నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

7, జనవరి 2019, సోమవారం

ఎవరు నేను?

కొందరు నన్ను మంచి మిత్రుడినన్నారు
నిజమే
చక్కగా నాతో స్నేహం చేసేవారికి
మంచి మిత్రుడినే నేను

కొందరు నన్ను మోసగాడన్నారు
నిజమే
ఏవేవో కోరికలతో నాదగ్గరకు వస్తే
పెద్ద మోసగాడినే నేను

కొందరు నన్ను పిచ్చివాడన్నారు
నిజమే
ఈలోకమంతా ఉన్న  పిచ్చివాళ్ళకు అర్ధంకాని
కొత్తరకం పిచ్చివాడినే నేను

కొందరు నన్ను అమాయకుడన్నారు
నిజమే
ఈ ప్రపంచపు మాయలు తెలియని
అసలైన అమాయకుడినే నేను

కొందరు నన్ను స్వాప్నికుడనన్నారు
నిజమే
ఎప్పుడూ ఏవేవో కలల్లో ఉండే
స్వాప్నికుడినే నేను

కొందరు నన్ను పొగరుబోతునన్నారు
నిజమే
పొగరుగా నాకెదురు వచ్చేవారికి
అంతకంటే పెద్ద పొగరుబోతునే నేను

కొందరు నన్ను సరదా మనిషినన్నారు
నిజమే
మామూలు సరదాలకు దూరమైన
సరదా మనిషినే నేను

కొందరు నన్ను అనాచారినన్నారు
నిజమే
కొంతమందికే తెలిసిన ఆచారాన్ని పాటించే
అసలు సిసలు అనాచారినే నేను

కొందరు నన్ను నాస్తికుడనన్నారు
నిజమే
ఆస్తిపాస్తులమీద పెద్దగా నమ్మకం లేని
నికార్సైన నాస్తికుడనే నేను

కొందరు నన్ను సంసారాలు కూల్చేవాడినన్నారు
నిజమే
సంసారాన్నే కూల్చేద్దామని
ఎప్పుడూ ప్రయత్నించేవాడినే నేను

కొందరు నన్నొక దొంగనన్నారు
నిజమే
మీ ఆస్తులన్నీ దోచుకుని మిమ్మల్ని నాస్తిగా చేసే
గజదొంగనే నేను

కొందరు నన్నొక ప్రేమికుడనన్నారు
నిజమే
మనుషుల్లో నిద్రాణంగా ఉన్న ప్రేమను తట్టిలేపే
ప్రేమికుడినే నేను

కొందరు నన్నొక కాముకుడినన్నారు
నిజమే
దేన్ని కామించాలో ఎలా కామించాలో తెలిసిన
కాముకుడినే నేను

కొందరు నన్నొక రచయితనన్నారు
నిజమే
ఏం వ్రాస్తానో ఎలా వ్రాస్తానో నాకే తెలియని
రచయితనే నేను

కొందరు నన్నొక ఉపన్యాసకుడినన్నారు
నిజమే
నేను మాట్లాడేది నేను కూడా వినే
ఉపన్యాసకుడినే నేను

కొందరు నన్నొక గాయకుడి నన్నారు
నిజమే
పాతగాయాల్ని పాటలతో మర్చిపోదామని ప్రయత్నించే
గాయకుడినే నేను

కొందరు నన్నొక జులాయినన్నారు
నిజమే
ఏ కట్టుబాట్లకూ లొంగకుండా సంచరించే
జులాయినే నేను

కొందరు నన్నొక సాధకుడినన్నారు
నిజమే
సాధారణంగా ఉండటానికి ఇష్టపడే
సాధకుడినే నేను

కొందరు నన్నొక గురువునన్నారు
నిజమే
గురువుల గ్రుడ్డితనాన్ని చూచి నవ్వుకునే
గురువునే నేను

కొందరేమో నువ్వు అర్ధం కావన్నారు
నిజమే
నాకే నేనర్ధం కాను
ఇక మీకెలా అవుతానన్నాను

ఇంతకీ ఎవరు నేను?

అందరికీ తలూపుతూ
అన్నిటికీ ఔనంటూ
అన్నీచూచి నవ్వుకుంటూ
అవన్నీ నేనౌతూ
ఆ అన్నిటికీ అతీతంగా
నన్నే నేను నిరంతరం దాటిపోతూ
నాలోనే నేనుండే
అసలైన నేనును నేను