Pages - Menu

Pages

24, నవంబర్ 2018, శనివారం

హిందువులందరికీ ప్రాత:స్మరణీయుడు - గురు తేజ్ బహదూర్

Kashmiri Pandits meeting Guru Tegh Bahadur in 1675
నిన్న ఒకరు నన్నిలా అడిగారు.

'ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ! గుడికెళ్ళి వచ్చారా?'

'ఎందుకు?' తిరిగి ప్రశ్నించాను.

'అదేంటి? హిందువువై ఉండి, అందులో బ్రాహ్మిన్ అయి ఉండి, మీరు ఇలాగేనా ఉండేది? ఈరోజు గుడికెళ్ళి దీపాలు వెలిగించి రావాలి. కనీసం మాకు తెలిసినంతైనా మీకు తెలీదా?' అతని గొంతులో హేళన ధ్వనించింది.

నవ్వాను

'తెలుసు. నీకంటే చాలా ఎక్కువే నాకు తెలుసు. ఈ రోజు ఏం చెయ్యాలో, రేపేం చెయ్యాలో కూడా తెలుసు. నేను మీ అంత అజ్ఞానంలో, చీకట్లో, దురాశలో కూరుకుపోయి లేను. నిజమైన బ్రాహ్మణత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నిజానికి నువ్వే 'హిందువు' అన్న పదానికి తగవు.' అన్నాను.

'అదేంటి?' అన్నాడు ఆ వ్యక్తి.

'మీకు ఆస్తినిచ్చిన తల్లిదండ్రులను మీరు మర్చిపోతే దాన్ని ఏమంటారు?' అడిగాను.

'దానికంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అలాంటి మనిషిని అనడానికి నాదగ్గర మాటల్లేవు' అన్నాడు తను.

'కనీసం ఈ మాత్రం జ్ఞానమైనా నీలో ఉంది. సంతోషం. మరి నీకు హిందువు అనిపించుకునే భిక్షను పెట్టిన వ్యక్తిని నువ్వు మరచిపోతే దాన్ని ఏమంటారు?' అడిగాను.

'అది మరీ ఘోరం అవుతుంది! నాకు భిక్ష పెట్టాడా? ఎవరాయన? అయినా, నేనడిగినదానికీ దీనికీ సంబంధం ఏమిటి?' అడిగాడు.

'సంబంధం ఉండబట్టే అడుగుతున్నాను. కార్తీక పౌర్ణమి, గురు నానక్ జన్మదినం. ఈ రోజున నువ్వు చెయ్యాల్సింది గుడికి వెళ్లి దీపాలు వెలిగించడం కాదు. గురునానక్ ను స్మరించి ఆయన బోధనలను ఆచరించే ప్రయత్నం చెయ్యాలి.

నువ్వు గుడికి వెళ్ళినా వెళ్లకపోయినా దేవుడు ఉంటాడు. నువ్వు వెలిగించవలసిన దీపాలు బయటవి కావు, అవి జ్ఞానదీపాలు. అవి నీలో వెలగాలి. నీ లోలోపల చీకటి ఉంచుకుని బయట నెయ్యిపోసి వెయ్యి దీపాలను వెలిగించినా చీమంత కూడా ఉపయోగం లేదు. లోపల చీకటి అంటే ఏమిటో నీకసలు తెలుసా?' అడిగాను.

'తెలీదు' అన్నాడు.

'సరే ! దాని గురించి ఇంకో రోజు చెబుతా. అయిపోయిన నిన్న గురించి ఎందుకు గాని, ప్రస్తుతానికి ఈరోజు విలువ చెబుతాను విను.

ఈరోజు ఒక మహామనీషి నీకోసం, నాకోసం, మనందరి కోసం, తన తలను ఇస్లాం క్రూరపు కత్తికి ఆనందంగా అర్పించాడు. ఆయన తన శిరస్సును అలా అర్పించడం వల్లనే, ఈనాడు నువ్వూ నేనూ ఇంకా కోట్లాది హిందువులూ ఈ దేశంలో హిందువులుగా మిగిలి ఉన్నాం. హాయిగా బ్రతుకుతున్నాం. లేదంటే మూడొందల ఏళ్ళ క్రితమే మన తాతముత్తాలు ముస్లిములుగా మార్చబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా అదే అయి ఉండేవాళ్ళం. ఈ సంగతి తెలుసా నీకు?' అడిగాను.

'తెలీదు' అన్నాడతను ఆశ్చర్యంగా.

'తెలీకపోతే విను. ఆయనే గురు తేజ్ బహదూర్. గురుగోవింద్ సింగ్ తండ్రి. సిక్కుల తొమ్మిదో గురువు. ఆయన తన శిరస్సును ఔరంగజేబ్ కసాయికత్తికి అర్పించిన మహత్తరమైన రోజు ఈరోజు. ఆయనే లేకపోతే నువ్వు ఈనాడు లేవు. ఆయన గుర్తున్నాడా నీకసలు?' అడిగాను.

నమ్మలేనట్లుగా చూచాడు ఆ వ్యక్తి.

'ఇదే మన హిందువులకు పట్టిన అసలైన దరిద్రం. మీకోసం ప్రాణాన్ని గడ్డిపోచలాగా ఇచ్చిన మహాత్ముడిని మీరు మర్చిపోవడమే మీరు చేస్తున్న మహాపాపం. కార్తీకమాసంలో గుడికి వెళ్లి దీపాలు వెలిగించి రావడం కాదు మీరు చెయ్యవలసింది. ఈ మహాత్ముడిని తలచుకుని రెండు కన్నీటి బిందువులు రాల్చాలి మీరంతా. అది ఒదిలేసి చెత్త నియమాలన్నీ పాటిస్తున్నారు మీరు. ఈయనే లేకుంటే మీరంతా ఈరోజున ముస్లిములుగా గడ్డాలు పెంచుకుని బ్రతుకుతూ ఉండేవాళ్ళు. తెలుసా? సిగ్గుందా నీకసలు? నువ్వసలు హిందువువేనా? ఇదేనా హిందూమతం అంటే?' అడిగాను సూటిగా.

బిత్తరపోయాడు అతను.

'ఏంటిదంతా? ఎవరాయన?' అన్నాడు.

'సరే నీ ఖర్మ. నీ చరిత్రే నీకు తెలీనంత అజ్ఞానంలో ఉన్న నువ్వా నాకు కార్తీకమాసం గురించీ హిందూమతం గురించి, బ్రాహ్మణత్వం గురించి చెప్పేది? పోయి ఇంటర్ నెట్లో వెతుక్కో. కనీసం అప్పుడైనా నమ్ముదువుగాని. అప్పుడైనా నీకు అసలైన హిందూమతం అంటే ఏమిటో తెలుస్తుంది.' అన్నాను జాలిగా.

అతను అదోలా చూస్తూ మౌనంగా వెళ్ళిపోయాడు. ఇలాంటివాళ్ళు మన హిందువుల్లో చాలామంది ఉన్నారు. అందుకే మన దేశంలోనే మన ఖర్మ ఇలా తగలడింది.

ఈరోజున భారతదేశంలో ప్రతి హిందువూ పొద్దున్నే లేవగానే చెయ్యవలసింది - మొబైల్లో ఏం మెసేజీలు వచ్చాయి? ఏం వీడియోలు వచ్చాయి? - అని చూసుకోవడం కాదు. ఇంకా కళ్ళు కూడా తెరవక ముందే, మొట్టమొదట భక్తితో స్మరించవలసింది మహాత్ముడైన గురు తేజ్ బహదూర్ ను. ఎందుకంటే - ఒక శిక్కుగురువై ఉండి, హిందూధర్మం కోసం తన తలను బలి ఇచ్చాడాయన. తన కోసం, తన శిక్కుల కోసం కాదు. హిందువుల  కోసం ! మనందరి కోసం !

ఈ సంఘటన సరిగ్గా 24-11-1675 నాడు జరిగింది. అంటే 343 ఏళ్ళ క్రితం జరిగింది. సరిగ్గా ఈరోజునే గురు తేజ్ బహదూర్ మనందరికోసం ప్రాణత్యాగం చేశాడు!

ఈ సంఘటన జరిగిన రోజున తట్టుకోలేక భూమి వణికింది. ఆకాశం రోదించింది. పంచభూతాలు విలవిల లాడాయి. గురు తేజ్ బహదూర్ చేసిన మహత్తర త్యాగాన్ని చూచి సాక్షాత్తూ ఆ దేవుడే కన్నీరు కార్చాడు.

ఇదంతా 26-5-1675 న మొదలైంది. ఆరోజునే కాశ్మీరీ పండిట్స్ వచ్చి గురు తేజ్ బహదూర్ని కలిశారు. రక్షించమని ప్రార్ధించారు.

అసలిదంతా ఏంటో తెలియాలంటే, మూడొందల ఏళ్ళు వెనక్కు వెళ్ళాలి. చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోవాలి.

భారతదేశాన్ని 1658 నుంచి 1707 వరకూ దాదాపు ఏభై ఏళ్ళపాటు ఔరంగజేబ్ అనే ఒక ఛండాలపు సైతాన్ గాడు పరిపాలించాడు. వీడు ముఘల్ పాదుషాలలో పరమ కిరాతకుడు, నీచాతినీచుడు. వీడి సమాధి ఔరంగాబాద్ లో ఉంది. వీడు అక్బర్ మునిమనవడే గాని అక్బర్ లో ఉన్న శాంతి, సహనం, వీడిలో లేవు. వీడు సింహాసనం ఎక్కడానికి అమాయకులైన తన అన్నలు ముగ్గురినీ చంపించాడు. తన తండ్రియైన షాజహాన్ ను జైల్లోపెట్టి అతను చనిపోయేవరకూ అందులోనే ఉంచి, కన్నతండ్రినే చంపిన పరమదుర్మార్గుడు. మన దేశపు సింహాసనాన్ని ఏభైఏళ్ళు ఎక్కి కూచుని ఈ వేదభూమిని పరిపాలించాడా దరిద్రుడు.

ఆ ఏభై ఏళ్ళూ హిందువులకు కాళరాత్రులే. ఆ ఏభై ఏళ్ళలో ఎన్ని లక్షలాది మంది హిందువులు గొంతుమీద కత్తిని పెట్టి ఇస్లాంలోకి మార్చబడ్డారో లెక్కేలేదు. ఎంతమంది హిందూస్త్రీలు మానభంగాలకు హత్యలకు గురయ్యారో లెక్కే లేదు.

వీడి కుయుక్తులకూ, వీడు హిందువులను పెట్టిన బాధలకూ అంతేలేదు. హిందువులైనవారు తమ సంపాదనలో, వ్యవసాయ పంటలో, 60% శాతాన్ని 'జిజియా' అనే పన్నురూపంలో ముఘల్ పాదుషా కాళ్ళదగ్గర అర్పించుకోవాలి. ఇది ఎందుకూ అంటే - వాళ్ళు ముస్లిములు కానందుకు. ఏడాదంతా కష్టపడిన సంపాదనలో వారికి మిగిలేది 40% మాత్రమే. ఆ ట్యాక్స్ తో ముస్లిమ్స్ అందరూ మహారాజభోగాలు అనుభవిస్తూ ఉండేవారు. ఇష్టం వచ్చిన అరాచకాలు చేస్తూ ఉండేవారు. వాళ్లకు ఎదురు చెబితే చావే గతి. అది కూడా భయంకరమైన చిత్రహింసలతో కూడిన చావు ! ఇదంతా తట్టుకోలేక చాలామంది మానసికంగా బలహీనులైన హిందువులు ఇస్లాంలోకి మారిపోయి జిజియాను, ప్రభుత్వహింసను తప్పించుకున్నారు. వాళ్ళే నేడు ఇండియాలో మనకు కనిపిస్తున్న నల్ల ముస్లిములు.

ఇవేవీ చాలక, ఔరంగజేబ్ ఇంకో పని చేశాడు. కాశ్మీర్లో ఉన్న హిందూపండితులను అందర్నీ ముస్లిమ్స్ గా మార్చేస్తే, ఆఫ్ఘనిస్తాన్ కూ, ఇండియాకు మధ్య ఉన్న 'హిందూ అడ్డుగోడ' కూలిపోతుందని, ఇరాన్ నుంచీ సెంట్రల్ ఇండియా వరకు అంతా అప్పుడు ఇస్లాంరాజ్యంగా మార్చవచ్చనే ఒక పధకం వేశాడు. దాన్ని అమలుపరుస్తూ, ఒక ప్లాన్ ప్రకారం కాశ్మీర్ పండిట్స్ ను హింస పెట్టడం ప్రారంభించాడు.

ఆ ప్లాన్ ఇప్పటికీ సజీవంగానే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ టెర్రరిస్టుల పధకం ఇదే. దీనికోసమే వాళ్ళు ఈనాటికీ కాశ్మీర్లో చిచ్చు రేపుతూనే ఉన్నారు. అమాయకులైన హిందువులను చంపుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న కసబ్ గాడు చేసింది ఏమిటి? సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రతిరోజూ చేస్తున్నదేమిటి?

కాశ్మీర్ పండిట్స్ చాలా నిష్టాగరిష్టులైన హిందువులు. అంతేకాదు, వాళ్ళు వేదవేదాంగాలలో మంచి నిష్ణాతులు కూడా. ఫిలాసఫీలో దిట్టలు మాత్రమేకాదు, నీతి నియమాలతో కూడిన ధార్మిక జీవనం గడిపే శుద్ధమైన మనుషులు వాళ్ళు. అలాంటి కమ్యూనిటీ ఒకటి, కాశ్మీర్లో తమకు అడ్డుగా ఉండటం ఔరంగజేబుకు ఏ మాత్రమూ నచ్చలేదు. వాళ్ళనెలాగైనా నాశనం చెయ్యాలని, వాళ్ళమీద నానా రకాల ట్యాక్స్ లు వేశాడు. ఏడాది అంతా కష్టపడినా, ట్యాక్స్ పోను వాళ్లకు ఏమీ మిగిలేది కాదు. ఔరంగజేబు యొక్క ఈ పాలసీల వల్ల స్వతహాగా సంపన్నులైన వాళ్ళు, చూస్తూ ఉండగానే బికారులుగా మారిపోయారు. అయినా సరే, దరిద్రాన్ని భరించడానికైనా సిద్ధపడ్డారు గాని, ధర్మాన్ని ఒదులుకోవడానికి మాత్రం వాళ్ళు సిద్ధపడలేదు. ఎంతకీ వాళ్ళు లొంగకపోతుంటే, ఔరంగజేబు గాడు చివరకు ఒక రాక్షస ప్లాన్ వేశాడు.

క్రీ.శ. 1675 సంవత్సరంలో వాళ్లకు ఒక అంతిమతేదీని నిర్ణయించాడు. ఆ తేదీలోపు కాశ్మీర్లో ఉన్న పండిట్స్ అందరూ వారివారి కుటుంబాలతో సహా, ఇస్లాంలోకి మారితే మారాలి. లేదంటే, అందరినీ మూకుమ్మడిగా సైన్యంచేత చంపిస్తానని, వాళ్ళ ఇళ్ళను ఆస్తిపాస్తులను ఆడవాళ్ళను ముస్లిమ్స్ వచ్చి ఆక్రమించుకుంటారనీ ఆజ్ఞ జారీ చేశాడు.

కాశ్మీరీ పండిట్స్ కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. చూస్తుండగానే ఆ తేదీ దగ్గరకు వచ్చేస్తున్నది. ఎవరితో వాళ్ళ గోడు చెప్పుకోవాలి? ఎవరు వారి ఘోషను వింటారు? ఎవరు వాళ్ళను రక్షిస్తారు? రాజే దుర్మార్గుడైతే ఇక ప్రజలను రక్షించేదెవరు? పులుల మధ్యన ఉన్న గోవులమంద లాగా తయారైంది వారి పరిస్థితి. ఎటు పోవాలో తోచడం లేదు.

ఆలోచించగా ఆలోచించగా వారికి ఒకేఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఆయనే శిక్కుల తొమ్మిదో గురువైన గురు తేజ్ బహదూర్. సిక్కు గురువులకూ కాశ్మీరీ పండిట్స్ కూ దగ్గర సంబంధం ఉన్నది. సిక్కు గురువులలో చాలామంది సంస్కృతాన్ని, మన గ్రంధాలను కాశ్మీరీ పండిట్స్ దగ్గరే నేర్చుకున్నారు. అందుకని వారంటే వీరికి గౌరవభావం ఉన్నది. పైగా ముఘలుల రాక్షసత్వాలను ధైర్యంగా ఎదుర్కొన్నది సిక్కులే. కనుక గురు తేజ్ బహాదూర్ ను శరణు కోరాలని కాశ్మీరీ పండిట్స్ అందరూ నిశ్చయించుకున్నారు.

25-5-1675 న పండిట్ కృపారాం నాయకత్వంలో కాశ్మీరీ పండిట్స్ అందరూ వచ్చి పంజాబ్ లో ఉన్న గురు తేజ్ బహాదూర్ కు తమ సమస్యను విన్నవించుకున్నారు. తమను రక్షించమని ప్రార్ధించారు. ఎందుకంటే - ఆ కాలంలో ముస్లిముల రాక్షసత్వానికీ, అరాచకాలకూ ఎదురు నిలిచి సామాన్య ప్రజలను ఆదుకున్నది సిక్కు గురువులే కాబట్టి.

ఎంత ఆలోచించినా ఏం చెయ్యాలో ఎవరికీ తట్టలేదు. ఈ మారణహోమాన్ని ఎలా ఆపాలో తెలియలేదు. వీరి సమస్యను విన్న గురువు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు.

అసలు వేదభూమియైన ఈ నేల, దుర్మార్గులూ, ఆచారహీనులూ అయిన ముస్లిం పాదుషాల చేత ఇన్ని వందలఏళ్ళు ఎందుకు పాలించబడింది? అలాంటి ఖర్మ ఈ దేశానికి ఎందుకు పట్టింది? హిందూరాజులలో ఐకమత్యం లేకపోవడం వల్లా, హిందువులలో ఐకమత్యం లేకపోవడం వల్లా ఈ దుస్థితి కలిగింది. అదే ఉంటె, ఎక్కడో ఇరాన్ నుంచీ ఆఫ్గనిస్తాన్ నుంచీ ప్రతి దోపిడీజాతీ వచ్చి ఈ దేశాన్ని ఎలా దోచుకోగలుగుతుంది? మన దేవాలయాలను, శిల్పసంపదను ఎలా ధ్వంసం చెయ్యగలుగుతుంది? ఇంతమంది రాజులున్నారు ఎందుకు? హిందువులలో ఐకమత్యం రావాలంటే ఏం చెయ్యాలి? వారిలో జాగృతి కలగాలంటే ఏం చెయ్యాలి? తీవ్రంగా ఆలోచించిన గురు తేజ్ బహదూర్ కు ఒకే ఒక మార్గం కనిపించింది.

ఒక గురువు, ఒక మహనీయుడు, ఒక మహాత్ముడైన వ్యక్తి ఈ రాక్షసపాలనకు బలి కావాలి. తన ప్రాణాన్ని అర్పించాలి. తద్వారా మిగతావారంతా రక్షింపబడతారు. అప్పుడైనా కనీసం ఈ సమాజంలో జాగృతి వస్తుంది. అప్పుడే ఇస్లాం అరాచకం ఈ దేశంలో విషంలా వ్యాపించకుండా ఆపబడుతుంది. ఇది తప్ప మార్గం లేదు. ఆ మహనీయుడు ఎవరు? ఇంకెవరు? తనే ! కనుక తనే తన ప్రాణాన్ని త్యాగం చెయ్యాలి. అప్పుడే ఈ వేదభూమి రక్షింపబడుతుంది. అంతే ! ఇది తప్ప వేరే మార్గం లేనే లేదు.

ఇలా నిశ్చయించుకున్న గురు తేజ్ బహదూర్, కాశ్మీరీ పండిట్స్ కు ఇలా చెప్పాడు.

'మీరు ఔరంగజేబ్ కు ఒక తీర్మానాన్ని పంపండి. గురు తేజ్ బహదూర్ గనుక తన మతం మారి, ఇస్లాం స్వీకరిస్తే, మేమంతా ఆయన్ను వెంబడించి, మేము కూడా ఇస్లాంలోకి మారతాం. ఆయన మారకపోతే మేమూ మారం.' అనేదే ఆ తీర్మానం.

అనుకున్నట్లుగానే ఆ తీర్మానం ఔరంగజేబ్ కు చేరవెయ్యబడింది.

అది చదివి ఔరంగజేబ్ చాలా సంతోషించాడు. వేలాదిమందితో పోల్చుకుంటే ఒక్కడిని మతం మార్చడం చాలా తేలిక. గురు తేజ్ బహాదూర్ మారితే అందరూ పొలోమంటూ మారతారు. ఇది చాలా బాగుంది. సరేనన్నాడు ఔరంగజేబ్. వెంటనే గురువును డిల్లీకి రమ్మని హుకుం జారీ చేశాడు.

11-7-1675 న తన ప్రియ శిష్యులు కొంతమందితో కలసి డిల్లీకి బయల్దేరాడు గురు తేజ్ బహదూర్. మార్గమధ్యంలోనే ఆయన్ను బంధించిన ముఘల్ సైనికులు ఆయన్ను నానాహింసా పెడుతూ డిల్లీకి తీసుకొచ్చారు.

నవంబర్లో విచారణ మొదలైంది.

వారు చూపిన ఆశలన్నింటినీ గురువు తిరస్కరించాడు. డబ్బునీ, అధికారాన్నీ, అందగత్తెలైన వనితలనూ - ఇలా ఎన్ని ఆశలను చూపించినా సరే - అన్నింటినీ రెండో మాట లేకుండా 'ఛీ' కొట్టాడు. ఇస్లాంలోకి మారడం మాత్రం జరిగేపని కాదని తేల్చి చెప్పేశాడు.

మన దేశాన్ని పాలించిన ముస్లిం పాదుషాలు పరమ కిరాతకమైన ప్లాన్స్ తో జనాన్ని భయభ్రాంతులను చేసేవాళ్ళు. బ్రతికి ఉండగానే చర్మం ఒలిపించడం, రోజుకొక్క అవయవాన్ని నరుకుతూ రావడం, నూనె గానుగలో వేసి మనిషిని పిప్పి చెయ్యడం, సలసలా మరుగుతున్న నీళ్ళలో మనిషిని వేసి ఉడకబెట్టడం, బ్రతికి ఉండగానే తగలబెట్టడం - ఈ విధంగా వాళ్ళు వేసే శిక్షలు చాలా దారుణంగా కిరాతకంగా ఉండేవి. వాటిని నాలుగురోడ్ల కూడలిలో అమలు చేసేవాళ్ళు. అవి చూసిన జనం భయంతో గడ్డ కట్టుకుపోయి కిక్కురు మనకుండా సుల్తాన్లకు లొంగి పోయేవాళ్ళు. ఈ విధంగా 'భయం' అనే ఒకే ఒక అస్త్రంతో మన సమాజాన్ని లొంగదీసుకున్నారు ముస్లిం సుల్తానులు. అదే వాళ్ళ స్ట్రాటజీ !

కాకతీయ మహారాజైన ప్రతాపరుద్రుడిని బ్రతికి ఉండగానే చర్మం ఒలిపించి చర్మం లేని ఆ మాంసపు ముద్దను ఒక బండిమీద గుంజకు కట్టి నిలబెట్టి, దాని ఊరేగింపుగా తీసుకెళుతూ, "తమకు ఎదురు తిరిగితే ఎవరికైనా ఇదేగతి" అని చాటింపు వేస్తూ, సౌత్ ఇండియాలో చాలా రాజ్యాలను భయభ్రాంతులకు గురిచేసి ఆయా రాజ్యాలను, ప్రజలను డిల్లీ పాదుషాలు దోచుకున్న సంగతి నేడు ఎందరికి తెలుసు? వాళ్ళు చేసే ఘోరాలు, సృష్టించే భయభ్రాంతులు అలా ఉండేవి !

కానీ, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎన్ని ఆశలు చూపించినా గురువు లొంగడం లేదని వెర్రెక్కి పోయిన ఔరంగజేబ్, గురువు ఎదురుగా అతని ప్రియశిష్యులను చిత్రహింసలు పెడితేనైనా గురువు లొంగుతాడని దుర్మార్గపు ప్లాన్ వేశాడు.

ముందుగా గురువు ప్రియశిష్యుడైన భాయీ దయాళ్ దాస్ ను ఒక సలసలా మరుగుతున్న గంగాళంలోని నీటిలో వేసి బ్రతికి ఉండగానే ఉడకపెట్టమని ఆజ్ఞాపించాడు. దయాళ్ దాస్ కిమ్మనలేదు. గురువులను దైవాన్ని స్మరిస్తూ ధ్యానస్థితుడై మౌనంగా ఆ శిక్షను అనుభవించి దైవసాన్నిధ్యానికి చేరుకున్నాడు.

అయినా గురు తేజ్ బహదూర్ చలించలేదు. కాశ్మీర్లోని హిందూ పండితులను తలచుకుంటూ ధ్యానంలో నిశ్చలంగా ఉండిపోయాడు.

నవంబర్ 11 న గురువుకు ప్రియశిష్యులైన మరొక్క ఇద్దరిని పరమ కిరాతకంగా చంపించాడు ఔరంగజేబ్. భాయీ మతీదాస్ ను బ్రతికి ఉండగానే నిలువుగా రెండు ముక్కలుగా రంపంతో కోయించాడు. భాయీ సతీదాస్ ను దూదితో చుట్టి, నూనె పోసి, అగ్నిని అంటించారు. అంటే, సజీవదహనం చేశారు. అయినా సరే, వాళ్ళిద్దరూ చలించకుండా గురుధ్యానంలో దైవధ్యానంలో మరణాన్ని కౌగలించుకుని అమరత్వాన్ని పొందారు.

ఇన్ని చేసినా గురు తేజ్ బహదూర్ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు గాని 'ఇస్లాం లోకి మారతాను' అని చెప్పలేదు.

'నీ కళ్ళముందే నీ ప్రియశిష్యులను ఎంత దారుణంగా చంపామో చూశావు కదా ! మర్యాదగా ఇప్పుడైనా ఇస్లాంలోకి మారు. ఈ రాజభోగాలను, ఈ అందగత్తెలను అనుభవించు. ఆనందంగా జీవించు. చావును కొనితెచ్చుకోకు' అని ఔరంగజేబ్ చెప్పాడు గురువుతో.

ఉదాత్తమైన తన మతాన్ని వదలిపెట్టి, రాక్షస ఇస్లాంలోకి మారడం అసంభవం అని తలపోశాడు గురువు. పైగా, తాను వారి మాటకు ఒప్పుకుంటే లక్షలాది మంది కాశ్మీరీ పండిట్స్ వెంటనే ఇస్లాం లోకి మారవలసి వస్తుంది. అది జరిగే పని కాదు.

'మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను మాత్రం ఇస్లాం లోకి మారను గాక మారను.' అన్నాడు శాంతంగా గురు తేజ్ బహదూర్.

'ఆఖరు సారి అడుగుతున్నాం. మారుతావా లేదా?' గద్దించాడు ఔరంగజేబ్.

'నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా జవాబు ఒకటే. నా ప్రాణం పోయినా సరే, ఆనందమేగాని, ఇస్లాంలోకి మాత్రం మారను. అది జరగని పని' అని గట్టిగా జవాబిచ్చాడు గురు తేజ్ బహదూర్.

'ఇతన్ని తల నరికి చంపెయ్యండి' ఆజ్ఞాపించాడు పాదుషా.

ఆ ఆజ్ఞను విని పద్మాసనంలో శాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానస్థితిలోకి వెళ్లిపోయాడు గురు తేజ్ బహదూర్. కసాయి కత్తి గాలిలోకి లేచింది, గురువు శిరస్సు ఎగిరి అవతల పడింది. ఆయన దేహం మాత్రం పద్మాసనంలో దైవధ్యానంలో అలాగే కూర్చుని ఉంది.

గురు తేజ్ బహదూర్ మహత్తర త్యాగానికి భూమి వణికింది. గాలి స్తంభించింది. పంచభూతాలు గడగడలాడాయి. చూస్తున్న ముస్లిం అధికారులు మాటలేక నిర్ఘాంతపోయారు.

ఈ సంఘటనను చూచి ఆ దేవుడే కన్నీరు కార్చాడు.

ఆ విధంగా కాశ్మీరీ పండిట్స్ ముస్లిములుగా మారకుండా రక్షింపబడ్డారు. వాళ్ళే కాదు, మొత్తం ఇండియానే రక్షింపబడింది. హిందువులందరూ రక్షింపబడ్డారు. ఈ నాడు మనం హిందువులుగా హాయిగా ఈ దేశంలో బ్రతుకుతున్నామంటే, మన మతాన్ని చక్కగా అనుష్టించుకుంటూ ఉన్నామంటే, దానికి ఒకే ఒక్క మహనీయుని త్యాగం కారణం ! ఆయనే గురు తేజ్ బహదూర్ !!

'సిర్ దియా సర్ న దియా' అని ఆయనను గూర్చి అంటారు. అంటే, శిరస్సును అర్పించాడు గాని, ధర్మాన్ని వదలలేదు అని అర్ధం.

ఎంత ధన్యాత్ముడాయన ! ఎంతటి మహాత్ముడాయన !

ఆయనకు, ఆయన ప్రియశిష్యులకు స్వాగతం చెప్పడానికి సాక్షాత్తూ ఆ భగవంతుడే స్వర్గద్వారంలో వేచిఉండి వారిని తన చేతులలోకి తీసుకున్నాడని నా విశ్వాసం !! 

ఈ సంఘటన సరిగ్గా 24-11-1675 న జరిగింది. నేటికి సరిగ్గా 343 ఏళ్ళ క్రితం ఇదే రోజున జరిగింది.

జరిగిన ప్రదేశం డిల్లీలోని చాందినీ చౌక్. 

అదే ప్రదేశంలో ఈ రోజున సగర్వంగా నిలబడి ఉంది గురుద్వారా సీస్ గంజ్. 

డిల్లీలో చూడవలసిన ఏకైక ప్రదేశం ఇదేనని నా ప్రగాఢవిశ్వాసం !

హిందూమతాన్ని, వేదభూమిని రక్షించాలని ప్రయత్నించిన వాళ్ళు, దానికోసం ప్రాణాలు అర్పించినవాళ్ళు ఎందఱో చరిత్రలో ఉన్నారు. వారిలో అగ్రస్థానం గురు తేజ్ బహదూర్ ది.

ఎందుకంటే ఆయన తనకోసం ఈ త్యాగం చెయ్యలేదు. తన శిక్కుల కోసం చెయ్యలేదు. హిందువుల కోసం చేశాడు. వారిని ఔరంగజేబుగాడి సైతాన్ పరిపాలన నుండి కాపాడటం కోసం చేశాడు. తనకు సంబంధం లేని మనుషుల కోసం మహత్తరమైన త్యాగం చేశాడు. హిందూధర్మాన్ని రక్షించడం కోసం చేశాడు.

మనుషుల పాపాల కోసం జీసస్ చనిపోయాడని అంటారు. అది నిజం కాదు. తర్వాత తరాలలోని మిషనరీలు అల్లిన కట్టుకధ అది. కానీ హిందువుల మతస్వేచ్చను కాపాడటం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు గురు తేజ్ బహదూర్. నా దృష్టిలో జీసస్ కంటే, గురు తేజ్ బహదూర్ ఎంతో గొప్పవాడు. ఎంతో మహనీయుడు !

వాళ్ళెలా మహాత్ములయ్యారో తెలియకుండా, ఎవరికిబడితే వారికి 'మహాత్మా' అని బిరుదులిచ్చి వాడవాడలా వారికి శిలావిగ్రహాలు కట్టిస్తున్న మనం, మనకోసం తమ ప్రాణాలను గడ్డిపోచల్లా అర్పించిన గురు తేజ్ బహదూర్ వంటి నిజమైన మహాత్ములను సిగ్గులేకుండా మర్చిపోయాం. ఇంతకంటే సిగ్గులేనితనం ఎక్కడైనా ఉంటుందా?

మనలాంటి కృతజ్ఞతలేని జాతి, 800 ఏళ్ళు కాదు కొన్నివేల ఏళ్ళపాటు ఔరంగజేబ్ వంటి నీచుల పరిపాలనలో ఉన్నాకూడా బుద్ధి తెచ్చుకోదు. గురు తేజ్ బహదూర్ లాంటి ఇంకెందరు నిజమైన సద్గురువులు, మహనీయులు మనకోసం ప్రాణత్యాగం చేసినాకూడా మనకు బుద్ధిరాదు. అలా బుద్ధి తెచ్చుకోనంతవరకూ, మనం పోగొట్టుకున్న ఆత్మాభిమానాన్ని తిరిగి పొందనంతవరకూ మన సమాజానికి నిష్కృతి లేదుగాక లేదు.

గురు తేజ్ బహదూర్ తన శిరస్సును అర్పించి 300 ఏళ్ళైనా కూడా ఘనత వహించిన మన పాలకుల పాలసీల వల్ల కాశ్మీర్ సమస్య ఈనాటికీ ఇంకా రావణకాష్టంలా మండుతూనే ఉంది. ఎవరి కోసమైతే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడో ఆ కాశ్మీర్ పండిట్స్, అదే కాశ్మీర్లో ముస్లిం టెర్రరిస్టుల చేతులలో ఊచకోత కొయ్యబడి, భయంతో పారిపోయి వచ్చి డిల్లీలో పేవ్ మెంట్ల మీద ఈనాటికీ డేరాలు వేసుకుని చిన్నచిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. స్వార్ధపరులైన గత ప్రభుత్వాల నాయకులలో, వాళ్ళను నిజంగా పట్టించుకుంటున్న నాధుడంటూ ఎవడూ లేడు.

చరిత్రను గుర్తు చేసుకుంటే ఒళ్ళు గగుర్పాటు కలిగే అలాంటి రోజు ఈ నవంబర్ 24.

మనం నిజంగా హిందువులమైతే, కార్తీకమాసంలో చెయ్యాల్సింది, పిచ్చి కోరికలు కోరుకుంటూ గుళ్ళలో దీపాలు వెలిగించి, ఏదో సాధించినట్లు ఎగురుకుంటూ ఇంటికి రావడం కాదు. మనకోసం గురు తేజ్ బహదూర్ చేసిన త్యాగాన్ని ఈనాడు మనమందరం స్మరించాలి. ఆయన్ను తలచి ఆవేదనతో రెండు కన్నీటి బిందువులను రాల్చాలి. ఆయన త్యాగానికి భక్తితో చేతులెత్తి నమస్కరించాలి. ఆయన ఏ విలువల కోసమైతే బ్రతికాడో, వాటికోసం మనమూ బ్రతకాలి. అప్పుడు - మనం నిజమైన హిందువులమైనట్లు. నిజమైన భారతీయులమైనట్లు ! అంతేగాని మనకు తోచిన పిచ్చిపనులు మనం చేసుకుంటూ మనమూ హిందువులమే, మన మతం చాలా గొప్పదని  చంకలు చరుచుకుంటే ఏమీ ఉపయోగం లేదు !

గురు తేజ్ బహదూర్నీ ఆయన ప్రియశిష్యులనూ భక్తితో స్మరించినప్పుడే, కార్తీకమాసాన్ని మనం నిజంగా జరుపుకున్నట్లు, అందులోనూ దైవం మెచ్చే విధంగా జరుపుకున్నట్లు అవుతుంది !

ఈరోజేం చెయ్యాలో మీరే ఆలోచించుకోండి మరి !