నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

19, అక్టోబర్ 2018, శుక్రవారం

జిల్లెళ్లమూడి స్మృతులు - 22 (మా గృహప్రవేశానికి అమ్మే స్వయంగా వచ్చింది)

అమ్మగారి ఫోటోనూ, శ్రీరామకృష్ణులు, శారదామాత, వివేకానందస్వాముల ఫోటోనూ పూజామందిరంలో ఉంచి, తలతిప్పి వెనక్కు చూచేసరికి రవన్నయ్య హాల్లో నిలబడి కన్పించారు. ఒక్క క్షణం నోటమాటరాక నిలబడి పోయాను !

రవన్నయ్య జిల్లెళ్ళమూడి అమ్మగారి కుమారుడు. బ్యాంకింగ్ రంగంలో చాలాకాలం పనిచేసి రిటైరైన ఆయన ప్రస్తుతం బాపట్లలో ఉంటున్నారు. ఈ సమయంలో ఆయనిక్కడ ఉన్నట్లుగా మాకు తెలీదు. ఆయన వస్తారని కూడా మేము ఊహించలేదు. ఆర్భాటం లేకుండా సింపుల్ గా మా కార్యక్రమం చేసుకుందామని అనుకోవడంతో జిల్లెళ్ళమూడిలో కూడా ఎవరినీ ఆహ్వానించలేదు. వసుంధరక్కయ్యను పిలుద్దామంటే, లిఫ్ట్ పని ఇంకా పూర్తి కాలేదు. లిఫ్ట్ లేకుండా తను సెకండ్ ఫ్లోర్ కి రాలేదు.

అమ్మగారి సంతానంలో పోయినవాళ్ళు పోను మిగిలింది సుబ్బారావన్నయ్య, హైమక్కయ్య, రవన్నయ్యలు మాత్రమే. వీరిలో హైమక్కయ్య 1966 లోనే చాలా చిన్న వయసులో గతించింది. సుబ్బారావన్నయ్య చాలాకాలం తర్వాత పెద్ద వయసులోనే పోయాడు. ప్రస్తుతం మన ఎదురుగా మనకు కన్పిస్తున్నది రవన్నయ్య మాత్రమే. ఆయనలో అమ్మగారి పోలికలు స్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన వస్తే అమ్మగారు వచ్చినట్లే !

వెంటనే నేను ఆయన పాదాలను స్పృశించి స్వాగతం చెప్పి, మిగిలిన అందరినీ కూడా ఆయనకు ప్రణామం చెయ్యమని చెప్పాను. ఆ తర్వాత అమ్మ ఫోటోకు పుష్పాంజలి సమర్పించమని అన్నయ్యను కోరాను. ఆయన తర్వాత వరుసగా అందరం అమ్మకు, శ్రీరామకృష్ణులకు పుష్పాంజలి సమర్పించాము. ఆవుపాలు రెడీగా ఉన్నాయి. పాయసం చేసే కార్యక్రమం మొదలైంది.

'జాబాల దర్శనోపనిషత్' ప్రింట్ పుస్తకాన్ని జిల్లెళ్ళమూడిలో అమ్మ సమక్షంలో విడుదల చేద్దాం అన్న సంకల్పంతో కొన్ని ఇంగ్లీషు పుస్తకాలను, కొన్ని తెలుగు పుస్తకాలను మాతో తెచ్చాము. రవన్నయ్య కనిపించేసరికి వాటిని అన్నయ్య చేతులమీదుగానే విడుదల చేయించాము. అమ్మే స్వయంగా తన చేతులతో వాటిని విడుదల చేసినంత ఆనందం మాకు కలిగింది.

ప్రసాదం రెడీ అయ్యే లోపు రవన్నయ్యను హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి మేమందరం ఆయన చుట్టూ నేలమీద కూచున్నాము. అన్నయ్య ముఖం వైపు కాసేపు చూస్తూ ఉండిపోయాము. ఆయన కూడా ఏమీ మాట్లాడకుండా మా వైపు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయారు. ఆయన్ను చూస్తుంటే అమ్మను చూస్తున్నట్లే నాకు అనిపించింది. అమ్మే అక్కడకు అన్నయ్య రూపంలో వచ్చిందా అన్నట్లు అనిపించింది. అలా కూర్చుని ఉన్న అన్నయ్య ముఖంలో కూడా ఏదో మార్పు కనిపించింది మాకు. అచ్చం అమ్మ చిరునవ్వు నవ్వుతున్నట్లే ఆయన ముఖం మారిపోయింది. ఉన్నట్టుండి ఆ గదిలో వాతావరణంలో ఏదో తెలియని మార్పు రావడం మొదలైంది. గాలిలో విద్యుత్తు ప్రాకుతున్నదా అన్నంతగా ఆ గది మొత్తం చార్జ్ అయిపోయింది. 

అప్రయత్నంగా  నాకు ధ్యానస్థితి రావడం మొదలైంది. ఏ ప్రయత్నమూ చెయ్యకుండానే మనస్సు నిశ్చలమై అంతర్ముఖమై పోతున్నది. నా ప్రమేయం లేకుండా కళ్ళలోంచి నీళ్ళు ధారలుగా కారిపోతున్నాయి. రవన్నయ్య మౌనంగా ఇదంతా గమనిస్తూ కాసేపు ఆయన కూడా కళ్ళు మూసుకున్నారు. చుట్టూ కూచున్న వారంతా ఈ దృశ్యాన్ని మౌనంగా వీక్షిస్తున్నారు.

అట్లా ఒక పది నిముషాలు ఉన్న తర్వాత భావావేశం కొంచం తగ్గుముఖం పట్టింది. మెల్లిగా కళ్ళు తెరిచాను, రవన్నయ్య కూడా కళ్ళు తెరిచి నా వైపు చిరునవ్వుతో చూచారు.

'ఇలాంటి దృశ్యాలను నా చిన్నప్పటి నుంచీ ఎన్నో చూచాను. అమ్మ దగ్గరకు వచ్చినవాళ్ళలో చాలామంది వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేవారు. నా చిన్నతనంలో ఈ సీన్లన్నీ చూచి ఏడవడం ఇక్కడ ఒక రూలేమో, అందరూ అలా ఏడవాలేమో అని అనుకునేవాడిని.' అన్నారాయన.

మేం మౌనంగా వింటున్నాం.

'జిల్లెళ్ళమూడిలో ఈ ఇల్లు కొనడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? అసలు మీ మార్గం ఏమిటి?' అడిగారాయన.

'మాది ధ్యానమార్గం అన్నయ్యా. నా దారిలో నడవడానికి ఇష్టపడే వారికంటూ ఒక ఆశ్రమం ఉండాలన్నది మా ఆశయం. అక్కడ ఉంటూ ప్రశాంతంగా సాధన చేసుకోవడం మా లక్ష్యం. ప్రాధమికంగా నేను శ్రీరామకృష్ణుల భక్తుడిని అయినప్పటికీ, రామకృష్ణా మిషన్ కు నా దారి భిన్నమైనది. మేము సోషల్ సర్వీస్ జోలికి వెళ్ళం. మాకు చేతనైనంతలో నిశ్శబ్దంగా సాటివారికి సహాయం చేస్తాం. కానీ అదే పనిగా సోషల్ సర్వీస్ చెయ్యం. ప్రస్తుతం ఇండియాలో అది అవసరం లేదు. సాధన కోసం మాకంటూ ఇక్కడ ఒక ఇల్లు ఉండాలని కోరుకున్నాం. అప్పుడప్పుడూ ఇక్కడకు వచ్చి కొన్నాళ్ళు ఉండి తపస్సు చేసుకోవడం కోసం ఈ ఇల్లు కొన్నాము' అని చెప్పాను.

గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు అన్నయ్య కాసేపు మౌనంగా ఉండిపోయారు.

'ఇప్పుడు మీరు చూస్తున్న శివాలయం ఉన్న స్థలంలొనే 1950 కి ముందు అమ్మ ఒక పూరిపాకలో ఉండేది. 1960 నుంచి 70 లోపల, ఇప్పుడు అఖండనామం జరుగుతున్న చోట ఇంకొక పూరింట్లో ఉండేది. ఆ తర్వాత ఇప్పుడున్న డాబా ఇంటికి మారింది. 1950 ప్రాంతాలలో కోటంరాజు నారాయణరావు గారని ఒకాయన అమ్మను వెతుక్కుంటూ వచ్చారు. ఆయనకేదో అంతరిక అనుభవం కలిగింది. 'అమ్మా! నువ్వింత మారుమూల పల్లెటూళ్ళో దాక్కుని ఉన్నావు. నీ గురించి అందరికీ తెలియాలి. నీ గురించి పత్రికలలో నేనొక వ్యాసం వ్రాస్తానమ్మా' అని ఆయన అడిగారు.

దానికమ్మ ' ఇప్పుడెవరి వ్యాసం చదివి నువ్వొచ్చావు నాయనా? నిన్ను రప్పించిన శక్తే వాళ్ళనూ రప్పిస్తుంది. నీకెందుకు? నీ సంగతి నువ్వు చూసుకో' అన్నట్లు జవాబు చెప్పింది. అమ్మ ప్రచారానికెప్పుడూ పెద్దపీట వెయ్యలేదు. ఆ కాలంలోనే అమ్మ ఇంకో మాటన్నది. 'ముందు ముందు ఇది తపోస్థలం అవుతుంది. ఎంతోమంది యోగులు, సాధకులు ఇక్కడకు వస్తారు. ఇక్కడ ఉంటారు.' అని. బహుశా మీ రాక దానికి సంకేతం అని నాకనిపిస్తున్నది.' అన్నాడన్నయ్య.

'1950 లలో అమ్మ ఈ మాటన్నపుడు ఇక్కడున్న మేమెవ్వరమూ ఇంకా పుట్టలేదన్నయ్యా' అని నేనన్నాను.

'అమ్మ దృష్టి జన్మలకు అతీతంగా ఉండేది. ఇంకో సంఘటన వినండి. దాదాపుగా అదే సమయంలో ఒకసారి ఒక పెద్దాయన అమ్మను చూడ్డానికి వస్తే, ' ఇంతకు ముందే నిన్ను నేను చూశాను నాయనా' అని అమ్మ అన్నది.

'ఎక్కడ చూచావమ్మా' అని ఆయన అడిగాడు.

'మంగళగిరిలోని అన్నసత్రంలో వడ్డిస్తున్నపుడు పలానా సంవత్సరంలో నిన్ను చూచాను.' అని అమ్మ అన్నది.

ఆ సంవత్సరంలో ఆయన మంగళగిరి అన్నసత్రానికి వెళ్ళినది నిజమే. అయితే, అమ్మ అప్పటికి ఇంకా పుట్టలేదు. అలా, తను పుట్టక ముందరి విషయాలు కూడా చూచినట్లుగా అమ్మ చెప్పేది.' అన్నారు రవన్నయ్య.

'మేము కూడా గతజన్మలలో అమ్మను చూచే ఉంటాము. అందుకనే ఈ జన్మలో మళ్ళీ ఇక్కడకు వచ్చామేమో?' అన్నాన్నేను.

కావచ్చు అన్నట్లుగా అన్నయ్య తల పంకించారు.

ఈ లోపల పాయసం వండటం అయిపోయింది. అమ్మకు నైవేద్యం పెట్టి, అందరం కొద్ది కొద్దిగా తీసుకున్నాము. ఆ తర్వాత 'వెళ్లి వస్తానంటూ' అన్నయ్య లేచి క్రిందకు వెళ్ళారు.

అందరి వైపూ ఒక్కసారి చూచాను.

ఏదో ఒక అద్భుతాన్ని అప్పటిదాకా చూచినట్లు అందరి ముఖాలూ సంభ్రమంగా ఉన్నాయి. ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం జరిగిన సంగతులను అన్నయ్య చెబుతుంటే టైం ట్రావెల్ చేసి ఆ కాలానికి వెళ్ళిన అనుభూతి చాలామందికి కలిగింది.

అన్నయ్య రూపంలో అమ్మే వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిందని మాకందరికీ అనిపించింది.



















(ఇంకా ఉంది)