Pages - Menu

Pages

6, జనవరి 2019, ఆదివారం

టాయిలెట్ ధ్యానం

ఒకడు
టాయిలెట్లో భార్య ఎక్కువసేపుందని
తలుపులు బాదుతున్నాడు
తన పూజకు లేటౌతోందని
తను స్నానం చెయ్యాలని
త్వరగా మడి కట్టుకోవాలని
మెట్టేషన్ చేసుకోవాలని
బాత్రూం బయట కోతిలా ఎగురుతున్నాడు

చివరకు భార్య బయటకొచ్చింది
ఇతని స్నానం అయింది, పూజ అయింది
పూజ సమయంలో టీవీ సౌండ్ తగ్గించలేదని
భార్యను తిడుతున్నాడు
టిఫిన్ సరిగా చెయ్యలేదని
నీవల్లే ఆఫీసుకు లేటైందని
చిర్రుబుర్రులాడుతున్నాడు

భర్త భరతనాట్యం చేస్తున్నాడు
భార్య మౌనయోగినిలా ఉంది
భర్త అసహనంగా ఉన్నాడు
భార్య అమాయకంగా ఉంది

ఆ భార్య
టాయిలెట్లో ఉన్నంతసేపూ
ట్యాప్ లోంచి మగ్గులో పడుతున్న
నీటి చుక్కల శబ్దం వింటూ
దానిలో లీనమై
ప్రపంచాన్ని మరచింది
తనెక్కడుందో మరచింది
ఆమె మనసు ఆగిపోయింది
శూన్యమై పోయింది
అందుకే అక్కడ అంతసేపుంది

మడికట్టుకుని గంటసేపు
పూజా ధ్యానం చేసిన భర్త మనసు
చేపల మార్కెట్లా ఉంది
పావుగంటసేపు టాయిలెట్లో ఉన్న భార్య మనసు
మానససరోవరంలా ఉంది
ఎవరిది ధ్యానం?
ఎవరిది మౌనం?

పూజగది టాయిలెట్ అయింది
టాయిలెట్ పూజగది అయింది
భలే ఉంది కదూ
టాయిలెట్ ధ్యానం !