Pages - Menu

Pages

10, జనవరి 2019, గురువారం

జీవితం

ఊహలే నిజమనుకుంటూ
వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించలేకపోవడం
జీవితం

ఎక్కడెక్కడో ఆలోచిస్తూ
చేతిలోని జీవితాన్ని చేజార్చుకోవడం
జీవితం

పిచ్చిపిచ్చి గమ్యాలు పెట్టుకుని
వాటికోసం వెర్రిగా పరుగెత్తడం
జీవితం

నిజంగా తనవారెవరో తెలుసుకోలేక
ప్రతివారూ తనవారే అనుకోవడం
జీవితం

పక్కవాడికంటే వేగంగా పరుగెత్తకపోతే
తనదేదో పోతుందని భ్రమించడం
జీవితం

అన్నీ సంపాదించాక
అవన్నీ అక్కరకు రావని గ్రహించడం
జీవితం

చెయ్యాల్సిన పనిని వాయిదా వేసి
అవసరం లేని పనుల్ని అతిగా చెయ్యడం
జీవితం

అన్నీ తెలుసని అహంకరిస్తూ
అసలైనవాటిని దూరం చేసుకోవడం
జీవితం

ఈ క్షణమే శాశ్వతం అనుకుంటూ
శాశ్వతాన్ని కాలదన్నుకోవడం
జీవితం

బాధల్లో ఏడవడం
అవి తీరాక అందర్నీ అరవడం
జీవితం

ఉన్నప్పుడు విలువ తెలియక
లేనప్పుడు విలపించడం
జీవితం

పావురాళ్ళను దూరం చేసుకోవడం
నాగుపాముల్ని నమ్మడం
జీవితం

ఎందుకు బ్రతుకుతున్నామో
తెలియకుండా బ్రతకడం
జీవితం

జీవితాన్ని అనుక్షణం
చేజార్చుకుంటూ జీవించడం
జీవితం