Pages - Menu

Pages

21, జనవరి 2019, సోమవారం

జీవితం - హైకూలు

కలలను మరువలేకపోవడమే జీవితం
కనులను తెరువలేకపోవడమే జీవితం
కలలు కల్లలని అందరికీ తెలుసోయ్ !
అంతులేని వెదుకులాటేగా జీవితం
అర్ధంకాని కలలబాటేగా జీవితం 

నీ వాళ్ళు దూరం కావడమే జీవితం
నీ కాళ్ళు భారం కావడమే జీవితం
నిజంగా మనవాళ్ళంటే ఎవరోయ్?
కుదురు లేని మనసేగా జీవితం
ఎదురు చూచు చూపేగా జీవితం

ప్రేమకు ప్రేమ దక్కకపోవడం జీవితం
కామపు మంట ఆరకపోవడం జీవితం
అన్నీ కావాలని అందరూ ఆశిస్తారోయ్
కొందరికే కొన్నే దక్కడం జీవితం
ఎందులోనూ ఏదీ మిగలకపోవడం జీవితం

ఏదో కావాలని వెర్రిగా ఆశించడం జీవితం
అదే దొరికాక అదికాదని తెలియడం జీవితం
ఈలోకంలో దేన్నీ వెదకనివాడు ఎవడోయ్?
లేనిదాన్ని చేరాలనుకోవడం జీవితం
కానిదాన్ని కావాలనుకోవడం జీవితం

ఎండమావులను నిజాలనుకోవడం జీవితం
బండబావులలో నీళ్లుంటాయనుకోవడం జీవితం
నిజంగా దాహం తీరినవాడు ఎవడున్నాడోయ్?
నీడలవెంట పరుగులాటేగా జీవితం
శూన్యపు ఇంట వెదుకులాటేగా జీవితం

నువ్వేంటో నీకు తెలియకపోవడమే జీవితం
అన్నింటినీ అనుభవించాలనుకోవడమే జీవితం
ఎన్నాళ్ళు నువ్విక్కడ ఉంటావోయ్?
కిరాయి కొచ్చిన కులుకులాటే జీవితం
పరాయిపెళ్ళికి విరగబాటే జీవితం

ఇప్పటికిది నిజమనుకోవడం జీవితం
తప్పని తెలిసినా తప్పకపోవడం జీవితం
తప్పులు చెయ్యనివాడు ఎవడున్నాడోయ్?
తప్పొప్పుల మధ్య తటపటాయింపే జీవితం
ముప్పొద్దుల మధ్య ముగిసిపోవడమే జీవితం