Pages - Menu

Pages

3, డిసెంబర్ 2018, సోమవారం

మిమ్మల్ని అన్నయ్యా అని పిలవవచ్చా?

పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ (అమెరికా) ట్రెజరర్ శ్రీ గణేష్ నాతో కొన్నాళ్ళు గడపడానికి సతీసమేతంగా గుంటూరు వచ్చాడు. ఈ సందర్భంగా నిన్న అందరం కలసి జిల్లెళ్ళమూడి వెళ్లిరావడం జరిగింది. జిల్లెళ్ళమూడిలో మేము ఇల్లు కొన్న తర్వాత అక్కడకు వఛ్చిన మొదటి అమెరికా శిష్యుడు తనే.

'మాతృశ్రీ మహోదధి' అనే పుస్తకం భాస్కరన్నయ్య వ్రాసినది చాలాకాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రింట్ అయింది. అది స్టాల్ లో ఉన్నది అని తెలిసి కొందామని అక్కడకు వెళ్ళాము.

ఈ సందర్భంగా అక్కడ బుక్ స్టాల్ పని చూచే ఒక అక్కయ్య నమస్కారముద్రలో ఇలా అడిగింది.

'అన్నయ్యా ! మీరు ఎందరికో గురువర్యులు. మిమ్మల్ని ఎలా పిలవాలో తెలియక నేను అన్నయ్యా అని పిలుస్తున్నాను. పరవాలేదా? తప్పైతే మన్నించండి. ఇంకెలా పిలవాలో నాకు తెలీడం లేదు. '

జిల్లెళ్ళమూడికి తరచుగా వెళుతూ ఉండటం వల్లా, అక్కడ ఇల్లు కొన్నందువల్లా ప్రస్తుతం చాలామంది నన్ను గుర్తు పడుతున్నారు.

ఆమె సంస్కారానికి ఎంతో ముగ్దుడనైనాను నేను. 

ఆమెతో ఇలా చెప్పాను.

'చూడమ్మా ! నేను ఎందరికో గురువును కావచ్ఛు. కానీ మీలాగా నేనుకూడా అమ్మబిడ్డనే. అమ్మకు అందరం పిల్లలమే.  ఎంత మహనీయుడైనా, ఎంతటి గురువైనా అమ్మముందు చిన్న పిల్లవాడే. మనిద్దరం ఒక తల్లి పిల్లలమే కనుక మీరు నన్ను అన్నయ్యా అని పిలవడం చాలా బాగుంది. అలాగే పిలవండి.' అన్నాను.

ఆమె ఇంకా సంకోచిస్తూ, 'అలా కాదన్నయ్యా ! ఇలా పిలిస్తే మిమ్మల్ని ఏదైనా అమర్యాద చేసినట్లు అవుతుందేమో అనీ' అంది.

'అన్నయ్యా అని నోరారా పిలిస్తే అమర్యాద ఎలా అవుతుందమ్మా? అలాంటి సంకోచం ఏమీ పెట్టుకోకండి. మీ ఇష్టం వచ్చినట్లు నన్ను పిలవచ్చు. నేను నా శిష్యులకు గురువును కావచ్చు కానీ మీకు కాదు. కనుక మీరు ఇలాగే పిలవండి. మళ్ళీ చెబుతున్నాను. నేనూ మీలాగే అమ్మబిడ్డనే.' అని చెప్పాను.

గురుత్వం అన్నది అమ్మ కూచోబెట్టిన ఒక సీటు. కట్టబెట్టిన ఒక బాధ్యత. 'నీవు పొందినదాన్ని అర్హులకు పంచరా' అని అమ్మ ఇచ్చిన ఆదేశం. అంతేగాని, అదొక హోదా కాదు. అందరితో నమస్కారాలు పెట్టించుకునే బిజిజెస్ కాదు.

గురుశిష్య సంబంధం అనేదికూడా క్రమేణా దూరంనుంచి దగ్గరగా మారాలి. సంకోచం నుంచి చనువుకు ఎదగాలి. భయంనుంచి ప్రేమగా మారాలి. 'ప్రేమ' అన్నదే వారిద్దరి మధ్యనా మూలసూత్రం కావాలి. అప్పుడే అది నిజమైన బంధం అవుతుంది. అప్పుడే హృదయస్థాయిలో 'కనెక్షన్' ఏర్పడుతుంది. అందులో నుంచే అన్నీ దక్కుతాయి. అన్నీ అందుతాయి. అందులోనుంచే ఏకత్వానుభూతి కలుగుతుంది.

పుట్టుకతో కొన్ని బంధుత్వాలు వస్తాయి. కానీ దైవం ఇచ్చే బంధాలు ఆ తర్వాత ఏర్పడతాయి. పుట్టుకతో వచ్చే బాంధవ్యాల కంటే, దైవం ఇచ్చే బంధాలే ప్రేమమయంగా ఉంటాయి.

ప్రేమను మించిన గొప్పబంధం ఈ ప్రపంచంలో ఇంకేముంది గనుక?