Pages - Menu

Pages

6, అక్టోబర్ 2018, శనివారం

ప్రేమ మైకం

ఈరోజు తెల్లవారక ముందే
ఎందుకో మెలకువొచ్చింది
ఇంకా కళ్ళు తెరవక ముందే
ప్రేమ నాలో కన్ను విచ్చింది

నీ ప్రేమను తలచుకొంటూ
విలపిస్తూ నిద్ర లేచాను
ఇంత ప్రేమకు నేనర్హుడినా?
అనుకుంటూ నిద్ర లేచాను

ఉదయిస్తున్న సూర్యుడిని చూచాను
ఆ బింబంలో నీ ప్రేమే నాకు కనిపించింది
ఒంటికి తాకుతున్న చల్లని గాలిలో
నీ ప్రేమే నన్ను సుతారంగా స్పృశించింది

మనోజ్ఞమైన ఉదయసంధ్యలో
నీ ప్రేమవెలుగే నన్ను పలకరించింది
ఏ దిక్కుకు తిరిగి చూచినా
నీ చిరునవ్వే నాకు దర్శనమిచ్చింది

పంచభూతాలుగా ఈ లోకంలో 
నన్ను పోషిస్తున్నది నీ ప్రేమే
ఇక్కడి నా ప్రయాణం ముగిశాక 
నే చేరే ఆఖరి మజిలీ నీ ప్రేమే

మా అమ్మ లాలింపుగా
నన్ను పెంచింది నీ ప్రేమే
నా పిల్లలపై ప్రేమగా
నాలో పొంగింది నీ ప్రేమే

నన్ను ప్రేమిస్తున్న వారిద్వారా
హర్షంగా నాపై కురుస్తోంది నీ ప్రేమే
నన్ను ద్వేషిస్తున్న వారిలో
శీర్షాసనం వేస్తున్నది నీ ప్రేమే

నన్ను చూచే నా ప్రేయసి కళ్ళలో
తళుక్కుమన్నది నీ ప్రేమే
నన్ను చంపే నా శత్రువు చేతిలో
చురుక్కుమన్నది నీ ప్రేమే

జీవితపు ప్రతి మజిలీలోనూ
ఎన్నో వేషాలలో ఎదురైంది నీ ప్రేమే
కాగితపు పూలల్లో కూడా
కళకళలాడింది నీ ప్రేమే

నేను గ్రహించినా గ్రహించలేకున్నా
నన్ను నడిపింది నీ ప్రేమే
నేను చూచినా చూడకపోయినా
కన్ను కలిపింది నీ ప్రేమే

జగత్తును నడుపుతున్నది ప్రేమే
జ్వలిస్తూ కరుగుతున్నది ప్రేమే
జీవితాన్ని మలుపుతున్నది ప్రేమే
చావులేక వెలుగుతున్నదీ ప్రేమే