాధగా చెబుతుంటే నీకు జోకులుగా ఉందా?' అన్నాడు సూర్య కోపంగా.

'సర్లే సర్లే కోప్పడకు. ఆ తర్వాత స్వామీజీ ఏమన్నాడు?' అడిగాను.

'మీ ఇంటి నడిబొడ్డులో హోమం చెయ్యాలి. నేనే చేస్తాను. అప్పుడు అటకమీదున్న మీ ముత్తాతకు మోక్షం వచ్చేస్తుంది. అన్నాడు స్వామీజీ' చెప్పాడు సూర్య.

'పోన్లే పాపం! హోమం ఫ్రీనేగా?' అడిగాను.

'అబ్బా ! మసాలా దోశేం కాదూ? అయిదు లక్షలౌతుందని చెప్పాడు?'

'అవునా? మరి చేయించావా ఏంటి కొంపదీసి?' అడిగాను.

'అదే ఆలోచిస్తున్నాను. మా ఆవిడేమో వద్దంటోంది. నాకేమో పోనీలే చేయిద్దాం అనిపిస్తోంది.' అన్నాడు.

'అదేంటి? ఆమె అలా అంటోందా?' అడిగాను.

'అవును. మా ఆవిడకు మా వైపు వాళ్ళంటే అస్సలు పడదు. ఎప్పుడో చచ్చినవాళ్ళ గురించి ఇంత బాధేంటి? ఏమీ వద్దు. అంటోంది తను.' అన్నాడు.

'నీకంటే మీ మిసెస్సే ప్రాక్టికల్ గా ఉంది సూర్యా' అన్నాను.

'నిన్నటిదాకా నేనూ ప్రాక్టికలే. స్వామీజీ కొట్టిన ఈ సెంటిమెంట్ దెబ్బతో కూలబడ్డాను. ఇప్పుడెం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఆ అటక వైపు చూసినప్పుడల్లా భయం వేస్తోంది.' అన్నాడు సూర్య నీరసంగా.

(ఇంకా ఉంది)

'సెల్ ఫోన్ పోయింది' - ప్రశ్నశాస్త్రం

మీ జీవితంలో అతి ముఖ్యమైన వస్తువేది అని ఇప్పుడెవర్నైనా అడిగితే అందరూ - 'మొబైల్ ఫోన్' అంటూ ఒకేమాట చెబుతున్నారు. చాలామంది ఆడాళ్ళు కూడా, మెళ్ళో ఉన్న మంగళసూత్రం ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా బాధపడటం లేదుగాని సెల్ ఫోన్ మర్చిపోతే మాత్రం తెగ గాభరా పడిపోతున్నారు. చార్జర్ మర్చిపోతే ఇంకా హైరాన పడిపోతున్నారు. అంతగా ఈ రెండూ మన జీవితాలలో ముఖ్యమైన భాగాలై పోయాయి.

13-8-2018 న మధ్యాన్నం 11-45 కి ఒకరు ఈ ప్రశ్న అడిగారు.

'కొన్ని రోజులక్రితం మా సెల్ ఫోన్ పోయింది. మాకు ఇద్దరి మీద అనుమానంగా ఉంది. వారిలో ఎవరో చెప్పగలరా?'

'చెబితే ఏం చేస్తారు?' అడిగాను.

'ప్రస్తుతం ఏమీ చెయ్యలేము. ఊరకే తెలుసుకుందామని.'

'ఊరకే తెలుసుకుని చేసేదేమీ లేదు. కనుక ఈ ప్రశ్న చూడను.' అన్నాను.

'ప్లీజ్ ప్లీజ్. కొద్దిగా చూడండి. అది దొరికినా దొరక్కపోయినా కనీసం మా మానసిక ఆందోళన అయినా తీరుతుంది.' అంటూ ఆ వ్యక్తి చాలా బ్రతిమిలాడిన మీదట తప్పక, ప్రశ్న చార్ట్ చూడటం జరిగింది.

ఆరోజు సోమవారం. శుక్రహోరలో ప్రశ్న అడుగబడింది. మొన్న కాలేజీలో కూడా ఇదే హోరలో ప్రశ్న వచ్చింది. కానీ ఆ రోజు వారం వేరు. వారం మారినా అదే హోరలో ప్రశ్న రావడానికి శుక్రుని బలమైన నీచస్థితి కారణం. దశ గమనించాను. శుక్ర-శని-శుక్రదశ జరుగుతున్నది.

'మీకు అనుమానం ఉన్న ఒక మనిషి బ్రాహ్మణకులానికి చెందినవాడు' అన్నాను చార్ట్ చూస్తూనే.

'ఎలా చెప్పారు' అడిగాడా వ్యక్తి కుతూహలంగా.

'ఎలా చెప్తే మీకెందుకు? అవునా కాదా?' అడిగాను.

'అవును' అన్నాడు.

'అతనే మీ ఇంటికొచ్చి సెల్ ఫోన్ దొంగిలించాడని మీ అనుమానం. ఇది మీ ఇంట్లోనే జరిగింది. బయట కాదు.' అన్నాను.

'నిజమే' అన్నాడు.

'మీరు అనుమాన పడుతున్న రెండోవ్యక్తి మీ పనిమనిషి. నిజమా కాదా?' అన్నాను.

అడిగిన వ్యక్తి నోరెళ్ళబెట్టాడు.

'నిజమే' అన్నాడు.

'తీసింది పనిమనిషే. మొదటివ్యక్తి కాదు.' అన్నాను.

'ఎలా చెప్పగలిగారు?' అడిగాడు.

'ఈ శాస్త్రానికి కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఇందులో ప్రవేశం లేకపోతే అవి మీకు అర్ధం కావు' అన్నాను.

'అర్ధం చేసుకోడానికి ట్రై చేస్తాను. చెప్పండి.' అన్నాడు.

'షష్టాధిపతి గురువు బ్రాహ్మణుడు. అతను లగ్నంలోకొచ్చి ఉన్నాడు. అంటే దొంగ మీ ఇంటికి వచ్చి దొంగతనం చెయ్యాలి. అదే జరిగిందని మీరు అనుమానిస్తున్నారని ఇది చెబుతోంది. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే ఆరూఢలగ్నం సింహం అయింది. అక్కడనుంచి షష్టాధిపతి శనీశ్వరుడు అయ్యాడు. ఆయన పనివాళ్ళను సూచిస్తాడు. ఆయన వక్రించి మీ చతుర్ధంలోకి వస్తాడు. అంటే ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తాడు. గురువుకు తులకంటే, శనికి వృశ్చికం చాలా ఇబ్బందికర ప్రదేశం. పైగా. సెల్ ఫోన్ అనేది కమ్యూనికేషన్ ను సూచిస్తుంది. అంటే తృతీయంతో సంబంధం ఉండాలి. తులాలగ్నం నుంచి గురువు తృతీయానికి అధిపతే. కానీ, సింహం నుంచి అయితే, తృతీయాదిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో నీచలో ఉంటూ, విలువైన వస్తువులను అందులోనూ కమ్యూనికేషన్ కు పనికొచ్చే విలువైన వస్తువులు పోవడాన్ని సూచిస్తున్నాడు. ఆ శుక్రుని మీద దొంగ అయిన శనీశ్వరుని దశమ దృష్టి కూడా ఉన్నది. అంటే, మీ పనిమనిషి కన్ను ఈ సెల్ ఫోన్ మీద ఉన్నదని అర్ధం. పైగా, మనస్సుకు దాని దుర్బుద్ధికీ సూచకుడైన చంద్రుడు కూడా ఆరూఢలగ్నంలోనే ఉన్నాడు. కనుక సింహలగ్నం నుంచి సరిపోయినట్లు తులాలగ్నం సరిపోవడం లేదు. పైగా, దశాధిపతులు కూడా శనిశుక్రులే అయ్యారు. కనుక సింహలగ్నమే ఎనాలిసిస్ కు కరెక్ట్. కాబట్టి, లగ్నంలో ఉన్న గురువును బట్టి, మీ అనుమానం మొదటి వ్యక్తిమీద బలంగా ఉన్నప్పటికీ, తీసినది మాత్రం రెండో వ్యక్తే.' అన్నాను.

'ఆ ఇద్దరూ ప్రస్తుతం ఎక్కడున్నారో చెప్పగలరా?' అడిగాడు.

'ఆ బ్రాహ్మిన్ వ్యక్తి ప్రస్తుతం మీ ఇంటి దగ్గర లేడు. వెళ్ళిపోయాడు.' అన్నాను మేషంలో శనికి నీచస్థానంలో ఉన్న గురువును నవాంశలో గమనిస్తూ.

'నిజమే. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు' అన్నాడు.

'మీ పనిమనిషి కూడా ఇప్పుడు మీ ఇంట్లో పని మానేసింది.' అన్నాను వక్రత్వంలో ఉన్న శనీశ్వరుడిని గమనిస్తూ.

'నిజమే. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మానేసింది.' అన్నాడు.

'మరి ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నారు?' అడిగాను.

'ఏమీ చెయ్యను. కొత్త ఫోన్ వెంటనే కొనుక్కున్నాను. ఏది లేకపోయినా బ్రతగ్గలం గాని ఫోన్ లేకపోతే బ్రతకలేం కదా !' అన్నాడు.

'మంచి జీవితసత్యాన్ని గ్రహించారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి' అన్నాడు.

'సరే. థాంక్సండి.' అంటూ అతను వెళ్ళిపోయాడు.

13, ఆగస్టు 2018, సోమవారం

బ్లాగు భేతాళ కధలు - 3 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)

'స్వామి ప్రత్యంగిరానంద గురించి విన్నావా?' పొద్దున్నే ఫోన్ చేశాడు సూర్య.

'నా చిన్నప్పటినుంచీ తెలుసు ఆయన గోల. ఏంటి ఈ మధ్య ఆయన ఆశ్రమానికి వెళుతున్నావా?' అడిగాను విసుగ్గా.

'అవును.' అన్నాడు.

'ఏంటి సంగతులు? ఏమైనా కొత్త కొత్త విశేషాలు తెలిశాయా?' అడిగాను.

'చాలా తెలిసినై. చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావ్" అన్నాడు.

'ఆశ్చర్యపోతానో లేదో తర్వాతగాని ముందు సంగతులు చెప్పు. అసలాయనతో నీకు పరిచయం ఎలా కలిగింది?' అన్నా.

'మా అబ్బాయిని డిల్లీలో I.S.B లో చేర్పిస్తున్నా కదా. ఒకసారి వాడి జాతకం ఎలా ఉందొ చూపిద్దామని ప్రత్యంగిరా టెంపుల్ కి వెళ్ళా. అక్కడొక పూజారి జాతకాలు బాగా చెప్తాడని మా కొలీగ్ చెప్పాడు' అన్నాడు.

'హైదరాబాద్ లో ప్రత్యంగిరా టెంపుల్ ఉందా?' అడిగాను.

'ఉంది. ఎక్కడున్నావ్ నువ్వు? నీకు జెనరల్ నాలెడ్జి బొత్తిగా తక్కువై పోయిందీ మధ్య. నీ శిష్యురాళ్ళను తప్ప ఇంకెవరినీ పట్టించుకోవడం మానేశావ్ ' అన్నాడు సూర్య.

'త్వరగా స్వామీజీ అవతారం ఎత్తమని నువ్వేగా పోరు పెడుతున్నావ్? అందుకే ముందు శిష్యురాళ్ళను పోగేసుకుంటున్నా. మా స్వామీజీల ఆశ్రమాలకు మూలస్థంభాలు వాళ్ళేగా?' అన్నాను నవ్వుతూ.

'అబ్బో ! ఏంటి? మా స్వామీజీలం అంటున్నావ్ అప్పుడే?' అన్నాడు.

'అంతే ! నాకేం తక్కువ? కాషాయమే కదా! అదెంతసేపు కట్టుకోవడం?  అయినా నువ్విలా మాట్లాడావంటే రేపు నిన్ను నా ఆశ్రమం చాయలకు కూడా రానివ్వను.' అన్నా వార్నింగ్ ఇస్తూ.

'బాబ్బాబు. అంతపని చెయ్యకు. రేపు రిటైర్ అయ్యాక నీ ఆశ్రమంలో ఏదో ఒక పోస్ట్ లో చేరదామని అనుకుంటుంటే ఇదేంటి ఇలా అంటున్నావ్? సారీ సారీ !' అన్నాడు నవ్వుతూ.

'సరే ! ప్రస్తుతానికి క్షమిస్తున్నా ! ఇక విషయంలోకి రా. మీ అబ్బాయి జాతకం చూచి పూజారి ఏమన్నాడు?' - అన్నాను.

'జాతకం చూడలేదు. నక్షత్రం ఏంటని అడిగాడు. చెప్పాను. వెంటనే - 'మీ అబ్బాయికి గత ఆరునెలల నుంచీ పిరుడు బాలేదు' అన్నాడు.

'వీడి బొంద ఇంగ్లీషూ వీడూనూ ! పూజారిగాడికి ఇంగ్లీషు ముక్కలు ఎందుకు? పిరుడు ఏంటి వాడి బొంద ! పీరియడ్ అనాలి. ఇంకా నయం 'పురుడు పోస్తా' అనలేదు. దశ అంటే చక్కగా ఉండేది కదా?' అన్నాను.

'ఏమోలే వాడి ఇంగ్లీషు గురించి నాకెందుకు? అయినా మా అబ్బాయికి అలాంటి బ్యాడ్ పీరియడ్ ఏమీ లేదు. అంతా బాగానే ఉందని చెప్పా. ఎందుకైనా మంచిది పూజ చేయించుకోండి అన్నాడు. మావాడి పేరుమీద గుళ్ళో పూజ చేయించా. ఆ తర్వాత పూజారి ఒక సలహా ఇచ్చాడు. అక్కడే నాకు శని పట్టింది.' అన్నాడు.

'ఏంటా సలహా? రెండు లక్షలిస్తే హోమం చేస్తానన్నాడా?' అడిగా నవ్వుతూ.

'దాదాపుగా అలాంటిదే. లక్ష చాలన్నాడు. నావల్ల కాదని చెప్పాను. సరే అయితే పైన గదిలో స్వామీజీ ఉన్నారు. ఆయన్ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోండి అన్నాడు. వెళ్లి స్వామీజీని కలిశాం.' అన్నాడు సూర్య.

'ఆయనేమన్నాడు?' అడిగా.

'మీవాడికి పిరుడు బాలేదని కింద పూజారి చెప్పాడు కదా !' - అని ఆయనడిగాడు. దాంతో మా ఆవిడ ఆయనకు ఇన్స్టంట్ భక్తురాలుగా మారిపోయింది. 'ఎందుకే అంత తొందరపడతావ్?' అనంటే - 'క్రింద పూజారి అడిగింది ఈయనకెలా తెలిసింది? ఈయనకేవో శక్తులున్నాయి' - అంటుంది. అంతా నా ఖర్మలా ఉంది' అన్నాడు సూర్య.

నాకు చచ్చేంత నవ్వొచింది.

'ఇది చాలా చీప్ ట్రిక్. అలా అడగమని పూజారికి ట్రెయినింగ్ ఇస్తారు. అదే మాటను స్వామీజీ మళ్ళీ అడుగుతాడు. అది చూచి మీ ఆవిడలాంటి వాళ్ళు పడిపోతూ ఉంటారు. మా స్వామీజీల ట్రిక్స్ ఇలాగే ఉంటాయి !' అన్నాను.

'మధ్యలో నిన్ను కలుపుకుంటావ్ ఏంటి?' అన్నాడు.

'ఎన్ని చెప్పినా మేమంతా ఒకటే. పాపం ఏదోలే పిచ్చిస్వామీజీ ఒదిలెయ్. విషయం చెప్పు.' అన్నా నవ్వుతూ.

'మా వాడికి అంతా బానే ఉందని డిల్లీలో చదువుకోడానికి వెళ్ళబోతున్నాడని చెప్పాను. సరే, ఒక యంత్రం ఇస్తాను వాడి మెడలో వెయ్యండి. రక్షణగా ఉంటుందని చెప్పి ఒక రాగిరేకు ఇచ్చాడు.' అన్నాడు.

'ఏంటి? దాన్ని మీవాడి మెడలో కట్టావా ఏంటి కొంపదీసి? మూర్చరోగి అనుకుంటారు చూసినవాళ్ళు. అసలే హై సర్కిల్స్ లోకి వెళుతున్నాడు. బాగోదు.' అన్నాను.

'నేనంత పిచ్చోడిని కాన్లే. క్రిందకొచ్చాక ఆ రాగిరేకును చెత్తకుండీలో పడేశా. కాకపోతే తన పుస్తకం ఒకటి అంటగట్టాడు స్వామీజీ. అది చదువుతున్నా ప్రస్తుతం.' అన్నాడు సూర్య.

'ఏంటి దాని పేరు?' అనడిగా.

'బుద్ధాశ్రమ కోతులు' అన్నాడు.

మళ్ళీ చచ్చే నవ్వొచ్చింది.

'అదేం పేరు? ఏముంది ఆ పుస్తకంలో?' అడిగాను.

'400 ఏళ్ళ క్రితం అదే ఆశ్రమంలో చెట్టుమీద ఒక కోతిగా ఈయన ఉండేవాడట. అదంతా అందులో వ్రాశాడు.' అన్నాడు.

నవ్వుతో నాకు పొలమారింది. నవ్వలేక పొట్ట పట్టుకుని ఇలా అడిగాను.

'ఇంతకీ ఆ ఆశ్రమం ఎక్కడుంది?'

'అది హిమాలయాల్లో ఉందిట ఇప్పటికీ. కానీ మనలాంటి పాపులకు కనిపించదట. స్వామీజీ లాంటి పుణ్యాత్ములకు మాత్రం కనిపిస్తుందట. ఆయన ప్రతిరోజూ రాత్రి అక్కడకు వెళ్లి తెల్లవారేసరికి మళ్ళీ ఆశ్రమానికి వస్తూ ఉంటాట్ట.' అన్నాడు సూర్య.

'అలాగా ! అంటే కలలోనా?' అడిగాను.

'కలలో కాదు. ఇలలోనే అని ఆయన శిష్యులు చెప్పారు.' అన్నాడు.

'వాళ్ళు కూడా డిల్లీ I.S.B లో M.B.A చదివారా ఏంటి కొంపదీసి?మార్కెటింగ్ అద్భుతంగా చేస్తున్నారు?' అడిగాను.

సూర్య కూడా నవ్వేశాడు.

'ఏమో అలాగే ఉంది వాళ్ళ వాలకాలు చూస్తుంటే. సరే మన కధలోకి వద్దాం. ఆ పుస్తకం చదువుతుంటే ఇక వేరే పోర్నోగ్రఫీ చానల్ ఏదీ చూడనక్కర్లేదు. అంత ఘోరంగా ఉంది' అన్నాడు.

నేను బిత్తరపోయాను.

'అదేంటి? స్వామీజీ అలా వ్రాశాడా?' అడిగాను.

'అవును. తను పూర్వజన్మలో ఏదో సిద్ధుడుట' అన్నాడు.

'అదేంటి? ఇప్పుడే కదా చెట్టుమీద కోతి అన్నావ్. ఇంతలోనే సిద్దుడెలా అయ్యాడు?'

'ముందుగా ఒక జన్మంతా ఆశ్రమంలో చెట్టుమీద కోతిలా  ఉండాలిట. ఆ తర్వాత జన్మలో అదే ఆశ్రమంలో సిద్దుడిగా పుట్టే అర్హత వస్తుందని ఆ పుస్తకంలో వ్రాశాడు.' అన్నాడు.

'ఏడ్చినట్టుంది ! ఆశ్రమంలో సిద్దుడిగా పుట్టడం ఏంటి? ఎవరికి పుడతాడు? అంటే ఆశ్రమంలో ఆడాళ్ళు కూడా ఉన్నారా? ఒకవేళ ఉన్నారని అనుకున్నా, ఆశ్రమంలో ఉండేవాళ్లకు గర్భం ఎలా వస్తుంది?' అడిగాను అయోమయంగా.

'భలే పాయింట్ పట్టావ్ ! నాకీ పాయింట్ తట్టలేదు. ఏంటో అలా వ్రాశాడు మరి !' అన్నాడు సూర్య కూడా అయోమయంగా.

'సర్లే ఏదో ఒకటి ! ఎలా వస్తే మనకెందుకు? ఆ తర్వాతేమైందో చెప్పు' అన్నాను.

'ఇలా ఉండగా, ఆ ఆశ్రమానికి కొంతమంది సామాన్యభక్తులు వస్తూ పోతూ ఉండేవారట. వాళ్లకి ఈయన దీక్షలు ఇచ్చాడట. వాళ్ళే తర్వాత జన్మల్లో రామకృష్ణ పరమహంస గానూ, రమణ మహర్షిగానూ పుట్టారని వ్రాశాడు.' అన్నాడు.

అరికాలి మంట నషాళానికి ఎక్కింది నాకు.

'ఇంకా నయం ! వెంకటేశ్వర స్వామి, శీశైల మల్లన్న, బెజవాడ కనకదుర్గమ్మా కూడా అదే ఆశ్రమంలో తన శిష్యులుగా ఉండేవారని చెప్పలేదు. సంతోషం!' అన్నాను.

'అలా చెప్పలేదుగాని దాదాపుగా అదే చెప్పాడు. వాళ్ళందరూ ఈనాటికీ రోజూ తనతో కబుర్లు చెబుతూ ఉంటారని వ్రాశాడు.' అన్నాడు.

'వాట్సప్ లోనా, ఇంస్టాగ్రాం లోనా? దురహంకారం మరీ తలకెక్కినట్టుంది ఈయనకు? ఈయన్ని అనుసరించే వాళ్ళు ఎలా ఉన్నారు?' అడిగాను.

'ఇంటలిజెన్స్ లెవల్స్ మరీ సబ్ స్టాండర్డ్ గా ఉన్నాయి వాళ్లకు. మళ్ళీ అందరూ చదువుకుని మంచి పొజిషన్స్  లో ఉన్నవాళ్ళే. కానీ నేలబారుగా ఆయనేది చెబితే దాన్ని నమ్మేస్తున్నారు. వాళ్ళని కూచోబెట్టి నానా అబద్దాలూ కధలూ నోటికొచ్చినట్టు చెప్పేస్తున్నాడు. వాళ్లేమో గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఐ రియల్లీ పిటీ దెం. ఎడ్యుకేటెడ్ ఫూల్స్ లా ఉన్నారు' అన్నాడు సూర్య.

'ఏం అబద్దాలు చెబుతున్నాడు?' అడిగాను.

'ఈ మధ్యనే రాక్షసులకూ వానరసైన్యానికీ ఒక యుద్ధం ఆకాశంలో జరిగిందట. ఆ యుద్ధంలో సింగరాయకొండ ఆంజనేయస్వామి కళ్ళుతిరిగి పడిపోతే కసాపురం ఆంజనేయస్వామి వచ్చి కాపాడాడని, తను పక్కనే ఉండి చూశాననీ చెప్పాడు ఒక ఉపన్యాసంలో.' అన్నాడు.

పదినిముషాలు ఆగకుండా నవ్వుతూనే ఉన్నా నేను.

'వింటున్న భక్తులేం చేశారు?' అడిగాను తేరుకుని.

'భక్తిగా తలలూపుతూ చొంగ కారుస్తున్నారు' చెప్పాడు.

'నేనింక నవ్వలేనుగాని, అసలు నీకీ స్వామీజీ గురించీ, ఆ ప్రత్యంగిరా టెంపుల్ గురించీ ఎలా తెలిసింది? ఆ కధంతా వివరించుము' అన్నాను.

చెప్పడం మొదలు పెట్టాడు సూర్య.

(ఇంకా ఉంది)

బ్లాగు భేతాళ కధలు - 2 (వాళ్ళిద్దరి అభిరుచులూ ఒకటే)

మొన్నొకరోజున సీరియస్ గా యోగాభ్యాసం చేస్తూ ఉండగా ఫోన్ మ్రోగింది.

శీర్షాసనంలోనే ఉండి ఫోన్ తీసుకుని 'హలో' అన్నా.

'నేను సూర్యని' అన్నాడు.

'ఊ! చెప్పు. ఏంటి కొత్త కధ?' అన్నాను.

'ఏంటి వాయిస్ ఎక్కడో బావిలోనించి వస్తున్నట్టుంది?' అన్నాడు.

'అవును. బావిలో శీర్షాసనం వేస్తున్నా. అందుకే అలా ఉంది వాయిస్' అన్నాను.

'నీకు జోకులు మరీ ఎక్కువయ్యాయి. సర్లేగాని, నాకొక ధర్మసందేహం వచ్చింది. నువ్వు ఆన్సర్ చెయ్యాలి' అన్నాడు.

'ఆన్సర్ చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలౌతుంది అని శాపం పెడతావా ఏంటి?' అన్నా.

'అంత శక్తి నాకు లేదులేగాని, ఇద్దరి అభిరుచులూ చక్కగా కలిశాయని అబ్బాయీ అమ్మాయీ మురిసిపోతూ పెళ్లి చేసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి?' అడిగాడు.

'అదంతా ట్రాష్. అలాంటివి ఏవీ ఉండవు.' అన్నాను.

'హుమ్,,,' అని మూలిగాడు సూర్య.

'ఏంటి అంతలా మూలిగావ్? ఏమైంది?' అడిగాను శీర్షాసనం నుంచి దిగుతూ.

'ఏమీ కాలేదు. బానే ఉన్నాను. నువ్వు చెప్పిన ఆన్సర్ కి నీరసం వచ్చింది.' అన్నాడు.

'ఎందుకంత నీరసం? ఇంతకీ నువ్వడిగిన ప్రశ్న నీ కపోల కల్పితమా?  లేక వేరేవాళ్ళ కపాల లిఖితమా?' అడిగాను.

'రెండోదే. చెప్తా విను. మా అమ్మాయి అమెరికాలో ఉందని నీకు తెలుసు కదా ! దానికి ఇద్దరు అమెరికా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకబ్బాయి ఒకమ్మాయి. వాళ్ళిద్దరి అభిరుచులూ ఒకటే. ఇద్దరి అభిమాన హీరోలూ ఒకరే. ఇద్దరూ  ఇష్టపడే కార్ల బ్రాండూ, హోటలూ, తిండీ,  డ్రస్సులూ, చివరకు పిక్నిక్ స్పాట్లూ, టీవీ చానల్సూ అన్నీ ఒక్కటే. అంతలా వాళ్ళ అభిరుచులు కలసి పోయాయి. అందుకని ఒకరినొకరు బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.' అన్నాడు సూర్య.

విపరీతమైన నవ్వొచ్చింది నాకు.'  'హహ్హహ్హ...' అంటూ పెద్దగా నవ్వేశాను. 

'ఎందుకలా విలన్లా నవ్వుతున్నావ్? నవ్వకు. అసలే యోగా చేస్తున్నావ్. కొరబోతుంది.' అన్నాడు సూర్య.

'ఏం పోదులే గాని. తర్వాతేమైఁదో  నేను చెప్తా విను. నాలుగేళ్ళు తిరిగీ తిరక్కుండానే వాళ్ళు డైవోర్స్ తీసుకున్నారు.' అన్నా చక్రాసనం వెయ్యడానికి రెడీ అవుతూ.

కెవ్వ్ మని కేక వినిపించింది అటువైపు నుంచి.

నాకు భయం వేసింది.

'ఏమైంది సూర్యా ! ఎందుకలా అరిచావ్ ?' అడిగాను కంగారుగా.

'ఏం కాలేదు. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావ్? నీకేవో శక్తులున్నాయని నాకు మొదట్నించీ అనుమానం. అదిప్పుడు నిజమౌతోంది. నువ్వన్నట్టుగానే వాళ్ళు సరిగ్గా నాలుగేళ్ళకి విడిపోయారు.' అన్నాడు.

'పోతే పోయార్లే ! కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే మంచిది. ఎవరి బ్రతుకు వాళ్ళు హాయిగా బ్రతకొచ్చు. ఈ మాత్రం చెప్పడానికి శక్తులు అక్కర్లేదు. సైకాలజీ తెలిస్తే చాలు. సర్లేగాని, వేరే టాపిక్ ఏమీ లేదా మనం మాట్లాడుకోడానికి?' అడిగాను చక్రాసనంలో నడుమును బాగా వంచుతూ.

'ముందు నా సందేహానికి సమాధానం చెప్తే ఇంకో టాపిక్ లోకి వెళతా' అన్నాడు.

తను  ఏం అడగబోతున్నాడో అర్ధమైనా తెలీనట్టు ' ఏంటి నీ సందేహం?' అన్నాను.

'అదే ! అంత ఇష్టపడి, ఒకరి అభిరుచులు ఒకరికి బాగా కలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు నాలుగేళ్ళలో ఎందుకు విడిపోయారు? దీనికి సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ యోగా షెడ్యూల్ చెడిపోతుంది.' అన్నాడు సూర్య నవ్వుతూ.

'చాలా సింపుల్ సూర్యా ! నీ ప్రశ్నలోనే జవాబుంది. అంతగా ఒకరి  అభిరుచులను ఒకరు ఇష్టపడి చేసుకున్నారు గనుకనే విడిపోయారు' అన్నాను.

'అదేంటి? నీ జవాబు ఏదో కన్ఫ్యూజింగ్ గా ఉంది. కొంచం వివరించుము' అన్నాడు సూర్య.

'ఇందులో కన్ఫ్యూజింగ్ ఏమీ లేదు. సరిగ్గా  అర్ధం చేసుకుంటే చాలా సింపుల్. వాళ్ళు ఇష్టపడినది అభిరుచులని. అంతేగాని ఒకరినొకరు ఇష్టపడలేదు. కనుకనే విడిపోయారు. అభిరుచులు ఈరోజున్నట్లు రేపుండవు. మారుతూ  ఉంటాయి. కానీ మనుషులు ఒక్కలాగే ఉంటారు. వ్యక్తిని ఇష్టపడాలి గానీ రంగును, అందాన్ని, ఆస్తిని, హాబీలను, అభిరుచులను కాదు. ఇవన్నీ కొన్నాళ్ళకు మారిపోతాయి. కానీ మౌలికంగా ఆ మనిషి మారడు. ఆ మౌలికత్వాన్ని, అంటే, essential person ను ఇష్టపడితే ఈ బాధ ఉండదు. అప్పుడు జీవితాంతం కలిసే ఉంటారు.

ఇంకో సంగతి చెబుతా విను. పెళ్లి కాకముందు ఒకరినొకరు ఎంత అర్ధం చేసుకున్నాం అనుకున్నా అది భ్రమ మాత్రమే. ఎందుకంటే, బయటకు కనిపించే మనిషి వేరు. లోపల ఉండే మనిషి వేరు. బయటకు కనిపించే హాబీలు అభిరుచులలో ఆ లోపల మనిషి కనిపించడు. పెళ్ళయ్యాక రోజులు గడిచే కొద్దీ ఆ నిజస్వరూపాలు కనిపించడం మొదలౌతాయి. క్రమేణా ఒకరంటే  ఒకరికి మునుపటి ఆసక్తీ ఆకర్షణా పోయి విసుగూ విరక్తీ వచ్చేస్తాయి. ఈ క్రమంలో పిల్లలు ఎలాగూ పుట్టేస్తారు కదా. పిల్లలకోసమో, పరువు కోసమో ఇష్టం లేకున్నా కలిసి ఉంటారు. కానీ తమకు నచ్చిన ఇంకొకరిని వెదుకుతూనే ఉంటారు. ఇప్పుడైతే extra marital affairs ఇండియాలో కూడా ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తున్నాయి. దానికి soul mate అని కొత్త నామకరణం చేశారు. అదొక గోల !

అమెరికాలో ఇలాంటి హిపోక్రసీ లేదు కదా !  వాళ్లకు నచ్చకపోతే విడిపోతారు. అంతే ! నువ్వు చెబుతున్నవాళ్ళు అదే చేశారు. నా దృష్టిలో అలా విడిపోవడం మంచిదే ! ఒకరికొకరు నచ్చనప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకే కప్పు క్రింద బ్రతకడం కంటే, విడివిడిగా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడమే మంచిది.

నేను చెప్పిన essential person  ను ప్రేమించే కిటుకు తెలిస్తే ఏ బాధా లేదు. ప్రతివారిలోనూ కొన్ని లోపాలుంటాయి. మనకు నచ్చని కొన్ని కోణాలు తప్పకుండా   ఉంటాయి. వాటిని అర్ధం చేసుకుని సర్దుకుపోవడమే జీవితం. మరీ ఇక తట్టుకోలేనంత విభేదాలున్నపుడు విడిపోక తప్పదనుకో! కానీ హాబీలు కలవలేదనో, ఒకరికి కాఫీ ఇష్టమైతే ఇంకొకరికి టీ ఇష్టమనో, ఒకరికి వంకాయ ఇష్టమైతే ఇంకొకరికి బెండకాయ ఇష్టమనో, ఇలాంటి సిల్లీ విషయాలకు విడిపోవడం అమెరికాలో సహజమే కదా ! మనకు అలా ఉండదు.   మనకు సర్దుకుపోవడం ఎక్కువ. అమెరికాలో రిజిడిటీ ఎక్కువ. అందుకనే వాళ్ళు విడిపోయారు.

వాళ్ళ అభిరుచులను ఇష్టపడటం కాకుండా ఒకరినొకరు ఇష్టపడి ఉంటే వాళ్ళు కలిసే ఉండేవారు. ఎందుకంటే 'అభిరుచి' అంటేనే expectation కదా! అంటే, "నేననుకున్నట్టు ఎదుటి మనిషి ఉండాలి" అనుకోవడమే కదా హాబీలు అభిరుచులు కలవడం అంటే. అన్ని expectation లూ జీవితాంతం మారకుండా అలాగే ఎక్కడా ఉండవు. అవి మారినప్పుడు, ఆ ఎదుటివ్యక్తి కూడా మనకనుగుణంగా మారాలని ఆశించడమే అసలైన తప్పు.  అలా జరగనప్పుడు ఒకరంటే ఒకరికి    విసుగు పుట్టడం సహజమే. వీళ్ళ కేస్ లో అదే జరిగింది. అమెరికన్స్ గనుక విడిపోయారు. అంతే ! వెరీ సింపుల్ !" అన్నాను.

'అయితే, హాబీలు నచ్చడం ముఖ్యం కాదు. ఒకరినొకరు అర్ధం చేసుకోవడం, సర్దుకోవడం ముఖ్యం అంటావ్" అన్నాడు.

'అంతే ! రుచులూ అభిరుచులూ కలిస్తే సరిపోదు. మనసులు కలవాలి. అదే ముఖ్యం.' అన్నాను శవాసనంలోకి మారుతూ.

'అంత మానసిక పరిణతి ఇప్పటి కుర్రకారుకు ఎలా వస్తుంది? రాదుకదా?' అన్నాడు.

'రాదు కాబట్టే, నూటికి ఏభై పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి ప్రస్తుతం' అన్నాను.

"మరి దీనికేంటి పరిష్కారం?' అన్నాడు.

'వెరీ సింపుల్! రోజూ నాలా యోగా చెయ్యడమే' అన్నాను నవ్వుతూ.

'మళ్ళీ మొదలుపెట్టావా నీ జోకులు?' అన్నాడు సీరియస్ గా.

'పోనీ ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది.  వాళ్ళిద్దర్నీ నా శిష్యులుగా మారమని చెప్పు. అప్పుడు కరెక్ట్ గా ఎలా బ్రతకాలో వాళ్లకు ట్రెయినింగ్ ఇస్తాను. నీకీ మధ్యవర్తిత్వం బాధా తప్పుతుంది.' అన్నాను.

'రెండూ జరిగే పనులు కావులే గాని. నువ్వు  యోగా చేసుకో. నాకు వేరే పనుంది.' అన్నాడు.

'నాకూ పనుంది. నువ్వు ఫోన్ పెట్టేయ్' అంటూ నేను ప్రాణాయామం మొదలుపెట్టాను.

సూర్య ఫోన్ కట్ చేశాడు.