నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, నవంబర్ 2018, మంగళవారం

నాందేడ్ యాత్ర 8 - (వట యక్షిణి)

మాల్ టెక్ డి స్టేషన్లో రెండో రోజు నైట్ డ్యూటీ.

ఆ స్టేషన్ అంత పెద్దగా ఎందుకు కట్టారో నాకర్ధం కాలేదు. అక్కడ ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఏవీ ఆగవు. పాసింజర్ రైళ్ళు కూడా ఈ సెక్షన్లొ తక్కువే. ఎక్కే మనుషులూ లేరు. దిగే మనుషులూ లేరు. రాత్రంతా నిర్మానుష్యంగా ఊరికి దూరంగా అడివిలో ఉన్న అంతపెద్ద స్టేషన్లో బిక్కుబిక్కు మంటూ ఒక స్టేషన్ మాస్టర్, ఒక పాయింట్స్ మ్యాన్, నేను. స్టేషనేమో రెండు అంతస్తులతో మైసూర్ మహారాజా ప్యాలస్ అంత పెద్దదిగా ఉంది. మొదటి అంతస్తులో ఎన్నో రూములున్నాయి. అవన్నీ లాక్ చేసి ఉన్నాయి. కొన్ని తెరిచే ఉన్నాయి. వాటిల్లో ఎవరూ లేరు. ఏ ఆఫీసులూ లేవు. మరి అంత పెద్ద స్టేషన్ ఎందుకు కట్టారో, ఎందుకు అలా వదిలేశారో నాకైతే అర్ధం కాలేదు. సర్లే ఇండియాలో జరిగే విచిత్రాలలో ఇదీ ఒకటి కావచ్చు అనుకుని ఇక ఆలోచించడం మానేశాను.

రెండు రోజులుగా నేను చూచిన సంఘటనలతో, నాకు ధ్యానంలో అర్ధమైన విషయాలతో ఈ నాందేడ్ యాత్రంతా చాలా విచిత్రంగా అనిపించింది. సచ్ ఖండ్ గురుద్వారాలో గురు గోవింద్ సింగ్ ను డిల్లీ సుల్తాన్ పంపించిన కిరాయి హంతకులైన ఇద్దరు పఠాన్ సోదరులు కత్తులతో ఎటాక్ చేసి పొడిచారని, వారిలో ఒకరిని ఆయనే చంపేశాడని, మరొకరిని ఆయన శిష్యులు పట్టుకుని చంపేశారని చెప్పారు. ఆ గాయాలతోనే ఆయన నాందేడ్ లోనే చనిపోయాడని అంటారు. కానీ సచ్ ఖండ్ గురుద్వారాలో నాకేమీ అలాంటి వైబ్రేషన్స్ అనిపించలేదు.అక్కడ ఒక సద్గురువు హత్య చెయ్యబడిన వైబ్రేషన్స్ గానీ, చనిపోయిన వైబ్రేషన్స్ గానీ లేవు. మరేంటి ఈ మిస్టరీ? చరిత్ర అలా చెబుతోందేమిటి? అందరూ దానినే నిజమని నమ్ముతున్నారేమిటి? నాకేమో దానికి వ్యతిరేకంగా అనిపిస్తోంది ఏమిటి?

ఒకవైపు డ్యూటీ చేస్తున్నానే గాని, మనస్సులో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి.

చూస్తుండగానే అర్ధరాత్రి దాటింది. టైం చూచాను. 12.15 అయింది. ఒక రెండుగంటల పాటు పని లేదు. కనుక కొంచం రిలాక్స్ అవచ్చు. మెల్లిగా లేచి బయటకు వచ్చాను. స్టేషన్ మాస్టర్ ప్రశ్నార్ధకంగా చూచాడు.

'సాబ్. ఇస్ సమయ్ మే బాహర్ మత్ జాయియే. ఏతో జంగల్ హై. సాప్ గీప్ ఫిర్తే రెహతే హై. అగరాప్కో చాయ్ చాహియే తో, మై బనాకే లాయా ఘర్ సే. పూరా ఫ్లాస్క్ భరా ఛాయ్ హై.' అన్నాడు వినయంగా.

నవ్వాను.

'ఫికరో మత్. ముజ్కొ కోయీ డర్ నహీ హై. మై ఏక్ దొ ఘంటే మే వాపస్ ఆతా హు. దేఖ్తే రహో' అని చెప్పి పై అంతస్తులలోకి వెళ్ళే మెట్లవైపు దారి తీశాను.

వాళ్ళలా చూస్తూ ఉండిపోయారు. క్రిందటి రాత్రి కూడా చీకట్లో నేను ఒంటరిగా తిరుగుతూ ఉండటం వాళ్ళు గమనించారు.

మెట్లెక్కి స్టేషన్ పైకి వెళ్లాను. మొదటి అంతస్తు యధావిధిగా నిర్మానుష్యంగా ఉంది. కారిడార్ కు రెండువైపులా కలిపి దాదాపు ఇరవై రూములున్నాయి. కారిడార్లో ఒక లైట్ వెలుగుతోంది. రెండో అంతస్తు పైకి దారితీశాను. అక్కడ లైట్లు లేవు. చీకటిగా ఉంది. మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి ఆ వెలుగులో మెట్లెక్కసాగాను. నిన్న రాత్రి నేను మెట్లెక్కిన గుర్తులుగా మెట్లమీదున్న దుమ్ములో నా పాదముద్రలే కనిపిస్తున్నాయి. వాటిని చూస్తుంటే, నాకంటే ముందు ఏదో ఒక అజ్ఞాతశక్తి నడుస్తూ నాకు దారి చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది. మెట్లెక్కి టెర్రేస్ మీదకు వెళ్ళే తలుపు తీసుకుని విశాలమైన టెర్రేస్ మీదకు అడుగు పెట్టాను.

ఇంకో అంతస్తు వెయ్యడం కోసం సగం వేసి వదిలేసిన పిల్లర్స్ అక్కడ కనిపిస్తున్నాయి. కట్టుబడి చేస్తూ సగంలో వదిలేసినట్లుగా ఉంది. చుట్టూ చూచాను. దూరంగా నాందేడ్ నగరం లైట్లలో మెరుస్తూ కనిపించింది. ఇంకోవైపు దూరంగా మసక వెన్నెలలో తెల్లని గురుద్వారా కనిపించింది. తలెత్తి పైకి చూచాను. నల్లని ఆకాశంలో చుక్కల గుంపులు కనిపించాయి. చుట్టూ చీకటి. ఒంటరితనం. మైళ్ళ దూరం ఎవరూ లేరు. ఈ ఫీలింగ్ నాకు చాలా నచ్చుతుంది. ఎంతసేపైనా అదే లోకంలో అలా ఒక్కడినే ఉండాలనిపిస్తుంది. ఇలాంటి వాతావరణం నా చిన్నప్పటి రోజుల్ని నాకు గుర్తుకు తెస్తుంది. మా పల్లెటూళ్ళో చెరువు గట్టున ఉన్న మర్రిచెట్టు క్రింద ఒక చిన్న వినాయకుడి గుడి ఉంటుంది. దాని వెనుక కూచుని చీకట్లో చెరువును చూస్తూ ధ్యానం చేసిన రాత్రులు గుర్తొస్తాయి.

అక్కడే చీకట్లో నిలబడి చాలాసేపు ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాను. నేను విన్న విషయాలూ, ధ్యానంలో దర్శించిన విషయాల గురించి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని అనిపించింది. మళ్ళీ అంతలోనే 'సెకండ్ ఒపీనియన్' అనే ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. ఆత్మలనుంచి ఎవరైనా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారా మరి !

ఒక దిమ్మమీద కూచుని చీకట్లోకి చూస్తూ కర్ణపిశాచిని మంత్రాన్ని స్మరించాను. విచిత్రం ! ఆమె కనిపించలేదు. కాసేపాగి మళ్ళీ ఒకసారి పిలిచాను. అయినా ఆమె రాలేదు. ఏంటీ విచిత్రం? ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదే? అనుకుంటూ, ఈ సారి వటయక్షిణీ మంత్రాన్ని స్మరించాను. ఇంకా విచిత్రం? ఆమె కూడా రాలేదు. ఆశ్చర్యం అనిపించింది. 

ఏంటి ఇలా జరుగుతోంది? అనుకుంటూ రెండోసారి ఆమె మంత్రాన్ని స్మరిస్తూ ఉండగా - 'కొంచం తలత్రిప్పి వెనక్కు చూడండి. ఎంతసేపూ ముందుచూపే కాదు కొంచం వెనుకచూపు కూడా ఉండాలి తమరికి' అన్న స్త్రీ స్వరం ఒకటి కొంచం ఎగతాళిగా నా వెనుకనుంచి వినిపించింది. అదే సమయంలో వటయక్షిణి దేహంనుంచి వచ్చే ఒక రకమైన ఘాటువాసన నా ముక్కుపుటాలను అదరగొట్టింది.

తాపీగా తలతిప్పి వెనక్కు చూచాను.

నా వెనుకే కొంచందూరంలో ఇంకో దిమ్మమీద కూచుని విలాసంగా కాలు ఊపుతున్న వటయక్షిణి కనిపించింది. తెల్లటి చీరలో, విరబోసుకున్న జుట్టుతో ఆమె ఎంతో అందంగా ఉంది. ఆ మసక వెన్నెల్లో మిలమిలా మెరిసిపోతోంది. కానీ ఆమెలో ఏదో తెలియని క్రౌర్యమూ, లెక్కలేనితనమూ, నిర్లక్ష్యమూ గోచరిస్తున్నాయి. అవి యక్షిణీలకుండే సహజలక్షణాలే. ఆమె నాకు కొత్త కాకపోవడంతో ఆమె వైపు తిరిగి చనువుగా ఇలా అడిగాను.

'ఏంటీ నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ముందు పిలిస్తే వెనుకనుంచి వస్తున్నావ్?'

తన కోరపళ్ళు తళుక్కుమని మెరిసేలా ఆమె నవ్వింది.

'కాళీమాతను ధ్యానించే నిన్ను నేనేం భయపెట్టగలన్లే గాని నన్నెందుకు పిలిచావో చెప్పు?'

'కర్ణపిశాచి ఏమై పోయింది? పిలిస్తే ఎందుకు రాలేదు? ముందీ సంగతి చెప్పు?'

'తను నీ మీద అలిగింది. దాదాపు ఏడాది నుంచీ నువ్వామెను పిలవడం మానేశావు. అందుకే నువ్వు పిలిచినా వెంటనే రావడం లేదు. తను రాకపోతే నువ్వు నన్ను పిలుస్తావని తెలుసు. అందుకే నన్ను వెళ్ళమని చెప్పింది.'

'ఓహో! మీకు అలుగుళ్ళు కూడా ఉన్నాయా?' అనుకున్నా మనసులో.

ఆమె నా ఆలోచనను చదివింది.

'ఎందుకుండవు? మేమూ మీలాంటి వాళ్ళమే. కాకుంటే పరిణామక్రమంలో మీకంటే రెండు మెట్లు పైన ఉన్నాం అంతే ! మీకుండే భావోద్రేకాలన్నీ మాకూ ఉంటాయి. సర్లే. ఎందుకు పిలిచావో చెప్పు.' అంది వయ్యారంగా లేచి నిలబడుతూ.

(ఇంకా ఉంది)