నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, అక్టోబర్ 2018, ఆదివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 28 (సోషల్ సర్వీస్)

ఆఫీస్ కి వెళ్లేసరికి దినకర్ అన్నయ్య అక్కడ కూచుని ఉన్నారు. మమ్మల్ని చూస్తూనే 'రండి రండి' అంటూ ఆహ్వానించారు. నిన్న 'జాబాల దర్శన ఉపనిషత్' ఇంగ్లీషు పుస్తకాన్ని ఆయనకు ఇచ్చి ఉన్నాను. దానిని చదివినట్లున్నారు. 'మీ పుస్తకం బాగుంది. చాలా క్లుప్తంగా సూత్రాల లాగా చక్కగా విషయాన్ని వివరించారు' అన్నారాయన. ఒకే పుస్తకం చదివిన ఇద్దరు మనుషుల స్పందనలో ఎంత తేడానో కదా అనిపించింది. ఇలాంటి కామెంట్స్ ని బట్టే ఆ మనిషి ఎలాంటివాడో మనకు తెలుస్తూ ఉంటుంది.

విశ్వజనని పత్రికలో దినకర్ అన్నయ్య ఒక ఇంగ్లీష్ వ్యాసం వ్రాస్తూ ఉంటారు. అది పత్రిక చివరి పేజీలలో ఉంటుంది. ఆయన ఇంగ్లీషు చాలా చక్కగా చిక్కగా ఉంటుంది. నేను ఆ వ్యాసాలు చదువుతూ ఉంటాను.

దినకర్ అన్నయ్య 1960 ప్రాంతాలలోనే సివిల్ సర్వీస్ చాలా మంచి మార్కులతో పాసయ్యారు. కానీ అదే సమయంలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇంటర్వ్యూకి హాజరు కాలేకపోయారు. మెయిన్స్ లొ చాలా మంచి మార్కులు రావడంతో తనకు సెలెక్షన్ రావాలని కోర్టును ఆశ్రయించారు. చాలా కాలం ఆ కేసు సాగింది కాని ఎటూ తేలలేదు. ఈలోపల బ్యాంక్ లో పీ.వో గా చేరారు. కొన్నేళ్ళు అక్కడ చేసి బయటకొచ్చి Rao's Study Circle లొ ఫేకల్టీగా పనిచేశారు. ఆ తరువాత ICFAI లొ కూడా ఫేకల్టీగా పనిచేశారు. వీరి శిక్షణలో ఎందఱో IAS, IPS లను సాధించారు. దశాబ్దాలనుంచీ అమ్మ భక్తుడు. శ్రీ విశ్వజననీ పరిషత్ లో కీలకపాత్రను పోషిస్తున్నారు. నిరాడంబరంగా మౌనంగా ఉండే ఈయనలో ఇంత లోతుపాతులున్నాయంటే ఎవరూ ఒక పట్టాన నమ్మరు. లోతైన ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాదు. National and International స్థాయిలో Current affairs మీద లోతైన పట్టు ఉన్న వ్యక్తి.

ఆ తర్వాత ఎంతోసేపు ఎన్నో విషయాల మీద ఆయన మాతో మాట్లాడారు. వాటిల్లో మన దేశ ప్రస్తుతపరిస్థితి, అంతర్జాతీయ సంబంధాలు, అమెరికా యూరోపు దేశాల ఆర్ధిక పరిస్థితి, ఇలా ఎన్నో విషయాలు దొర్లాయి. కాసేపు ఆయనతో మాట్లాడితే చాలు, ఆయనెంత విజ్ఞానఖనియో అర్ధమౌతుంది. అలాంటి వ్యక్తి అలా మారుమూల పల్లెలో ఒక సామాన్యునిలా ఉంటూ అమ్మను సేవిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది.

అమ్మను గురించి చెబుతూ ఆయనిలా అన్నారు.

'అమ్మ బయటకు ఒక సామాన్యవ్యక్తిగా మనకు కనిపించినప్పటికీ, ఆమెలో యూనివర్సల్ పవర్ ఉంది. అమ్మదంతా యూనివర్సలే. ఆమెలో సంకుచితం అనేది లేదు. అందుకే అలాంటి వారి అవసరాలకు ప్రకృతే స్పందిస్తుంది. మేము ఎన్నో విషయాలు కళ్ళారా చూచాం. ఒకసారి అమ్మకు రేడియాలజీ టెస్ట్లు చెయ్యాల్సి వచ్చింది. ఆస్పత్రిలో మిషన్ ఉన్నది. కానీ అనుకున్న సమయానికి రేడియాలజిస్ట్ రాలేదు. అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాం. అతను రాకుంటే పని జరగదు. ఇప్పుడెలా అనుకుంటూ ఉన్నాం. ఇంతలో హటాత్తుగా ఒక విదేశీ వనిత వచ్చింది. తను ఆస్ట్రేలియా నుంచి వస్తున్నానని అమ్మను చూద్దామని వచ్చానని చెప్పింది. 'మీరేం చేస్తుంటారు?' అని మేమడిగితే, 'నేను రేడియాలజిస్ట్ ను' అన్నది. మేమంతా ఆశ్చర్యపోయాం. 'మా పరిస్థితి ఇది, ఈరోజు అమ్మకు ఫలానా టెస్ట్ లు చెయ్యాలి. రేడియాలజిస్ట్ రాలేదు' అని చెప్పాం. 'ఏం పరవాలేదు. నేను చేస్తాను' అని తను ఆ టెస్ట్ లన్నీ చేసింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియా నుంచి అదే సమయానికి ఆమె రావడం, పని జరిగిపోవడం ఏమిటి? ఇలాంటి అధ్బుతాలు అమ్మ సమక్షంలో ఎన్నో జరిగేవి. కానీ అమ్మ వాటిని చేసినట్లుగా కన్పించేది కాదు. ఆమె మనస్సు నిరంతరం వ్యక్తిగతానికి అతీతంగా యూనివర్సల్ గా ఉండేది. అందుకే ఆమె అవసరాలకు యూనివర్స్ స్పందించేది. అవి మనకు అద్భుతాలుగా తోచేవి.

ఇలాంటివి ఎన్నో మేము ఇక్కడ చూచాము. మండుతున్న ఎండలో 'ఉక్క పోస్తోందిరా' అని అమ్మ అంటే అయిదు నిముషాలలో మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లగా మారడం మేము చూచాము. కాసేపు ఉండి మళ్ళీ మేఘాలు వెళ్లిపోయేవి. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో లెక్కలేదు.' అని చెబుతున్న దినకర్ అన్నయ్య కొంచం ఆగారు.

'మీరేమనుకోకుంటే ఒక మాట అడగాలని ఉంది' అని మూర్తి ఆయన్ను అడిగాడు.

'అడగండి' అన్నారాయన.

'ఈ సంస్థను మీరంతా ఇప్పటిదాకా నడిపారు. కానీ మీ చేతులోనుంచి ఈ పనిని అందిపుచ్చుకునే తర్వాత తరాన్ని మీరు తయారు చేస్తున్నారా? అది లేకపోతే ఒకేసారిగా పెద్ద గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కదా?' అని అడిగాడు మూర్తి.

దినకర్ అన్నయ్య చెప్పసాగారు.

'గురు పరంపర వేరు. ఒక వ్యవస్థ వేరు. పరంపరలో అయితే గురువు తర్వాత ఇంకో గురువు, ఆ తర్వాత ఇంకో గురువు అలా వస్తూ ఉంటారు. కాని ఇది అలాంటిది కాదు. ఇక్కడకు ఎవరో వస్తారో ఏయే పనులు చేస్తారో అన్నీ అమ్మే చూసుకుంటుంది. మనం ఉన్నంతవరకూ మన పనిని సక్రమంగా చెయ్యడమే మన బాధ్యత. ఆ తర్వాత ఏమౌతుందో అది అమ్మ ఇష్టం. అలాంటి అచంచలమైన విశ్వాసంతో మనం ఉండాలి. దీన్ని ఉంచాలి అని అమ్మ అనుకున్నంత వరకూ ఇది ఉంటుంది. ఎలా ఉంటుందో ఎలా జరుగుతుందో అమ్మ ఎలా జరిపిస్తుందో మనకు అర్ధం కాదు.' అన్నారాయన.

ఆ తర్వాత ఆయన 'పంచవటి' ఆశయాల గురించి అడిగారు. సోషల్ సర్వీస్ మీద మా అభిప్రాయాలను విని ఆయనిలా అన్నారు.

'120 ఏళ్ళ క్రితం వివేకానంద స్వామి ఉన్న సమయంలో ఉన్న సమస్యలు వేరు. ఇప్పుడున్నవి వేరు. అందుకని అప్పటి విధంగా ఇప్పుడు కూడా సోషల్ సర్వీస్ చెయ్యవలసిన పని లేదు. కాకుంటే ఇప్పుడు మనం చెయ్యవలసిన పని రెండు విధాలుగా ఉన్నదని నాకనిపిస్తున్నది. ఒకటి, భావప్రచారం, రెండు, ప్రభావ ప్రసరణం.

నేటి యువతరంలో భావదారిద్ర్యం కొట్టవచ్చినట్లుగా కనిపిస్తున్నది. వారికి కావలసినంత డబ్బు చేతిలో ఉన్నది. అన్ని రకాలైన నవీన సౌకర్యాలూ వారికీ అందుబాటులో ఉన్నాయి. కానీ సంస్కారం మాత్రం ఉండటం లేదు. దానిని వారి తల్లిదండ్రులు నేర్పడం లేదు. కుసంస్కారాన్ని మాత్రం సినిమాలూ, మీడియా నేర్పిస్తున్నాయి. అందుకని వాళ్ళు వికృతంగా తయారౌతున్నారు. దీనిని కౌంటర్ చెయ్యాలంటే మన అసలైన ఆధ్యాత్మిక భావాలను ఇంకా ఇంకా మనం ప్రచారం చెయ్యాలి.

టేబిల్ మీద ఉన్న ఇస్కాన్ పుస్తకాలను చూపిస్తూ ఆయన ఇలా అన్నారు.

'ఈ పుస్తకాలను మన లైబ్రరీకి డొనేషన్ గా ఇచ్చారు. వీరి పుస్తకాలు చాలా చక్కని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రింట్ కాబడతాయి. విద్యావంతులైన యువతరాన్ని గట్టిగా ప్రభావితం చెయ్యడంలో ప్రభుపాద గారు విజయం సాధించారనే చెప్పాలి. ఎంతోమంది పెద్ద పెద్ద యూరోపియన్ అమెరికన్ కంపెనీల CEO లు నేడు కృష్ణ భక్తులు. వాళ్ళ మీటింగ్స్ లొ నేను చూచాను. తెల్లని జుబ్బా, పంచె కట్టుకుని చేతిలో ఉన్న చిన్న సంచిలో జపమాల ఉంచుకుని కృష్ణమంత్రం జపిస్తూ ఉంటారు. మనవాళ్ళేమో డ్రస్సు, మాట అన్నిట్లో తెల్లవాళ్ళను అనుకరిస్తూ ఉంటారు. ఇదే భావదారిద్ర్యం అంటే.

రెండవది - ప్రభావ ప్రసరణం. నిజానికి మన దేశంలో ఉన్నంత అవినీతి ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అవినీతి అనేది మన దేశంలో institutionalize కాబడింది. ఈ దేశంలో అసలైన దొంగ ఎవరంటే - చదువుకున్నవాడే. ప్రస్తుతం జరుగుతున్న దోపిడీ అవినీతి అంతా intellectuals వల్లనే జరుగుతున్నది. చదువురాని పల్లెటూరి వాడు ఇంత అవినీతికి పాల్పడలేడు. వాడికి అంత చాన్స్ ఉండదు. పక్కవాడి నోరుకూడా కొట్టి తనే తినాలి అని చదువుకున్న వాడు అనుకోవడమే ఈ పరిణామానికి కారణం. ప్రతివాడూ ఇంకాఇంకా దాచుకోవాలి అన్న దురాశే నేటి పరిస్థితికి కారణం. ఈ క్రమంలో haves కీ havenots కీ గ్యాప్ చాలా దారుణంగా పెరిగిపోతున్నది. ఇంత అవినీతి ఉన్న మన దేశం ఎప్పుడో సర్వనాశనం అయిపోవాలి. కానీ అలా జరగడం లేదు. ఏదో శక్తి దీనిని ఎక్కడికక్కడ నిలబెడుతూ ఉన్నది. హిమాలయాల నుంచీ కన్యాకుమారి వరకూ ఎందరో మహనీయులు వారివారి అనుష్టానంతో తపస్సుతో దైవభావాలను, ఆధ్యాత్మిక తరంగాలను నిరంతరం ప్రసారం చేస్తూనే ఉన్నారు. ఆ తరంగాలే ఈ దేశాన్ని రక్షిస్తూ ఉన్నాయి. ఇంత కుళ్ళు మన చుట్టూ ఉన్నా కూడా మనం ఇంకా ఇలా ఉన్నామంటే అవే కారణం. కనుక వాటిని కూడా మనం ఇంకా ఎక్కువ చెయ్యాలి. ఇదే భావ ప్రసరణం అంటే. మీరు యోగమార్గంలో ఉన్నారు. ఈ విషయం నాకంటే మీకు బాగా తెలుస్తుంది' అన్నారాయన.

'అవును. స్పిరిట్యువల్ వైబ్రేషన్స్ ను ఇతోధికంగా ప్రసారం చెయ్యవలసిన అవసరం ఉన్నది' అన్నాను. 

'అవును. ఈ రెండు విధాలుగా నేడు సోషల్ సర్వీస్ చెయ్యాలని నా ఉద్దేశ్యం' అంటూ ముగించారాయన.

మా భావాలనే ఆయన నోట వినడంతో మాకు చాలా సంతోషం కలిగింది. నిస్పక్షపాతంగా నిస్వార్ధంగా ఆలోచించేవారందరూ ఒకేవిధంగా ఆలోచిస్తారేమో అనిపించింది. ఆయనకు ధన్యవాదాలు చెప్పి, సెలవు తీసుకుని బయటకు వచ్చాం.

(ఇంకా ఉంది)