Pages - Menu

Pages

16, డిసెంబర్ 2018, ఆదివారం

'మహా సౌరమ్' తెలుగు E Book నేడు విడుదలైంది




'ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్' అని నానుడి.

ఒక్క ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మనిషి జీవితానికి కావలసిన సమస్తాన్నీ సూర్యోపాసన ఇవ్వగలదన్న విషయం మామూలు మనుషులకు తెలియకపోయినా, సూర్యోపాసకులకు చక్కగా తెలుసును. లౌకికమైన వరాలను మాత్రమేగాక, ఆధ్యాత్మికమైన వరాలను కూడా సూర్యోపాసన సునాయాసంగా ఇవ్వగలదు. ఎందుకంటే, సూర్యుడంటే అందరూ అనుకునేటట్లు ఒక అగ్నిగోళం మాత్రమే కాదు. పరబ్రహ్మము (Supreme God) నకు సూర్యబింబం ఒక ప్రతీక (symbol) అని మనకు తెలుసు.

సూర్యోపాసకులు జపించే మంత్రాలలో 'మహాసౌరమ్' మొదటిస్థానంలో ఉంటుంది. రెండవది 'అరుణమ్'. మూడవది 'ఆదిత్యహృదయం'. మొదటి రెండూ వేదంలోనివి. మూడవది రామాయణం లోనిది.

వీటిలో, గత మూడేళ్ళనుంచి నేను వ్రాస్తున్న పుస్తకం 'మహాసౌరమ్' తెలుగు E-Book ను నేడు, వరంగల్ రిట్రీట్లో, విడుదల చేస్తున్నాను. ఇది తెలుగు పద్యచరిత్రలోనే గాక, ఆధ్యాత్మికసాహిత్య లోకంలో కూడా ఒక మణిపూసగా నిలచిపోతుందని చెప్పవచ్చు. అంత అద్భుతమైన పద్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

'మహాసౌరమ్' అనేది ఋగ్వేదంలో ఉన్న 65 మహా ప్రభావవంతములైన సూర్యమంత్రముల సమాహారం. వీటిని పదముగ్గురు వేదఋషులు తమ తపస్సాధనలో దర్శించారు. వారి దర్శనములు ఋక్కులుగా వెలువడ్డాయి. ఈ ఋక్కులు (మంత్రములు) వేదంలో ఒకేచోట లేవు. చెదురుమదురుగా ఉన్నాయి. ఆ విధంగా ఋగ్వేదంలో ఉన్న 16 చోట్ల నుండి సేకరింపబడిన ఈ మంత్రములు 'మహాసౌర మంత్రపాఠమ్', 'మహాసౌరమ్' అనే పేర్లతో వేలాది ఏండ్లనుండి మన దేశంలోని సూర్యోపాసకులచేత జపింపబడుతున్నాయి.

ఒక వృత్తానికి 360 డిగ్రీలుంటాయని మనకు తెలుసు. సూర్యభగవానుడు ఒక గోళంలాగే మనకు ఆకాశంలో దర్శనమిస్తాడు. అందుకే ఈ స్తోత్రానికి గల 65 మంత్రములకూ తెలుగులో 360 పద్యములను వ్రాశాను. ఇందులో ఒక్కొక్క పద్యమూ సూర్యభగవానునికి గల ఒక్కొక్క కిరణం అనుకోవచ్చు.

నాకు తెలుగు అంతగా రాదనీ, నేను అందులో పండితుడను కాననీ మీకు తెలుసు. కానీ, కాళీకటాక్షంతో సునాయాసంగా ఈ 360 పద్యములను వ్రాయగలిగాను.

తన జీవితంలో ఆఖరిరోజున వివేకానందస్వామి ఇలా అన్నారు.'వేదంలో అనేకములైన అద్భుత మంత్రాలున్నాయి. వాటి అసలైన అర్ధాలను నా శిష్యులైన మీరు లోకానికి వెల్లడించాలి.ఈ పుస్తకం వ్రాయడం ద్వారా ఆయన ఆశయాన్ని నేను కొంతైనా నెరవేర్చగలిగానని నమ్ముతున్నాను.

వేదమంత్రాలు సామాన్యులకే కాదు, సంస్కృతం వచ్చిన పండితులకు కూడా అంత తేలికగా అర్ధంకావు. ఎందుకంటే అవి మార్మికభాషలో చెప్పబడిన మంత్రాలు గనుక. వాటికి వ్యాకరణార్ధం ఒకటి ఉంటే, రహస్యార్ధం ఇంకోటి ఉంటుంది. వేదాన్ని అర్ధం చేసుకోవాలంటే, తపశ్శక్తి కావాలి. ఉత్త పాండిత్యం ఎంతమాత్రమూ సరిపోదు.ఈ పుస్తకంలో, ఆయా మంత్రములకున్నట్టి వ్యాకరణార్ధాలతో బాటు, వేదాంత-యోగ-తంత్ర పరములైన రహస్యార్ధాలను కూడా, శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో, నేను వివరించగలిగాను.

పైన చెప్పినట్లుగా, ఆధ్యాత్మిక లోకంలోనే గాక, తెలుగు సాహిత్య చరిత్రలో కూడా ఈ పుస్తకం ఒక కలికితురాయిగా, ఒక మణిపూసగా నిలిచిపోతుందని నేను దృడంగా విశ్వసిస్తున్నాను. ఈ విషయం అల్పవిశ్వాసులు, శిశ్నోదర పరాయణులూ ఐన ఇప్పటివారికి అర్ధం కాకపోవచ్చు. కానీ ముందు తరాలవారైనా ఈ విషయాన్ని తప్పకుండా అర్ధం చేసుకుంటారని, ఈ పుస్తకాల విలువను గుర్తిస్తారని నా నమ్మకం.

ఈ పుస్తకం 'ప్రింట్ బుక్' ఈ నెలాఖరున బెంగాల్ రాష్ట్రంలోని జయరాంబాటిలో శ్రీ శారదామాత పాదపద్మాల వద్ద విడుదల అవుతుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ ఈ-బుక్ మరియు ప్రింట్ బుక్ వరుసగా విడుదల అవుతాయి.ఇవన్నీ యధావిధిగా google play books నుంచీ Amazon నుంచీ లభిస్తాయి.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకెంతో సహకరించిన నా అమెరికా శిష్యురాండ్రు అఖిల జంపాల, శ్రీలలితలకు, నిత్యం నన్ను సపోర్ట్ చేస్తూ నాకు చేదోడువాదోడుగా నిలచిన నా శ్రీమతి సరళాదేవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం కోసం ఎంతో ఎదురుచూచిన నా అమెరికా శిష్యులకు, ఇండియా శిష్యులకు నా ఆశీస్సులు. ఈ పుస్తకం కవర్ పేజీలను ఎంతో అందంగా డిజైన్ చేసి ఇచ్చిన నా శిష్యుడు ప్రవీణ్ (హైదరాబాద్) కు నా ఆశీస్సులు.

సాహిత్యపిపాసువులకూ, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకూ, ముముక్షువులకూ నా మునుపటి పుస్తకాలవలె ఈ పుస్తకం కూడా ఉత్తేజాన్ని, ఆనందాన్ని, ఆత్మోన్నతినీ కలిగిస్తుందని నమ్ముతున్నాను.