“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

12, జనవరి 2019, శనివారం

రాజకీయ రణరంగం

రాజకీయ రణరంగానికి
రంగం సిద్ధం అవుతోంది
అనవసరపు యుద్ధానికి
సర్వం సిద్ధం అవుతోంది

రణరంగం పణరంగం అవుతోంది
చదరంగం చెదరంగం అవుతోంది
సమాజపు ప్రతి అంగం చచ్చుబడుతోంది
మానవత్వం అడుగడుగునా
మానభంగానికి గురౌతోంది

వోటరుకు ఛాయిసూ లేదు
సామాన్యుడికి వాయిసూ లేదు
ఎవడు రాజైనా బోనసూ లేదు
జనాల జీవితంలోకి వీనసూ రాదు

కుల పార్టీలన్నీ
కులం పనికిరాదంటున్నాయి
మత పార్టీలన్నీ
మతం మంచిది కాదంటున్నాయి
అవినీతి పార్టీలన్నీ
అసలు ధర్మాలను చెబుతున్నాయి
వర్గపోరాట పార్టీలు
స్వర్గాన్ని ఇక్కడే అనుభవిస్తున్నాయి

రావణ పార్టీలన్నీ
రామాయణం పఠిస్తున్నాయి
దుశ్శాసన పార్టీలన్నీ
దుర్మార్గాన్ని ఎండగడతామంటున్నాయి

అందరినీ ఉద్ధరిస్తామని
అందమైన అబద్దాలు చెబుతున్నాయి
అందలం ఎక్కాక
అచ్చమైన మొండిచెయ్యి చూపిస్తాయి

దయ్యాలేమో వేదాలు వల్లిస్తున్నాయి
సైతాన్లేమో నీతులు లెక్కిస్తున్నాయి
రాక్షసులేమో రాజులౌతున్నారు
దేవతలేమో దిక్కులేకుండా పోతున్నారు

అదేదో సినిమాలో చెప్పినట్లు
ఎవడైతే నాకేంటి?
ప్రతి అయిదేళ్ళకూ కనిపిస్తున్నట్లు
ఎవడొస్తే మనకేంటి?

అదే దోపిడీ ఇంకొక తీరులో ఉంటుంది
అదే అవినీతి ఇంకో ముసుగులో వస్తుంది
ప్రతిసారీ ఒక పార్టీ గద్దెనెక్కుతుంది
ప్రతిసారీ ఒక కులం బాగుపడుతుంది

కులాలు బాగుపడతాయి
దేశం మాత్రం బాగుపడదు
మతాలు వెల్లివిరుస్తాయి
ధర్మం మాత్రం కనిపించదు

అయిదేళ్ళ దోపిడీకి లైసెన్సే
ఎలక్షన్లు
గత పార్టీ దోపిడీకి సైలెన్సే
ఎలక్షన్లు

మనదేశం కర్మభూమి
ఇక్కడ ఎవడి ఖర్మ వాడిదే
మనదేశం ధర్మభూమి
ఇక్కడ ఎవడి దోపిడీ వాడిదే

ఇక్కడ వెలయాలు
కులయాలులా కులుకులు పోతుంది
ఇక్కడ తలవ్రాలు
తుంపులు తుంపులై తంపులు పెడుతుంది

ఇదొక విచిత్రదేశం
ఇక్కడ సమస్తం మోసం
ఆవేశపడితే ఈ లోకం
ఇక్కడే అవుతుంది పరలోకం

ఈ దేశంలో
బురదలో కమలంలా
బ్రతకడమే బెస్ట్
దురదున్నా చలించకుండా
నిలవడమే బెస్ట్

ఈ అధర్మాన్ని ఎవరూ ఆర్చలేరు
ఈ సమాజాన్ని ఎవరూ మార్చలేరు
ఈ సంఘాన్ని ఎవరూ తీర్చలేరు
ఈ మనుషులని ఎవరూ కూర్చలేరు

ఇదింతే ! ఇదింతే !!
ఇదింతే ! ఇదింతే !!