నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, నవంబర్ 2018, మంగళవారం

నాందేడ్ యాత్ర - 6 (బందా బహదూర్ మహోజ్జ్వల జీవితం)

చరిత్రలో కొంతమంది మహనీయుల పేర్లు ఊరకే తలచుకుంటే చాలు హృదయం ఒప్పొంగిపోతుంది. ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటివారిలో ఒకడు బందా సింగ్ బహదూర్. ఈయనకు బందా బైరాగి అనీ బందా బహదూర్ అనీ పేర్లున్నాయి. ఈయన జీవితం ఎంత గొప్పదో ఎంత సార్ధకమైనదో తలచుకుంటే ఎంతసేపూ తిండి, సుఖాలు, స్వార్ధం, పనికిమాలిన గాసిప్ లతో కూడిన మన బ్రతుకులు అసలు బ్రతుకులేనా అనిపిస్తాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే 'ఛీ! మనదీ ఒక బ్రతుకేనా!' అనిపిస్తుంది.

మన దేశానికి స్వతంత్రం వచ్చాక ఒక విచిత్రం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా జరిగాయి. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి. ఓట్ల కోసం ప్రాకులాడే సెక్యులర్ ప్రభుత్వాలన్నీ మన నిజమైన చరిత్రను దాచిపెట్టి కుహనా చరిత్రనూ, వాళ్ళిష్టం వచ్చినట్లు వాసుకున్న చరిత్రనూ, పుస్తకాల రూపంలోనూ పాఠ్యపుస్తకాల రూపంలోనూ మనమీద రుద్దటం మొదలు పెట్టాయి. అదే నిజమని మనం నమ్ముతూ వచ్చాం. ఇది ఎంత ఛండాలపు స్థితిలోకి మన సమాజాన్ని నెట్టేసిందంటే, మన అసలైన చరిత్రను మనం మర్చిపోయి, మనమీద  రుద్దబడిన చరిత్రే నిజమని నమ్మే స్థాయికి, దానినే సమర్ధిస్తూ వాదించే స్థాయికీ మనం చేరుకున్నాం. అంతర్జాలం వచ్చాక మాత్రమే చాలామందిలో గూడుకట్టుకున్న ఈ భ్రమలు తొలగిపోవడం మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు సమాచారం అనేది అన్నిరకాల కట్టుబాట్లనూ, సంకెళ్లనూ దాటి అందరికీ అందుబాటులోకి వచ్చింది. కనుక నిజాలు అందరికీ తెలుస్తున్నాయి. భ్రమలు తొలగుతున్నాయి.

అయితే, అబద్ద ప్రచారాలనేవి అంతర్జాలంలో కూడా విరివిగా మొదలయ్యాయి. దీనికి కారణం, తమ ఆటలు, అబద్దాలు సాగడం లేదన్న విషయాన్ని గుర్తించిన కుహనా మేధావులు, మతమార్పిడిగాళ్ళు, సెక్యులర్ దోపిడీదారులు, అంతర్జాలాన్ని కూడా తమ పూర్వపు అబద్దాలతో, వక్రీకరించిన వాస్తవాలతో, నింపాలని చూడటమే. కొంతకాలంగా దీనిని వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం విస్తరిస్తూ వస్తున్నారు. ఒక సర్వే ప్రకారం, కొన్నేళ్ళ తర్వాత అంతర్జాలంలో అన్నీ అబద్దాలే ఉంటాయిట. నిజమైన సమాచారం కోసం అక్కడ కూడా చాలా వెదుక్కోవలసిన గతి మనకు పడుతుందట. ఈ పోకడలు ఇప్పుడిప్పుడే అగుపిస్తున్నాయి.

కనుక, అసలైన దేశభక్తులనూ, మహనీయులనూ తొక్కిపెట్టి, వాళ్లకు నచ్చినవారిని మాత్రమే మనముందు ప్రదర్శించే సెక్యులర్ వాదుల నీచపుక్రీడ మన దేశంలో దాదాపు అరవై ఏళ్ళుగా సాగింది. దీనికి minority appeasement policy అని పేరు. ఇది ముదిరి ముదిరి ఇప్పుడు ఎంత ఘోరమైన సమస్యగా మనముందు నిలుచున్నదో మనందరికీ తెలుసు. నేను మళ్ళీ ప్రత్యేకంగా అదంతా చెప్పవలసిన పని లేదు.

అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తూ జనాన్ని ఫూల్స్ ని చేసే ఈ ప్రక్రియ ఎంతవరకూ సాగిందంటే, గాంధీ మహా ఉత్తముడని, గాడ్సే పరమనీచుడని జనాల్లో ప్రచారం చెయ్యబడింది. కానీ నిజానిజాలు వేరు. అలాగే, బందా బహదూర్ వంటి నిజమైన దేశభక్తులను కూడా మనం పూర్తిగా మరచిపోయేటంతగా ఈ కుహనా సెక్యులర్ భావజాలం మనలో కనీసం నాలుగు తరాలుగా ఇంజెక్ట్ చెయ్యబడుతూ వచ్చింది. దీని ప్రభావ ఫలితంగా, ఒక పదేళ్ళ క్రితం వరకూ కూడా, బందా బహదూర్ అంటే ఎవరో పంజాబ్ లోనే ఎవరికీ తెలీనంతగా ఒక అబద్ధపు మాయ భారతీయ పౌరులని కమ్మేసింది. మన పూర్వీకులను మనం మర్చిపోవడమే మనకు తగిలిన పెద్ద శాపం. దీనిని మించిన ఇంకో పెద్ద శాపం - మనకోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగధనులను విస్మరించడం ! అటువంటి మహనీయులలో బందా బహదూర్ అగ్రగణ్యుడు !!

జమ్మూ కాశ్మీర్లో ఒక మామూలు క్షత్రియ కుటుంబంలో పుట్టి, ఒక తెంపరిగా, పొగరుబోతుగా జీవితం గడుపుతూ, ఒక సంఘటనతో జీవితం పట్ల విరక్తి కలిగి, సన్యాసిగా మారి, ఎక్కడో మహారాష్ట్రా ఆంధ్రా బార్దర్లోని నాందేడ్ లో ఏకాంత జీవితం గడుపుతూ, గురు గోవింద్ సింగ్ పరిచయంతో, శిష్యత్వంతో, అసలైన ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో అర్ధమై, తన దేశానికి, ప్రజలకు తను చెయ్యాల్సింది ఏమిటో అర్ధమై, అతి తక్కువమంది అనుచరులతో కలసి, పంజాబ్ లోని ముస్లిం సుల్తాన్లను ఎదిరించి, వారిని వారి సైన్యాన్ని యుద్ధంలో ఓడించి. నేటి పంజాబ్ నుంచి, పాకిస్తాన్లోని లాహోర్ వరకూ ముస్లిములను తరిమి కొట్టి, సిక్కు రాజ్యాన్ని స్థాపించిన మహావీరుడు, దేశభక్తుడు, గురుభక్తుడు - బందా సింగ్ బహదూర్.

గురు గోవింద్ సింగ్ పిల్లలను కిరాతకంగా చంపినవారిని, ఆయన తల్లి చావుకు కారణమైన వారిని, ఎందఱో హిందూ సిక్కు వనితల మానభంగాలకు చావులకు కారణమైన ముస్లిం దుర్మార్గులను వెతికి వెంటాడి వేటాడి తన కత్తికి బలిచేసి, గురువు ఋణం తీర్చుకున్న మహోన్నతుడు బందా సింగ్ బహదూర్. ఇంతా చేస్తే ఆయన బ్రతికింది 46 సంవత్సరాలే !!

అలాంటి మహనీయులను మనం మర్చిపోయేలా చేసి, అబద్దపు చరిత్రను మనకు నూరిపోసిన మన సెక్యులర్ విద్యా వ్యవస్థకు జోహార్లు అర్పించకుండా ఎలా ఉండగలం చెప్పండి మరి ?

ఒక్క ప్రస్తుత ప్రభుత్వం మాత్రమే ఈ మహనీయుడిని గుర్తుంచుకుని అతని జ్ఞాపికగా ఒక వెండి నాణాన్ని విడుదల చేసింది. వివరాలు ఇక్కడ చూడండి.

https://www.hindustantimes.com/punjab/arun-jaitley-releases-silver-coin-to-commemorate-banda-bahadur/story-W5r3J2cVhTe4G5oi0eDD3N.html

బందా బహదూర్ మహోజ్జ్వల జీవితం వచ్చే పోస్ట్ నుంచి చదవండి.

(ఇంకా ఉంది)