Pages - Menu

Pages

28, నవంబర్ 2018, బుధవారం

మా స్వామీజీ మీద ఒక పోస్ట్ వ్రాయండి

లోకంలో మనం సామాన్యంగా అనుకునే ఆధ్యాత్మిక ప్రపంచం ఒక పెద్ద రొచ్చుగుంట. ఇందులో కూడా నిజంకంటే అబద్దమే ఎక్కువగా చలామణీ అవుతూ ఉంటుంది. ఇక్కడ అసలు నోట్ల కంటే దొంగనోట్లే బాగా చలామణీ అవుతూ ఉంటాయి. కాకుంటే - అవే నిజమైన నోట్లని వాటిని ఇచ్చేవాళ్ళూ, తీసుకునేవాళ్ళూ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ భ్రమలోనే లక్షలాది జీవితాలు గడిచి, ముగిసిపోతూ ఉంటాయి.

నా పోస్టులు చదివి నాకు ఎంతోమంది మెయిల్స్ ఇస్తూ ఉంటారు. ఫోన్లు  చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది నిజంగా జిజ్ఞాసతో ఉండేవాళ్లూ  ఉంటారు, కొంతమంది 'ఈయన దగ్గర ఏముందో చూద్దాం' అని ఫోన్ చేసేవాళ్ళూ ఉంటారు, మరికొంతమంది - 'ఈయనకేం తెలుసు? మన పాండిత్యాన్ని ఈయన దగ్గర ప్రదర్శిద్దాం' అనుకునేవాళ్ళూ ఉంటారు. మొత్తం మీద నాకు మాత్రం బాగా కాలక్షేపం అవుతూ ఉంటుంది.

మొన్నీ మధ్యన ఒకాయన ఫోన్ చేశాడు.

'మీ పోస్టులు నేను చదువుతూ ఉంటాను. పర్లేదు బాగానే వ్రాస్తారు మీరు' అన్నాడు అదేదో నన్ను ఉద్ధరిస్తున్నట్టు.

నేనేమీ జవాబివ్వలేదు.

'మీ లేటెస్ట్ పోస్ట్ చదివాను. చాలా బాగా వ్రాశారు' అన్నాడు మళ్ళీ.

'ఇప్పుడేగా 'పర్లేదు' అన్నావ్. మళ్ళీ వెంటనే 'చాలా బాగా వ్రాశావ్ అంటున్నావు. అంటే, 'పర్లేదు' కీ, 'చాలాబాగా' కీ  నీకు తేడా తెలీదన్నమాట' అని మనసులో అనుకుంటూ, 'థాంక్స్' అన్నాను.

'మా స్వామీజీ మీద మీరు ఒక పోస్ట్ వ్రాయాలి.' అన్నాడు.

'మీ ... స్వామీజీనా?' అన్నాను నవ్వుతూ.

'అంటే, అలాకాదు. మా స్వామీజీ అంటే, ఆయన  మా గురువుగారు. చాలా మహనీయుడు. ఈ రోజుల్లో అలాంటివాళ్ళు ఎవరూ లేరు' అన్నాడు.

'లేరంటావేం? ఆయనున్నాడుగా?' అనుకుంటూ 'ఇంతకీ ఎవరాయన?' అన్నాను కుతూహలంగా.

'ఫలానా' అంటూ ఆయన పేరు చెప్పాడు.

నవ్వుతో పొలమారింది నాకు.

'ఆయన మహనీయుడు ఎలా అయ్యాడో కొంచం వివరించగలరా?' అడిగాను.

'అదేంటండి అలా అంటారు? ఆయన ఉపన్యాసాలు చాలా బాగుంటాయి.'  అన్నాడు.

'ఉపన్యాసాలు ఇస్తే మహనీయులౌతారా?  దేశంలోని కాలేజీలలో ఉపన్యాసాలు చెప్పే లెక్చరర్లూ, ప్రొఫెసర్లూ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మహనీయులేనా?' అన్నాను.

'వాళ్ళ సబ్జెక్టు వేరు, మా స్వామీజీ చెప్పే సబ్జెక్టు  వేరు. పైగా, ఎంతో పుణ్యం చేసుకుంటేగాని పీఠాదిపత్యం పట్టదు.' అన్నాడు.

'పట్టడానికి అదేమైనా దయ్యమా?' అడిగాను నవ్వుతూ.

'అదేంటండి పీఠాదిపతుల్ని అలా అంటారు?' అన్నాడు మళ్ళీ.

ఈ మాట వినగానే, -  'అందరూ పీటాధిపతులే. భోజనాల దగ్గర' - అనే జిల్లెళ్ళమూడి అమ్మగారి మాట గుర్తొచ్చింది.

'పీటాదిపత్యం పట్టడానికి పుణ్యం ఉండాలేమో నాకు తెలీదు గాని, అది కొనసాగాలంటే మాత్రం, మీలాంటి వాళ్ళ అజ్ఞానం ఉంటె చాలు.' అన్నాను.

'ఏంటండి మీరు మాట్లాడేది? నేను శాస్త్రాలు చదువుకున్నాను' అన్నాడు కోపంగా.

'ఏడిసినట్లే ఉంది  నీ శాస్త్రపరిజ్ఞానం' అనుకుంటూ - 'మరి అంత పాండిత్యం ఉంటే, మీరే వాయవచ్చు కదా  మీ స్వాములవారి మీద. నన్ను ఎగదొయ్యడం ఎందుకు?' అన్నాను.

'నేను మాట్లాడగలనేగాని వ్రాయలేను.' అన్నాడు నిజాయితీగా ఒప్పుకుంటూ.

'అందుకని మీ బదులు నన్ను వ్రాయమంటున్నారా? మీలా వ్రాయనా? నాలా   వ్రాయనా?' అడిగాను.

'మీలాగే వ్రాయండి' అన్నాడు.

'అలా అయితే, మీ స్వామీజీ మంచి ఉపన్యాసకుడేగాని అనుభవశూన్యుడు అని వ్రాస్తాను. సరేనా?' అడిగాను.

'ఏంటండి మీరు మాట్లాడేది? ఆయన గత ఇరవైఏళ్ళ నుంచీ పీటాదిపతిగా  ఉన్నారు.' అన్నాడు.

'ముప్పైఏళ్ళ నుంచీ పీటమీద కూచుని  లేవలేకపోతున్నారు అని  చెప్పండి. ఇంకా బాగుంటుంది. ఆయన్ను కాస్త లేచి నాలుగడుగులు వెయ్యమనండి సమాజంలోకి.' అన్నాను.

నేటి స్వామీజీలందరూ ఎవరి కుంపట్లు వాళ్ళు  పెట్టుకుని అసలైన పొయ్యిని ఆర్పేస్తున్నారని నా దృఢవిశ్వాసం.

'మీరు చాలా పెడమనిషి అని అనుకునేది నిజమేనన్న మాట' అన్నాడు కోపంగా.

'ఓహో! నా గురించి  బాగా తెలుసుకునే అడుగుతున్నారా? సరే, ఇప్పటిదాకా  మీతో మామూలుగా మాట్లాడాను. ఇప్పుడు అసలు పెడసరితనం చూపిస్తాను వినండి. మీ స్వామీజీ మీద నేను పోస్టు వ్రాయడం కాదు, నా మీదే మీ స్వామీజీని ఒక పుస్తకం వ్రాయమనండి.' అన్నాను.

'అదేంటి? మీరంత గొప్పవారా?' అన్నాడు కోపంగా.

'అవును. ఆయన ఉత్త  ఉపన్యాసాలు మాత్రమే ఇవ్వగలడు. అలాంటి స్కిల్స్ నా దగ్గర ఇంకా పదహారున్నాయి. మరి ఎవరి మీద ఎవరు వ్రాయాలి పుస్తకం?' అడిగాను.

'ఆయన పీటాదిపతి' అన్నాడు వగరుస్తూ.

'నా పీటకి నేనుకూడా అధిపతినే, భోజనాల దగ్గర' అన్నా నేను నవ్వుతూ.

సమాధానం లేదు.

'ఇంతకీ మీరు నా ప్రశ్నకు జవాబు సరిగ్గా చెప్పలేదు. మీ స్వామీజీ మహనీయుడు ఎలా అయ్యాడు? అసలు ఎవరైనా సరే, మహనీయులు ఎలా అవుతారు? తెలిస్తే చెప్పండి. తెలీకపోతే తెలీదని చెప్పండి. కనీసం మీకు నిజాయితీ ఉందనైనా అప్పుడు నమ్ముతాను' అన్నాను.

టక్కున ఫోన్ కట్ అయిపోయింది.

చాలామంది ఇంతే. వాళ్ళు అనుకున్నవి మనం చెయ్యాలి. వాళ్ళ ట్యూన్ కి మనం డాన్స్ వెయ్యాలి. లేకపోతే మనం పెడమనుషులం. సత్యాన్ని ఉన్నదున్నట్లుగా చెబితే మనం పెడ మనుషులం. వాళ్ళ బ్యాచ్ లో కలిస్తే మంచివాళ్ళం.

ఇలాంటివాళ్ళు ఆయా స్వామీజీల  దగ్గర భజన పరులుగా ఉంటుంటారు. మనలాంటి వాళ్ళను అప్రోచ్ అయి వాళ్ళమీద ఏవేవో పుస్తకాలు స్తోత్రాలు వ్రాయిస్తారు. అలా చేశామని  చెప్పి ఆ స్వామీజీల దగ్గర మెప్పు పొందుతూ ఉంటారు. లేదా ఆశ్రమాలలో మంచి 'కీ' పోస్టులు  కొట్టేస్తూ ఉంటారు. ఇలాంటి జలగల గురించి మనకు తెలీదని అనుకోవడం జలగల పిచ్చితనం. ఫోన్లో వాళ్ళ గొంతు వింటే చాలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మనకు అర్ధమైపోతూ ఉంటుంది. మన  దగ్గరా  వీళ్ళ జలగవేషాలు?

'పిచ్చి జలగా' అనుకున్నాను.

అయినా, సత్యానికి  ఇలాంటి భజనపరులతో పనేముంది?

కనీసం సివిక్ సెన్స్ లేని దీక్షలెందుకు?

అయ్యప్ప దీక్షల సీజన్ వచ్చేసింది. వాళ్ళమీద పోస్టు వ్రాయకపోతే నాకూ, నా విమర్శకులకూ తోచదు గనుక, నాకోసం కాకపోయినా, వారికోసమైనా ఒక పోస్ట్ వ్రాయక తప్పడం లేదు.

అయ్యప్ప దీక్షలంటే ఏంటో గొప్పగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. నిజానికి అందులో ఏమీ లేదు. అంతకంటే ఉన్నతమైన విషయాలు తెలియనివారికి అవి గొప్ప కావచ్చు. కానీ అవి ఆధ్యాత్మిక మార్గంలో కనీసం LKG లెవల్ కూడా కాదు. ఎందుకూ అంటే, వాటిని చేసేవాళ్ళు తమతమ కోరికలు తీరడం కోసం చేస్తున్నారు కాబట్టి. కోరికలు తీరడం కోసం చేసే ఏ పూజ అయినా దీక్ష అయినా - వాటికి ఆధ్యాత్మికంగా ఏ విలువా ఉండదు. తెలీని అజ్ఞానులు వాటినేదో గొప్పగా అనుకుంటూ ఒంటిని నానా హింసా పెట్టుకుంటూ ఉంటారు. కానీ మానసికంగా వీళ్ళలో చాలామంది చాలా లేకి మనస్తత్వాలు కలిగి ఉంటారు. నేను కనీసం 40 ఏళ్ళ నుంచీ ఈ అయ్యప్ప దీక్షల తంతులను చూస్తున్నాను. ఆంధ్రాలో అయ్యప్ప పేరు ఎవరికీ తెలీని రోజుల్లో ఈ దీక్షను చేసిన వాళ్ళు మా కుటుంబంలోనే ఉన్నారు. కానీ, మానసికమైన ఔన్నత్యాన్ని కలిగిఉన్న అయ్యప్ప దీక్షాధారిని నేనింతవరకూ ఒక్కడిని కూడా చూడలేదు. అందుకే నేను వాళ్ళనెవర్నీ స్వామీ అని పిలవకపోగా, బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తూ ఉంటాను.

మొన్నొకరోజున ఉదయం ఆరుకే తయారై క్యాంప్ కని బయల్దేరాను. నేను మామూలుగా నా బైక్ ని 30, 40 కంటే ఎక్కువ స్పీడ్ లో ఎప్పుడూ పోనివ్వను. ఆ రోజు కూడా అంతే స్పీడ్ లో పోతున్నాను. మా సందు మలుపు తిరిగేసరికి, ఎదురుగా రాంగ్ రూట్ లో చాలా స్పీడ్ గా వస్తున్న ఒక బ్లాక్ క్యాట్ నాకు డ్యాష్ ఇచ్చినంత పనిచేసి సడన్  బ్రేక్ వేసింది. నేనూ బ్రేక్ వేసి ఆపాను బైక్ ను. లేకుంటే ఇద్దరం గుద్దుకునేవాళ్ళమే. రాంగ్ రూట్లో వచ్చిందికాక బ్లాక్ క్యాట్ చాలా సీరియస్ గా నావైపు చూసింది.

'రాంగ్ రూట్లో వచ్చావ్'   అన్నా నేను.

'నువ్వు తప్పుకొని పోవచ్చుగా?' అంది బ్లాక్ క్యాట్.

వీడికి నా చేతులో మూడింది అనుకుని బైక్ దిగి స్టాండ్ వేశాను.

'ఏంటీ? నువ్వు రాంగ్ రూట్లో  వచ్చి డ్యాష్ ఇవ్వబోతే, నేను తప్పుకుని పక్కకు పోవాలా?' అడిగాను అంతకంటే సీరియస్ గా.

'స్వామీ' అనలేదని వాడికి కోపం వచ్చేసింది. ఆ పదానికి ఉన్న విలువేంటో నాకు బాగా తెలుసు. ఊరకే నల్లడ్రస్సు వేసినంత మాత్రాన ప్రతి వెధవనీ 'స్వామీ' అని నేనెందుకంటాను?

'ఒకవేళ తగిలితే ఏమయ్యేది?' అన్నాడు వాడు.

'ఆ మాట నేననాలి. ఆ బుద్ధి నీకుండాలి' అన్నాను.

'ఏంటీ బుద్ధి అంటున్నావ్?' అన్నాడు బ్లాక్ క్యాట్ తనూ దిగి స్టాండ్ వేస్తూ.

ఇన్నేళ్ళలో, అయ్యప్పదీక్షలో ఉన్నవాడిని నేనెప్పుడూ కొట్టలేదు.  ఈ రోజు తప్పేటట్లు లేదని అనుకుంటూ 'మరేం అనాలి? రాంగ్ రూట్లో అంత స్పీడ్లో వచ్చింది చాలక, సిగ్గులేకుండా ఇంకా వాదిస్తున్నావా?' అన్నాను మణికట్లు, పిడికిళ్ళు ఫ్లెక్స్ చేస్తూ.

'సిగ్గేంటి?' అన్నాడు వాడు కోపంగా.

'అవున్లే అది నీకుంటే ఈ డ్రస్సేసుకుని ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావ్?' అన్నాను.

వాడికేం అనాలో తోచలేదు. కోపంగా చూస్తున్నాడు.

ఈలోపల వాడికి తోడు ఇంకో బ్లాక్ క్యాట్ గాడొచ్చాడు.

'గొడవెందుకు స్వామీ. వెళ్ళండి' అన్నాడు నాకు నచ్చజెబుతూ.

'అది అక్కడ చెప్పు' అన్నాను వాడినీ సీరియస్ గా చూస్తూ. గొడవ ముదిరితే ఇద్దర్నీ అక్కడే పడేసి ఉతుకుదాం అనుకున్నా.

'స్వాములతో  గొడవెందుకు స్వామీ?' అన్నాడు వాడు మళ్ళీ.

ఇదొక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !!

'ఎవడ్రా స్వామి? డ్రస్సు    మార్చినంత  మాత్రాన   స్వాములు అవుతారట్రా మీరు?' అందామని నోటిదాకా వచ్చింది, తమాయించుకుని -- 'గొడవ నేను పెట్టుకోలేదు' అన్నాను.

'సర్లే సర్లే స్వామీ. ఏదో అయిపొయింది. పదండి' అన్నాడు వాడు నా భుజం మీద చెయ్యి వెయ్యబోతూ.

వెయ్యబోతున్న ఆ చెయ్యి వైపు  సీరియస్  గా ఒక లుక్కిచ్చాను. చేతిని వెనక్కు తీసుకున్నాడు.

'చూద్దాం వీళ్ళ సంగతి ఏంటో?'-అనుకుంటూ నేను కదలకుండా అక్కడే నిలబడ్డాను. ఏమనుకున్నారో ఏమో బైక్ స్టార్ట్ చేసుకుని ఏదేదో గొణుక్కుంటూ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. 'పనికి మాలిన వెధవల్లారా !' - అనుకుంటూ నా దారిన నేనొచ్చేశాను.

ఇలాంటి దీక్షలను చూస్తుంటే నాకు చాలా  జాలి కలుగుతూ ఉంటుంది. వీళ్ళ ప్రవర్తనలు ఉన్నతంగా ఎక్కడా ఉండవు. చాలామంది అయ్యప్ప దీక్షాపరులు రౌడీల్లాగా ప్రవర్తిస్తూ ఉండటం నేను చాలాసార్లు చూచాను. నిన్నటిదాకా అన్నీ అవలక్షణాలతో    బ్రతికిన మనుషులు ఒక్కసారి నల్లడ్రస్సు వేసి గడ్డం పెంచినంత మాత్రాన ఋషులుగా ఎలా రూపాంతరం చెందుతారు? అది అసంభవం. అందుకే వాళ్ళ పాత ప్రవర్తనలే వాళ్ళతో ఉంటూ ఉంటాయి.  దానికి తోడు, 'స్వామీ స్వామీ' అంటూ లోకగొర్రెలు వీళ్ళకు ఇచ్చే గౌరవం ఒకటి!

ఇంతకీ, దీక్షలంటూ ఈ హింస ఎందుకూ అంటే, ఎవరికోసమో కాదు, వాళ్ళ కోరికలు అప్పనంగా తీరడానికి ఇదొక మసోచిష్టిక్ హింస. ఈ హింస వల్ల నిజానికి  ఏమైనా ఒరుగుతుందా అంటే, అక్కడ ఒరిగేది ఏమీ ఉండదు. కనీసం,  వీళ్ళలో సివిక్ సెన్సూ, మానసిక ఔన్నత్యమూ, ఉదాత్తమైన ఆలోచనాధోరణీ, మంచితనమూ పెరుగుతాయా అంటే అదీ ఉండదు. ఇవే లేనప్పుడు, వీటికి ఎంతో అతీతమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం ఎక్కడనుంచి ఏడుస్తుంది వీళ్ళకు? దీక్షలు తీసుకోని వాళ్ళకంటే మేమేదో గొప్పవాళ్ళం అని  అహంకారం పెరగడం తప్ప ఈ దీక్షలవల్ల ఏమీ ఉపయోగం లేదు.

ఏ దీక్ష అయినా సరే, దానివల్ల మనిషి ఉన్నతంగా ఎదగాలి, మంచితనం పెరగాలి, మానవత్వం పెరగాలి, సివిక్ సెన్స్ పెరగాలి, అహంకారం తగ్గాలి, మనవల్ల ప్రక్కమనిషి ఇబ్బంది పడకూడదన్న సెన్స్ రావాలి, మోసపూరిత మనస్తత్వం పోవాలి, దౌర్జన్యం చేసే గుణం మాయం కావాలి. ఈ లక్షణాలు మనిషిలో కనిపిస్తుంటే - అప్పుడు ఆ దీక్ష ఫలిస్తున్నట్టు. ఇవి లేకుండా మనం ఎప్పటిలాగే మన దరిద్రపు పోకడలతో ఉంటూ, అడ్డమైన పనులన్నీ ఎప్పటిలాగే చేస్తూ, మేం దీక్షలు చేస్తున్నాం అంటే అది ఆత్మవంచన, లోకవంచన తప్ప ఇంకేమీ కాదు.

ఒక మంచి సివిక్ సెన్స్ తో కూడిన అయ్యప్ప దీక్షాధారిని నేను ఇంకా చూడవలసి ఉంది. చూస్తానని నాకైతే నమ్మకం లేదు.

సివిక్ సెన్సే లేనివాడికి స్పిరిట్యువల్ సెన్స్ ఎలా  వస్తుంది? ఎక్కడనుంచి వస్తుంది? అసలలా ఆశించడమే తప్పేమో? మరి ఏ విధంగానూ మనిషిలో ఔన్నత్యాన్ని తీసుకురాని ఈ దీక్షలెందుకు? ఈ నాటకాలెందుకు? బలమైన లోకమాయలో ఈ దీక్షల గోల కూడా ఒక భాగమేనని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.

ఒకే ఒక్క సంఘటనను జెనరలైజ్ చెయ్యకూడదని నాకు బాగా తెలుసు. కానీ నాకిప్పటిదాకా ఎన్నో సంఘటనలు ఇలాంటివి కనిపించాయి. ప్రస్తుతం మన సమాజం చాలా దరిద్రంగా ఉంది. ఆ దరిద్రపు మనస్తత్వాలలోనుంచి వచ్చిన మనుషులు చేసే దీక్షలు ఉన్నతంగా ఎలా ఉంటాయసలు? పాత్రశుద్ధి లేకుండా దాంట్లో పాలు పోస్తే ఏమౌతాయి? పాలు కూడా వాటి విలువను పోగొట్టుకుంటాయి. ప్రస్తుతం అయ్యప్ప దీక్షల్లో జరుగుతున్నది సరిగ్గా అదే.

నా ఈ  అభిప్రాయం నిజమే అనడానికి ప్రతిరోజూ నాకు ఎవిడెన్స్ లభిస్తూనే ఉంది మరి !

27, నవంబర్ 2018, మంగళవారం

నాందేడ్ యాత్ర - 12 (I am a Sikh at heart)

ఈ మధ్యన ఎవరిని చూచినా నాకు రెండే ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అయితే నవ్వు, లేకపోతే జాలి. మనుషులు చేసే పిచ్చిచేష్టలు చూస్తుంటే నవ్వొస్తోంది. వాళ్ళ అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో గమనిస్తుంటే జాలి కలుగుతోంది. మానవజన్మను ఏ విధంగా వీళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారో చూస్తుంటే ఇంకా జాలి పెరిగిపోతోంది. కానీ ఏం చేస్తాం? లోకం మొత్తాన్నీ నేను ఉద్ధరించలేను కదా ! ఆ పనిని అవతార పురుషులే చెయ్యలేకపోయారు. మనమెంత? నా శిష్యుల వరకూ నేను వెలుగుదారిని చూపగలను. అందరికీ అంటే, మనవల్ల ఎక్కడౌతుంది?

మా కొలీగ్ ఎదురు బెర్త్ లో కూర్చున్నాను. ఆ 'బే' లో నేనూ ఆయనా తప్ప ఎవరూ లేరు. కూచున్న కాసేపటికే పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది నా పరిస్థితి.

ఇక వీడి సుత్తి మొదలైంది.

'ఆ ! ఏంటీ సంగతులు? నాందేడ్ లో మూడ్రోజులున్నారు కదా ! ఏమేం సినిమాలు చూశారు?' మొదలుపెట్టాడు.

నేను సినిమా అంటూ చూసి ఎన్ని నెలలైందో, ఎన్ని ఏళ్ళైందో నాకే గుర్తులేదు. కానీ అతన్ని డిసప్పాయింట్ చెయ్యడం ఎందుకని - 'ఒక సినిమా చూశాను' అన్నాను.

'ఏంటది?' అడిగాడు అతనూ కుతూహలంగా.

'Singh is King' అన్నాను.

'అదెక్కడుంది? అది పాత సినిమా కదా?' అన్నాడు తను.

'ఉంది. ఒకరోజు సెకండ్ షో కు వెళ్లాను. సినిమా చాలా బాగుంది. కానీ మర్నాడు వెళ్లి చూస్తె, ఆ ప్లేస్ లో సినిమా హాల్ లేదు.' అన్నాను.

అతను అయోమయంగా ముఖం పెట్టాడు.

'ఊరు కొత్తకదా ! రెండో రోజు మీరు మర్చిపోయి ఏదో వేరే ప్లేస్ లో వెదికి ఉంటారు.' అన్నాడు.

'కావచ్చు' అన్నా నేను వెనక్కు జారగిలి పడుకుంటూ.

'ఇంకేంటి సంగతులు?' అన్నాడు కొలీగ్ గాడు మళ్ళీ.

'ఇది వీడి ఊతపదం అన్నమాట' అనుకున్నా. 'అయ్యో' నుంచి  'ఇంకేంటి సంగతుల్లోకి' పడ్డానని అర్ధమైంది.

'ఈ ఊర్లో చూడదగినవేం ఉన్నాయి?' అడిగాను.

'ఏమీ లేవు. మహా బోర్. ఎప్పుడెప్పుడు నా టర్మ్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదామా అని చూస్తున్నా' అన్నాడు.

'అవును. మూడ్రోజులకే నాకు మహా బోర్ కొట్టింది. మీరు మూడేళ్ళ నుంచీ ఎలా ఉంటున్నారో ఇక్కడ?' అన్నాను.

'అదే మరి ! ఎంత నరకంగా ఉందో నాకే తెలుసు. సర్లేగాని, ఇంకేంటి సంగతులు?' అన్నాడు మళ్ళీ.

'మరీ అంత నరకంలా ఏమీలేదు. మంచి రిచ్ టౌనేగా?' అన్నాను.

'అలా అంటారేంటండి? మన తిండి కాదు, మన కల్చర్ కాదు, మన భాష కాదు. దుమ్మూ ధూళీ. మనుషుల్లో మంచీ మర్యాదా తక్కువ. మనం భరించలేం' అన్నాడు విసుగ్గా.

'అవన్నీ ఉన్నవాళ్ళు మనల్ని చూచి అదే అనుకుంటారేమో?' అన్నాను.

'సర్లెండి ఆ గోల ఎందుగ్గాని, ఎలా కాలక్షేపం అయింది ఈ మూడ్రోజులూ?' అడిగాడు.

'ఏముంది? రాత్రుళ్ళు డ్యూటీలు. పగలు ఊర్లో తిరగడం. ఈ ఊళ్ళో గురుద్వారాలన్నీ చూచాను.' అన్నాను.

'నైట్ డ్యూటీలు చేస్తూ సెకండ్ షో ఎలా చూచారు?' అని అతనికి డౌట్ వస్తుందని ఆశించాను. కానీ అతనంత సెన్స్ లో లేడు.

'ఆ ! వాటిల్లో ఏముందండి చూడ్డానికి? అదంతా సిక్కుల ప్రపంచం. మన కల్చర్ కాదు. ఇంకేంటి సంగతులు?' అన్నాడు మళ్ళీ.

'అసలు మన కల్చరంటే ఏంటో కాస్త చెప్పు నాయనా?' అని అడుగుదామనిపించింది. ఆ మాట అడిగితే హైదరాబాద్ దాకా 'ఇంకేంటి సంగతులు?' అని ఎన్నిసార్లు వినవలసి వస్తుందోనని ఆ మాటను మింగేశాను.

మనం ఎక్కడున్నా సరే, చూచేదృష్టితో చూస్తే అక్కడున్న విషయాలు కనిపిస్తాయి. ఎంతసేపూ మన గోలలో మనముంటే మన గోలే మనకు కనిపిస్తుంది. అప్పుడు అన్నీ బోరుగానే ఉంటాయి.

'సరేగాని, మీరు బ్రాహ్మిన్స్ కదా ! గురుద్వారాలు మీకు నచ్చాయా? అదేంటి? ఈ ఊర్లో కొన్ని మంచిమంచి దేవాలయాలున్నాయి. చూచారా మరి !' అడిగాడు.

'లేదు. నేను వాటిని చూడలేదు' అన్నాను.

'అదేంటి మన గుళ్ళు ఒదిలేసి గురుద్వారాలు తిరిగారా మూడ్రోజులు?' అన్నాడు ఆశ్చర్యంగా.

'అవును. I am a Sikh at heart' అన్నాను నవ్వుతూ.

'భలేవారు సార్, మీరూ మీ జోకులూ?' అన్నాడు.

'Yes. I am not sick at heart, but a Sikh at heart' అన్నాను మళ్ళీ.

అది వినిపించుకోకుండా, తను ఏదేదో వాగడం మొదలుపెట్టాడు. వాటిలో రాజకీయాలూ, రైల్వే సంగతులూ, సినిమాలూ, కరెంట్ ఎఫైర్సూ అన్నీ దొర్లుతున్నాయి. వాటిల్లో ఒక్కటీ నేను వినలేదు. కానీ అన్నింటికీ 'ఊ' కొడుతూ కళ్ళు మూసుకున్నాను.

ఎప్పుడు నిద్రపట్టిందో నాకే తెలీదు. లేచేసరికి ట్రెయిన్ సికింద్రాబాద్ ప్లాట్ ఫాం మీదకు వస్తోంది. పక్కన చూస్తె ఆ శాల్తీ కూడా మంచి నిద్రలో ఉంది.

'హైదరాబాద్ వచ్చింది. లేవండి' అంటూ అతన్ని లేపాను.

'అబ్బ. మళ్ళీ రెండ్రోజుల్లో నాందేడ్ నరకంలోకి వెళ్ళాలి.' అని తిట్టుకుంటూ అతను నిద్ర లేచాడు.

'నరకం అని మనం అనుకుంటున్నది స్వర్గం కావచ్చు. కానీ దానిని చూచే దృష్టి మనకు లేకపోతే, అప్పుడది నిజంగా నరకంలాగే కనిపిస్తుంది మరి !' అనుకున్నాను.

'మీరు ఎక్కువగా మాట్లాడరు లాగుంది' అన్నాడు కొలీగ్ తన బ్యాగ్ తీసుకుంటూ.

'అవును. మాట్లాడటం కంటే, వినడమే నాకిష్టం. ఎందుకంటే, వింటూవింటూ నిద్రలోకి జారుకోవచ్చు కదా!' అన్నాను నవ్వుతూ.

'సరే సార్, ఉంటా మరి' అంటూ బ్యాగ్ తీసుకుని దిగిపోయాడు తను.

నేనూ నా బ్యాగ్ తీసుకుని సికింద్రాబాద్ ప్లాట్ ఫాం మీద అడుగుపెట్టాను. దిగుతూ చూస్తే, నాకంటే ముందు దిగిన కర్ణపిశాచి నన్ను కోపంగా చూస్తోంది. నేను చూపు తిప్పుకుని, రాజుకోసం చూశాను. తను దూరంగా నన్ను వెతుక్కుంటూ వస్తూ కనిపించాడు.

కర్ణపిశాచి వైపు ఒకసారి చూచి, నా దారిన నేను నడక మొదలుపెట్టాను.

(అయిపోయింది)

26, నవంబర్ 2018, సోమవారం

నాందేడ్ యాత్ర - 11 (ఇంతదూరం వచ్చి షిర్డీ వెళ్ళలేదా?)

హోటల్ కు చేరి ఫ్రెష్ అయ్యి నిద్రకు ఉపక్రమించాను. ఈ రోజు నైట్ డ్యూటీ లేదు. హాయిగా తెల్లవార్లూ నిద్రపట్టింది. ఇంకో విచిత్రమేమంటే, రూమ్ లోని లైట్ ఏమీ ఇబ్బంది పెట్టకుండా చక్కగా వెలుగుతోంది.

పొద్దున్నే లేచి తయారై, టిఫిన్ చేసి, బ్యాగ్ సర్దుకుని, స్టేషన్ కు చేరాను. వచ్చిన పని అయిపొయింది గనుక, 9.30 కి దేవగిరి ఎక్స్ ప్రెస్ ఎక్కాలి. ఇది ముంబాయ్ నుంచి నాందేడ్ మీదుగా సికింద్రాబాద్ వస్తుంది. నాందేడ్ లో చాలామంది దిగిపోయారు. ఏసీ కోచ్ ఖాళీగా ఉంది. కోచ్ మొత్తం మీద పదిమంది కూడా లేరు. నేను ఫలానా అని చెప్పగానే, టీటీఈ, ' మీ ఇష్టం వచ్చిన చోట కూచోండి సార్. ఏమైనా కావాలంటే చెప్పండి' అన్నాడు. సరేనని ఒక సైడ్ బెర్తులో  సెటిలయ్యాను.

నాకు ఎదురుమూలగా ఇంకో బెర్తులో ఒక పెద్దామె కూచుని ఉంది. నాకప్పుడప్పుడూ కనిపించే కర్ణపిశాచికి ముసలిరూపంలా ఉందామె. ఆమె చేతులో 'సాయి సచ్చరిత్ర' పుస్తకం ఉంది. ఆమె ఆ పుస్తకాన్ని చదువుతూ మధ్యలో నావైపు ఒకసారి చూచి మళ్ళీ పుస్తకంలో తలదూర్చింది. నేను నా బెర్తుమీద నడుం వాల్చాను.

'ఏంటో ఈ ఖర్మ ! పిశాచాలకూ మనుషులకూ పోలికలు !' అనుకుంటూ విండో లోనుంచి బయటకు చూడసాగాను.

ట్రెయిన్ కదిలింది.

కాసేపయ్యాక నాకేదో ఫోన్ కాల్ వచ్చింది. అందులో మాట్లాడి ఫోన్ జేబులో పెట్టుకోగానే, ఆ పెద్దామె పలకరించింది. నేను తెలుగులో మాట్లాడటం ఆమె విన్నది.

'మీరు తెలుగువారా?'

'అవును' అన్నాను.

'హైద్రాబాదా? అడిగింది.

'హైదరాబాద్ కూడా మా ఊరేగాని, నేనుండేది గుంటూరులో' అన్నాను.

'షిర్డీ వెళ్లి వస్తున్నారా?' అడిగింది.

ఆ ఒక్క మాటతోనే నాకు విషయం అర్ధమైంది. 'సికింద్రాబాదు వరకూ ఈ ముసిల్దాని సుత్తి వినాలి గామోసు దేవుడా' అని భయపడుతూ 'కాదు' అన్నాను సాధ్యమైనంత కూల్ గా.

'అయ్యో !' అంది ఆమె నిట్టూరుస్తూ.

నాకు విషయం అర్ధమైనా అర్ధం కానట్లు - 'ఏమైందండీ? మీకేమైనా హెల్త్ ప్రాబ్లమా?' అడిగాను.

'ఈ వయసులో లేకుండా ఎలా ఉంటాయండి. బీపీ ఉంది. షుగర్ ఉంది. కాళ్ళ నొప్పులున్నాయి.' అంటూ ఆమె -' నేను అయ్యో అన్నది అందుకు కాదు. మీరు ఇంతదూరం వచ్చికూడా షిర్డీ చూడకుండా వెళుతున్నందుకు' అన్నది.

'ఓ అదా ! దానికేముంది లెండి. పరవాలేదు' అన్నాను.

'నేను ఏడాదికి కనీసం నాలుగుసార్లు షిర్డీ వెళ్లి వస్తుంటాను' అందామె.

'అవునా' అన్నాను.

'మీరెన్ని సార్లు వెళ్ళారు షిర్డీ ఇప్పటికి?' అంది తను.

'ఇదేమైనా దోశెలు తినే పోటీనా? నేను పాతిక దోశెలు తిన్నాను. నువ్వెన్ని తిన్నావు అనగడానికి?' అని మనసులో అనుకుని - 'ఇంతవరకూ ఒక్కసారి కూడా పోలేదు' అన్నాను నీరసంగా.

'ఓరి నీచుడా !' అన్నట్లు ఆమె ఒక చూపు చూచింది.

నేనదేమీ పట్టించుకోకుండా, 'ఎందుకండీ ఏడాదిలో అన్నిసార్లు వెళతారు మీరు?' అడిగాను.

'మీకు సాయిబాబా గురించి తెలీదన్న మాట ! ఆయన చాలా మహిమలు చేసే దేవుడు. నా జీవితంలో చాలా మహిమలు చేశాడు.' అందామె.

'దొరికిపోయాన్రా దేవుడో' అని మనసులో అనుకున్నాను. ఇక హైదరాబాద్ వచ్చేవరకూ ఆమె జీవితంలో సాయిబాబా చేసిన మహిమలను చెబుతూ రిలాక్స్ కూడా అవనివ్వదేమో అనుకున్నాను. చాలామంది ఇంతే. ఆయన మహిమలు చేశాడు గనక, తమ కోరికలు అప్పనంగా తీరుస్తాడని వీళ్ళు అనుకుంటారు గనుక, ఆయన్ను పూజిస్తారు. ఇలాంటి మనుషులను చూస్తె నాకు చాలా జాలేస్తూ ఉంటుంది.

ఈమెకు బ్రేక్ వెయ్యాలని - 'అన్ని మహిమలు మీ జీవితంలో జరిగితే మరి మీకెందుకు ఇన్ని రోగాలున్నాయి? వాటిని బాబా తగ్గించలేదా?' అడిగాను సూటిగానే అయినా సున్నితంగా.

'కర్మ అనుభవించక తప్పదు కదా' అందామె సర్దుకుంటూ.

'అబ్బో! పుస్తకాలు బాగానే చదివావు తల్లీ' అనుకుంటూ - 'కర్మ తప్పనప్పుడు ఇక దేవుడెందుకు?' అన్నాను నేనూ వాదనలోకి దిగుతూ.

ఆమె పూర్తి ఫైట్ కి రెడీ అయింది. పుస్తకం మూసి పక్కన పెట్టి నిటారుగా కూచుంది.

'బాబా పిలవందే ఎవరూ షిర్డీ రాలేరు.'అంది.

'అవునా. ప్రతిసారీ బాబా కనిపించి షిర్డీ రమ్మని పిలిస్తేనే మీరు వెళుతున్నారా?' అడిగాను అమాయకంగా.

'కాదు. వెళదామని నాకు అనిపిస్తుంది. నా మనసులో బాబా ప్రవేశించి అలా అనిపిస్తాడు' అన్నది ఆమె.

'మరి నా మనసులోకి ఆయన ప్రవేశించడం లేదు. నన్ను పిలవడం లేదు. అందుకే నేనూ పోవడం లేదేమో?' అన్నాను నవ్వుతూ.

'మీకు టైం ఇంకా రాలేదు' అందామె.

'మనకు టైం రాలేదు కాబట్టే ఇక్కడున్నామండి' అన్నాను నవ్వాపుకుంటూ.

ఆ మాట ఆమెకు అర్ధమైందో కాలేదో నేను పట్టించుకోలేదు. ఇలా కాదని మాట మార్చి - 'ఈ పుస్తకం చదవండి. షిర్డీ ఎంత గొప్పదో తెలుస్తుంది' అందామె.

'నాకు చదువు పెద్దగా రాదండి. అందులోను, ఆ దేవుడి పుస్తకాలలో ఉండే పెద్దపెద్ద మాటలు నాకసలు అర్ధం కావు.' అన్నాను ఒక పల్లెటూరి బైతులా నటిస్తూ.

'అయ్యో!' అందామె మళ్ళీ బాధపడుతూ. అది ఆమె ఊతపదమేమో అనిపించింది.

ఆ పుస్తకాన్ని చేతులోకి తీసుకుంటూ - 'ఇక్కడ చూడండి బాబా చేసిన అద్భుతం ఎంత బాగుందో!' అంటూ ఏదో చదవబోయింది ఆమె.

'ఏమండి ! మీరు ఏమనుకోకపోతే నేను కాసేపు నిద్రపోతాను. బాగా అలసటగా ఉంది.' అన్నాను.

'అయ్యో ! అవునా ! సరే పడుకోండి.' అందామె మళ్ళీ బాధపడుతూ.

నేను ఆవులిస్తూ - 'పరలోకమునందున్న మా తండ్రీ! ఈ నిద్రను మాకు కలిగించినందుకు నీకు వందనములు' అంటూ నామీద క్రాస్ మార్క్ వేసుకుంటూ, కళ్ళుమూసుకుని, కొంచం ఓరగా ఆమె వైపు చూచాను. 

ఆమె బిత్తరపోయి, నోరెళ్ళబెట్టింది.

ఆమె ఏదో అనేలోపు - 'ఏంటి సార్ ! మీరూ హైదరాబాద్ వస్తున్నారా? వర్క్ అయిపోయిందా?' అంటూ మా కొలీగ్ ఆఫీసర్ ఒకాయన వచ్చి పలకరించాడు.

ఆమె అయోమయంగా చూసింది.

'రక్షించావు బాబూ' అని అనుకుంటూ, నా బ్యాగ్ తీసుకుని - 'మీరూ ఇదే కోచ్ లో ఉన్నారా? పదండి మీ బెర్త్ దగ్గరికి వెళదాం.' అని లేచాను.

'అన్ని బెర్తులూ ఖాళీనే. రండి' అని అతను తన బెర్త్ దగ్గరికి దారి తీశాడు.

బిత్తరపోయి చూస్తున్న భక్తురాలిని చూసి లోలోపల జాలిపడుతూ అతని వెనుకే నడిచాను.

(ఇంకా ఉంది)

25, నవంబర్ 2018, ఆదివారం

నాందేడ్ యాత్ర - 10 (గురుద్వారా లంగర్ సాహిబ్)

రాత్రంతా నిద్రలేదు గనుక, హోటలు కొచ్చాక ఫ్రెష్ అయ్యి, కొన్ని గంటలు నిద్రపోయాను. మధ్యాహానికి లేచి, కొంచం ఏదో తిని, మళ్ళీ ఊరిమీద పడ్డాను. దారి అర్ధమైంది గనుక తాపీగా నడుచుకుంటూ మళ్ళీ గురుద్వారా బందా ఘాట్ కు చేరుకున్నాను. నిన్నటి లాగే ఆ ప్రాంతమంతా కోలాహలంగా పండుగ వాతావరణంలా ఉంది. అంతమంది సిక్కులను, వాళ్ళ ఉత్సాహాన్ని, వాళ్ళ ఐకమత్యాన్ని, అన్ని పనులనూ అందరూ కలసి చేసుకునే వాళ్ళ సోదరభావాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. దారిపొడుగునా, రకరకాల కర్రలు, కత్తులు, తల్వార్లు మొదలైన ఆయుధాలు రోడ్డు పక్కనే చేసి అమ్మే డేరాలు వెలిశాయి. అవన్నీ 'గట్కా' అనే సిఖ్ మార్షల్ ఆర్ట్ లొ వాడే ఆయుధాలు. అవన్నీ చూస్తూ, మెల్లిగా గోదావరి ఒడ్డునే నడిచి ముందుకు వెళ్లాను. బందా ఘాట్ గురుద్వారా ప్రక్కనే గురుద్వారా నగీనా ఘాట్ ఉంది. దాన్ని దాటి కొంచం ముందుకు వెళితే వచ్చేదే గురుద్వారా లంగర్ సాహిబ్.

నాందేడ్ లో మనం చూడవలసిన ప్రదేశాలలో గురుద్వారా లంగర్ సాహిబ్ చాలా ముఖ్యమైనది. దీనిని గురు గోవింద్ సింగ్ స్వయానా తన చేతులతో ప్రారంభించాడు. 300 ఏళ్ళ తర్వాత ఈనాటికీ ఇది నిర్విఘ్నంగా సాగుతోంది.

పంజాబీ భాషలో లంగర్ అంటే, వంటశాల, భోజనశాల అని అర్ధం. ఈ గురుద్వారా పేరే లంగర్ సాహిబ్ అంటే ఇదేంటో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈరోజున ఇక్కడ ప్రసాదం తీసుకోవాలని అనుకున్నాను. ఆ ప్రాంగణంలొ అడుగుపెడుతున్నప్పుడే భావోద్రేకంతో నా ఒళ్ళు జలదరించడం మొదలైంది. చెప్పుల కౌంటర్లో నా షూస్ ఇస్తుంటే, సిక్కులలో ఒక పెద్దాయన ఆ షూస్ తీసుకుని ఎంతో గౌరవంగా వాటిని గుడ్డతో తుడిచి లోపల ర్యాక్ లొ ఉంచాడు.

నేను ఎన్నో ఆశ్రమాలు చూచాను. పెద్దపెద్ద మాటలు చెప్పే ఎందఱో గురువులను వ్యక్తిగతంగా కలిశాను. వాళ్ళ శిష్యులనూ కలిశాను. అందరూ మాటలేగాని చేతల్లో ఎక్కడా ఉన్నతంగా ఉండరు. కానీ ఇక్కడ సేవ చేస్తున్న సిక్కులు చూపిస్తున్న త్రికరణశుద్ధి, భక్తి, అంకితభావాలు నన్ను ముగ్దుడిని చేశాయి. గురువుకు వాళ్ళు ఇస్తున్న గౌరవానికీ, ఆయన చెప్పిన బోధనలను వాళ్ళు ఈనాటికీ ఆచరిస్తున్న తీరుకూ నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ కౌంటర్లోని పెద్దాయనకు రెండు చేతులెత్తి నమస్కారం చేశాను. అర్ధం చేసుకున్నట్లు ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూ నాకూ నమస్కారం చేశాడు.

లోపలకు వెళ్లి చూస్తే, అందరూ వరుసలు వరుసలుగా నేలమీద కూర్చుని భోజనం చేస్తూ కనిపించారు. దారిలోనే ఒకాయన నిలబడి కంచం గ్లాసూ మనకు ఇస్తున్నాడు. అవి తీసుకుని వరుసలో కూర్చోవాలి. వెంటనే కొంతమంది వచ్చేసి, ఒక బుట్టలో తెచ్చిన వేడివేడి చపాతీలూ, పొగలు కక్కుతున్న పప్పూ వడ్డించి వెళ్ళిపోతున్నారు. అవి అయిపోయేలోపు మళ్ళీ ఇంకో రౌండ్ వస్తున్నారు. మనం అడగనక్కర్లేదు. వాళ్ళే చూసుకుంటూ, మనం తింటున్న చపాతీ అయిపోయేలోపు మళ్ళీ తెచ్చి వేసేస్తున్నారు.  లేచి కొంచం ఇవతలకు వచ్చే సరికి, వేడివేడి టీ పెద్ద గ్లాసులో పోసి అందిస్తున్నారు.

ఇదంతా చూస్తూ, కంచం గ్లాసూ తీసుకుని ఎక్కడ కూచోవాలా అని చూస్తున్నాను. ఎందుకంటే ఆడామగా భేదం లేకుండా ఒకరి పక్కనే ఇంకొకరు కూచుని తినేస్తున్నారు. వాళ్లకు అసలా ఆలోచనే ఉన్నట్లు కనిపించలేదు. చూస్తేనేమో అప్పుడు ఆడవాళ్ళ వరుసలోనే ఖాళీలున్నాయి. వాళ్ళ పక్కన కూచోవడం తప్పౌతుందేమో అని సందేహించాను. నా సందేహం చూచి ఒక సిఖ్ ముందుకొచ్చి - 'అరె భయ్యా. బైఠో. యహా ఐసా భేదభావ్ నహీ హై. యే గురూజీ కా ఘర్ హై. బైట్కే ఖావో'- అనేసి తన పనిమీద వెళ్ళిపోయాడు.  ఆడవాళ్ళ వరుసలో వాళ్ళ ప్రక్కనే కూచుని రెండు చపాతీలూ, పప్పూ తినేసరికి నా కడుపు నిండిపోయింది. ఆ తర్వాత వాళ్ళిచ్చిన టీ త్రాగాను.

చేతులు కడుక్కుంటూ చుట్టూ చూచాను. గురుద్వారా లంగర్ చాలా పెద్దది. గోధుమపిండి బస్తాలూ, నెయ్యిడబ్బాలూ, బంగాళాదుంపల బస్తాలూ వరుసలుగా పేర్చి కనబడుతున్నాయి. ఎంతోమంది సిక్కులు వాటిని అలా డొనేట్ చేసేస్తున్నారు. చపాతీలు ఒత్తేవాళ్ళు ఒత్తుతున్నారు. వండేవాళ్ళు వండుతున్నారు. సేవ చేసేవాళ్ళు చేస్తున్నారు. బ్యాచ్ లు బ్యాచ్ లుగా వేలమంది భోజనాలు చేస్తున్నారు. 'నువ్వెవరు? ఎక్కడనుంచి వచ్చావు?' అని ఒక్కరూ నన్నడగలేదు. అసలా ఆలోచనే వాళ్లకు లేదు. చాలా ఆనందం కలిగింది. మనస్సులోనే గురువులను స్మరిస్తూ బయటకు వచ్చి ఒక అరుగుమీద కూచున్నాను.

ఆలోచనలు మొదలయ్యాయి. మనసు చరిత్రలోకి తొంగి చూచింది.

ఔరంగజేబ్ గాడు చనిపోయాక వాడి కొడుకుల మధ్య అంతర్యుద్దం మొదలైంది. ముఘల్ పాదుషాల చరిత్ర అంతా రక్తసిక్తమే. అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవడం, తల్లిదండ్రులను చంపడం, అధికారం కోసం ఎవరినైనా చంపడం, మళ్ళీ ఇస్లాం అంటూ నీతులు చెప్పడం - ఇదీ వాళ్ళ నీచమైన చరిత్ర. ఎన్ని వెధవపనులు చేసినా సరే, గడ్డం పెంచితే చాలు, అన్నీ దాని చాటున కొట్టుకుపోతాయి.

అన్నదమ్ముల మధ్యన జరిగిన అంతర్యుద్ధంలొ, తనకు సహాయం చెయ్యమని గురు గోవింద్ సింగ్ ను కోరాడు ఔరంగజేబ్ కొడుకులలో ఒకడైన బహదూర్ షా. ఈ బహదూర్ షా గాడు, తన తండ్రియైన ఔరంగజేబ్ గాడి చావుకోసం, తను సింహాసనం ఎక్కడం కోసం, దాదాపు 50 ఏళ్ళు వేచి చూచాడు. తన తండ్రి చావును కోరుతూ అసహనంగా వీడు దాదాపు 50 ఏళ్ళు బ్రతికాడు. చివరకు వీడికి 63 ఏళ్ళున్నపుడు ఔరంగజేబ్ చచ్చాడు. ఈలోపలే అతను ఎన్నోసార్లు తండ్రికి వ్యతిరేకంగా కుట్రలు చేశాడు. కానీ ప్రతిసారీ ఔరంగజేబ్ వాటిని కనిపెట్టి కొడుకును డిల్లీకి దూరదూరంగా అనేక ప్రాంతాలలో గవర్నర్ గా పంపిస్తూ ఉండేవాడు. అయినా బహదూర్ షా తన కుట్రలు ఆపేవాడు కాదు. చివరకు ఔరంగజేబ్ తన కొడుకును ఆరేళ్ళపాటు జైల్లో కూడా పెట్టాడు. ఈ కధ ఇలా ఉండగా బహదూర్ షా గాడికి 63 ఏళ్ళు వచ్చిన సమయానికి ఔరంగజేబ్ గాడు చచ్చాడు.

ముఘల్ పాదుషాలకు ఎంతమంది పెళ్ళాలు, ఎంతమంది ఉంపుడుగత్తెలు ఉండేవారో వాళ్ళకే తెలీదు. కొంతమంది జనానాలో అయితే 3000 దాటి ఆడవాళ్ళు ఉండేవారు. పదేళ్ళకు కూడా ఒకళ్ళ టర్న్ వచ్చేది కాదు. మరి వాళ్ళ కోరికలు వాళ్ళకూ ఉంటాయి కదా. అందులోనూ రోజూ మూడు పూటలా తినేది మాంసమేనాయె. మరి పదేళ్ళలొ ఒకసారి కూడా సుల్తాన్ వారివైపు చూడకపోతే ఎలా ఊరుకుంటారు? అందుకని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు బయటవాళ్ళతో సంబంధాలు పెట్టుకోకుండా కొజ్జాలను జనానాకు కాపలా పెట్టేవాళ్ళు. ఈ పనికోసం కొంతమంది మగవాళ్ళను కొజ్జాలుగా మార్చేవాళ్లు. ఆ జనానాస్త్రీలు కూడా తక్కువ వాళ్ళేమీ కాదు. వాళ్ళా కాపలా కొజ్జాలను మచ్చిక చేసుకుని, తమకు నచ్చిన ప్రియులను వాళ్ళతోనే రప్పించుకునేవాళ్ళు. ఈ సంగతి సుల్తాన్ కు చేరవేసే గూడచార్లు కూడా వారి పక్కనే ఉండేవాళ్ళు, ఇలా బయటపడి దొరికిపోయిన స్త్రీలను తలలు నరికి, వాళ్ళ బాడీలను నదిలో పారేస్తూ ఉండేవాళ్ళు. ఈ శిక్షలు అమలు చేసే బ్యాచ్ ఇంకోటి ఉండేది. ఇదంతా పెద్ద ఛండాలపు గోలగా సాగేది. ఈ జనానానూ, కొజ్జాలనూ, గూడచారులనూ, శిక్షలు అమలుచేసే కసాయివాళ్ళనూ మూడు పూటలా మేపడానికి హిందువులు కట్టిన 'జిజియా' లాంటి ట్యాక్స్ ల ద్వారా వచ్చిన డబ్బును వాడేవాళ్ళు. ఈ రకంగా హిందువుల కష్టార్జితమంతా సుల్తాన్ల విలాసాలకూ, వాళ్ళ ముండల్ని మేపడానికీ సరిపోతూ ఉండేది. 

ఈ జనానాలో ఉన్న ఆడాళ్ళలో ఎవరి సంతానానికి ఎవరు తండ్రో తెలుసుకోవడం ఆ దేవుడి తరం కూడా అయ్యేది కాదు. ఈ విధంగా ప్రతి సుల్తాన్ గాడికీ అఫీషియల్ గానే, కనీసం పాతికమంది నుండి ఏభై మంది సంతానం ఉండేవాళ్ళు. 

అందుకని ఒక సుల్తాన్ చనిపోతున్నాడు అనగానే, ఈ జనానాకు పుట్టిన కొడుకులందరూ 'తర్వాత సుల్తాన్ నేనంటే నేనని' కొట్టుకు చచ్చేవాళ్ళు. ఎవరి మనుషులను వాళ్ళు కూడగట్టుకుని యుద్ధాలు చేసేవాళ్ళు. ఔరంగజేబ్ చచ్చాక కూడా ఇదే గోల జరిగింది. ఈ అంతర్యుద్ధంలో తనకు సాయం చెయ్యమని గురు గోవింద్ సింగ్ ను కోరాడు ఔరంగజేబ్ కొడుకులలో ఒకడైన బహదూర్ షా. తను డిల్లీ సింహాసనం మీద కూచుంటే, సిక్కులను ఆదుకుంటాననీ, వాళ్ళను ఏమీ అనననీ, వాళ్ళ మీద ఉన్న ట్యాక్స్ లు తీసేస్తాననీ అబద్దాలు చెప్పి గురువును నమ్మించాడు. ఈ విధంగా గురు గోవింద్ సింగ్ సహాయంతో, సిఖ్ సైన్యం సహాయంతో. బహదూర్ షా డిల్లీ సింహాసనం ఎక్కాడు.

కానీ వాళ్ళ రక్తం ఎలాంటిది? వాళ్ళ మూలాలు ఎలాంటివి? అవి ఎడారి దోపిడీ జాతులలో ఉన్నాయి. వాళ్ళ పూర్వీకులందరూ అరేబియాలో ఎడారిదొంగలు. వాళ్లకు విశ్వాసం ఎలా ఉంటుంది? ఆడిన మాటను నిలబెట్టుకోవాలన్న సత్యసంధత ఎలా ఉంటుంది? దొరికింది దొరికినట్లు దోచుకోవాలనే వాళ్లకు అనిపిస్తుంది. అంతకంటే ఉన్నతమైన విలువలు వాళ్లకు ఎలా ఉంటాయసలు? అదే బహదూర్ షా కూడా చేశాడు. సింహాసనం ఎక్కాక, గురువు కిచ్చిన మాటను గాలికి ఒదిలేసి, తన ఇష్టానుసారం చెయ్యడం సాగించాడు. తన హామీల గురించి అడిగితే ఏమీ చెప్పకుండా మాట మార్చేసేవాడు. అంటే, గురువుకు నమ్మక ద్రోహం చేశాడు. గురువును చంపడానికి ఆఫ్గనిస్తాన్ నుంచి కిరాయి హంతకులను రప్పించింది కూడా బహదూర్ షానే.

ఈలోపల డెక్కన్ లో ( అంటే, సెంట్రల్ మహారాష్ట్రా, ఆంధ్రాప్రాంతంలో) తిరుగుబాటులు రేగాయి. డిల్లీలో పాలకులు బలహీనులు అయినప్పుడు దూరదూరంగా ఉన్న గవర్నర్లు స్వతంత్రం ప్రకటించుకునేవారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా ! అప్పుడూ అదే జరిగేది. అలాంటి తిరుగుబాటును అణచి వెయ్యడానికి బహదూర్ షా డెక్కన్ కు తన సైన్యంతో బయల్దేరాడు. అవసరమైతే తన సిఖ్ సైన్యంతో తనకు సాయం చెయ్యడానికి గురుగోవింద్ సింగ్ ను కూడా తన వెనుక రమ్మని అడిగాడు. సరేనన్నాడు గురువు. ఆ సందర్భంలోనే,  గురు గోవింద్ సింగ్ నాందేడ్ కు వచ్చాడు.

అలా తన సైన్యంతో వచ్చిన ఆయన విడిది చేసిన ప్రదేశమే ఈనాటి గురుద్వారా లంగర్ సాహిబ్. అది వాళ్లకు భోజనశాలగా ఉంది. అప్పట్లో అదంతా అడవిగా ఉండేది. ఇక్కడే తన సైన్యంతో కలసి గురుగోవింద్ సింగ్ భోజనం చేసేవాడు.

అసలీ లంగర్ అనే దాన్ని గురు నానక్ మొదలు పెట్టాడు. ఆయన బోధనలు వినడానికి దూరదూరాల నుంచి అనేక మంది వస్తూ ఉండేవారు. వాళ్లకు భోజనం పెట్టె క్రమంలో ఈ 'లంగర్' అనేది మొదలైంది. అప్పట్లో గురుపత్నులు స్వయంగా తమ చేతులతో వండి, దూరదూరాల నుండి వచ్చిన శిష్యులకు భోజనం పెట్టేవాళ్ళు.

రెండవ గురువైన గురు అంగద్ దేవ్ ఈ 'లంగర్' అనేదాన్ని బాగా అభివృద్ధి చేశాడు. తమ శిష్యులలో కులం, మతం, గొప్పా బీదా, ఆడా మగా అనే భేదాన్ని సిఖ్ గురువులు వద్దన్నారు. ఎవరైనా సరే, అందరూ ఒకే బంతిలో నేలమీద పక్కపక్కనే కూచుని తినాలని ఆయనే నియమం పెట్టాడు. ఇది శిక్కులు ఈనాటికీ పాటిస్తున్నారు.

అయితే, మూడవ గురువైన గురు అమర్ దాస్ ఈ లంగర్ అనే దానిని ఒక సంస్థాగతంగా వృద్ధి చేశాడు. ఆయన్ను దర్శించడానికి ఎవరు వచ్చినా సరే, ముందు 'లంగర్' (భోజనశాలలో) అందరితో బాటు నేలమీద కూచుని భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆయన దర్శనం ఇచ్చేవాడు. ముందు తిని తర్వాత తన దగ్గరకు రమ్మని ఆయన చెప్పేవాడు. ఇదే మాటను జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా చెప్పేవారు.

గురు అమర్ దాస్ దర్శనార్ధమై వచ్చిన అక్బర్ పాదుషా కూడా అందరితో పాటు కలసి, నేలమీద కూచుని భోజనం చేశాడు. ఆ తర్వాతనే ఆయనకు గురు అమర్ దాస్ దర్శనం ఇచ్చాడు. ఈ సహపంక్తిలో కులం, మతం. గొప్పా బీదా ఏవీ పాటించరు సిక్కులు. ఇది చాలా గొప్ప విషయం. గురు అమర్ దాస్ శాకాహారి. శిక్కులు యుద్దవీరులు కనుక వాళ్ళు మాంసం తింటారు. ఒక లంగర్ లొ మాంసాహారం పెట్టడం చూచి గురు అమర్ దాస్ నొచ్చుకున్నాడు. అందుకని ఆయనకు విడిగా చపాతీలు, పప్పు పెట్టమని ఆదేశించాడు గురు అంగద్. మిగతా అన్నిచోట్లా శాకాహారం వడ్డించినప్పటికీ, నేటికీ గురుద్వారా ఆనందపూర్ సాహిబ్ లొ మాత్రం మాంసాహారం వడ్డిస్తారు.

నాందేడ్ లోని ఇదే ప్రదేశంలో ఇదే లంగర్ ను ఎప్పటికీ కొనసాగించమని తన శిష్యులను ఆదేశించాడు గురు గోవింద్ సింగ్. కానీ కొంతకాలం తర్వాత ఆయన శిష్యులు దీనిని ఆపేశారు. దానికి కారణం, నిర్వహణకు డబ్బులేకపోవడం. లంగర్ గురించి పట్టించుకోకుండా, వాళ్ళు మిగతా గురుద్వారాలు కట్టడం వంటి ఇతర పనులు చెయ్యడం మొదలుపెట్టారు. అలా రెండు వందల ఏళ్ళు గడిచాయి.

1912 లొ నాందేడ్ గురుద్వారాను దర్శించదానికి వచ్చిన బాబా నిధాన్ సింగ్, తన తిరుగు ప్రయాణంలో నాందేడ్ రైల్వే స్టేషన్లో కూచుని ధ్యానంలో ఉండగా ఆయనకు గురు గోవింద్ సింగ్ దర్శనం కలిగింది. ఈ లంగర్ ను మళ్ళీ అభివృద్ధి చెయ్యమని గురు గోవింద్ సింగ్ ఆయనతో చెప్పాడు. 'దానికోసం బోలెడంత ధనం కావాలి? అది ఎలా వస్తుంది? అని బాబా నిధాన్ సింగ్ అడిగాడు. దానికి గురు గోవింద్ సింగ్ జవాబిస్తూ 'కిస్సా మేరా హాత్ తేరా' అని చెప్పాడు. అంటే - 'సంకల్పం నాది, చేతులు నీవి' అన్నాడు.

ఆ విధంగా నాందేడ్ రైల్వే స్టేషన్లో గురుదర్శనాన్ని పొందిన బాబా నిధాన్ సింగ్ తన తిరుగుప్రయాణం మానుకుని నాందేడ్ లోనే స్థిరపడ్డాడు. ఆయన చేసిన కృషి ఫలితంగానే, గురుద్వారా లంగర్ మళ్ళీ మొదలైంది. ఫండ్స్ వచ్చాయి, పని చేసేవాళ్ళు వచ్చారు. అన్నీ అభివృద్ధి అయ్యాయి. అప్పటినుంచీ నేటి వరకూ గురుద్వారా లంగర్ సాహిబ్ దినాదినాభివృద్ధిగా నిరాఘాటంగా నడుస్తూనే ఉంది. ఒక్క భోజన సమయంలోనే కాదు. రాత్రీ పగలూ ఏ సమయంలో ఎవరు వచ్చి అడిగినా ఇక్కడ భోజనం పెడతారు. 24 గంటలూ అందుకు కొందరు సిక్ఖులు సిద్ధంగా ఉంటారు. తన శిష్యులపైనే కాదు, మానవులందరి పైనా గురువులకున్న ప్రేమకూ, గురు అనుగ్రహానికీ సూచికగా అలాంటి మహత్తరమైన కార్యక్రమం అక్కడ జరుగుతోంది.

అందుకనే, నాందేడ్ లో ఈ గురుద్వారాకు వెళ్ళే మార్గంలోని చౌరస్తాకు 'సంత్ బాబా నిధాన్ సింగ్ జీ చౌక్' అనే పేరు మనకు కనిపిస్తుంది.

జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా 1950 ప్రాంతాలలో జిల్లెళ్ళమూడి కుగ్రామానికి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎవరు ఏ సమయంలో వచ్చినా తనే స్వయంగా అన్నం వండి వారికి భోజనం పెట్టేవారు. అదే ఈనాటికీ అక్కడ అన్నపూర్ణాలయంలో కొనసాగించబడుతోంది. నాందేడ్ లోని గురుద్వారా లంగర్ సాహిబ్ లో కూడా అదే జరుగుతున్నది.

శ్రీరామకృష్ణులు జీవించి ఉన్న సమయంలో నరేంద్ర, రాఖాల్, బాబూరాం, యోగిన్, శరత్, శశి మొదలైన అనేకమంది యువభక్తులు ఆయనకోసం వచ్చేవారు. శారదామాత వారందరికీ భోజనం వండి తన కన్నపిల్లలకు పెట్టినంత ప్రేమగా తినిపించేవారు. పైగా ఎవరెవరి జీర్ణశక్తికి తగినట్లుగా వారివారికి సరిపోయే ఆహారాన్ని తయారుచేసేవారు. నిజమైన మహనీయుల ప్రేమ అలా ఉంటుంది మరి !

ఆ అరుగుమీద చాలాసేపు కూచుని ఇదంతా ఆలోచించిన నేను మెల్లిగా లేచి హోటల్ వైపు నడక సాగించాను. దారిలో ఉన్న స్టాల్స్ నూ, మెడికల్ రిలీఫ్ క్యాంప్ నూ, హోటళ్ళనూ, పంజాబ్ నుంచి వరదలా బస్సులలో కార్లలో వస్తున్న సిక్కులనూ చూస్తూ నేను బస చేసిన హోటల్ వైపు నడక సాగించాను.




























































  
(ఇంకా ఉంది)