Pages - Menu

Pages

15, నవంబర్ 2018, గురువారం

నాందేడ్ యాత్ర 7- (బందా ఘాట్ గురుద్వారా)

ఊరు మనకు పరిచయం లేదు గనుక ఆటో ఎక్కి బయల్దేరాను. కొద్ది సేపట్లోనే గోదావరి ఒడ్డున ఉన్న బందా ఘాట్ గురుద్వారాకు చేర్చాడు ఆటోవాలా. నవరాత్రులనేవి సిక్కులకు వచ్చే మొదటి పండుగ కనుక వాళ్ళు చాలా బాగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకని అక్కడంతా పండుగ వాతావరణంలా ఉంది.

గోదావరిని చూస్తూనే ప్రాణం లేచి వచ్చింది. కాసేపు ఆ నది ఒడ్డునే కూర్చున్నాను. సూర్యాస్తమయం అవడానికి ఇంకా సమయం ఉంది. నదిమీద నుంచి వచ్చే గాలితో కలసి సూర్యుని వెలుగు చాలా ఆహ్లాదకరంగా ఉంది. కాసేపు అక్కడ కూర్చుని, సూర్యకాంతిని ఆస్వాదించి, గురుద్వారాలోకి వెళ్లాను. అక్కడ కొద్దిసేపు మౌనంగా ధ్యానంలో కూర్చున్నాను. మనస్సు బందాసింగ్ బహదూర్ నివసించిన కాలంలోకి, మూడొందల ఏళ్ళ వెనక్కు వెళ్ళిపోయింది. ఎన్నో విషయాలు కనిపించాయి. ఎన్నో విషయాలు అర్ధమయ్యాయి. అలా ఒక మూలన కూర్చుని ఒక గంటసేపు ధ్యానంలో ఉన్నాను.

ధ్యాని చేతుల్లో ఉన్న వజ్రాయుధం ధ్యానమే. దాని ద్వారానే అతనికి సమస్తమూ తెలుస్తుంది. దానిద్వారానే అన్ని విషయాలూ అర్ధమౌతాయి. ఇతరులు చూడలేనివి కనిపిస్తాయి. ఇతరులు వినలేనివి వినిపిస్తాయి. ఎందుకంటే అంతా మనస్సు పైనే ఆధారపడి ఉంది గనుక, అది మన చెప్పుచేతల్లో ఉంటే మన దగ్గర అన్నీ ఉన్నట్లే. అది మనం చెప్పినట్లు వినకుంటే అన్నీ ఉన్నా ఏమీ లేనట్లే మరి !

సిక్కులకు ఈ గురుద్వారా చాలా ముఖ్యమైనది కావడంతో అమృత్ సర్ నుంచి కూడా సిక్కులు చాలామంది గుంపులు గుంపులుగా బస్సులలో కార్లలో వస్తున్నారు.  ఇంతలో ముగ్గురు సిక్కులు వచ్చి, హార్మోనియం, తబలాలు శృతి చేసుకుని సాయంకాల కీర్తనలు మొదలు పెట్టారు. ఒక గంటన్నరసేపు చక్కని కీర్తనలు ఆలపించారు. వింటూ కూర్చున్నాను. ముగ్గురూ చిన్నవాళ్ళే గాని చాలా భక్తిభావంతో పాడుతున్నారు. రకరకాల సంగతులు వేస్తూ రాగప్రస్తారాలతో చక్కగా హిందూస్తానీ రాగాలలో కీర్తనలు పాడారు. వాళ్లకు సంగీతం వచ్చని నాకర్ధమైంది.

చాలామంది వచ్చి గురుగ్రంద్ కు ప్రణామం చేసి వెళ్ళిపోతున్నారు గాని శ్రద్దగా కూర్చుని ఎవ్వరూ కీర్తనలు వినడం లేదు. నేనొక్కడినే మొదటినుంచీ చివరవరకూ వాటిని వింటూ మౌనంగా కూర్చోవడం గాయకులు గమనించారు. కీర్తనలు ముగిశాయి.

వాళ్ళు లేచి బయటకు వచ్చారు. ఇంతలో గురుద్వారా లంగర్ నుంచి వాళ్లకు చాయ్ వచ్చింది. ఒకచోట నిలబడి మాట్లాడుకుంటూ చాయ్ త్రాగటం మొదలుపెట్టారు. నేను వెళ్లి వాళ్ళను పరిచయం చేసుకున్నాను.

'మీరు చక్కగా పాడారు' అని నేనన్నాను.

వాళ్ళు నాతో వెంటనే సింక్ అయిపోయారు. వారిలో ముఖ్య గాయకుని పేరు ఆత్మారాం సింగ్. నాకు కూడా చాయ్ ఆఫర్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు గాని లంగర్ నుంచి మూడే చాయ్ లు వచ్చాయి. అందుకని ఆత్మారాం తను త్రాగబోతున్న కప్పులోనుంచి సగం చాయ్ వేరే కప్పులో పోసి నాకిచ్చాడు. గురూపదేశాలలో ముఖ్యమైన 'సోదరభావాన్ని' వాళ్ళు ఆ రకంగా ఆచరణలో పెడుతున్నందుకు నాకు సంతోషం కలిగింది.

పరిచయాలయ్యాయి.

తను విజయవాడలో, హైదరాబాద్ లొ చదువుకున్నానని ఆత్మారాం సింగ్ అంటూ నాతో తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాడు.

'నేను విజయవాడ గురునానక్ కాలేజీలో చదువుకున్నాను. మా నాన్న అక్కడే పోస్ట్ మాన్ గా పనిచేసేవాడు. జీతం సరిపోక రాత్రిళ్ళు రిక్షా తొక్కి మరికొన్ని డబ్బులు సంపాదించేవాడు. ఆ రకంగా మమ్మల్ని చదివించాడు.' అన్నాడు ఆత్మారాం సింగ్.

'అయ్యో ! పగలు పోస్ట్ మాన్ గా పనిచేసి, రాత్రిళ్ళు రిక్షా తొక్కేవాడా?' అడిగాను.

'అవును. కష్టపడి బ్రతకమని గురు ఆదేశం. అందుకే సిక్కులలో అడుక్కునేవాళ్ళు మీకు కన్పించరు. మేము ఏదో ఒక పని చేసి ఎలాగో ఒకలాగ ధర్మంగా బ్రతుకుతాం. ఉన్నంతలో గౌరవంగా బ్రతుకుతాం. కానీ అడుక్కోం. కాయకష్టం మాకు అలవాటే. అందుకే మా నాన్న అలా కష్టపడి మమ్మల్ని చదివించాడు. మెల్లిగా మేము ఆర్ధికంగా స్థిరపడ్డాం. నేను విజయవాడ మ్యూజిక్ కాలేజీలోనే డిప్లొమా చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ లొ చాలా కాలం ఉన్నాను. అక్కడ మాకు ఒక ఇల్లు ఉంది. దానిని అద్దెకు ఇచ్చి ఇక్కడకు వచ్చేశాను.' అన్నాడు.

'ఎందుకు? హైదరాబాద్ నచ్చలేదా?' అడిగాను.

'అవును. అక్కడ సొసైటీ బాగాలేదు. ఎక్కడ చూచినా అధర్మం, విలాసాల వెనుక పరుగులు, వ్యామోహాలు తప్ప ఇంకేమీ లేవు. నాకు ఆ సొసైటీ అసహ్యం వేసింది. అందుకే హైదరాబాద్ వదిలేశాను. ఇక్కడకు వచ్చి ఈ గురుద్వారాలో ఉంటున్నాను. కీర్తనలు పాడే గ్రూప్ లొ చేరాను. ఈ ట్రూప్ తో కలసి లండన్, ఆస్ట్రేలియా, కెనడా అన్నీ తిరిగాను. నేను పెళ్లి చేసుకోను. నా జీవితాన్ని దైవానికి, గురువుకు, సిఖ్ ధర్మానికి అంకితం చేశాను' అన్నాడు.

అతని వైపు సాలోచనగా చూచాను.

మహా ఉంటే అతనికి ముప్పై ఏళ్ళుంటాయి లేదా ఇంకా తక్కువే ఉండవచ్చు. అతని స్వరంలో ధ్వనించిన నిజాయితీ నాకు నచ్చింది. ఇంత చిన్న వయసులో ఇంత మంచి పరిపక్వత కలిగినందుకు సంతోషం వేసింది. 'ఇందుకన్నమాట నీతో మాట్లాడాలని నాకనిపించింది' అనుకున్నాను.

'ఒకసారి అమృత్ సర్ వెళ్లి రండి. జీవితంలో ఒకసారైనా గోల్డెన్ టెంపుల్ చూడాలి. మీరు వెళ్ళే ముందు నాకు ఫోన్ చెయ్యండి. అక్కడ మావాళ్ళకు చెబుతాను. మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. మీకేమీ ఇబ్బంది ఉండదు' అన్నాడు ఆత్మారాం సింగ్.

'సరే. ప్రయత్నిస్తాను' అన్నాను.

'చూస్తున్నారుగా. ఇది మాకు చాలా ముఖ్యమైన పండుగ. బస్సులు వేసుకుని పంజాబ్ నుంచి కూడా చాలామంది ఈ గురుద్వారాకు వస్తున్నారు. ట్రక్కులలో గుర్రాలు, ఏనుగులు కూడా వస్తున్నాయి చూడండి. ఇది బందా సింగ్ బహదూర్ నివసించిన ప్రదేశం. ఇక్కడే ఆయన గురు గోవింద్ సింగ్ జీ ని దర్శించారు. భావి ప్రణాళికా నిర్దేశం పొందారు. పంజాబ్ లొ ఇప్పుడు మనం చూస్తున్న సిక్కు రాజ్యానికి ఇక్కడే బీజం పడింది. అంతా తిరిగి చూడండి. బాగుంటుంది. నాకు వేరే పనుంది వస్తా మరి' అని సెలవు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.

నేను కూడా అదంతా తిరిగి చూచాను.పంజాబ్ నుంచి గుర్రాలు వచ్చేశాయి. ఏనుగులు కూడా ఉన్నాయని అన్నారుగాని నాకు కనిపించలేదు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న సిక్కులతో అక్కడంతా పండుగ వాతావరణంలా ఉంది. ఎవరి పనులు వాళ్ళు ఉత్సాహంగా చేసుకుంటున్నారు. వాళ్ళలో నాకు నచ్చిన గుణాలలో ముఖ్యమైంది - ఉత్సాహం. ఎవరికీ నీరసం గాని, బద్ధకంగాని, ఏడుపు ముఖాలుగాని లేవు. అహంకారం లేదు. అందరూ కలసి మెలసి ఉత్సాహంగా డేరాలు వెయ్యడం, సామాన్లు సర్దుకోవడం. వంటలు చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ లక్షణాలు నాకు బాగా నచ్చేశాయి. చూస్తుండగానే చీకటి పడింది. నేను కాసేపు అవన్నీ చూస్తూ అక్కడే తిరుగుతూ కాలం గడిపాను. 

మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళవలసి ఉండటంతో వెనక్కు బయలుదేరక తప్పింది కాదు. హోటల్ కి వెళ్లి కాసేపు రిలాక్స్ అయ్యి, మాల్ టెక్ డీ స్టేషన్ కి వెళదామని అనుకుంటూ వెనక్కు బయలుదేరాను. దారి అర్ధం కావడంతో నడుస్తూనే హోటల్ కు చేరుకున్నాను.







Banda Singh meeting Guru Govind Singh at Nanded













(ఇంకా ఉంది)