కలియుగంలో ధర్మం తగ్గిపోతుందనీ, ఏవేవో ఎక్కువైపోతాయనీ మనం చాలా చదువుకున్నాం. అవన్నీ ఎక్కువయ్యాయో లేదో మనకు తెలీదు కానీ, ఎక్కడో ఉండవలసిన త్రిమూర్తులు మాత్రం ఈలోకానికి వచ్చి చక్కగా కూచున్నారు.
త్రిమూర్తులంటే మీకు తెలిసిన దేవతలని అనుకునేరు ! వాళ్ళు కారు. ఈ త్రిమూర్తులు వేరు. ఇప్పుడు ఎక్కడ చూచినా వీళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరని మీకు అనుమానం వస్తోంది కదూ ! వినండి మరి !
బ్రహ్మ - Fast food
విష్ణువు - Use and throw
శివుడు - Speculation
ఒక్కొక్కరినీ విడివిడిగా ప్రార్ధిద్దాం. అంటే పరిశీలిద్దాం.
Fast Food
ఇదేంటో మీకందరికీ తెలుసు. నేను విడమర్చి చెప్పనక్కర్లేదు. కానీ చెప్తాను. ఫాస్ట్ ఫుడ్ అంటే రోడ్డు పక్కన ఉండే చిన్నచిన్న హోటళ్ళలో తినే తిండి కాదు. దేనికోసమూ ఎక్కువసేపు వేచి చూడలేకపోవడం. మనక్కావాల్సిన పనిని త్వరగా ముగించుకుని వెళ్ళిపోవడం. మన పనైపోయాక అక్కడ ఒక్క క్షణమైనా ఉండకపోవడం. ఇదీ ఫాస్ట్ ఫుడ్ అంటే.
ఇప్పుడు ఎవ్వరూ టైం వేస్ట్ చెయ్యడం లేదు అవసరమైన విషయాలలో. అనవసరమైన వాటిల్లో మాత్రం చాలా చేస్తున్నారు. ఏది అవసరమో ఏది అనవసరమో మాత్రం ఎవరికీ తెలీడం లేదు. కానీ ఉన్నది మాత్రం అవసరమే.
ప్రస్తుతం ఏ ఇద్దరినీ చూచినా, అవసరం లేనిదే ఎవ్వరూ ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు. అవసరం తీరాక కూడా మాట్లాడటం లేదు. అసలిప్పుడు మనుషులనే వాళ్ళు ఎక్కడా లేరు. అవసరమే ఉంటున్నది. అవసరమే మాట్లాడిస్తోంది. అవసరమే మాట్లాడుతోంది. మానవ సంబంధాలన్నీ అవసరం చుట్టూతా తిరుగుతున్నాయి. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, కుటుంబసభ్యుల మధ్య కావచ్చు, ఎవరి మధ్యనైనా సరే, ఎక్కడైనా సరే, అవసరం ఒక్కటే ప్రస్తుతం మిగిలి ఉంది. ప్రేమ లేదు, దోమ లేదు, అభిమానం లేదు, స్నేహం లేదు, ఇంకేదీ లేదు, అవసరం తప్ప ! అందుకే అవసరం తీరాక ఎవరి మొహమూ ఎవరూ చూడటం లేదు. Fast food అంటే ఇదే.
Use and throw
ప్రస్తుతం మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న ఇంకో దేవత ఇది. మానవ సంబంధాలలో ప్రస్తుతం రాజ్యం చేస్తున్నది ఇదే. ఎదుటి మనిషి ఎవరైనా సరే, 'వాడుకో - వదిలేయ్' అంతే. నీకు అవసరం ఉంటే, ప్రేమను నటించు. నీ అవసరం తీరాక నిర్మొహమాటంగా ఆ మనిషిని వదిలేయ్.
బాధాకరమైన విషయం ఏమంటే, స్నేహితులు, ప్రేమికులు, బంధువులు, చివరకు భార్యాభర్తల మధ్యన కూడా ఇదే సూత్రం ఇప్పుడు రాజ్యం చేస్తోంది. ఎదుటి మనిషి నీకు ఉపయోగపడుతూ ఉన్నంతవరకూ ఆ మనిషిని ఉండనివ్వు. ఆ ఉపయోగం తీరిన మరుక్షణం తీసి అవతల పారెయ్. ప్రస్తుతం ఎవరిని చూచినా ఇదే పంధాలో కనిపిస్తున్నారు. పాతకాలంలో దీనిని స్వార్ధం అనేవారు. ఇప్పుడు 'తెలివితేటలు' అంటున్నారు. అందరినీ తన స్వార్ధానికి వాడుకుంటూ అందలం ఎక్కినవాడిని 'భలే తెలివైనవాడు' అంటున్నారు. మేనేజిమెంట్ తెలిసినవాడు అంటున్నారు. వాడే ఈనాడు సొసైటీలో ఒక ఐకాన్ అవుతున్నాడు. అంటే మనిషి పూజిస్తున్నది స్వార్దాన్నేగా !
Speculation
సమాజంలో మనం చూచే ఇంకో దేవత ఇది. ఈ పేరు చూచి షేర్ మార్కెట్ అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అది కాదు. స్వల్పకాలిక బిజినెస్ అన్నమాట.
ప్రస్తుతం ఎవరూ ఎవరినీ పర్మనెంట్ గా అంటి పెట్టుకుని ఉండటం లేదు. శాశ్వతంగా నమ్మడమూ లేదు. పాతకాలంలో ఉన్నట్లు శాశ్వత ప్రేమలు, శాశ్వత అభిమానాలూ ఇప్పుడు భూతద్దంలో చూచినా ఎక్కడా కనిపించడం లేదు. కొంతకాలం ఒకరు, ఆ తర్వాత మరొకరు. కొంతకాలం ఒక ఉద్యోగం, ఆ తర్వాత ఇంకో ఉద్యోగం. కొంతకాలం ఒక స్నేహం, ఆ తర్వాత ఇంకో స్నేహం. ఏదైనా ఇంతే. ఏదీ శాశ్వతం కాదన్న వేదాంత సత్యాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నారన్న మాట ప్రజలు !
ఒక్క హైదరాబాద్ సిటీ లోనే ప్రస్తుతం 'సహజీవనం' అనే విధానం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందట. ఒకే అపార్ట్ మెంట్ ను, నలుగురు అమ్మాయిలూ, నలుగురు అబ్బాయిలూ కలసి అద్దెకు తీసుకోవడం, సహజీవనం చెయ్యడం. ఇకచాలు అనుకున్నప్పుడు వేరేచోటకి షిఫ్ట్ అయిపోవడం, లేదా చక్కగా వేరేవాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం. ఇదీ ప్రస్తుత వరస ! ఆఫ్ కోర్స్ ఏదైనా ఒకటి రెండేళ్ళే అనుకోండి. ఆ తర్వాత ఎవరి దారి వారిది. ఇంకో జంటను వెతుక్కోవడమే.
ఒకచోట కొంత ప్రాఫిట్ చేసుకోవడం. ఇంకో కంపెనీ షేర్ కొనడం. మళ్ళీ దాన్ని వదిలించుకోవడం, ఇంకోదానికి షిఫ్ట్ అవడం. ఇదేగా speculation అంటే. ప్రస్తుతం మానవ సంబంధాలు కూడా ఇదే వరసలో సాగుతున్నాయి.
ఈ ముగ్గురే ప్రస్తుతం మనం పూజిస్తున్న నిజమైన త్రిమూర్తులు.
రాజకీయులైనా, భక్తులైనా, ఉద్యోగులైనా, వ్యాపారులైనా, డబ్బున్న వాళ్లైనా, డబ్బు లేని వారైనా, గొప్పవారైనా, మామూలు మనుషులైనా, ఇంకెవరైనా - ప్రస్తుతం అందరూ పూజిస్తున్నది ఈ ముగ్గరు దేవతలనే. ఇంట్లో అయినా, కాలేజీలో అయినా, ఆఫీసులో అయినా, పార్టీలల్లో అయినా, పండుగలలో అయినా, పబ్బాల్లో అయినా, పేరంటాల్లో అయినా, గుళ్ళల్లో అయినా, గోపురాలలో అయినా - ఎక్కడైనా సరే ఇదే వరస !
ప్రస్తుతం ప్రతివారి పూజామందిరంలోనూ ఎంతోమంది దేవతలు కనిపిస్తున్నారు. నిజంగా పూజించేది మాత్రం ఈ త్రిమూర్తులనే. పూజామందిరంలో దేవుళ్ల పటాలు మాత్రం రకరకాలు. ఇదొక హిపోక్రసీ ! పూజామందిరంలో ఉన్న దేవుళ్లన్నీ ఈ త్రిమూర్తుల తొత్తులు మాత్రమే. ఈ ముగ్గురినీ సంతృప్తి పరచినంతవరకే ఆ దేవతల విలువ. అది చెయ్యలేని మరుక్షణం పూజగదిలోని దేవతలు మారిపోయి వేరే దేవతలు వచ్చి కూచుంటారు.
ఈ కలిప్రభావంలో ఇంకెంత మంది ఇలాంటి దేవతలను చూడాలో ఏమో మరి?