నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, మార్చి 2019, మంగళవారం

గుడ్డి గురువులు - 3

ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఫంక్షన్ జరుగుతూ ఉండగా, ఇంకొకాయన్ని తీసుకొచ్చి 'ఈయన మా ఇంకో గురువుగారు' అంటూ మళ్ళీ పరిచయం చేశాడు మొదటాయన.

'ఈయన మూడో కృష్ణుడన్నమాట' అనుకుంటూ ఆయనవైపు నిర్లిప్తంగా చూస్తూ జీవం లేని చిరునవ్వొకటి నవ్వాను.

ఆయనకూడా నావైపు అలాగే చూస్తూ 'నమస్కారం' అన్నాడు ఏదో అనాలి అన్నట్టు.

నేనుకూడా ఏడిచినట్టు ముఖం పెట్టి 'నమస్కారం' అన్నాను. కానీ లోలోపల మాత్రం నవ్వు ఉబికి వస్తోంది.

ఇక మూడో గురువుగారి పరిచయం మొదలైంది.

'ఈయన ఫలానా గుళ్ళో ఉంటారు. ఒకరోజున ఈయన నన్ను రమ్మని పిలిచారు. ఏంటా అని వెళ్లాను. నువ్వు ఈ రోజంతా ఎక్కడికీ వెళ్లొద్దు. ఈ గుళ్లోనే ఉండు' అన్నారు. 'ఎందుకు?' అనడిగాను. 'భూమిలోనుంచి అమ్మవారు వస్తుంది' అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మధ్యాన్నానికి నేలలోంచి అమ్మవారు వచ్చింది' అన్నాడు పరిచయం చేసినాయన.

హటాత్తుగా నా బ్రతుకు మీద నాకే విపరీతమైన అసహ్యం వేసింది. 'చూసేవాళ్ళకి మరీ ఇంత వెర్రి వెంగళప్పలాగా కనిపిస్తున్నానా?' అని అనుమానం వచ్చి ఒక్కసారి నన్ను నేనే తాట ఊడేలా గట్టిగా గిచ్చుకున్నా.

'ఏంటండీ అలా గోక్కుంటున్నారు?' అన్నాడు గురువుగారు.

'గిచ్చుకోదానికీ గోక్కోడానికీ తేడా తెలియదు వీడికి' అని మనసులో అనుకుంటూ, మళ్ళీ జవాబు సరిగా చెప్పకపోతే, 'గుడికి రండి, తీర్ధం ఇస్తా' అంటాడేమో అని భయం వేసి, ' అబ్బే అలాంటిదేం లేదండి. ఊరకే జస్ట్ ఏదో పాకినట్టుంటేనూ' అన్నా మొహమాటంగా నవ్వుతూ.

నేను సరిగా వినలేదేమో అని అనుమానం వచ్చినట్టుంది. మళ్ళీ అమ్మవారు నేలలోనుంచి బయటకు రావడం సీనంతా వివరించాడు మొదటాయన.

నేను అనుమానంగా గురువుగారి ముఖంలోకి చూచాను.

ఆయన నేలచూపులు చూస్తూ 'ఏదోలెండి అమ్మవారి దయ' అన్నాడు వినయంగా.

'ఏ అమ్మవారు నాయనా. ఇంట్లో అమ్మవారా? లేక బయట అమ్మగారా?' అందామని నోటిదాకా వచ్చిన మాట నోట్లోనే ఆగిపోయింది.

'అంత చెప్పినా కూడా నా దగ్గర నుంచి ఆశ్చర్యం గాని, ఇంకోటి గాని రాకపోయే సరికి వాళ్ళకూ నేనంటే చిరాకు వేసినట్టుంది, 'సరే ఉంటానండి' అన్నాడు మర్యాదగా చేతులు జోడిస్తూ. 'మంచిదండి' అన్నా నేనూ అదే రాగంలో.

ఇది చాలా ప్రిమిటివ్ ట్రిక్. ఆటవిక సమాజాలు ఉన్నప్పటినుంచీ ఈ ట్రిక్ భూమ్మీద ఉంది. నేలలో విగ్రహాలు పాతిపెట్టి అక్కడ తవ్వించి, 'స్వామి బయటకు వచ్చాడు. అమ్మవారు బయటకు వచ్చింది' అని జనాన్ని నమ్మించే దొంగపూజారులు దొంగస్వాములు పాతకాలంలో ఉండేవారు. ఇప్పుడూ ఉన్నారన్నమాట అని మళ్ళీ రుజువైంది. కొంతకాలం క్రితంవరకూ జనం వేలం వెర్రిగా పూజించిన ఒక బాబాగారు ఈ ట్రిక్ చెయ్యడంలో సిద్ధహస్తులు. నది ఒడ్డున ఇసకలో కృష్ణుడి విగ్రహం పాతిపెట్టి, మళ్ళీ దాన్నే తవ్వి బయటకు తీసి, పెద్ద పెద్ద సైంటిస్టులను కూడా బోల్తా కొట్టించిన ఘనుడాయన.

ఆ తర్వాత అందరూ చందాలేసుకుని ఆ విగ్రహానికి గుడి కట్టడమూ, ఆ గుడిమీద పడి ఈ మెజీషియన్ బ్రతికెయ్యడమూ జరుగుతూ ఉంటుంది.

పనీపాటా చెయ్యకుండా లోకంలో ఇతరుల మీద పడి ఊరకే బ్రతికేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వీళ్ళనే పారాసైట్స్ అనవచ్చు. వీళ్ళలో రెలిజియస్ పారాసైట్స్ మరీ నీచులు. ఇలాంటి వారంటే నాకు చెప్పరానంత అసహ్యం. ఏదో ఒక గుడినో స్వామీజీనో ఆశ్రయించి ఇలా బ్రతికేస్తూ ఉండేవారికంటే, కూలీ నాలీ చేసుకుంటూ బ్రతికేవారికే నేను ఎక్కువ విలువనిస్తాను.

19 ఏళ్ళ వయసులో ఉన్నపుడు స్వామీజీ అయ్యే అవకాశం నాకొచ్చింది. కానీ అది పారాసైట్ బ్రతుకని నేను దాన్ని తిరస్కరించాను. ఎప్పుడో ముప్పై అయిదేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన ఒక్కసారి నా కళ్ళముందు మళ్ళీ మెదిలింది.

ఏంటో ఈ మాయ లోకం? అసలైన దానికి విలువ ఉండదు. నకిలీకి విపరీతమైన విలువ ఉంటుంది. ఈ ప్రపంచం తీరు ఇంతేనేమో? ఎప్పటికీ ఇది మారదేమో? అన్న ఆలోచనలు నాలో కలిగాయి.

'బుద్ధుడికి మర్రిచెట్టు కింద జ్ఞానోదయం అయింది. నీకు మామిడిచెట్టు పక్కనే అయిందన్నమాట' అంటూ నవ్వుతున్న కర్ణపిశాచి స్వరం స్టేజిమీద నుంచి హటాత్తుగా వినిపించి నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.

తలతిప్పి అటువైపు చూసిన నాకు, పురోహితుడి పక్కనే కూచుని మంత్రాలు చదువుతున్నట్టు పోజు కొడుతున్న కర్ణపిశాచి కనిపించింది.

నవ్వుతూ దానివైపు చెయ్యి ఊపాను. అదీ నన్ను చూస్తూ చెయ్యి ఊపింది.

తనకు చెయ్యి ఊపుతున్నాననుకుని పురోహితుడు నావైపు కోపంగా చూస్తున్నాడు.

'చూశావా నిన్నెలా బోల్తా కొట్టించానో?' అన్నట్లుగా కర్ణపిశాచి పగలబడి నవ్వుతోంది.

(అయిపోయింది)