నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

3, అక్టోబర్ 2018, బుధవారం

జిల్లెళ్లమూడిలో మాకొక స్థానం దొరికింది

పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ కు మాదంటూ ఒక ఆశ్రమంతో బాటు, మూడు ప్రదేశాలలో మా గెస్ట్ హౌస్ లు ఉండాలనేది నా స్వప్నం. ఆ ప్రదేశాలు జిల్లెళ్ళమూడి, అరుణాచలం, దక్షిణేశ్వరం. ఈ స్వప్నం సాకారం అయ్యే దిశగా ఈరోజు ఒక ముందడుగు పడింది. మాదంటూ ఒక ప్రాపర్టీని ఈరోజున జిల్లెళ్ళమూడిలో కొనడం జరిగింది. అమ్మ తన ఒడిలో మాకు చోటిచ్చింది.

ఈ భూమ్మీద ఇప్పటివరకూ పుట్టిన మహనీయులలో జిల్లెళ్లమూడి అమ్మగారిది అత్యున్నతమైన స్థానం. అమ్మ చూపిన మాతృప్రేమ గానీ, తాత్విక చింతన గానీ, ఆచరణలో చూపిన ఆధ్యాత్మికత గానీ ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేము. ప్రపంచం మొత్తం మీదనే అంతటి దివ్యమూర్తి ఇప్పటివరకూ లేదని ఘంటాపధంగా చెప్పవచ్చు.

అలాంటి అమ్మ నడయాడిన జిల్లెళ్ళమూడి గ్రామంలో మిత్రులు చక్కా శ్రీమన్నారాయణ గారు కట్టించిన 'శ్రీ చక్రరాజ అపార్ట్ మెంట్స్' లో ఒక ఫ్లాట్ ను ఈరోజున మా ఫౌండేషన్ కొనుగోలు చేసింది. ఈరోజు ఉదయమే బాపట్ల వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి వచ్చాము. అమ్మ పాదాల దగ్గర మాకంటూ ఒక నీడ ఈరోజున ఏర్పడింది.

నా శిష్యులు, పంచవటి సభ్యులు ఎవరైనా సరే, ఇప్పుడు జిల్లెళ్ళమూడి వెళ్లి కొన్నాళ్ళు సాధన చేసుకోవాలంటే, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఇప్పుడు మన ఇంట్లోనే ఉండవచ్చు. అమ్మ తిరిగిన పవిత్ర వాతావరణంలో హాయిగా సాధన చేసుకోవచ్చు.

అమ్మ అనుగ్రహంతో త్వరలో మా ఆశ్రమ స్థాపన దిశగా మిగతా అడుగులు కూడా పడతాయని మాకు నమ్మకం బలపడింది. మేము అనుకున్నది సాధిస్తామని విశ్వాసం గట్టిపడింది.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.