Pages - Menu

Pages

4, డిసెంబర్ 2018, మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 32 (దీక్షా స్వీకారం)

పుస్తకాలు చదవడం, ప్రవచనాలు వినడం, గుడులూ గోపురాలూ తిరగడమే ఆధ్యాత్మికం అని చాలామంది అనుకోని పొరపాటు పడుతూ ఉంటారు. అది ఆధ్యాత్మికతలో చాలా చిన్న స్థాయి. LKG లెవల్ అని చెప్పవచ్చు.

ఆధ్యాత్మిక మార్గంలో నడవడం అనేది మనం చెయ్యవలసిన అసలైనపని. దానికి ఒక గురువు అవసరం ఉంటుంది. ఆ గురువు సద్గురువై ఉండాలి. అంటే, తను చెబుతున్న మార్గంలో ఇప్పటికే తను నడిచి గమ్యాన్ని చేరుకున్నవాడై ఉండాలి. అలాంటి గురువును పట్టుకుని ఆయన చూపిన మార్గంలో నడక ప్రారంభించి అంతరికమైన అనుభవాలను సరాసరి అందుకోవడమే అసలైన ఆధ్యాత్మిక మార్గం. దీనికి దీక్షాస్వీకారం అనేది ముఖ్యమైన మెట్టు. ఆ తరువాత సాధన అనేది ఇంకా ముఖ్యమైన మెట్టు. ఈ క్రమంలో నడిస్తే, అంతరిక అనుభవాలు కలగడాన్ని సాధకుడు ప్రత్యక్షంగా తన అనుభవంలో చూడవచ్చు.

నా శిష్యులైన శ్రీరామమూర్తి, గణేష్ లకు నా సాధనామార్గంలో 'రెండవ దీక్ష' (Second level initiation) ను 9-12-2018 న జిల్లెళ్ళమూడిలో ఇవ్వడం జరిగింది. నా శిష్యబృందంలో ఈ దీక్షను ఇంత త్వరగా గ్రహించిన వాళ్ళలో వీళ్ళు రెండో బ్యాచ్. మొదటి బ్యాచ్ శిష్యులు డెట్రాయిట్ లో ఉన్నారు.

ఒక మనిషిని నేను చాలా సూక్ష్మంగా పరిశీలించిన తర్వాతనే 'దీక్ష' అనే దాన్ని ఇస్తాను. ఎవరికి బడితే వారికి అది ఇవ్వను. ఒకవేళ ఇచ్చినా అది వారిలో నిలబడదు. నిలబెట్టుకున్నవాళ్ళు ధన్యులు. ఒదులుకున్నవాళ్ళు చాలా దురదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే దైవానుగ్రహాన్ని వాళ్ళు చేజేతులా దూరం చేసుకున్నారు గనుక !

Second Level Initiation వల్ల, దీక్షాస్వీకారం చేసినవారిలో చాలా మార్పులు కలుగుతాయి. షట్చక్ర జాగరణం, కుండలినీ జాగరణం కలుగుతాయి. ధ్యానంలో లోతులు సునాయాసంగా అందుతాయి. ఎన్నో దివ్యానుభవాలు దీనివల్ల కలుగుతాయి. జీవితానికి నిజమైన ధన్యత్వాన్ని ఈ దీక్ష ఇస్తుంది. ఎంతో అదృష్టం ఉంటేగాని ఈ దీక్ష ఎవరికీ దక్కదు.

అమ్మ నివసించిన గది ప్రక్కనే ఉన్న ధ్యానాలయంలో అలాంటి దీక్షను వీరికివ్వడం జరిగింది.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.