Pages - Menu

Pages

28, నవంబర్ 2018, బుధవారం

మా స్వామీజీ మీద ఒక పోస్ట్ వ్రాయండి

లోకంలో మనం సామాన్యంగా అనుకునే ఆధ్యాత్మిక ప్రపంచం ఒక పెద్ద రొచ్చుగుంట. ఇందులో కూడా నిజంకంటే అబద్దమే ఎక్కువగా చలామణీ అవుతూ ఉంటుంది. ఇక్కడ అసలు నోట్ల కంటే దొంగనోట్లే బాగా చలామణీ అవుతూ ఉంటాయి. కాకుంటే - అవే నిజమైన నోట్లని వాటిని ఇచ్చేవాళ్ళూ, తీసుకునేవాళ్ళూ కూడా అనుకుంటూ ఉంటారు. ఆ భ్రమలోనే లక్షలాది జీవితాలు గడిచి, ముగిసిపోతూ ఉంటాయి.

నా పోస్టులు చదివి నాకు ఎంతోమంది మెయిల్స్ ఇస్తూ ఉంటారు. ఫోన్లు  చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది నిజంగా జిజ్ఞాసతో ఉండేవాళ్లూ  ఉంటారు, కొంతమంది 'ఈయన దగ్గర ఏముందో చూద్దాం' అని ఫోన్ చేసేవాళ్ళూ ఉంటారు, మరికొంతమంది - 'ఈయనకేం తెలుసు? మన పాండిత్యాన్ని ఈయన దగ్గర ప్రదర్శిద్దాం' అనుకునేవాళ్ళూ ఉంటారు. మొత్తం మీద నాకు మాత్రం బాగా కాలక్షేపం అవుతూ ఉంటుంది.

మొన్నీ మధ్యన ఒకాయన ఫోన్ చేశాడు.

'మీ పోస్టులు నేను చదువుతూ ఉంటాను. పర్లేదు బాగానే వ్రాస్తారు మీరు' అన్నాడు అదేదో నన్ను ఉద్ధరిస్తున్నట్టు.

నేనేమీ జవాబివ్వలేదు.

'మీ లేటెస్ట్ పోస్ట్ చదివాను. చాలా బాగా వ్రాశారు' అన్నాడు మళ్ళీ.

'ఇప్పుడేగా 'పర్లేదు' అన్నావ్. మళ్ళీ వెంటనే 'చాలా బాగా వ్రాశావ్ అంటున్నావు. అంటే, 'పర్లేదు' కీ, 'చాలాబాగా' కీ  నీకు తేడా తెలీదన్నమాట' అని మనసులో అనుకుంటూ, 'థాంక్స్' అన్నాను.

'మా స్వామీజీ మీద మీరు ఒక పోస్ట్ వ్రాయాలి.' అన్నాడు.

'మీ ... స్వామీజీనా?' అన్నాను నవ్వుతూ.

'అంటే, అలాకాదు. మా స్వామీజీ అంటే, ఆయన  మా గురువుగారు. చాలా మహనీయుడు. ఈ రోజుల్లో అలాంటివాళ్ళు ఎవరూ లేరు' అన్నాడు.

'లేరంటావేం? ఆయనున్నాడుగా?' అనుకుంటూ 'ఇంతకీ ఎవరాయన?' అన్నాను కుతూహలంగా.

'ఫలానా' అంటూ ఆయన పేరు చెప్పాడు.

నవ్వుతో పొలమారింది నాకు.

'ఆయన మహనీయుడు ఎలా అయ్యాడో కొంచం వివరించగలరా?' అడిగాను.

'అదేంటండి అలా అంటారు? ఆయన ఉపన్యాసాలు చాలా బాగుంటాయి.'  అన్నాడు.

'ఉపన్యాసాలు ఇస్తే మహనీయులౌతారా?  దేశంలోని కాలేజీలలో ఉపన్యాసాలు చెప్పే లెక్చరర్లూ, ప్రొఫెసర్లూ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మహనీయులేనా?' అన్నాను.

'వాళ్ళ సబ్జెక్టు వేరు, మా స్వామీజీ చెప్పే సబ్జెక్టు  వేరు. పైగా, ఎంతో పుణ్యం చేసుకుంటేగాని పీఠాదిపత్యం పట్టదు.' అన్నాడు.

'పట్టడానికి అదేమైనా దయ్యమా?' అడిగాను నవ్వుతూ.

'అదేంటండి పీఠాదిపతుల్ని అలా అంటారు?' అన్నాడు మళ్ళీ.

ఈ మాట వినగానే, -  'అందరూ పీటాధిపతులే. భోజనాల దగ్గర' - అనే జిల్లెళ్ళమూడి అమ్మగారి మాట గుర్తొచ్చింది.

'పీటాదిపత్యం పట్టడానికి పుణ్యం ఉండాలేమో నాకు తెలీదు గాని, అది కొనసాగాలంటే మాత్రం, మీలాంటి వాళ్ళ అజ్ఞానం ఉంటె చాలు.' అన్నాను.

'ఏంటండి మీరు మాట్లాడేది? నేను శాస్త్రాలు చదువుకున్నాను' అన్నాడు కోపంగా.

'ఏడిసినట్లే ఉంది  నీ శాస్త్రపరిజ్ఞానం' అనుకుంటూ - 'మరి అంత పాండిత్యం ఉంటే, మీరే వాయవచ్చు కదా  మీ స్వాములవారి మీద. నన్ను ఎగదొయ్యడం ఎందుకు?' అన్నాను.

'నేను మాట్లాడగలనేగాని వ్రాయలేను.' అన్నాడు నిజాయితీగా ఒప్పుకుంటూ.

'అందుకని మీ బదులు నన్ను వ్రాయమంటున్నారా? మీలా వ్రాయనా? నాలా   వ్రాయనా?' అడిగాను.

'మీలాగే వ్రాయండి' అన్నాడు.

'అలా అయితే, మీ స్వామీజీ మంచి ఉపన్యాసకుడేగాని అనుభవశూన్యుడు అని వ్రాస్తాను. సరేనా?' అడిగాను.

'ఏంటండి మీరు మాట్లాడేది? ఆయన గత ఇరవైఏళ్ళ నుంచీ పీటాదిపతిగా  ఉన్నారు.' అన్నాడు.

'ముప్పైఏళ్ళ నుంచీ పీటమీద కూచుని  లేవలేకపోతున్నారు అని  చెప్పండి. ఇంకా బాగుంటుంది. ఆయన్ను కాస్త లేచి నాలుగడుగులు వెయ్యమనండి సమాజంలోకి.' అన్నాను.

నేటి స్వామీజీలందరూ ఎవరి కుంపట్లు వాళ్ళు  పెట్టుకుని అసలైన పొయ్యిని ఆర్పేస్తున్నారని నా దృఢవిశ్వాసం.

'మీరు చాలా పెడమనిషి అని అనుకునేది నిజమేనన్న మాట' అన్నాడు కోపంగా.

'ఓహో! నా గురించి  బాగా తెలుసుకునే అడుగుతున్నారా? సరే, ఇప్పటిదాకా  మీతో మామూలుగా మాట్లాడాను. ఇప్పుడు అసలు పెడసరితనం చూపిస్తాను వినండి. మీ స్వామీజీ మీద నేను పోస్టు వ్రాయడం కాదు, నా మీదే మీ స్వామీజీని ఒక పుస్తకం వ్రాయమనండి.' అన్నాను.

'అదేంటి? మీరంత గొప్పవారా?' అన్నాడు కోపంగా.

'అవును. ఆయన ఉత్త  ఉపన్యాసాలు మాత్రమే ఇవ్వగలడు. అలాంటి స్కిల్స్ నా దగ్గర ఇంకా పదహారున్నాయి. మరి ఎవరి మీద ఎవరు వ్రాయాలి పుస్తకం?' అడిగాను.

'ఆయన పీటాదిపతి' అన్నాడు వగరుస్తూ.

'నా పీటకి నేనుకూడా అధిపతినే, భోజనాల దగ్గర' అన్నా నేను నవ్వుతూ.

సమాధానం లేదు.

'ఇంతకీ మీరు నా ప్రశ్నకు జవాబు సరిగ్గా చెప్పలేదు. మీ స్వామీజీ మహనీయుడు ఎలా అయ్యాడు? అసలు ఎవరైనా సరే, మహనీయులు ఎలా అవుతారు? తెలిస్తే చెప్పండి. తెలీకపోతే తెలీదని చెప్పండి. కనీసం మీకు నిజాయితీ ఉందనైనా అప్పుడు నమ్ముతాను' అన్నాను.

టక్కున ఫోన్ కట్ అయిపోయింది.

చాలామంది ఇంతే. వాళ్ళు అనుకున్నవి మనం చెయ్యాలి. వాళ్ళ ట్యూన్ కి మనం డాన్స్ వెయ్యాలి. లేకపోతే మనం పెడమనుషులం. సత్యాన్ని ఉన్నదున్నట్లుగా చెబితే మనం పెడ మనుషులం. వాళ్ళ బ్యాచ్ లో కలిస్తే మంచివాళ్ళం.

ఇలాంటివాళ్ళు ఆయా స్వామీజీల  దగ్గర భజన పరులుగా ఉంటుంటారు. మనలాంటి వాళ్ళను అప్రోచ్ అయి వాళ్ళమీద ఏవేవో పుస్తకాలు స్తోత్రాలు వ్రాయిస్తారు. అలా చేశామని  చెప్పి ఆ స్వామీజీల దగ్గర మెప్పు పొందుతూ ఉంటారు. లేదా ఆశ్రమాలలో మంచి 'కీ' పోస్టులు  కొట్టేస్తూ ఉంటారు. ఇలాంటి జలగల గురించి మనకు తెలీదని అనుకోవడం జలగల పిచ్చితనం. ఫోన్లో వాళ్ళ గొంతు వింటే చాలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మనకు అర్ధమైపోతూ ఉంటుంది. మన  దగ్గరా  వీళ్ళ జలగవేషాలు?

'పిచ్చి జలగా' అనుకున్నాను.

అయినా, సత్యానికి  ఇలాంటి భజనపరులతో పనేముంది?