నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, డిసెంబర్ 2018, బుధవారం

నా శిష్యులే నిజమైన బ్రాహ్మణులు

మొన్నొకాయన ఈవిధంగా మెయిల్ ఇస్తూ ఈ ప్రశ్నను అడిగాడు. 

'మీ శిష్యులలో కొందరు నాకు తెలుసు. వారినుంచి నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీ శిష్యులలో బ్రాహ్మణులు లేరు. మిగతా కులాల వారే ఎక్కువగా ఉన్నారు? ఇది ఎందుకో చెప్పగలరా?'

ఈ ప్రశ్నకు మెయిల్ రూపంలో సమాధానం ఇవ్వడం కంటే బ్లాగులో ఇవ్వడం సమంజసం అనిపించింది. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన సబ్జెక్ట్ కాదు. మా సంస్థ అంటే ఎందరికో వచ్చే సందేహం. అందుకే ఈ పోస్ట్.

'మీరు విన్నది నిజమే కావచ్చు. దీనికి జవాబు చెప్పాలంటే ముందుగా మీకు చాలా విషయాలలో బేసిక్ అవగాహనను నేను కల్పించాలి.

1. శ్రీరామకృష్ణుల అమృతవాక్కులలో ఒకటి - 'భక్తేర్ జోతి నోయ్' - అంటే 'భక్తులలో కులం లేదు' అని. దీనిని మేము తూచా తప్పకుండా పాటిస్తాం. మా సంస్థలో కులాన్ని అస్సలు మేము లెక్కపెట్టం. నా శిష్యులలో చాలామంది కులం ఏమిటో నాకిప్పటికీ తెలీదు. నేనడగను.

2. నిజమైన ఆధ్యాత్మికత, కులానికి మతానికి అతీతమైనది. అది విశ్వజనీనమైన సూత్రాల మీద నిలబడి ఉన్నది. నిజమైన ఆధ్యాత్మికులు కులమతాలకు అతీతంగా ఎదుగుతారు. దీనిని ఊరకే మాటల్లో చెప్పడం కాదు, మా సంస్థలో మేము ఆచరిస్తున్నాం.

3. బ్రహ్మజ్ఞానం కలిగినవాడే బ్రాహ్మణుడు. కనీసం దానికోసం చిత్తశుద్ధితో ప్రయత్నించేవాడు కూడా బ్రాహ్మణుడే. ఈ మాటను నేను చెప్పడం లేదు. వేదమే చెప్పింది. వేదం ఇచ్చిన ఈ నిర్వచనాన్ని స్వీకరిస్తే,  బ్రహ్మజ్ఞానం కోసం నిజాయితీతో ప్రయత్నిస్తున్న వారందరూ బ్రాహ్మణులే. నా శిష్యులందరూ అలాంటివారే. అలాంటివారు కాకపోతే నా దగ్గర నిలబడలేరు. అందుకే నా శిష్యులే నిజమైన బ్రాహ్మణులని నేను చెబుతున్నాను.

4. నా శిష్యులలో బ్రాహ్మణకులం వాళ్ళు తక్కువగా ఉండటానికి ఇంకో కారణం ఉన్నది. అదే బ్రాహ్మణకులంలో పుట్టిన వారికుండే అహంకారం. 'మాకంతా తెలుసు ఒకరు మాకు చెప్పనక్కరలేదు' అని వారు సహజంగా అనుకుంటారు. దీన్నే దురహంకారం అంటారు. ఈ దుర్గుణం వల్లనే వారిలో ఐకమత్యం ఉండదు. అందుకే వారు సామాజికంగా ఎదగలేకపోతున్నారు.

ఈ అహంకారం వల్లనే నా శిష్యులలో కూడా బ్రాహ్మణకులంలో పుట్టినవాళ్ళు తక్కువగా ఉంటారు. అహంకారులైన బ్రాహ్మణులు నా శిష్యులు ఎన్నటికీ కాలేరు. ఆ రకంగా వారు సత్యానికి ఎప్పటికీ దూరంగానే ఉండిపోతూ అసత్యంలోనే ఉంటుంటారు. కానీ తాము సత్యంలోనే ఉన్నామని భ్రమిస్తూ ఉంటారు.

5. వెకిలి ప్రవర్తన కలిగిన పూజారులను, దురహంకారులైన పురోహితులను చూస్తే నాకు పరమచీదర. అలాంటివారిని నేను ఆమడ దూరంలో ఉంచుతాను. కనుక వీరు ఎప్పటికీ నాకు శిష్యులు కాలేరు. వారికి శాస్త్రపాండిత్యం ఉండవచ్చు, వారు పుస్తకాలను బట్టీపట్టి ఉండవచ్చు. కానీ అనుభవజ్ఞానం వారికి పిసరంత కూడా ఉండదు. దానికోసం ప్రయత్నం చెయ్యాలని కూడా వారికి అనిపించదు. అలా అనిపించకపోవడానికి కారణం వారికున్న దురహంకారమే.

6. బ్రాహ్మణకులంతో పోలిస్తే, మతపరమైన విషయాలలో, మిగతాకులాల వారిలో అహంకారం తక్కువగా ఉంటుంది. 'మాకు తెలీదు, తెలుసుకుందాం' అని వారనుకుంటారు. అందుకని వినయంగా ఉంటారు. తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. సరియైన దారి చూపిస్తే దానిలో నడవడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఈ మంచిగుణాలే వారిని నాకు దగ్గర చేస్తున్నాయి. సత్యపధంలో వారిని నడిపిస్తున్నాయి.

7. ఒకరకంగా చెప్పాలంటే మీ ప్రశ్నే తప్పు. కులానికీ ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ ఏమీ సంబంధం లేదు. కులం అన్నది వృత్తికి సంబంధించినది. ఆధ్యాత్మికత అన్నది ప్రవృత్తికీ మానసిక సంస్కారానికీ చెందినది. ఏ కులమైనా, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అభ్యంతరమూ లేదు, అడ్డంకీ లేదు. మీ ప్రశ్న మీకున్న అవగాహనారాహిత్యాన్ని సూచిస్తోంది.

నా శిష్యులలో చాలామంది బ్రాహ్మణకులంలో పుట్టి ఉండక పోవచ్చు. కులపరంగా వాళ్ళు బ్రాహ్మణులు కాకపోవచ్చు. కానీ గుణపరంగా వాళ్ళు సద్బ్రాహ్మణులే. ఎందుకంటే వారిలో దురహంకారం ఉండదు. గర్వం ఉండదు. వినయం ఉంటుంది. ఆధ్యాత్మికమార్గం కోసం వెదుకులాట ఉంటుంది. దానిలో నడవాలన్న తపన ఉంటుంది. నడిచే దీక్ష ఉంటుంది.

బ్రాహ్మణులలో అందరూ అహంకారులే అన్నది నా ఉద్దేశ్యం కాదు. వారిలోనూ చాలామంది వినయ సంపన్నులున్నారు. అలాంటివారితో నాకు పేచీ లేదు. కానీ ఎక్కువమంది అహంకారులే. అందుకే, కులబ్రాహ్మణులతో నాకెప్పుడూ వైరమే. గుణబ్రాహ్మణులతో ఎప్పుడూ స్నేహమే !

ఇంకా చెప్పాలంటే - నా శిష్యులే అసలైన బ్రాహ్మణులని నేను గర్వంగా చెప్పగలను.

'మరి మేమెవరం? మిగతావారందరూ ఎవరు?' - అని మీకు సందేహం వచ్చిందా?

వెల్ ! పైన చెప్పిన వేదనిర్వచనాన్ని బట్టి మీరేంటో, వారేంటో మీరే తేల్చుకోండి మరి !