నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, మార్చి 2019, మంగళవారం

గుడ్డి గురువులు - 2

ఇలా కాసేపు ఆలోచించి, 'ఇక చాల్లే' అనుకుంటూ పక్కనే ఉన్న వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాను. మేము మాట్లాడుకుంటూ ఉండగా ఏనుగులా ఉన్న ఒక పిలకశాల్తీ ఉన్నట్టుండి మా గుంపులో జొరబడి - 'ఏంటి బాగున్నావా?' అంటూ మాలో ఒకరిని పలకరించి మా మాటలకు అడ్డు తగిలింది.

ఆ శాల్తీ వైపు తేరిపార చూచాను. ఏదో గుళ్ళో పూజారిలా అనిపించింది.

లోకంలో ఎవరన్నా సరే, నాలో ద్వేషభావం లేకుండా ఉండటానికి ఎప్పుడూ నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ఇద్దరు వ్యక్తులను మాత్రం నేనస్సలు భరించలేను. ఒకటి పురోహితులు, రెండు గుళ్ళో ఉండే పూజారులు. దీనికి కారణాలున్నాయి.

మొదటి కారణం - వీళ్ళలో అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో కారణం - లేకి ప్రవర్తన కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండూ నన్ను ఆమడదూరం తోసేస్తూ ఉంటాయి. మంచివారినీ, క్లాస్ గా ఉండేవారినే నేను ఇష్టపడతాను గాని ఇలాంటి అహంకార. లేకి ధోరణులు ఉండేవారితో ఒక్క క్షణం కూడా ఇమడలేను. ఈ పిలకేనుగు కూడా అలాంటి బాపతే అని, అతని సంస్కారరహిత ప్రవర్తనను బట్టి క్షణంలో అర్ధమైంది.

'ఆ బాగున్నాను' అన్నాడు మా గుంపులో ఉన్న వ్యక్తి.

'కార్యక్రమం బాగా జరిగింది. నేను పెట్టిన ముహూర్తం అలాంటిది మరి !' అన్నాడు పిలకేనుగు ఏమాత్రం సిగ్గులేకుండా డప్పు కొట్టుకుంటూ.

నాకు చచ్చే నవ్వొచ్చింది.

అతను ముహూర్తం పెట్టిందేమో ఉదయం ఆరుకి. జరిగిందేమో ఏడుంబావుకి. మరి ముహూర్తంలో అంత బలం ఉంటే, పెట్టిన టైముకి ఎందుకు జరగలేదు? అని అడుగుదామని నోటిదాకా వచ్చిందిగాని, ప్రతివారితో గొడవలు ఎందుకులే అని మౌనంగా ఉండిపోయాను.

'పెట్టింది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం' అన్న జిల్లెళ్ళమూడి అమ్మగారి మహావాక్యం గుర్తొచ్చి మౌనంగా నవ్వుకున్నా.

గురువారం గురుహోర అని ఉదయం ఆరుకి ముహూర్తం పెట్టాట్ట ఆ పిలకేనుగు. ఇలాంటి మిడిమిడిజ్ఞానం గాళ్ళని చూస్తుంటే తన్నాలని అనిపిస్తుంది నాకు. ఇలాంటివాళ్ళ వల్లే జ్యోతిష్యశాస్త్రం భ్రష్టు పడుతోంది. 'కామన్ సెన్స్ లేకుండా ఉదయం ఆరుకి ముహూర్తం ఏంట్రా నీ బొంద? నువ్వు ముహూర్తం పెడుతున్నది కార్యక్రమానికా? లేక టాయిలెట్ కి వెళ్ళడానికా? పైగా హైదరాబాద్ లో సూర్యోదయం 6-21 కి అవుతుంటే, నువ్వు ఆరుకి గురుహోర అని ఎలా చెప్పావురా? నువ్వు ముహూర్తం పెట్టింది గురుహోరలోనా లేక శనిహోరలోనా అప్రాచ్యుడా?' అందామని నోటిదాకా వచ్చింది. ఇలాంటి వెధవలతో మనకెందుకులే అని మళ్ళీ మింగేశాను.

నేటి పనికిమాలిన జ్యోతిష్కులలో చాలామంది 'హోరలు' అంటూ, చాలా ఇబ్బందిగా ఉండే సమయంలో ముహూర్తాలు పెడుతున్నారు. ఇది చాలా తప్పు. అసలు హోరలు అనేవి మనవి కావు. అవి గ్రీక్ జ్యోతిష్యం నుంచి మనం కాపీ కొట్టినవి. 'హోర' అనే గ్రీక్ పదం నుంచే 'హవర్' లేదా 'అవర్' అనే ఇంగ్లీషు పదం పుట్టింది. మన భారతీయ జ్యోతిష్యశాస్త్రంలోని ముహూర్తభాగంలో హోరాసిద్ధాంతం లేనేలేదు. కానీ నేటి మిడిమిడి జ్యోతిష్కులూ, గుళ్ళలో ఉండే పురోహితులూ హోరల్ని ఆధారం చేసుకుని ముహూర్తాలు పెడుతున్నారు. తెలిసీ తెలియని అజ్ఞానులు పెట్టించుకుంటున్నారు.

అసలు, పెళ్లి ముహూర్తాలూ, నిశ్చితార్ధముహూర్తాలూ గురుహోరలో పెట్టకూడదు. గురుహోర అనేది పూజలకు, మంత్రసాధనకు, తీర్ధయాత్రలకు మంచిది గాని పెళ్ళికి సంబంధించిన పనులకు మంచిది కాదు. అలాంటివాటికి శుక్రహోరను వాడాలి. ఇంతచిన్న విషయం కూడా తెలియనివాళ్ళు జ్యోతిష్కులని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇదంతా చెప్పి అక్కడ మన విజ్ఞానప్రదర్శన చెయ్యడం ఎందుకని మౌనంగా చూస్తున్నాను.

'మీకు రేపు ఆగస్ట్ లోపల ఉద్యోగంలో మార్పు ఉంటుంది.' అంది పిలకేనుగు మా గ్రూపులో ఉన్న ఒకాయన్ని చూస్తూ.

'ఓహో. మార్కెటింగ్ మొదలు పెట్టావట్రా చీప్ వెధవా' అనుకున్నా లోలోపల. చాలామంది పూజారులూ పురోహితులూ ఇంతే. నలుగురు కన్పిస్తే చాలు, ఇక వాళ్ళ బిజినెస్ మొదలుపెడతారు.

'అవునా. చాలా ధాంక్స్ అండి' అన్నాడీయన భక్తిగా పిలకేనుగుకి నమస్కారం పెడుతూ.

'నేను చెప్పినది జరిగితే మన గుడికి వచ్చి స్పెషల్ పూజ చేయించుకోండి' అన్నాడు పిలకేనుగు.

నాకు నవ్వుతో పొట్ట చెక్కలయ్యేలా ఉంది.

'ఏంట్రా! స్పెషల్ పూజ చేయించుకోవాలా? ఎవరు? దేవుడా ఇతనా?' అనుకున్నా లోలోపల.

'ఆయ్ ! అలాగేనండి. తప్పకుండా వస్తానండి' అన్నాడు వింటున్నాయన.

ఇంతగా మార్కెటింగ్ చేసినా మేమేమీ ఇంప్రెస్ అవకపోవడంతో ఏనుగుకి చిరాకేసినట్టుంది. నావైపు కోపంగా చూసి అక్కణ్ణించి మెల్లిగా వెళ్ళిపోయింది.

'బ్రతకడానికి ఇన్ని అబద్దాలు చెప్పి ఇంత మార్కెటింగ్ చెయ్యాలట్రా?' అనుకున్నా మనసులో.

జ్యోతిష్యశాస్త్రానికి ఇలాంటి చీడలు చాలామంది పట్టుకొని ఉన్నారు. శాస్త్రంలో లోతుపాతులు తెలీక, ఉదయం ఆరుగంటలకి ముహూర్తాలూ, అర్ధరాత్రి పన్నెండు గంటలకి ముహూర్తాలూ పెడుతూ ఉంటారు ఇలాంటివాళ్ళు. డబ్బుకి ఆశపడి ఇలాంటి పనులు చేస్తూ జ్యోతిష్యశాస్త్రంతో ఆటలాడే వీళ్ళకు ఋషిశాపం తప్పదు. ఆ సంగతేమో వీళ్ళకు తెలీదు.

పురోహితులూ పూజారులూ అంటే నాకున్న తేలిక అభిప్రాయం ఈ సంఘటనతో మళ్ళీ బలపడింది.

(ఇంకా ఉంది)