Pages - Menu

Pages

12, జనవరి 2019, శనివారం

ఓటెలా వెయ్యాలి?

'నీకన్నీ తెలుసు కదా? ఓటు ఎలా వెయ్యాలో చెప్పు?' అడిగాడు మా ఫ్రెండ్ ఒకాయన ఇవాళ.

'దానికి చాలా టైముంది కదా? అప్పుడే ఎందుకు? మెల్లిగా చేస్తాలే ఉపదేశం' అన్నా నవ్వుతూ.

'కాదు. ప్లీజ్. ప్లీజ్. చెప్పవా?' బ్రతిమాలాడు.

'చేత్తో వెయ్యాలి' సీరియస్ గా అతని వైపు చూస్తూ చెప్పాను.

అతను కాసేపు నావైపు ఎగాదిగా చూశాడు.

'అబ్బా ! కాల్తో వెయ్యాలనుకున్నానే' అన్నాడు.

'నీ ఇష్టం వచ్చినదాంతో వెయ్యి. నాకేమీ అభ్యంతరం లేదు' అన్నా నవ్వుతూ.

'జోకులు కాదు. సీరియస్ గా అడుగుతున్నా. ఈ రాజకీయపార్టీలంటేనే నాకు విసుగు పుట్టింది. ఈ సారి మీరు ఎవరికి వెయ్యమంటే వారికి వేస్తా' అన్నాడు.

'చెప్పాక, చెయ్యకపోతే ఊరుకోను మరి !' అన్నా నేను కోపంగా.

'సరే చెప్పు' అన్నాడు ఒప్పుకుంటూ.

'పోలింగ్ స్టేషన్ కు వెళ్ళు. క్యూలో నిలబడు. ముందుకు నడువు.' అన్నా.

'అవన్నీ నాకు తెలుసు. ఓటు ఎలా వెయ్యాలి? అది చెప్పు' అన్నాడు.

'ఎందుకంత తొందర? చెప్తున్నాగా? బ్యాలట్ పేపర్ చేతులోకి తీసుకో. కళ్ళు మూసుకో. నీ ఇష్టదైవాన్ని మనసారా స్మరించు. కళ్ళు మూసుకుని గుద్దేయ్. చుక్క ఎవరిమీద పడితే ఆ పార్టీకే ఈసారి అధికారంలోకి వచ్చె అర్హత ఉన్నట్లు లెక్క' అన్నాను.

'ఒకవేళ ఆ గుర్తు రెండు పార్టీల మధ్యలో పడితేనో? అప్పుడు ఎవరికి అర్హత ఉన్నట్లు?' అడిగాడు ఫ్రెండ్ తెలివిగా.

'వాళ్ళ అర్హత నాకు తెలీదుగాని, అలా జరిగితే ఒక లెక్కుంది' అన్నా.

'ఏంటది?' అన్నాడు ఆత్రుతగా.

'అసలు ఓటేసే అర్హతే నీకు లేనట్లు లెక్క' అన్నా కూల్ గా.

ఫ్రెండ్ మాయమై పోయాడు.