నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

1, నవంబర్ 2018, గురువారం

నాందేడ్ యాత్ర - 4 (Room Number 211)

మొదటి రోజున నైట్ డ్యూటీ ముగించుకుని హోటల్ కి వచ్చి ఫ్రెష్ అయ్యాను. టిఫిన్ ఆర్డర్ చేసి, కాసేపు రిలాక్స్ అవుదాం అని బెడ్ మీద వాలగానే, రూమ్ లో ఉన్న మూడు లైట్లలో ఒక లైటు వెలిగీ ఆరిపోవడం మొదలుపెట్టింది.

నిన్న ఈ రూమ్ లోకి చెక్ ఇన్ అవుతున్నప్పుడే దీని నంబర్ గమనించాను. అది 211. ఏంటి రవి రాహు యోగం ఉంది? పైగా టోటల్ నంబర్ 4, అంటే కేతువు అయ్యింది? ఇదేదో haunted room లా ఉందే అన్న ఆలోచన మదిలో మెరిసింది. నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. ఒకవేళ అయితే గియితే అలాంటి రూమే అయినప్పటికీ, మనల్ని చూచి అది భయపడాలిగాని మనకేం అవుతుంది? అనుకుంటూ రూమ్ లోకి అడుగుపెట్టాను.

ఇప్పుడు ఉన్నట్టుండి సీలింగ్ లైట్ ఫ్లికర్ అవడం చూచి నిన్నటి ఆలోచన మళ్ళీ గుర్తొచ్చింది. ఏదైనా ఆత్మ మనం ఉన్న గదిలో ఉంది అనడానికి ఒక గుర్తు అలా లైట్లు వెలిగి ఆరిపోతూ ఉండటం (ఫ్లికర్ అవడం). ఈ విషయం అకల్ట్ సైన్సెస్ తెలిసిన ప్రతివారికీ తెలుసు.

సరే ఇదేదో తమాషాగానే ఉంది చూద్దాం అనుకుంటూ, రూమ్ సర్వీస్ ని పిలిచాను. కాసేపట్లో బాయ్ వచ్చాడు. విచిత్రంగా, అతను తలుపు తోసుకుని లోనికి రావడం, ఫ్లికర్ అవుతున్న సీలింగ్ లైట్ మామూలుగా అయిపోవడం ఒకేసారి జరిగాయి.

'క్యా ప్రాబ్లం హై సర్' అన్నాడు బాయ్.

'జరా వో లైట్ కో దేఖో, తోడా తక్లీఫ్ దే రహా హై' అన్నా కూల్ గా.

అతను దాన్ని కాసేపు చెక్ చేసి, తల అడ్డంగా తిప్పుతూ, ' కోయీ ప్రాబ్లం నహీ హై సార్, సబ్ అచ్చా హై' అని వెళ్ళిపోయాడు.

అతను బయటకు అడుగుపెట్టగానే, మళ్ళీ లైట్ వెలిగి ఆరిపోవడం సాగించింది. విషయం అర్ధమైంది. కానీ అదేదో హాని చేసే ఆత్మలా అనిపించలేదు. దాని ఆరా బాగానే ఉంది. సరే చూద్దాం అనుకుంటూ నా గురువులను, ఇష్టదైవాన్ని స్మరించాను. వెంటనే లైట్ మామూలుగా అయిపోయింది.

ఈ రూమ్ లో నిన్న ఈ ప్రాబ్లం లేదు. రాత్రంతా Maltekdi స్టేషన్లో గడిపాను. అర్ధరాత్రి దాటాక, స్టేషన్ ఆ చివరకూ ఈ చివరకూ నడుచుకుంటూ వెళ్లి అక్కడ కాసేపు కూర్చుని ధ్యానం చేసి వచ్చాను. ఈ స్టేషన్ బిల్డింగ్ చాలా పెద్దది. దాని రెండంతస్తులు పైదాకా ఎక్కి పైన టెర్రేస్ మీదకెళ్ళి దూరంగా కనిపిస్తున్న గురుద్వారాను, లైట్లలో వెలుగుతున్న ఊరిని చూచి క్రిందకు వచ్చాను. ఆ రెండంతస్తులూ ఎవరూ వాడటం లేదు. వాటిల్లో ఉన్న రూములన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇదంతా తెల్లవారుఝామున మూడు గంటల టైంలో చేశాను. అసలే, ఈ ఊరు చాలా పురాతనమైనది. ఎప్పటివో ఆత్మలు కొన్ని అక్కడ సంచరిస్తూ ఉంటాయి. రాత్రి ఆ నిర్మానుష్య ప్రదేశాలలో అలా తిరిగినప్పుడు నన్ను చూచిన ఏదైనా ఆత్మ నాతోబాటు హోటల్ రూమ్ కి వచ్చిందా అని అనుమానం కలిగింది. సర్లే వస్తే వచ్చిందిలే, ఈ మూడు రోజులూ మనకూ కాస్త తోడుగా ఉంటుంది అన్న ఆలోచన వచ్చాక నాలో నేనే నవ్వుకున్నాను.

ఆధ్యాత్మికంగా శక్తి లేనివారు అలా నిర్మానుష్య ప్రదేశాలలోనూ, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలోనూ తిరగకూడదు. అలాంటి ప్రదేశాలలో అలాంటి సమయాలలో కొన్ని ఆత్మలు ఉంటూ ఉంటాయి. వాటివల్ల తెలియని చెడు చాలా జరుగుతుంది. కానీ సాధనామార్గంలో ఉన్నతస్థాయిలు అందుకున్నవారికి మాత్రం వాటివల్ల ఏమీ జరుగదు. పైగా అలాంటివారి వల్ల ఆ ఆత్మలకే మేలు జరుగుతుంది. వాటి ప్రేతత్వం నుంచి వాటికి విముక్తి కలుగుతుంది. శ్రీరామకృష్ణుల భక్తుల జీవితాలలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.

ఇంతలో మళ్ళీ లైట్ వెలిగీ ఆరడం మొదలు పెట్టింది. ఈ సారి తూర్పు దిక్కు ఎటుందో గమనించి ఈ లైట్ ఉన్న దిక్కును చూచాను. ఆ రూమ్ లో మూడు సీలింగ్ లైట్లున్నాయి. వాటిల్లో ఇది ఈశాన్యదిక్కులో ఉన్న లైట్. ఈ రూమ్ నంబర్ సూచిస్తున్న  కేతువు కూడా ఈశాన్య దిక్కుకే అధిపతి. ఈశాన్యం మంచి దిక్కే. కనుక ఇది మంచి ఆత్మే అని నిర్ధారణకు వచ్చాను. మంచి ఆత్మ కాకుంటే మనతో ఎలా ఉండగలుగుతుందసలు?

ఇంతకీ ఈ ఆత్మ నాతో ఏం చెప్పాలనుకుంటోంది? అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా బయట కారిడార్లో ఎవరో ' బందా భాయ్ ! బందా భాయ్ ! తూ కహా గయా?' అని పిలుస్తున్నారు. వెంటనే తలుపు తీసి కారిడార్లోకి వెళ్లాను. కారిడార్లో అటూ ఇటూ ఏడేసి రూములున్నాయి. ఎవరూ లేరు. కాసేపు అక్కడే నిలబడి రూమ్ లోకి వచ్చి రూమ్ సర్వీస్ కి మళ్ళీ కాల్ చేశాను.

'బందా' అనే పేరు ఎందుకో నాలో ఏదో తెలియని అలజడిని కలిగించింది. ఇదేంటా అని కాసేపు దానిమీదే ధ్యానిస్తూ ఉండిపోయాను.

ఈలోపల బాయ్ వచ్చాడు.

'యహా కోయీ బందా నాంవాలా ఆద్మీ హై క్యా?' అడిగాను.

'ఐసా ఆద్మీ యహా కోయీ నహీ హై సార్.' అన్నాడు బాయ్ అనుమానంగా నన్ను చూస్తూ. ఏంటి ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నాడు? అన్న సందేహం అతని కళ్ళలో నాకు కనిపించింది. ఆ పేరుతో ఎవరూ లేకపోతే కారిడార్లో అలా పిలిచింది ఎవరు? చూస్తే ఎవరూ లేరేమిటి?

నేను కూడా అలాగే అతన్ని చూస్తూ - ' బందా నాంసే యహా కోయీ దర్శనీయ స్థల్ హై క్యా' అడిగాను.

'హైనా సర్. బందా బహదూర్ జీ కా గురుద్వారా బహుత్ ఫేమస్ హై యహా' అన్నాడు వాడు.

'ఠీక్ హై, తుం జావో' అన్నాను.

బాయ్ వెళ్ళిపోయాడు.

వెంటనే ఫోన్ లో నెట్ ఓపన్ చేసి 'బందా బహదూర్ గురుద్వారా' అని కొట్టగానే - 'బందా ఘాట్ గురుద్వారా' అని చూపించింది. నేనున్న చోటకు అది చాలా దగ్గరలోనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, బందా ఘాట్ గురుద్వారా, నగినా గురుద్వారా, లంగర్ గురుద్వారా, సచ్ ఖండ్ గురుద్వారా ఇవన్నీ పక్కపక్కనే ఉన్నాయి గోదావరి నది ఒడ్డున.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి.

నాందేడ్ ప్రాచీన నామం నందిగ్రాం. ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. గోదావరి నది ఈ ఊరి మధ్యగా ప్రవహిస్తూ ఈ ఊరిని రెండుగా చీలుస్తూ ఉంటుంది. ఈ గోదావరి నది ఒడ్డునే ప్రముఖ గురుద్వారాలన్నీ ఉన్నాయి.

ఇదంతా చూస్తూ ఉండగానే, లైట్ మళ్ళీ ఫ్లికర్ అవడం మొదలుపెట్టింది. మళ్ళీ ఏమైంది నీకు? అనుకుంటూ - 'ఈరోజున ఈ గురుద్వారాలన్నీ చూడాలి ముఖ్యంగా 'బందా ఘాట్ గురుద్వారా'ను దర్శించాలి' అని సంకల్పం చేసుకున్నా. విచిత్రం ! ఎప్పుడైతే ఈ సంకల్పం చేశానో, లైట్ మామూలు అయిపోయింది. ఆ తర్వాత అక్కడున్న మూడు రోజులలో ఆ లైట్ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టలేదు.

బందాఘాట్ గురుద్వారాకు నన్ను తీసికెళ్ళదానికే ఎవరో సిఖ్ మహనీయుని ఆత్మ అలా ప్రయత్నించిందని నాకర్ధమైంది. మనస్సులోనే దానికి కృతజ్ఞతలు చెబుతూ ప్రణామం చేశాను. వెంటనే ఆ గదిలోనుంచి ఏదో ఒక తెర తొలగిపోయిన ఫీలింగ్ నాకు కలిగింది.

ఈ లోపల టిఫిన్ వచ్చింది. నిదానంగా టిఫిన్ చేసి, కాసేపు రెస్ట్ తీసుకుని మధ్యాన్నం నుంచీ బందా ఘాట్ కు బయల్దేరాను.

(ఈ పోస్ట్ నంబర్ కూడా నాలుగే అయింది గమనించారా మరి?)

(ఇంకా ఉంది)