నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

12, జనవరి 2019, శనివారం

రెడ్ లైట్ పౌరుడు

నీ రేటెంత?
అమ్మాయిని అడిగాడు రెడ్ లైట్ ఏరియా విటుడు
నీ రేటెంత?
ఓటర్ను అడిగాడు వైట్ డ్రెస్సులో ఉన్న నాయకుడు

వలువలు తీస్తే వెలయాలు
విలువలు వదిలేస్తే రాజకీయాలు
సుఖాన్ని కోరుతూ వ్యభిచారం
అధికారాన్ని కోరుతూ రాజకీయం

అక్కడ అమ్మాయి అస్వతంత్ర బానిస
ఇక్కడ ఓటరు స్వతంత్రపౌరుడు
అమ్మాయిది ఆకలి అవసరం
ఓటరుది ఆశల అవకాశం

ఈ ఓటరు కంటే
ఆ అమ్మాయి ఎంతో ఉత్తమురాలు
ఈ నాయకుడితో పోలిస్తే
ఆ అమ్మాయి దేవత

డబ్బుకు ఒళ్లమ్ముకుంటే వెలయాలు
డబ్బుకు ఓటమ్ముకుంటే భారతపౌరుడు
ఒళ్లమ్ముకోవడం కంటే
ఓటమ్ముకోవడం నీచాతినీచం

డబ్బిచ్చి రోగాన్ని కొనుక్కుంటున్నాడు
విటుడు
డబ్బిచ్చి అధికారాన్ని కొనుక్కుంటున్నాడు
నాయకుడు
డబ్బిచ్చి అమ్మాయి శీలాన్ని దోచుకుంటున్నాడు
విటుడు
డబ్బిచ్చి ఓటరు ఆత్మను కొల్లగొడుతున్నాడు
నాయకుడు

ఆ విటుడికంటే
ఈ నాయకుడే నికృష్టుడు
ఆ వెలయాలు కంటే
ఈ పౌరుడే కంకుష్టుడు

అక్కడ డబ్బిస్తే
కొత్త కొత్త అమ్మాయిలు దొరుకుతారు
ఇక్కడ డబ్బు తీసుకున్నా
పాత పార్టీలే మళ్ళీమళ్ళీ కనిపిస్తాయి
ఈ పార్టీల కంటే
ఆ అమ్మాయిలే నయం

ఒళ్లైనా ఓటైనా
డబ్బుకు దాసోహమేగా
రెడ్ లైటైనా వైట్ డ్రస్సైనా
రంగుల ప్రపంచమేగా...