నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, నవంబర్ 2018, శుక్రవారం

గురు నానక్ జయంతి - 2018


ఈ రోజు కార్తీక పౌర్ణమి. గురునానక్ జయంతి. నాందేడ్ సీరీస్ వ్రాస్తున్న సమయంలోనే గురునానక్ జయంతి రావడం యాదృచ్చికం కాదు.

ఈయన 29-11-1469 న పాకిస్తాన్లోని తల్వాండీలో జన్మించాడు. డెబ్బై ఏళ్ళు బ్రతికి 22-9-1539 న మరణించాడు. పౌర్ణమి రోజున జన్మించిన వారి జాతకాలలో ఆధ్యాత్మిక యోగాలుంటే వాళ్ళు దైవమార్గంలో చాలా ఉన్నతస్థాయికి చేరుకుంటారనడానికి ఈయన జాతకం కూడా ఒక నిదర్శనమే.

సిక్కులు ఈయన్ను తమ ఆదిగురువుగా భావిస్తారు. ఈయన హిందూ క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. అప్పటికే ఉన్న భక్తిమార్గాన్నీ, నిరాకార బ్రహ్మోపాసననూ కలిపి దానికి సామాజిక సమానత్వాన్ని జోడించి ఈయన సిఖ్ పంధాను తయారు చేశాడు. అనవసరమైన తంతులను పూజలను ఈయన నిరసించాడు. నిజమైన సద్గురువులు అందరిలాగే, ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికతకే ఈయన పెద్దపీట వేశాడు. వారిలాగా ఈయనది కూడా యూనివర్సల్ మైండే.

ఈయన జీవితాన్ని అందులోని సంఘటనలనూ ఏకరువు పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. అవి చాలాచోట్ల దొరుకుతాయి. ఈయన చెప్పిన బోధనలను క్లుప్తంగా చూద్దాం.

1. దైవం ఒక్కటే. దాని పేరు ఓమ్. అది నిరాకారం. అన్ని జీవులలో అంతరాత్మగా ఉన్నది. దానికోసం విగ్రహాలలోనో లేదా ఇంకెక్కడో వెదకడం వృధా.

2. పూజారులు, పురోహితుల మధ్యవర్తిత్వం అవసరం లేకుండా ప్రతివారూ దైవాన్ని సరాసరి తామే అనుభూతి చెందవచ్చు.

3. అనునిత్యం దైవనామాన్ని ధ్యానపూర్వకంగా స్మరిస్తూ తనలోని పంచపాపాలకు - అంటే, కామం, క్రోధం. లోభం, మోహం, అహంకారం -  వీటికి అతీతంగా నిత్యజీవితంలో బ్రతకడమే అసలైన పూజ. అదే అసలైన సాధన. మిగతా పూజలన్నీ పనికిమాలినవి.

4. ప్రతివారూ కష్టపడి ధర్మంగా బ్రతకాలి. అన్యాయపు ఆర్జన పనికిరాదు. మోసపు జీవితం పనికిరాదు. అలాంటి శుద్ధమైన జీవితమే దైవానికి నచ్చుతుంది.

5. సంసారాన్ని వదలి సన్యాసం తీసుకోవాల్సిన పనిలేదు. సంసారంలో ఉంటూనే దైవానుభూతి పొందవచ్చు. సమాజం పట్ల తన బాధ్యతను సన్యాసి నిర్వర్తించడు. కానీ సంసారి ఆ పని చేస్తూనే దైవసాధన కూడా చేస్తాడు. కనుక సన్యాసం కంటే సంసారమే గొప్పది.

6. కొండకోనల్లో సమాజానికి దూరంగా ఉంటూ తపస్సు చెయ్యవలసిన పని లేదు. సమాజంలో ధర్మంగా బ్రతుకుతూ, నీ పనిని నువ్వు సక్రమంగా, దైవానికి నచ్చేలాగా చేస్తూ, సాధన చెయ్యడమే నిజమైన సాధన.

7. నిత్యజీవితమే సాధన కావాలి, అంతేగాని వేషంకోసం కాసేపు చేసే పూజా, కోరికలు తీరడం కోసం చేసే దీక్షలూ పనికిరానివి.

8. మానవులలో కులం మొదలైన భేదాలు పనికిరావు. దైవం ఎదుట అందరూ సమానులే. కనుక మానవులలో సోదరభావం ఉండాలి. ఒకరికొకరు సహాయపడే తత్త్వం ఉండాలి.

9. సమాజంలో ఒక వృత్తి ఎక్కువా ఇంకొకటి తక్కువా కాదు. దేని విలువ దానిదేనని గ్రహించి ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం కావాలి. ఇంకొకరిపైన ద్వేషం పనికిరాదు.

ఈ విధంగా, నానక్ ఉపదేశాలన్నీ, మౌలికమైన హిందూమతానికి ప్రతిబింబాలుగా కనిపిస్తాయి. వీటిని ప్రతి సద్గురువూ ఒప్పుకున్నాడు, బోధించాడు. అలా బోధించిన గురువులు నానక్ కి ముందూ ఉన్నారు, తర్వాతా ఉన్నారు. ఆచరించే వారే లేరు !

ఈయన జాతకంలో నవాంశచక్రంలో ఉచ్చవక్ర శనితో బాటు, కేతువు, చంద్రుడు ఉండటం వల్ల - మనం ఈనాడు చూస్తున్న డొల్ల మతాచరణలకు భిన్నమైన నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం ఈయనకు కలిగింది. ఈయన ఎన్నో మహిమలను చేశాడు. కష్టాలలో ఉన్న ఎందరినో తన శక్తితో ఆదుకున్నాడు.

ఈయన శక్తి, దివ్యత్వము, మహిమా తర్వాతి గురువులకు పరంపరగా అందాయని శిక్కులు నమ్ముతారు. గురు గ్రంధసాహిబ్ లో ఈయన చెప్పిన బోధలు దాదాపు వెయ్యిదాకా ఉన్నాయి. అవన్నీ కూడా - భగవంతుడు ఒక్కడే, మానవులంతా ఒక్కటే, మనిషి ధర్మంగా బ్రతకాలి, అనవసర పూజలు, తంతులు. దీక్షలు వద్దు, నిత్యజీవితమే సాధనగా మారాలి, సాటిమనిషికి సాయం చెయ్యి, నీలోని పంచపాపాలకు అతీతంగా ఉండు, నిత్యం భగవంతుని నామాన్ని స్మరించు, శుద్ధంగా బ్రతుకు - అనే మూలసూత్రాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.

ఏ సద్గురువైనా చెప్పినవి ఇవే. కాకుంటే అప్పటికే ఉన్న హిందూమతంలోనుంచి నానక్ ఒక మార్గాన్ని తయారుచేసి, దానిని ముందు తను ఆచరించి, ఆ తర్వాత తన శిష్యులకు (సిక్ఖులకు) బోధించాడు. అది నేడు 'సిఖ్ మతం' అంటూ ఒక ప్రత్యేక పంధాగా రూపుదిద్దుకుంది.

'అయ్యప్పగుడిలోకి ఆడాళ్ళు రావచ్చా లేదా?' లాంటి చెత్త విషయాలమీద కాకిగోల చేస్తున్న నేటి హిందూసమాజం ఈ పనికిమాలిన కాలక్షేప ఆధ్యాత్మికతను వదిలిపెట్టి గురునానక్ వంటి మహనీయులైన సద్గురువులు చూపించిన అసలైన ఆధ్యాత్మికతను ఆచరిస్తే ఎంత బాగుంటుంది? కానీ మన కుహనా మతాచారపరులకు నిజమైన ఆధ్యాత్మికత ఎప్పటికైనా ఎక్కుతుందా? కనీసం అర్ధమౌతుందా? అసలు మన సమాజం ఏనాటికైనా నిజంగా ధార్మికంగా మారుతుందా? ఆధ్యాత్మికంగా ఎదుగుతుందా?

గురునానక్ ఈ భూమ్మీద నడయాడి 550 ఏళ్ళు గడిచాయి. కానీ ఈరోజుకైనా, ఆయన చెప్పిన మార్గంలో ఎంతమంది నిజంగా నడుస్తున్నారు? సందేహమే ! గురు నానక్, శిక్ఖులకు మాత్రమే గురువు, మనకు కాదు అనుకోవడం పెద్ద పొరపాటు. అలాగే, ఆయన బోధనలు శిక్కులకు చేసినవి, మనకు కాదు అని అనుకోవడం కూడా అతిపెద్ద పొరపాటే !

ఈ మహనీయుని, ఆయన బోధనలను, కనీసం ఈరోజైనా భక్తిపూర్వకంగా స్మరించుకుందాం. ఆచరించే ప్రయత్నం చేద్దాం !